సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1207వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన వివాహం
2. ఏమడిగినా తీర్చే బాబా
3. బాబా కృప

బాబా చేసిన వివాహం


ఈ బ్లాగును అనుగ్రహించిన సాయినాథునికి నా వందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు అరుణవల్లి కుమారి. నేను చిన్నతనం నుండి సాయిబాబా భక్తురాలిని. నాకు ఏం కావాలన్నా బాబానే అడుగుతాను. నేను బాబాను "నాకు ఒక మంచి భర్తనివ్వమ"ని అడుగుతుండేదాన్ని. అయితే నాకు ఎన్నో సంబంధాలు వచ్చినప్పటికీ ఏ సంబంధమూ కుదరలేదు. బహుశా అవేవీ బాబాకి నచ్చలేదేమో! ఇలా ఉండగా నా నెంబర్ 'సాయి నామ మహిమ' అనే వాట్సాప్ గ్రూపులో ఆ గ్రూపు నిర్వహిస్తున్న అతను యాడ్ చేసారు. నేను ఆ గ్రూపులో సాయి నామం చేసి మెసేజ్ పెడుతుండేదాన్ని. క్రమంగా అతనితో నాకు పరిచయం ఏర్పడింది. అతను గత 25 సంవత్సరాలుగా సాయి భక్తుడు. 2010 నుండి సాయినే తన గురువుగా స్వీకరించి అన్నిటికి బాబా మీదే ఆధారపడి జీవిస్తున్నారు. 49 సంవత్సరాలొచ్చినా అతనికి వివాహం కాలేదు. ఏ సంబంధం వచ్చినా ఏదో ఒక అంగవైకల్యం ఉండటం వల్ల ఇంట్లోవాళ్ళు వివాహానికి అంగీకరించేవారు కాదు. కాబట్టి అతను బాబానే తనకి సుగుణవంతురాలైన అమ్మాయిని భార్యగా ఇస్తారని ఆశగా ఎదురుచూస్తుండేవారు. అటువంటి మా ఇద్దరి మధ్య బాబా ఏర్పరిచిన పరిచయం ఒకరిపట్ల ఒకరికి ఇష్టంగా మారింది. అతను సన్నగా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పెద్ద కుటుంబం. నేను అతనితో, "నేను పదవ తరగతి వరకే చదువుకున్నాను. చూడటానికి లావుగా ఉంటాను" అని చెప్పాను. అయినా తనకి ఇష్టమేనని అతను అన్నారు. "నేను పేదింటి అమ్మాయిని. మా నాన్నగారు మీకు ఏమీ ఇవ్వలేరు" అని చెప్పాను. అందుకు అతను, "నాకు ఏమీ వద్దు. బాబా ఆశీస్సులు, ఆయన దయ ఉంటే చాలు" అని అన్నారు. ఆ తరువాత అతనొక్కరే ఏదో మాటవరసకు పెళ్ళిచూపులకని మా ఇంటికి వచ్చారు. అప్పటివరకు మేము ఒకరిని ఒకరు చూసుకోలేదు. నేను లావుగా ఉంటానని, చదువు కూడా లేదని అతని ఇంటిలో ఎవరూ ఈ సంబంధాన్ని ఇష్టపడలేదు. అందరూ వద్దనే చెప్పారు. అప్పటికీ అతను బాబా తన దగ్గరకు వచ్చిన ఒక ధనవంతురాలి కూతురిని, పేదవాడైన సంగీత కళాకారునికి ఇచ్చి వివాహం చేయమని చెప్పిన విషయం తన ఇంట్లోవాళ్ళకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసారు కానీ, అతని మాట ఎవరూ వినిపించుకోలేదు. అయినా అతను, "నాకు బాబా దయ ఉంది" అని గట్టిగా అన్నారు. దాంతో వాళ్ళు అతను ఎక్కడ నన్ను వివాహం చేసుకుంటాడో అన్న భయంతో చాలా ఆవేదన చెందారు. దాంతో అతను ఇక చేసేదేమీ లేక 'నేను ఆ ఆమ్మాయిని వివాహం చేసుకోన'ని బాబా మీద ప్రమాణం చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లోవాళ్ళు కూడా ఆ సంబంధానికి ఇష్టపడలేదు.


కానీ మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. అందువల్ల మేము ప్రతిరోజు ఫోన్‍లో మాట్లాడుకుంటుండేవాళ్ళం. అలా ఒక తొమ్మిది నెలలు గడిచాయి. నేను రోజూ బాబాతో, "బాబా! నాకు అతను భర్తగా రావాలి" అని చెప్పుకుంటూ ఉండేదాన్ని. చివరికి ఒకరోజు మాఇంట్లోవాళ్ళతో "నేను పెళ్లి అంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. లేదంటే ఇలాగే ఉండిపోతాను" అని గట్టిగా చెప్పాను. దాంతో మావాళ్లు అతని తల్లిదండ్రులతో సంబంధం గురించి మాట్లాడారు. కానీ వాళ్లు, "మాకు ఈ సంబంధం వద్దు. ఇంకొకసారి ఫోన్ చేయొద్దు" అని చెప్పారు. దాంతో నేను మూడు రోజులు అన్నం తినలేదు. ఆ సమయంలో అతని మనస్సుకి ఏదో సంకోచంగా అనిపించి ఫోన్ చేస్తే నేను భోరున ఏడ్చేసాను. అతను నాకోసం తన ఇంట్లో గొడవపడ్డాడు. నేను బాబాతో, "బాబా! నన్ను అతని భార్యగా చేస్తే చేయి. లేదంటే నన్ను నీలో ఐక్యం చేసుకో" అని చెప్పుకున్నాను. బాబాది గొప్పమనసు, ఆయన దయాగుణం యెనలేనిది. ఆయనకి ప్రేమ అంటే తెలుసు కాబట్టి మమ్మల్ని ఒక్కటి చేశారు. బాబా ఆశీస్సులతో 2022, ఫిబ్రవరి 11న మా వివాహం జరిగింది. ఇలా బాబా మా ప్రేమను గెలిపించారు. ఆయన దయతో మావాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మావారి తరుపు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళని కూడా ఒప్పించి తొందరలో మా కుటుంబాన్ని ఒకటి చేయమని బాబాని కోరుతున్నాను. "బాబా! మా ప్రేమని గెలిపించిన మీకు శతకోటి వందనాలు. ఈ సంతోషాన్ని మీ బ్లాగులో పంచుకోవడం చాలా ఆలస్యమైంది. అందుకు నన్ను క్షమించండి".


ఇకపోతే, బాబా మీద ప్రమాణం చేసి తప్పినందుకు ఫలితమో ఏమోగాని మావారి నోటిలో గాయం అయింది. మావారు బాధపడుతూ, "మా ఇద్దరి వివాహం మీ ఆశీస్సులతో జరిగినట్లయితే ఎటువంటి మందులు లేకుండా ఆ గాయాన్ని తగ్గించండి" అని సాయిదేవుని వేడుకుంటున్నారు.


ఏమడిగినా తీర్చే బాబా


అందరికి నమస్కారాలు. అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. మాది హైదరాబాద్. మేము ఒక ఇల్లు కొనుక్కున్నాము. ఆ ఇంట్లో దిగాక వుడ్ వర్క్(కర్ర పని) చేయించదలిచాము. అయితే ఏ కార్పెంటర్‌ని అడిగినా అందరూ చాలా ఎక్కువ కొటేషన్ వేస్తుండేవాళ్లు. అప్పుడు నేను, "బాబా! తక్కువ కొటేషన్ వేసే వాళ్ళని పంపించండి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా దయ చూపారు. ఒక అతను వచ్చి తక్కువ కొటేషన్ వేసాడు. దాంతో మేము అతనికే పని అప్పగించాము. అతను పని మొదలుపెట్టాక కొంత పని బాగానే చేసాడు. మేము అతనికి కొంత ఎక్కువ మొత్తం ఇచ్చాము. ఇక అంతే, అతను మాకు అసలైన టార్చర్ చూపించాడు. మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని అస్సలు ఖాతరు చేసేవాడు కాదు. ఇంట్లో ఉంటూ పని చేయించుకోవడం వల్ల దుమ్ము, ధూళితో ఒకరకమైన ఇబ్బంది అయితే పని మధ్యలో ఆగిపోవడం మరొకరకమైన బాధ. అతను పని మధ్యలో ఆపేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో నా బాబాకి మాత్రమే తెలుసు. నేను బాబా మీద భారం వేసాను. కొన్నిరోజులు గడిచాక అతను మా ఇంటికి వచ్చి, "పని పూర్తి చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి" అని అన్నాడు. మేము సరే ఇస్తామని అన్నాము. అయితే మళ్ళీ అదే తంతు. పని మొదలుపెట్టలేదు సరికదా, మా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసేవాడు కాదు. మునపటిలాగే నరకం చూపించాడు. తరువాత మళ్ళీ వచ్చి మరల డబ్బులు పెంచమన్నాడు. మేము, "ఇక మావల్ల కాదు. ఇప్పటివరకు చేసిన దానికి థాంక్స్. చేసిన పనికి సరిపడా డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు మాకు ఇచ్చేయమ"ని చెప్పాము. అందుకు అతను ఒప్పుకున్నాడు కానీ, డబ్బులు ఇవ్వడానికి కొంత టైమ్ కావాలని అన్నాడు. అయితే ఆ టైమ్ దాటినా మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. ఇకపోతే కర్ర పని అర్థాంతరంగా ఆగిపోవడంతో నేను బాబాని, "పని సక్రమంగా పూర్తయితే మీ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మేము వుడ్ వర్క్ మెటీరియల్ కొనుక్కుని పని పూర్తి చేయించుకున్నాము. "థాంక్యూ బాబా కార్పెంటర్ విషయంలో మీరు చాలా సహాయం చేసారు. మీ దయవల్లే ఆ కార్పెంటర్ మోసం నుంచి మేము బయటపడ్డాము. ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు నన్ను క్షమించి, మాకు అండగా నిలిచి మా డబ్బులు మాకు ఇప్పించండి. ప్లీజ్ బాబా. లవ్ యు సో మచ్ బాబా. ఆపదలో ఉన్నవారి పాలిట మీరు ఆపద్బాంధవులు తండ్రి".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా కృప


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు సంగీత. మాది నిజామాబాద్. ఒకప్పుడు మావారికి ప్రమోషన్ వచ్చి చాలా దూరప్రాంతానికి బదిలీ అయ్యింది. మావారక్కడ ఆరు నెలలు డ్యూటీ చేసారు. అయితే ఆ ఊరికి సరైన బస్సు సదుపాయం లేక చాలా కష్టమవుతుండేది. అందువల్ల నేను, "బాబా! అక్కడికి వెళ్లి రావడానికి మావారికి చాలా కష్టమవుతుంది, మీ దయవల్ల ఆయనకి నిజామాబాద్‍కి బదిలీ అయితే గురువారంనాడు మావారితో మీ పల్లకి ఒక రౌండ్ తీయిస్తాను బాబా" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో మావారికి  నిజామాబాద్‍కి బదిలీ అయింది. కానీ అది జరిగి రెండు సంవత్సరాలవుతున్నా మ్రొక్కిన మొక్కు తీరలేదు. చివరికి 2022, మే 26, గురువారంనాడు నేను, "బాబా! నా మొక్కు ఈరోజు తీరితే, రేపే నా అనుభవం బ్లాగుకి పంపుతాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు మేము గుడికి వెళ్లి పల్లకి మోసాము. కాదు, బాబానే మాకు ఆ అదృష్టాన్ని కల్పించారు. "ధన్యవాదాలు బాబా".


సర్వేజనా సుఖినోభవంతు!!!


5 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽🌹🌺

    ReplyDelete
  3. ఈ రోజు గురువారం గురువు పూజించాలి. ప్రతి రోజు గురువారమే మనకు శుభం కలుగుతుంది. బాబా ఆశీస్సులు మనకు వూంటాయి.చల్లని దేవుడు ఆ తండ్రి. ఓం. సాయి రామ్

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo