సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1205వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యను పరిష్కరించి షాపు సొంతమయ్యేలా చేసిన బాబా
2. ఆరోగ్యాన్నిచ్చిన సాయి - భయంలో అండగా నిలిచిన సాయి

సమస్యను పరిష్కరించి షాపు సొంతమయ్యేలా చేసిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమ:!!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


ముందుగా, మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును ఇంత చక్కగా నడిపిస్తున్న సాయికి కృతజ్ఞతలు. తోటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. మాది నిజామాబాద్ జిల్లా. నేను 2022, ఫిబ్రవరిలో ఈ బ్లాగ్ ద్వారా ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఆ అనుభవం చివరిలో నేను, "సాయీ! నేను ఇంకొక సమస్యతో బాధపడుతున్నాను, తొందరలో అది పరిష్కారమైతే మళ్ళీ బ్లాగులో పంచుకుంటాన"ని సాయికి చెప్పుకున్నాను. ఆ సమస్యను నా సాయి ఎలా పరిష్కరించారో నేనిప్పుడు మీకు చెబుతాను.


మా ఊరిలో మాకు ఒక షాపు ఉంది. 2005, జులై 26, గురుపౌర్ణమి, గురువారంనాడు నా సాయి మాచేత ఆ షాపును ప్రారంభింపజేశారు. నిజానికి నాకు అప్పటికింకా బాబా గురించి ఏమీ తెలియదు. ఆయన్ని పూజించటం, నమ్మటం వంటివేమీ లేవు. ఆరోజు గురుపౌర్ణమి అని కూడా నాకు తెలీదు. కానీ ఆ తండ్రికి మేము తమ బిడ్డలమేనని తెలుసు కాబట్టి ఆనాడు మాచేత ఆ షాపును ప్రారంభింపజేసి ఈరోజు మమ్మల్ని చాలా ఉన్నతస్థితిలో ఉంచారు. మా షాపు  M.P.P కాంప్లెక్స్‌లో ఉంటుంది. కాంప్లెక్స్‌లో ఉండే షాపులన్నీ మెయిన్‌రోడ్డుకు ఆనుకొని ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆ కాంప్లెక్స్ వాళ్ళు షాపుల సైజును తగ్గించి చాలా చిన్నవిగా కట్టించారు. అటువంటి చిన్నషాపులోనే 10 సంవత్సరాలు బాబా మాచేత వ్యాపారం చేయించి మమ్మల్ని చాలా అభివృద్ధిపరిచారు. ఐదు సంవత్సరాల క్రితం మా షాపుకి ప్రక్కనున్న షాపును అద్దెకిస్తామంటే పది సంవత్సరాల అగ్రిమెంట్ మీద మేమే తీసుకున్నాము. మేము అగ్రిమెంటును అనుసరించి మొదటి ఐదు సంవత్సరాలకు కాంప్లెక్స్ కిరాయి 3,000 రూపాయలు, ఇంకా 3,50,000 రూపాయల నగదు ఎటువంటి వడ్డీ లేకుండా ఆ షాపతనికి ఇవ్వాలి. తరువాత ఐదు సంవత్సరాలకు కాంప్లెక్స్ కిరాయి అతను కట్టుకోవాలి. మేము అతనికి మార్కెట్ కిరాయి కింద 5,000 రూపాయలు చెల్లించాలి. ఇంకా మేము ఇచ్చిన 3,50,000 రూపాయలను ఐదు సంవత్సరాల తరువాత మాకు తిరిగి ఇచ్చేయాలి. ఇది అగ్రిమెంట్. 


2022, ఫిబ్రవరిలో ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటినుండి ఆ షాపతను మా షాపుకి వచ్చి, "నా షాపు ఖాళీ చేయండి. నేను షాపు పెట్టుకుంటాను" అని మమ్మల్ని విసిగించసాగాడు. మేము, "అదెలా కుదురుతుంది? పది సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కదా! మేము ఇప్పుడే ఖాళీ చేయము" అని చెప్పాము. కానీ అతను వినకుండా అందరితో చెప్పించడం మొదలుపెట్టాడు. ఒకసారి తన భార్యను, అక్కను మా ఇంటికి పంపించాడు. వాళ్ళు, "మేము చాలా బాధలో ఉన్నాము. మీరు షాపు ఖాళీ చేసినట్లైతే చిన్న వ్యాపారం పెట్టుకుంటాం" అని ఏడ్చారు. వాళ్ళ ఏడుపు చూసిన మావారు, "సరే" అని ఒప్పేసుకున్నారు. ఇంకా ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నందున నాకు అలా చేయడం అస్సలు ఇష్టంలేకపోయినప్పటికీ మావారికి ఎదురుచెప్పలేకపోయాను.


మేము అప్పట్లో ఆ షాపును మా షాపులో కలుపుకోవడానికి మధ్యలో ఉన్న గోడను తీసేశాము. అది ఇప్పుడు మళ్ళీ కట్టాలని మావారు మర్నాడు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. నేను మాత్రం బాబాని తలచుకుని, "షాపు మళ్ళీ చిన్నదైపోతుంది బాబా. ఇంట్లో వ్యాపారం చేయటం చాలా కష్టం బాబా. సరే, మీకు నచ్చినట్లు చేయండి" అని బాబాతో చెప్పుకుని ఆయనకే వదిలేశాను. రెండు రోజుల్లో గోడ నిర్మాణం పూర్తయింది. ఇంకో రెండు రోజుల్లో, అంటే శనివారంనాడు వాళ్ళకి షాపు తాళం ఇచ్చేయాలి. ఇంతలో గురువారంనాడు అసలు నిజాన్ని నా సాయి మాకు తెలియజేశారు. అదేమిటంటే,  షాపు వాళ్ళు పెట్టుకోవడం లేదు. అది వేరేవాళ్లకు అమ్ముతున్నారు. నా బాబా తనని నమ్ముకున్న భక్తులకు అన్యాయం చేయాలని చూస్తే  ఊరుకుంటారా మరి?


అసలు నిజం తెలియడంతో మావారు ఆ రాత్రే షాపులో నిర్మించిన గోడ సగం తొలగించారు. మరుసటిరోజు అతను ఏకంగా షాపులోనే కూర్చుని గొడవ చేశాడు. దాంతో మేము పోలీసులకి కంప్లైంట్ చేశాము. అయినా అతను వినలేదు. చివరికి కోర్టు నుండి లాయరు ద్వారా నోటీసు పంపించాము. న్యాయం మావైపే ఉంది కాబట్టి ఇక అతను ఏమీ చేయలేక ఒక నెలరోజులకి కాంప్రమైజ్ అయి షాపు మాకే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలా బాబా దయవల్ల  2022, మే 19న ఆ షాపు మా సొంతమైంది. ఇప్పుడు గోడను పూర్తిగా తొలగించి సంతోషంగా మా వ్యాపారం చేసుకుంటున్నాము. ఇదంతా నా సాయి ఆశీర్వాదం. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పుకున్నట్లే ఈ అనుభవం బ్లాగులో పంచుకున్నాను. ఇంకా మీ గుడిలో 108 ప్రదక్షిణాలు చేయాలి బాబా. తొందరలోనే అది చేయగలిగేలా ఆశీర్వదించండి సాయీ".


ఇంకొక విషయం, ఇంకో రెండు రోజుల్లో మా బాబుకి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే, నేను బాబాకి దగ్గరకాకముందు బాబు జాతకాలు చూపించినప్పుడు జాతకరీత్యా వాడు సరిగా చదువుకోడని చెప్పారు.  అయితే నా సాయి "జాతకాలను చుట్టచుట్టి అవతల పారెయ్" అని చెప్పారు. కాబట్టి ఆయన తప్పకుండా మా బాబు మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేస్తారని నేను 100% నమ్మకంతో ఉన్నాను. అదే జరిగితే, ఆ అనుభవంతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. బాబాపై మనకున్న ప్రేమ, నమ్మకం, ఆయన స్మరణ మాత్రమే మనల్ని ఈ సంసారసాగరాన్ని దాటిస్తాయి. కాబట్టి, సాయిభక్తులందరూ బాబాపై నమ్మకాన్ని వదలకండి. ఖచ్చితంగా బాబా మనతోనే ఉంటారు.


ఆరోగ్యాన్నిచ్చిన సాయి - భయంలో అండగా నిలిచిన సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తులకు నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను కొన్ని నెలలుగా మెడ, కుడిభుజం, కుడికాలు నొప్పులతో బాధపడుతున్నాను. ఎన్ని టాబ్లెట్లు, బామ్‍లు వాడినా నొప్పి తగ్గలేదు. 2022, ఏప్రిల్ నెలలో నొప్పులు మరింత ఎక్కువై కొన్నిరోజులకి 'కనీసం నా పనులు నేను చేసుకోగలనా?' అన్న స్థితికి వచ్చింది. అంతలా నొప్పి ఎక్కువ అయ్యేసరికి నేను డాక్టర్ దగ్గరకి వెళ్ళాలనుకున్నాను. కానీ నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, నాకు ఇదివరకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయినా ఆ సాయినాథునిపై నమ్మకముంచి, 'హాస్పిటల్‍కి వెళ్ళాలా? వద్దా?' అని రెండు చీటీలు రాసి బాబా ఫోటో ముందు ఉంచి, ఒక చీటీ తీశాను. అందులో 'హాస్పిటల్‍కి వెళ్ళమ'ని వచ్చింది. దాంతో, "నాకు ఏమీ లేదని డాక్టరు చెపితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకుని, ఆయన్నే తలచుకుంటూ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. డాక్టర్ ఎక్స్-రే తీసి, "చిన్న సమస్యే, వ్యాయామాలు చేస్తే నొప్పులు తగ్గిపోతాయి. నొప్పి తీవ్రంగా ఉంటేనే మందులు వేసుకోమ"ని చెప్పారు. నాకు చాలా ఉపశమనంగా అనిపించి సాయినాథుని పాదాలకు నమస్కారం చేస్తూ, 'బయటికి రాగానే బ్లాగులో పంచుకునేందుకు నా అనుభవాన్ని మెయిల్ చేస్తాన'ని చెప్పుకున్నాను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీకు మ్రొక్కుకున్నట్లే నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రీ. మమ్మల్ని ఎప్పుడూ ఇలానే కాపాడుతూ ఉండండి సాయినాథా. నాకు ఇంకో ఆరోగ్య సమస్య ఉంది. అది కూడా నయమైతే బ్లాగులో పంచుకుంటాను బాబా".


ఒకసారి మా అత్తగారు బయటికి వెళ్తూ మధ్యాహ్న భోజనానికి బియ్యం కడిగి కుక్కర్‌లో పెట్టి, నన్ను పొయ్యి వెలిగించమని చెప్పారు. ఎందుకంటే, నాకు కుక్కర్‌లో అన్నం వండడం రాదు. సరే, మా అత్తయ్య చెప్పినట్టు పొయ్యి వెలిగించి నా వర్క్ చేసుకుంటూ కుక్కర్ సంగతి మర్చిపోయాను. ఒక 30 నిమిషాల తరువాత నాకు కుక్కర్ విషయం గుర్తుకొచ్చింది. అప్పటికింకా విజిల్స్ రాలేదు. ఏమిటా అని వెళ్ళి చూస్తే, కుక్కర్‌లోని నీళ్ళు బయటికి పడి మంట ఆగిపోయింది. గ్యాస్ మాత్రం ఆన్‍లోనే ఉంది. నాకు చాలా భయమేసి, "బాబా! ఏ ప్రమాదమూ లేకుండా కాపాడండి" అని బాబాను ప్రార్థించి నెమ్మదిగా వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేశాను. తరువాత కుక్కర్ పక్కన పెట్టి, మా అమ్మకి ఫోన్ చేసి, విషయం చెప్పి, "ఇప్పుడు ఏమి చేయాలి?" అని అడిగాను. మా అమ్మ నాకు ధైర్యం చెప్పి ఏమి చేయాలో చెప్పారు. అమ్మ చెప్పినట్లు కుక్కర్ విజిల్ తీసి, కుక్కర్ మూత తీసి చూస్తే అన్నం ఉడికిపోయి ఉంది. విజిల్ రాకున్నా, నీళ్ళు బయటికి వచ్చేసినా అన్నం మామూలుగా ఉండటం చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏదేమైనా గ్యాస్ లీకవుతున్నా ప్రమాదం జరగకుండా బాబా కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఏమైనా తప్పులు వ్రాసున్నా, ఏమైనా వ్రాయడం మర్చిపోయినా నన్ను క్షమించండి బాబా".


ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!

సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


3 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sai ram we have house at our native place.That is joint property.we want to sell that house.my brother_in_law is not willing to sell that house.. Elders must solve the problem.They leave to their children to solve the problem.innocents suffer very much.Sai please show the way.we are trying this so many years. He is also sai devotee. With wicked thoughts.sai baba change them.

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo