సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1202వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలో లభించే బాబా అనుగ్రహం
2. బాబా దయుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం
3. మళ్ళీ మాట్లాడుకునేలా చేసిన బాబా

ప్రతి విషయంలో లభించే బాబా అనుగ్రహం


నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నా వైవాహిక జీవితంలో చాలా గందరగోళం నెలకొని ఉంది. అందువల్ల విడాకులు తీసుకోవాలో, వద్దో తేల్చుకోలేక సతమవుతున్న తరణంలో నేను, "బాబా! మీరు నాకు ఏదైనా సూచన లేదా స్వప్న దర్శనమిచ్చి ఏదైనా చెపితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ఇనపకడ్డీకి మూడు ఆకులు వచ్చి, ఆపై మరి ఆకులు రాలేదు. ఆ కలను బట్టి, పెళ్ళై మూడేళ్ళయిన మాకు ఇకపై పెళ్లిరోజు వేడుకలు ఉండకపోవచ్చని నాకనిపించింది. ఇలా నా సందేహాన్ని తీర్చారు బాబా. దాంతో విడాకులు తీసుకోవాలని బలంగా అనుకున్నప్పటికీ బాబా అందుకు ఒప్పుకోవాలని అనుకున్నాను. అందుకోసం బాబా చరిత్ర పారాయణ మొదలుపెడితే, అది పూర్తయ్యేలోగా బాబా తమ తుది నిర్ణయాన్ని తెలియజేస్తారని తలచి, అది తెలిసాక నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా కలలో తమ సమ్మతిని నాకు వినిపించారు. కానీ అదంతా ఎలా జరుగుతుందనేది కూడా బాబానే చూసుకోవాలి. ఆ బాధ్యతను ఆయనకే అప్పగించాను.


ఇకపోతే పైన చెప్పినట్లు పారాయణ చేస్తాననుకున్న వారంలో నేను బయటకి ఎక్కువగా తిరగాల్సి ఉన్నందున బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను. ఆ విషయంలో కూడా నేను, "బాబా! నేను పారాయణ చేయాలో, వద్దో నాకు స్వప్నంలో తెలియజేయండి. మీ సమాధానం లభిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అందుకు పారాయణ చేయమని సూచన బాబా నుండి లభించడంతో నేను పారాయణ మొదలుపెట్టాను. మొదలుపెట్టడమైతే పెట్టాను కానీ, నాకున్న బిజీలో ఎలా పూర్తి చేసానో ఏమో నాకే తెలియదు. కానీ అంతటి బిజీలో కూడా ఎటువంటి టెన్షన్, కంగారు లేకుండా చక్కగా అర్ధం చేసుకుంటూ పారాయణ పూర్తి చేసేలా అనుగ్రహించారు బాబా.


పారాయణ మధ్యలో ఉండగా మేము తిరుపతికి ప్రయాణమయ్యాము. 2022, మే 10న నాకు, మా చెల్లికి, అమ్మకి 300 రూపాయల దర్శనానికి బుక్ చేసుకున్నాము. బాబా ఆశీస్సులతో దర్శనం బాగా జరిగింది. మరోసటిరోజు బ్రేక్ దర్శనానికి ప్రయత్నిస్తే మా తమ్ముడికి టికెట్స్ కంఫర్మ్ అవలేదుగాని నాకు, చెల్లికి, అమ్మకి అయ్యాయి. కానీ ఆరోజు మా అమ్మకి నెలసరి సమయం. నేను, 'అమ్మకి నెలసరి రాకుండా ఉంటే బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన'ని బాబాతో చెప్పుకుందామని అనుకుని కూడా ఎందుకో తెలీదు 'కేవలం నెలసరి రాకూడద'ని మాత్రమే బాబాతో చెప్పుకున్నాను. కానీ తమ్ముడి విషయంలో  మాత్రం తనకి స్వామి దర్శనమైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మనకి ఏది చేస్తే ఉత్తమమో అదే బాబా చేస్తారని మనకి తెలిసిందే. ఆయన మే 11 ఉదయం అమ్మకి  నెలసరి వచ్చేలా చేసి, దర్శనానికి అవకాశం లేని తమ్ముడికి అమ్మ టికెట్ మీద దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఒక ఆడమనిషి టికెట్ మీద మగ వ్యక్తి వెళితే అక్కడివాళ్లు అంతగా పట్టించుకోకపోవడం నిజంగా బాబా చేసిన అద్భుతమే!


ఒకరోజు ఉన్నటుండి నా ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. నొప్పి ఎందుకు వస్తుందో నాకు తెలియలేదుకానీ రెండు, మూడు రోజులైనా నొప్పి అలాగే కొనసాగింది. ఇంకా నాకు, "ఇదేమైనా బ్రెస్ట్ కాన్సరేమోన'ని భయం మొదలైంది. అంతలో మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నాకు గుర్తొచ్చింది. వెంటనే, "బాబా! ఈ నొప్పి తగ్గిపోతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మన సాయితో చెప్పుకున్నాను. అంతే, అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ నొప్పి మళ్ళీ రాలేదు. అలాగే నాకు ఒకరోజు కడుపునొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను నా అనుభవం బ్లాగులో పంచుకుంటానని అనుకున్న 5 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది. అది ఈ బ్లాగు యొక్క ప్రభావం. నేను స్వయంగా అనుభవించాను. చాలామంది తమ అనుభవాలలో 'బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పుకుంటే, తాము అనుకున్నవి జరిగాయి' అని వ్రాస్తూ ఉంటారు. అది చదివినప్పుడు నేను, 'అలా అనుకుంటే జరగటం ఏంటి? అసలైనా బాబాతో ఎందుకిలా బేరాలు చేయడం?' అని అనుకునేదాన్ని. కానీ, ఈ బ్లాగు ఆ భగవంతుని(బాబా) అనుగ్రహం, ఇది నిజం. ఈ బ్లాగు అడ్మిన్‍కి, బృందానికి ధన్యవాదాలు, బాబా మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఎప్పుడూ నా మీద, నా కుటుంబం మీద ఇంకా అందరి మీదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రి".


బాబా దయుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం


ముందుగా ఈ బ్లాగ్ నిర్విహకులకు మరియు తోటి సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను తోటి సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. మాది చిన్న పెంకుటిల్లు. మా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం వలన వర్షం పడితే చాలు, ఆ చెట్లపై ఉండే గండు చీమలు మా ఇంటి మీద గుండా మా ఇంట్లోకి జొరబడి ఇల్లంతా కనబడేవి. గతంలో అయితే వర్షాకాలం మొదలయిందంటే చీమల వల్ల మాకు రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. అప్పుడు నేను బాబా భక్తురాలిని కాదు కానీ, ఇప్పుడు బాబాని బాగా నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇంట్లోకి వచ్చే చీమల గురించి బాబాతో చెప్పుకుని, "ఇంక మావల్ల కాదు బాబా, ఉదయం నుంచి కష్టపడి పనిచేసే మాకు రాత్రిళ్ళు నిద్రలేకపోతే ఎలా బాబా. మీరే చీమలు రాకుండా చూడాలి. చీమలు రాకుండా ఉంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. రాత్రి అవుతుండగా చీమలు రావడం మొదలు అయ్యింది. కానీ 4, 5 చీమలు వచ్చాక మరి రాలేదు. బయటకి వెళ్ళి, ఇంటిపైన చూస్తే చాలా చీమలు ఉన్నాయి. కానీ అవి లోపలకి రావడం లేదు. అప్పుడు నేను 'ఇదంతా బాబా దయవల్లనే' అని అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


మేము కొంతమంది బట్టలు తెచ్చి ఉతికి, ఇస్త్రీ చేస్తాము. ఒకరోజు బట్టలు తెచ్చి ఉతికి ఆరేస్తే వర్షమొచ్చి అన్నీ తడిచిపోయాయి. మరుసటిరోజు మళ్ళీ ఉతికి ఆరేస్తే, మళ్ళీ వర్షం మొదలైంది. అప్పుడు నేను, "బాబా! నిన్న ఈ బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేస్తే వర్షం వల్ల మొత్తం అన్ని బురద అయిపోయాయి. ఈరోజు కూడా అలాగే అయితే ఇంకా వీటిని శుభ్రపరచడం నా వల్ల కాదు. పైగా మళ్ళీమళ్ళీ ఉతికితే బట్టలు రంగు పోతాయి. కావున వర్షం రాకుండా చూడండి బాబా. వర్షం రాకుండా మా పని పూర్తయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంకా అంతే,  కొంతసేపట్లో మబ్బులన్నీ పోయి ఎండెక్కింది. మా పని ఏ ఆటంకమూ లేకుండా పూర్తి అయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్లనే ఎలాంటి కష్టాన్ని అయిన ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాము తండ్రి".


మళ్ళీ మాట్లాడుకునేలా చేసిన బాబా


సాయి బంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా పేరు ప్రసాదరావు. నాకు, నాభార్యకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. మేము ప్రతీ పనిని సాయిని ప్రార్ధించే ప్రారంభిస్తాము. మాకు బాబాతో చాలా అనుభవాలున్నాయి. వాటి నుండి ఒక ముఖ్యమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాకు ఒక బాబు, ఒక పాప. పాప డాక్టరు, బాబు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఎంతో ప్రేమాభిమానాలతో ఉండే వాళ్ళ మధ్య ఒకసారి ఏవో మనస్పర్థలు చోటు చేసుకుని ఇంక జీవితంలో వాళ్లిద్దరూ మాట్లాడుకోమని అనుకున్నారు. అలాగే సుమారు నాలుగు నెలలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. వాళ్ళ ప్రవర్తనతో చాలా ఒత్తిడికి గురైన నాకు, నా భార్యకు జీవితం మీద విరక్తి వచ్చి ఇంక బతకడానికి ఇష్టం లేకుండా పోయింది. సరైన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాము. అట్టి స్థితిలో మేము, "బాబా! మా పిల్లలిద్దరూ మునుపటిలా ప్రేమగా మాట్లాడుకోవాలి. మీ దయతో వాళ్ళు కలుసుకుంటే, శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాము" అని బాబాను వేడుకున్నాము. ఆ సాయితండ్రి మా మీద దయ చూపి పిల్లలిద్దరినీ కలిపారు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా ప్రేమతో మెలుగుతున్నారు. బాబా చేసిన మేలుకు కృతజ్ఞతగా మేము శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాము. ధన్యవాదాలు బాబా.


8 comments:

  1. Om sree sai ram

    ReplyDelete
  2. సయి బాబా నీ దయ వలన నాకు మందులు పని చేసి క డుపు నొప్పి తగ్గి పోయేలాగ ఆశీస్సు లు్ ఱ్

    ReplyDelete
  3. అందించు.కడుపు నొప్పి తగ్గక పోతే ప్రొసీజరు చేయాలని డాక్టర్ చెప్పారు. నీ అనుగ్రహముతో తగ్గిపోయేలాగ చేయి తండ్రి. నా వయస్సు 68 సంవ.నాకు భయం ఎక్కువ కాపాడు తండ్రి. నీకు సర్వశ్య శరాణాగతి కలిగి వుంటాను

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  5. ఓం సాయినాథాయ నమః

    ReplyDelete
  6. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo