ఈ భాగంలో అనుభవాలు:
1. వివిధ మార్గాలలో బాబా సూచనలు
2. బాబాకి చెప్పుకున్నంతనే మారిన మనసు
3. ఒక్కరోజులో పని పూర్తయ్యేలా అనుగ్రహించిన బాబా
వివిధ మార్గాలలో బాబా సూచనలు
నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. మా పాపకి మూడు సంవత్సరాల వయస్సు. తను చాలారోజుల నుంచి ఫుడ్ అసలు తినట్లేదు. కేవలం బిస్కెట్లు, పాలు తీసుకుంటుంది. 2022, మే 11న తను రోజు చూసే ట్యాబ్‌లో ఛార్జింగ్ అయిపోవడంతో ట్యాబ్ రావట్లేదని పాప ఒకటే ఏడుపు మొదలుపెట్టింది. వేరే ఐ-ప్యాడ్ ఇస్తే విసిరేసింది. టివి, లాప్టాప్ ఏది పెట్టినా, ఏం చేసినా, ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. మావారికి ఫోన్ చేసి మాట్లాడిద్దాం అని ప్రయత్నించినా పాప నా మాట వినిపించుకోలేదు. అలా గంటసేపైనా ఏడుపు ఆపలేదు. చివరికి బాబాను స్మరించాను. అయినా పాప ఏడుపు ఆపలేదు. నాకు చాలా ఒత్తిడిగా అనిపించి బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ ఒక భక్తురాలు తన కొడుకు చేయి తలుపు సందులో పడటంతో బాగా ఏడ్చాడని, బ్లాగులో పంచుకుంటాను అని అనుకోగానే బాబుకి బాధ తగ్గిందని పంచుకున్నారు. అది చదివిన వెంటనే నేను, "ప్లీజ్ బాబా, 5 నిమిషాల్లో పాప ఏడుపు అపేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. అంతే, అంతసేపూ నా దగ్గరికి రాని పాప 5 నిమిషాల్లో రమ్మంటే వచ్చి, ఏడుపు ఆపి నిద్రపోయింది. "ధన్యవాదాలు బాబా. పాప ఫుడ్ తిని మొండితనం తగ్గించుకుని మంచిగా ఉండేలా చేయండి ప్లీజ్. నా కుటుంబంపై మీ దయ సదా ఉండాలి సాయి".
ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా నేను మావారికోసం, బాబుకోసం టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం తయారు చేయాలి. అయితే 2022, మే 11, ఉదయం మా పాప ఏడుస్తుంటే నా వంటకి ఇబ్బంది అయింది. మావారికి కోపం వచ్చి చిన్న గొడవ అయింది. దాంతో నాకు కూడా చాలా కోపం వచ్చింది. అయితే వాళ్ళు వెళ్ళిపోయాక సోఫాలో కూర్చొని టివి ఆన్ చేస్తే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా 'తన కోపమే తన శత్రువు' అని బాబా నాకు చెప్తున్నట్లు అనిపించింది. బాబా మనల్ని ప్రతిక్షణమూ గమనిస్తూ ఉంటారు.
ఒకసారి మేము మాకు దగ్గరలో ఉన్న ప్రదేశాలు చూసొద్దామని నాలుగురోజుల ట్రిప్‌కి కారులో వెళదామని అనుకున్నాము. నేను మా ప్రయాణానికి ముందు, "బాబా! ట్రిప్ మంచిగా జరిగితే, తిరిగి వచ్చాక నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత కారులో వెళ్తున్నపుడు నేను నా డైలీ పారాయణ చేద్దామని సచ్చరిత్ర తెరిస్తే ఆరోజు పారాయణలో 12 అధ్యాయం వచ్చింది. అందులో శ్రీమతి నిమోన్కర్‌తో బాబా, "వెళ్లి, నాలుగు రోజులు సంతోషంగా గడిపి రా" అని చెప్పడం ఉంది. అది చదివాక బాబా నాతోనే, "నాలుగురోజులు సంతోషంగా గడిపి రండి" అని చెప్తున్నట్లు అనిపించింది. అలాగే బాబా ఆశీస్సులతో సంతోషంగా గడిపి వచ్చాము. నిజంగా ఈ బ్లాగులో చెప్పుకుంటే బాబాకి చెప్పుకునట్టే. "బాబా! మీకు శతకోటి వందనాలు. మీకు మాటిచ్చినట్లే మీ ప్రేమను పంచుకుంటున్నాను తండ్రి".
బాబాకి చెప్పుకున్నంతనే మారిన మనసు
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన మాపై చూపిన ప్రేమను, కరుణను సాటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. మా నాన్నగారు వాస్తుశాస్త్రాన్ని నమ్ముతారు. ఆయన మా ఇంట్లో కుడివైపున భూమిలో ఉన్న ట్యాంకుని ఎడమవైపుకు మార్చాలని అన్నారు. అలా చేయాలి అంటే ఎడమవైపున ఉన్న బాత్రూమ్, లెట్రిన్లను పూర్తిగా పడగొట్టి, భూమి లోపలికి తవ్వి ట్యాంకు నిర్మించాలి. ఆ బాత్రూమ్, లెట్రిన్లు ఈమధ్యనే కొత్తగా నిర్మించినవైనందున వాటిని కూలగొట్టడం అమ్మకి, నాకు ఇష్టం లేదు. అయితే నాన్న ఎవరు చెప్పినా వినిపించుకోకుండా మేస్త్రిని పిలిచి మాట్లాడేశారు. ఇక చేసేది లేక నేను, అమ్మ బాబాను ప్రార్థించాము. "బాబా! ఇప్పుడిప్పుడే నిర్మించిన వాటిని కూలగొడితే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి నాన్న మనస్సు మార్చి ట్యాంక్ పనులు ఆపేలా చెయ్యండి. అలా జరిగితే, వెంటనే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని నేను బాబాకి చెప్పుకున్నాను. అరగంట తరువాత మా అమ్మ నాకు ఫోన్ చేసి, "మీ నాన్నగారు మనస్సు మార్చుకున్నారు. 'ఆ పని తరువాత చేద్దాంలే, ఇప్పుడు చిన్నచిన్న మరమ్మత్తులు అయిపోని' అన్నారు" అని చెప్పింది. అంతవరకు ఎవరు చెప్పినా వినని నాన్న 'నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన'ని బాబాకి చెప్పుకోగానే ఆయన తన మనస్సు మార్చుకున్నారు. కాదు, బాబానే మార్చారు. నిజంగా ఇది బాబా అనుగ్రహమే. ఎవరైతే నమ్మకంతో బాబాను ప్రార్థిస్తారో, వారికి బాబా సహాయం ఎప్పుడూ అందుతుంది. బాబా మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. "మీకు అనంతకోటి ధన్యవాదాలు బాబా. మీకు ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని వెంటనే పంచుకున్నాను. నాకు వివాహమై కొన్ని సంవత్సరాలవుతుంది. మాకు ఇంకా సంతానం కలుగలేదు బాబా. దయతో మాకు సంతానం కలిగేలా అనుగ్రహించండి. అదే జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణనుస్తు!!!
ఒక్కరోజులో పని పూర్తయ్యేలా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య నా భార్య ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ మార్పుకోసం మేము అప్లై చేసాము. వాళ్ళు డేట్ అఫ్ బర్త్ మారడానికి మూడు రోజులు పడుతుంది అని చెప్పారు. అయితే ఆ మార్పు తొందరగా జరగాల్సిన అవసరం మాది. ఎందుకంటే, డేట్ అఫ్ బర్త్ మారితేనే జీతం పడుతుందని ఆఫీసువాళ్ళు చెప్పారు. ఇటువంటి స్థితిలో మేము, "బాబా! తొందరగా డేట్ అఫ్ బర్త్ మారేలా అనుగ్రహించండి" అని సాయిని ప్రార్థించాము. బాబా మాపై చాలా దయ చూపారు. ఒక్కరోజులో మా పని పూర్తయింది. బాబా నాకు ప్రసాదించినటువంటి అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు సాయి".
Om sairam
ReplyDeleteSai always be with me
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete