సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1216వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని ఒసగిన బాబా
2. బాబాను నమ్ముకుంటే, తప్పకుండా మంచి జరుగుతుంది
3. బాబా దయతో అందిన డబ్బులు - తగ్గిన నొప్పి

ఆరోగ్యాన్ని ఒసగిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నా అనుభవాలను ఈరోజు మీ అందరితో పంచుకునే అవకాశమిచ్చిన సాయినాథునికి పాదాభివందనాలు. సాయి బంధువులకు నమస్కారం. భయం వేయగానే బాబా తరపు వారధిలా ధైర్యాన్నిస్తున్న మరియు కోరికలు తీరిన వెంటనే మా అనుభవాలను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా అందరితో పంచుకునే అవకాశం కల్పిస్తున్న బ్లాగు నిర్వాహకులకు అనేకానేక ధన్యవాదాలు. నిజానికి బ్లాగును ఇంత బాగా నడిపిస్తున్న మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...  


2022, మే నెల చివరి వారంలో మా అమ్మాయి మెడకి కాస్త పక్కగా చిన్న గడ్డలా వచ్చింది. ముందు మేము దాన్ని మామూలు సెగ్గడ్డ అనే అనుకున్నాం. కానీ అది తగ్గలేదు. పైగా ఏదో ఒక బిళ్ళలా అయి కొంచెం గట్టిగా ఉండేసరికి నాకు భయం వేసింది. వెంటనే మావారు పాపని హాస్పిటల్‍కి తీసుకెళ్లారు. నేను, "బాబా! ఆ గడ్డ తగ్గడానికి మందులు ఇప్పించి, దానివల్ల సమస్య ఉండదు అనేలా చూడండి. నేను నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. డాక్టర్ ఆ గడ్డని చూసి, "ఇది సేబాషియస్ తిత్తి(రసికారు గడ్డ) దీనివల్ల సమస్య ఉండదు. దీనికి ఇవ్వడానికి మందులు ఉండవు. ఒకవేళ ఇది పెరిగినా, నొప్పిగా ఉన్నా లేదా రంగు మారినా కట్ చేసి తీసేయాలి" అని అన్నారు. మావారు ఇంటికి వచ్చాక ఇటువంటి గడ్డకు హోమియోపతిలో మందు ఉంటుందని తెలుసుకుని డాక్టరుని అడిగితే, ఆమె మందు ఇచ్చారు. ఆ మందు వాడాక ఆ గడ్డ కొంచం తగ్గి ఇప్పుడు పాపకి బాగుంది. అంతా బాబా దయ. నాకు చాలా సంతోషంగా ఉంది. 'సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై'!!!


2022, మే నెల చివరి వారం మొదలు నుండి నాకు విపరీతమైన గొంతునొప్పి ఉంటే అజిత్రోమైసిన్ టాబ్లెట్లు వేసుకున్నాను. కానీ నొప్పి నుండి నాకు ఉపశమనం రాలేదు. అయినా ఎక్కువగా యాంటిబయోటిక్స్ తీసుకోకూడదని టాబ్లెట్లు వేసుకోవడం ఆపేసాను. ఒక రెండు రోజులు బాగున్నట్లే అనిపించి తరువాత మళ్ళీ నొప్పిగా అనిపించింది. అసలే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. పైగా ఇక్కడ దుబాయ్‍లో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. అందువల్లే ఇబ్బందేమో అనుకుని హోమియోపతి మందులు వాడటం మొదలుపెట్టాను. అయినా పెద్దగా ఉపశమనం కనిపించలేదు. ఇలా ఉండగా ఆదివారంనాడు మావారు తన స్నేహితుల కుటుంబాలను లంచ్‍కి పిలిచారు. ఆ మరుసటిరోజు వాళ్లలో ఒకరికి ఒంట్లో బాగోలేక టెస్టు చేయించుకుంటే, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంకో రెండు రోజులకి ఇంకొకరు కూడా అలాగే ఒంట్లో బాగోలేక టెస్టుకి వెళ్తే, తనకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అది తెలిసి మాకు చాలా భయమేసింది. నేను, "ఇలా అయింది ఏమిటి బాబా?" అని అనుకుని ఒకవేళ నావల్ల వాళ్ళు కోవిడ్‍తో బాధపడుతున్నారా అన్న అనుమానంతో టెస్టుకి వెళ్తే, నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, "బ్లడ్‍లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల నొప్పి వస్తుంద"ని చెప్పి డాక్టర్ నాకు మందులు ఇచ్చారు. తరువాత మావారికి కూడా గొంతులో కొంచెం తేడాగా, అలాగే కొంచం ఒళ్లునొప్పులుగా అనిపిస్తే, టెస్టుకి ఇచ్చారు. ఆయనకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను బాబా దగ్గర, "వాళ్లందరికీ నా వాళ్లే కోవిడ్ వచ్చిందో లేక ఇంకా ఎక్కడ నుండైనా వచ్చిందో అర్థం కావట్లేదు బాబా. తొందరగా అందరికీ తగ్గేలా చూడు తండ్రి. ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని బాధపడ్డాను. బాబా దయవల్ల మావారి స్నేహితుల్లో ఒకరికి ముందు నెగిటివ్ వచ్చింది. మా వారికి, ఇంకో ఆయనకి ఆరోగ్యం మామూలుగానే ఉండటంతో వాళ్ళకి కూడా నెగిటివ్ వస్తుందనే ధైర్యంతో ఉండగా వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చింది. బాబా దయవల్ల ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇలా బాబా మమ్మల్ని కరోనా నుండి రెండుసార్లు కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబాను నమ్ముకుంటే, తప్పకుండా మంచి జరుగుతుంది


నేను గత 22 సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నా జీవితంలో బాబా అడుగడుగునా ఉంటూ నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుంచి మీతో పంచుకుంటానని బాబాకి మాటిచ్చిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2022లో  ఒకరోజు హఠాత్తుగా మా అమ్మకి తీవ్రమైన జ్వరం వచ్చింది. అసలే అమ్మ ఆరు సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంది. అందువలన మేము చాలా భయపడ్డాము. హాస్పిటల్‍కి తీసుకుని వెళితే బిపి చెక్ చేసి, "190 ఉంది" అని అన్నారు. ఇంకా సిటీ స్కాన్ చేసి, "కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. కానీ ఈ స్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయడం ప్రమాదమ"ని డాక్టర్లు చెప్పారు. నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, “బాబా! అమ్మని ఇబ్బందిపెట్టకు. తనకి తొందరగా నయమయ్యేలా చేయండి. మీ కృపతో తనకి నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన అమ్మ ఇప్పుడు కొంచంకొంచంగా కోలుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా. ఏమి చేసినా మీ ఋణం తీర్చుకోలేము. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు చేయాలని అనుకుంటున్నాము బాబా. దానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేలా మీ ఆశీస్సులు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి".


2022, జనవరిలో నాకు, నా పిల్లలకి జ్వరం వచ్చింది. కోవిడ్ టెస్టు చేయిస్తే, 'పాజిటివ్' అని చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయతో మేము తొందరగా కోలుకుంటే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక్క వారంలో మాకు నెగిటివ్ వచ్చింది. అంతేకాదు బాబా ఆశీస్సులతో పిల్లల పుట్టినరోజు వేడుకలు బాగా జరుపుకున్నాము.


మాకు కొన్ని ఆర్థిక సమస్యలొచ్చి, వాటినుండి బయటపడటానికి నేను కర్నూలులో మాకున్న ప్లాట్లు అమ్మాలనుకున్నాను. ఆ విషయంలో బాబా నాకు ఎంతో సహాయం చేసారు. ఇవి కాకుండా నాకు చాలా ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటినన్నిటినీ నేను ధైర్యంతో సహిస్తూ, "మా సమస్యలను పరిష్కరించమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయిచరిత్ర పారాయణాలు చేశాను, చేస్తూనే ఉన్నాను. నవ గురువార వ్రతం కూడా చేశాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీరుస్తున్నారు. బాబాను నమ్ముకుంటే, మనకు తప్పకుండా మంచి జరుగుతుందని అనటానికి ఇవే పూర్తి నిదర్శనాలు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! పెద్ద అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మంచిగా వ్రాసేలా దీవించావు తండ్రి. ఇలాగే తను రెండవ సంవత్సరం కూడా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యేలా ఆశీర్వదించండీ బాబా. ఇంకా నీట్‍లో మంచి ర్యాంకు సాధించేలా తనకి మార్గనిర్దేశం చేయండి బాబా. మాకున్న రెండు ప్లాట్లలో కొన్నిరోజులుగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. మీ దయవల్ల తొందరగా అవి పరిష్కారమవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నేను ఒక చోట ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. దయచేసి తొందరగా అక్కడున్న సమస్యలు తొలగించి నా కోరిక తీరేలా ఆశీర్వదించండి బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా దయతో అందిన డబ్బులు - తగ్గిన నొప్పి


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు రవీంద్ర. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. నేను చేసిన పనికి గానూ నాకు కొంత డబ్బు రావాల్సి ఉండగా, "బాబా! నాకు రావాల్సిన డబ్బు వచ్చేటట్లు చేయండి. మీ అనుగ్రహంతో నా డబ్బులు నాకు వస్తే, ఆ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన నా డబ్బులు నాకు వచ్చాయి.


2022, జూన్ 2 రాత్రి నా ఛాతి పైభాగంలో నొప్పి వస్తే, "బాబా! మీ దయవలన నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి పడుకున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. మర్నాడు ఉదయం కొద్దిగా కండరం నొప్పిగా అనిపించినప్పటికీ బాబా దయతో అది కూడా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మూడు సంవత్సరాలుగా నేను ఉదోగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. మీ దయవలన ఉదోగ్యం వస్తే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. భక్తులందరికీ మీ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను తండ్రి"


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo