1. బాబా ఎల్లవేళలా కాపాడుతుంటారు
2. బాబా ఆశీర్వాదం
3. ఊదీతో ఆరోగ్య సమస్యను తొలగించిన బాబా
బాబా ఎల్లవేళలా కాపాడుతుంటారు
"కలియుగాన వెలిసిన కారుణ్యమూర్తి సాయిబాబా! మీకు శతకోటి పాదనమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు మీరే ఇలా బ్లాగు పెట్టమని ప్రేరణనిచ్చి ఉంటారనిపిస్తుంది. మా సంతోషాన్ని ఈ బ్లాగు ద్వారా పంచుకుంటూ మరింత సంతోషాన్ని, మానసిక తృప్తిని పొందుతున్నాము తండ్రి". నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు 2022, మే నెల రెండో వారంలో జరిగిన ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. మా అబ్బాయి ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‍లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదివరకు కొన్నాళ్లపాటు తనకి కంపెనీవాళ్ళు టూ వీలర్ ఇచ్చారు. మా బాబు తనకి మళ్ళీ టూ వీలర్ ఇస్తారని ఆశిస్తుండేవాడు. ఇంకా తనకి రావాల్సిన బోనస్ ఆలస్యం అవుతోంది. ఈ రెండు విషయాల గురించి నేను బాబాకి చెప్పుకుని, "తొందరగా బోనస్ వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఒకరోజు మా బాబు ఫోన్ చేసి, "అమ్మా! నాకు టూ వీలర్‍కి బదులుగా కారు ఇస్తున్నారు. అది కూడా నాకన్నా సీనియర్‍కి కాదని నాకు ఇస్తున్నారు" అని చెప్పాడు. నేను బోనస్ అడిగితే, బాబా కారు ఇచ్చారని చాలా సంతోషించాను. మేము కారు బుక్ చేసాము. కానీ కారుకు కంపెనీవాళ్ళు ఇచ్చే డబ్బుకి అదనంగా మేము కొంత డబ్బు కలపాల్సిన అవసరం వచ్చింది. నేను 'ఇప్పుడెలా బాబా?' అనుకుని మా అక్కని డబ్బులు అడిగాను. తను ఆ డబ్బులు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ బయటవాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం మా బాబుకి ఇష్టం లేదు. అందువలన తనకిప్పుడే కారు వద్దని, బోనస్ వచ్చాక తీసుకుంటానని అన్నాడు. ఒక వైపు మా అక్కవాళ్ళు అకౌంట్ నెంబర్ ఇవ్వమని, మా బాబేమో వద్దని. నాకు కోపమొచ్చి మా బాబుని "మనము కోటీశ్వరులమా? అవసరం ఉన్నప్పుడు వేరేవాళ్ళ దగ్గర తీసుకుని, తరువాత డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకు ఇచ్చేయొచ్చు కదా!" అని అన్నాను. కానీ వాడు ససేమిరా వద్దు అన్నాడు. దాంతో నేను మా అక్కతో, "డబ్బులైతే అలాగే ఉంచు. నేను రేపు చెప్తాను" అని అన్నాను. తను సరే అంది. నేను, "బాబా! వాడి మనసైనా మార్చు, లేకుంటే బోనసైనా త్వరగా వచ్చేటట్టు చేయి" అని బాబాతో చెప్పుకున్నాను. మరునాడు ఉదయం, 'పోనీ చిట్టి వ్యాపారంలో పెట్టిన డబ్బు తీద్దామా? మధ్యలో తీసుకుంటే నష్టపోతాం. మరి ఇప్పుడెలా?' అని అనుకుంటున్నంతలో మా బాబు తన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, "అమ్మా, '30% కార్ల ధరలు పెరుగుతున్నాయి. కారు అయితే వచ్చింది. మరి మీ ఇష్టం' అని కార్ల షో రూమ్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి నువ్వు పెద్దమ్మ దగ్గర డబ్బులు తీసుకో" అని అన్నాడు. అంతే, మరుసటి గురువారం నాడు బాబు కారుని ఇంటికి తెచ్చాడు. అక్కడికి సరిగా వారం రోజులకి బోనస్ వచ్చింది. వెంటనే మా అక్కవాళ్ళకు డబ్బులు ఇచ్చేసాము.
ఇకపోతే, "మా చిన్నబాబుకి కూడ బోనస్ రాలేదు బాబా" అని అనుకున్నాను. తరువాత మా చిన్నబాబు ఫోన్ చేసి, "అమ్మా! పై ఆఫీసర్ కాల్ చేసి, నీకు జీతమెంత పెంచాలి?" అని అడిగారు అని చెప్పాడు. ఇది బాబా కృప కాకపోతే మరి ఏమిటి? ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంటారు. "బాబా మీకు శతకోటి నమస్కారాలు. మాపై ఇలానే దయ ఉంచి మమ్మల్ని మా పిల్లలని కాపాడు సాయి. మాకు చిన్నచిన్న మొత్తాలు కావాల్సి ఉంది. చిన్నబాబుకి బోనస్ వస్తే, ఆ సమస్య తీరిపోతుంది. అదే జరిగితే మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నా కోడలికి ఇప్పుడు తొమ్మిదో నెల. మీ దయవల్ల తనకి ఎటువంటి ఇబ్బంది లేదు. నాడు నానాచందోర్కర్ కూతురుని అనుగ్రహించినట్లు నా కోడలికి సుఖ ప్రసవం అయ్యేటట్లు చూడండి సాయి".
బాబా ఆశీర్వాదం
ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా పేరు సత్య. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మేము గత మూడు సంవత్సరాలుగా ఇల్లు మారాలని ప్రయత్నిస్తున్నాము. కానీ ఎదో ఒక కారణం వల్ల కుదరడం లేదు. నేను ఎప్పుడూ బాబాని, "ఇల్లు మారడానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది" అని అడుగుతుండేదాన్ని. ఏ పని చేయాలన్నా ముందుగా బాబా అనుమతిని అడగడం నాకు అలవాటు. అలా అడిగినప్పుడు శిరిడీలో బాబా పసుపురంగు వస్త్రాలు ధరిస్తే, అది ఆయన అంగీకారంగా భావిస్తుంటాను. ఒకసారి ఒక ఇల్లు నచ్చి, పాలు పొంగించడానికి తేదీ కూడా చూసుకున్నాక బాబా అంగీకారం తెలుపలేదు. అయితే అందరికీ ఆ ఇల్లు నచ్చడం వల్ల నేను వాళ్ళకి ఏం చెప్పలేక అంతా బాబానే చూసుకుంటారని ఊరుకున్నాను. ఇంతలో ఆ ఇంటి యజమాని ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదు అనేసరికి ఇంట్లోవాళ్ళు బాగా నిరాశ చెందారు. ఇంకా అద్దెకు వెతకడం మానేసి ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నాం కానీ, అప్పుడు కూడా బాబా అంగీకారం రాలేదు. నేను బాబాపైనే భారం వేసి, "ఏది మంచిదైతే అదే చేయి బాబా" అని అనుకున్నాను. తరువాత మావారు ఆ ఫ్లాట్ వాస్తు సిద్ధాంతికి చూపిస్తే, బాగాలేదని చెప్పారు. దాంతో ఆఖరి నిమిషంలో మావారు డ్రాప్ అయిపోయారు. తరువాత ఇంకో ఇల్లు చూసాం. అప్పుడు నేను, "బాబా! ఈ ఇల్లు మీకు అంగీకారమైతే రేపు కాకడ హారతి అనంతరం పసుపురంగు వస్త్రాలు ధరించండి" అని అనుకున్నాను. బాబా తమ అంగీకారం తెలుపుతూ ఆరోజు పసుపురంగు వస్త్రాలు ధరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ మరోసారి నిర్థారించుకోడానికి బాబాని, "మధ్యాహ్న హారతికి కనీసం కండువా ఐనా పసుపురంగు ఉంటే చాలు బాబా" అని అడిగాను. ఈసారి బాబా తమ అంగీకారాన్ని మరింత బలంగా చెప్పారు. అనుకోకుండా మధ్యాహ్న హారతి సమయానికి నేను శిరిడీ లైవ్ దర్శనాన్ని ఓపెన్ చేశాను. సరిగ్గా అప్పుడే బాబాకి వస్త్రాలు మారుస్తున్నారు. నేను ఆతృతగా 'పసుపురంగేనా, కాదా' అని చూస్తున్నాను. అయితే బాబాకి పింక్ రంగు వస్త్రం వేశారు. పోనీ కండువా అయినా పసుపురంగు వేస్తారేమోనని చూస్తే, నీలం రంగు వేశారు. అయితే నేను, 'అయ్యో...!' అని అనుకునేలోపే అక్కడున్న పూజారి నీలం రంగు కండువా తీసేసి ఇంకో పూజారి చేతికి ఇచ్చారు. నేను ఇప్పటివరకు ఒకసారి బాబాకి వేసిన దానిని అలా తీసివేయడం చూడలేదు. అందుచేత నేను చాలా ఆశ్చర్యంగా 'ఇప్పుడు ఏ రంగు కండువా వేస్తారో?' అని చూస్తున్నాను. ఊహించని విధంగా ఇంకో పూజారి పసుపురంగు కండువా తెచ్చి బాబాకి అలంకరించారు. ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చేశాయి. బాబా దయతో మేము ఆ ఇల్లు కొనుక్కున్నాము. మనపై ఎనలేని ప్రేమతో బాబా మన బాగోగులన్నీ చూసుకుంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఊదీతో ఆరోగ్య సమస్యను తొలగించిన బాబా
ఈ బ్లాగుకి దగ్గరయ్యేలా చేసిన సాయితండ్రికి శతకోటి వందనాలు. సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మాకు ఏ కష్టం వచ్చినా సాయితండ్రి మా చేయి విడువరు. సమస్య వచ్చినప్పుడు కలల రూపంలోగాని, మెసేజ్ రూపంలోగాని 'నేనున్నాను' అంటూ మాకు నిదర్శనమిస్తారు. నేనిప్పుడు బాబాకి మాటిచ్చినట్లుగా నా అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకుంటున్నాను. నాకు ఈమధ్య నెలసరి సమయంలో ఇబ్బంది ఎదురయింది. హాస్పిటల్‍కి వెళితే, 'ఏ సమస్య లేద'ని చెప్తుండేవారు కానీ, నా ఇబ్బంది మాత్రం తగ్గేది కాదు. అప్పుడు నాకు, 'నా సమస్యను సాయితండ్రి తప్ప మరి ఏ డాక్టరూ తగ్గించలేర'ని అనిపించింది. వెంటనే సాయితండ్రికి నమస్కరంచి, "బాబా! మీరు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు తండ్రి. మీ కృపతో నా సమస్య తగ్గితే, బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఆ రోజు నుండి నేను హాస్పిటల్‍కి వెళ్ళడం మానేసి ప్రతిరోజూ బాబా ఊదీ మాత్రమే మందుగా తీసుకుంటుండేదాన్ని. కొద్ది రోజుల్లోనే నాకు కడుపునొప్పి తగ్గిపోయింది. ఇకపోతే అదే నెలసరి సమయంలో కాస్త ఇబ్బంది పడిన మరో విషయంలో బాబాని తలుచుకోగానే, తెలిసిన ఒక అక్క ఫోన్ చేసి నా సమస్యకి ఇంట్లోనే ఉండే వాటితో పరిష్కారం చెప్పింది. వాటితో మరుసటి నెలకు నా సమస్య తగ్గిపోయింది. ఇది సాయితండ్రి కృపకాక ఇంకేమిటి? సాయి చూపిన మరికొన్ని అనుభవాలను ఇంకోసారి మీతో పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha