సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1211వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన ఉద్యోగం
2. మరోసారి కరుణ చూపిన బాబా
3. ఉద్యోగం ప్రసాదించిన బాబా 

బాబా ప్రసాదించిన ఉద్యోగం


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు సాహిత్య. మేము విజయవాడలో ఉంటున్నాము. ఈ బ్లాగును నడిపిస్తున్న విధానం చాలా బాగుంది. ఎంతో విలువైన పని చేస్తున్నారు బ్లాగు నిర్వాహకులు. సాయి మిమ్మల్ని తగినంతగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నేను ఇపుడు ఇక్కడ పంచుకోబోయే బాబా అనుగ్రహం చాలా ప్రత్యేకమైనది. నా జీవితంలో అతి ముఖ్యమైన మరియు చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిన అనుభవం. అనుభవమని చెప్పటం కన్నా బాబా నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనటం సమంజసం. ఈ ఆశీర్వాదాన్ని కూడా బ్లాగులో ప్రచురిస్తారని ఆశిస్తూ బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


నేను మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలని నమ్ముతాను. అందుచేత ఉద్యోగం చేస్తూ ఒకరిపై ఆధారపడకుండా నా కాళ్ళ  మీద నేను నిలబడి జీవనం సాగించాలన్నది నా  కోరిక. మా అమ్మగారి ఆశ కూడా అదే. ఆమె నన్ను ఒక మంచి పొజిషన్‍లో చూడాలనుకునేది. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎన్నో ఉద్యోగాలకి ప్రయత్నించాను. కానీ కేవలం నాకున్న డిగ్రీ మీద ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇలా ఉండగా కొన్ని కుటుంబ పరిస్థితులు మమ్మల్ని చాలా సమస్యలలోకి తీసుకెళ్లిపోయాయి. ఆర్థిక స్థోమత లేకపోవడం, భవిష్యత్తు అంతా గందరగోళంగా కనిపించడంతో ఏవిధంగానూ మాకు ధైర్యం లేకుండా పోయింది. నేను చాలా నిరాశకు లోనయ్యాను. అలాంటి స్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా బాధను బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఆయన ప్రేరణో ఏమోగాని, 'డిగ్రీతో చదువు ఆపకూడదని, ఇంకా పై చదువులు చదువుతూ క్యాంపస్ ప్లేస్‍మెంట్స్ లో ఉద్యోగాన్ని పొందాలి' అన్న దృఢ సంకల్పం నాలో కలిగింది. దాంతో నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం ధైర్యంగా ఉంటుంది, అమ్మ సంతోషంగా ఉంటుందని నేను ఏం.బి.ఏలో జాయిన్ అయ్యాను. ఏం.బి.ఏ కాలేజీ రోజులు మంచి స్నేహితులనిచ్చి, మంచి గురువులను చూపించి, నాకు చాలా నేర్పించి నన్ను ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దాయి. అంతేకాదు నా చదువు నాలో విశ్వాసం పెంచింది, తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసింది. అన్ని సెమిస్టర్లలో నాకు మంచి మార్కులు వచ్చాయి. వీటన్నింటి వెనకాల మా అమ్మ కృషి చాలా ఉంది. ఆమె మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అప్పు చేసి నన్ను ఏం.బి.ఏలో చేర్పించింది. ఏ లోటు లేకుండా నన్ను నా చదువు మీద దృష్టి పెట్టేలా చూసుకుంది. నేను కూడా లెక్చరర్లు, ప్రొఫెసర్లు దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంటూ చాలా సాధించాను. అసలు అంతటికి కారణం సాయి కృప, ఆయన ప్రేమ. కాలేజీలో నాకు ఎప్పుడు ఏ ఛాలెంజ్ ఎదురైనా, ఏ కష్టం వచ్చినా 'సాయి సాయి సాయి' అని అనుకుంటూ ఉండేదాన్ని. వెంటనే ఆ సమస్యకి బాబా పరిష్కారం చూపించేవారు. ఆయనకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?


బాబా దయవల్ల ప్లేస్‍మెంట్స్ ప్రక్రియ మొదలయ్యాక నేను ఒక రెండు కంపెనీలలో సెలెక్ట్ అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీల నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అటువంటి స్థితిలో నేను మళ్ళీ బాగా నిరాశకు గురయ్యాను. దేనికోసమైతే నేను ఇదంతా మొదలుపెట్టానో అది జరగటం కష్టమేమో, ఏం.బి.ఏ చదవటానికి ఇంత ఖర్చు అయిందే,  ఇప్పుడు ఉద్యోగం రాకుంటే నేను చేసినదానికి అర్థం లేకుండా పోతుందమోనని నాకు వేటి మీద ఆసక్తి లేకుండా పోవటం మొదలైంది. ఒక్కోసారి రాత్రి నిద్రపోకుండా, "బాబా! ఎందుకు ఇలా జరుగుతుంది?" అని ఏడ్చేదాన్ని. ఇలా ఉండగా మా అమ్మ నాకు తెలియకుండా, "నా బిడ్డకి ప్లేస్‍మెంట్‍లో ఉద్యోగం రావాలి బాబా" అని బాబాతో చెప్పుకుని 11 గురువారాలు 'సాయి దివ్యపూజ' చేస్తానని సంకల్పం చేసుకుని పూజ మొదలుపెట్టింది. కొన్ని ఆటంకాలు ఎదురైనా అమ్మ తన పూజ కొనసాగించింది. బాబా నా జీవితంలో పూజ జరుగుతున్న ఒక్కో వారంలో ఒక్కో  మార్పు తెచ్చుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఒక పెద్ద కంపెనీ ప్లేస్‍మెంట్స్ కోసం మా కాలేజీకి వచ్చి సెలక్షన్స్ లో భాగంగా ముందుగా వ్రాతపరీక్ష పెట్టింది. ఆ ఉద్యోగం పూర్తిగా ఏం.బి.ఏలో ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉన్నవాళ్లకే. అందువల్ల నేను 'నాకు ఈ ఉద్యోగం రాదు' అని అనుకున్నాను. అయినప్పటికీ పరీక్ష మాత్రం శ్రద్ధగా వ్రాసాను. కాదు, బాబా నా చేత అలా వ్రాయించారు. ఒక వారంలో వచ్చిన రిజల్ట్స్ లో నేను పాస్ అయి, నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందం కలిగింది. సాయి నా జీవితంలో ఒక కొత్త మార్పు తేవటానికే నన్ను ఇన్నాళ్లు నిరీక్షింపజేశారా అనిపించింది. ఎందుకంటే, మంచి కెరీర్ గ్రోత్ ఉన్న కంపెనీ అది. పైగా నేను ఉండే లొకేషన్‍లోనే ఉద్యోగం, కాబట్టి మా అమ్మకి దగ్గరగా ఉండొచ్చు.


సరే, అందరం నెక్స్ట్ రౌండ్స్ కి ఇంటర్వ్యూకోసం ఆ కంపెనీ ఆఫీసుకి వెళ్ళాము. నేను ఎప్పటినుంచో ఎలాంటి కంపెనీలో అయితే ఉద్యోగం చేయాలని ఆశ పడుతుండేదాన్నో అచ్చం అలానే ఉంది ఆ ఆఫీసు. ఇంటర్వ్యూ అంతా చాలా బాగా జరిగింది. ఒకానొక సమయంలో మాత్రం నా ఏం.బి.ఏ స్పెషలైజేషన్ లేకపోవడం కొంత సమస్య అన్నట్లు కొంచెం అటుఇటుగా మాట్లాడారు. నేను బాబాని తల్చుకుంటూ కూర్చున్నాను. మరునిమిషంలో హెచ్.ఆర్ నన్ను పిలిచి, "మీరు శ్రద్ధగా ట్రైనింగ్ తీస్కోండి. మీరు ఈ ఉద్యోగం చేయగలరు. అల్ ది బెస్ట్" అని చెప్పారు. ఆంటే, నాకు ఉద్యోగం కంఫర్మ్ అయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. నాకు చాలా సంతోషమేసింది. మేము 27 మందిమి వెళ్తే, 17 మందిమి సెలెక్ట్  అయ్యాం. అందులో నేను ఒకదాన్ని. అంతా బాబా కృప. యన లేనిదే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదసలు. ఇంటికి వచ్చి అమ్మతో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే, ఆమె చాలా చాలా సంతోషించింది. అందరికీ ఆనందంగా "నా కూతురికి ఉద్యోగం వచ్చింద"ని చెప్పుకుంది. అది అమ్మ దివ్యపూజ చేసిన 9వ వారం. 11వ వారం దివ్యపూజ అయ్యేసరికి "ఆగస్టులో జాయిన్ అవ్వమ"ని వచ్చింది. ఇద్దరు అమ్మలు(సాయిబాబా & మా అమ్మ) తన కూతురుకోసం చేసిన సంకల్పం ఎలా ఫెయిల్ అవుతుంది? బాబా అనుగ్రహం పూర్తిగా లభించినంతనే అమ్మ నాతో, "ఈ సాయి ఆశీర్వాదాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాననుకున్నాన"ని చెప్పింది. అమ్మ కోరిక మేరకు ఇలా బాబా ఆశీర్వాదాన్ని మీ అందరితో పంచుకున్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అనుభవం ద్వారా బాబా నా జీవితాన్ని చాలా చక్కగా నడిపిస్తారన్న నమ్మకం నాకు మరింత పెరిగింది. ఇకపై నా భవిష్యత్తులో కూడా నేను చేసే ప్రతి పనిలో బాబాని తలుచుకుంటూ చేసుకుంటాను. చివరిగా "సాయితండ్రీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".


మరోసారి కరుణ చూపిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వ్యవస్థాపకులైన సాయికి ప్రత్యేక ధన్యవాదాలు. సాయి భక్తులందరూ, వారి కుటుంబాలతో సహా సంతోషంగా ఉండాలని, వారందరికీ శ్రీసాయినాథుడు అండగా ఉండాలని కోరుకుంటూ బాబా పాదాల చెంత సర్వస్య శరణాగతి వేడుతున్నాను. "ఓ సాయిదేవా! నీవే నాకు దిక్కు. నా అనుభవం పంచుకోడానికి కొంచెం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు తండ్రి". నా పేరు నిరంజన్ రెడ్డి. మాది కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా మూసనపల్లి గ్రామం. నేనిప్పుడు నాలుగోసారి నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. నేను సెక్యూరిటీగా పని చేస్తున్నాను. సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ పని గౌరవంగా ఉంటుంది. అక్కడుండే ప్రతి ఒక్కరూ మంచి మాటలతో మాకు సహకరిస్తారు. రోజుకు 8 గంటల చొప్పున 26 రోజులకి 15000/- జీతం వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, కరోనా సమయంలో కూడా సాఫ్ట్ వేర్ కంపెనీవాళ్ళు మమ్మల్ని కంపెనీలోనే ఉండాలని చెప్పారు. అయితే కుటుంబ సమస్యల వల్ల స్టాండర్డ్ ఏజెన్సీలేవీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో దాదాపు ఐదు నెలలకు పైగా డ్యూటీలకు వెళ్ళక మేం చాలా ఇబ్బందిపడ్డాము. పోనీ ఐదు నెలల తరువాత డ్యూటీకి వెళదామంటే, కంపెనీలు సెక్యూరిటీ మ్యాన్ పవర్‍ని తగ్గించాయి. అదివరకు దాదాపు 28 మందిమి ఉంటే తొమ్మిది మందికి మాత్రమే డ్యూటీ ఇచ్చి మిగతా 19 మందిని తొలగించారు. తరువాత కొన్నాళ్ళకి 2022, ఏప్రిల్ నెలలో మళ్ళీ మ్యాన్ పవర్‍ను పెంచారు. కానీ పాతవాళ్ళను తీసుకోవద్దని, కొత్తవాళ్ళనే తీసుకోమని కంపెనీలు ఆదేశాలిచ్చాయి. దాంతో నేను పాతవాళ్లను తీసుకోరని చాలాసార్లు ఆవేదన చెందాను. అటువంటి స్థితిలో నా ఫ్రెండ్ ఒకరు నాకు ఫోన్ చేసి, "ఒకసారి ప్రయత్నించి చూడు" అని చెప్పాడు. బాబాను తలుచుకుని ఆయన మీద నమ్మకముంచి 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని స్మరణ చేస్తూ ఆఫీసుకు పోయి ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ అడ్మిన్‍ని కలిసాను. బాబా దయవల్ల అడ్మిన్ సార్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చి, "డ్యూటీకి వచ్చి, ఇబ్బందిపడకుండా నీ విధులు నిర్వర్తించుకో" అని నాకు ధైర్యం చెప్పారు. నేను ఆ అడ్మిన్‍కు మనసారా ధన్యవాదాలు చెప్పుకుని బాబాను స్మరించుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చేసాను. తరువాత డ్యూటీలో చేరాల్సిన రోజు బాబాను స్మరించుకుంటూ ఆఫీస్‍కి వెళ్లి డ్యూటీలో చేరాను. అలా 'Happiest Mind IT' అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో చేర్చి మరోసారి నా మీద కరుణ చూపించారు బాబా. "బాబా! తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, దైవం నీవే. నీవు సర్వాంతర్యామివి. నీవు నీ భక్తుల హృదయాలలో ఉంటావు. కరుణతో సదా వారి వెంటుండి కష్ఠాల నుండి కాపాడుతావు. నీ దయవల్ల నేను మరోసారి ఉద్యోగంలో చేరాను. అందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. నీ మేలును ఎన్ని జన్మలైనా నేను మర్చిపోలేను. నేను నీ భక్తుడినైనందుకు చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ప్రతి కష్టంలో నాకు అండగా నిలుస్తున్నావు. కానీ నేను కొన్ని సమస్యల వల్ల నిష్ఠతో ఉండలేకపోతున్నాను. నా సమస్య మీకు తెలుసు బాబా. అందుకే నా వెంట నువ్వు ఉన్నావు. అలాగే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తులందరికీ నువ్వు అండగా ఉండాలి. మేము బ్లాగులోని ప్రతి భక్తుని అనుభవాలు చదువుకుంటూ మీ అనుగ్రహానికి పరవశిస్తూ 'శ్రీసాయినాథుడు అందరి దేవుడయ్యా' అని కీర్తిస్తూ, మీ నామస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతాము. ఎన్ని జన్మలైనా మీ భక్తుడిగా పుట్టాలని మేం కోరుకుంటాం బాబా".


సర్వేజనా సుఖినోభవంతు!!!


ఉద్యోగం ప్రసాదించిన బాబా 


అందరికీ నమస్కారం. నా పేరు నళిని. నేను బాబా భక్తురాలిని. నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా బాబా ఏదో ఒక రూపంలో నాకు సహాయం అందిస్తున్నారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.  ఈ మధ్యకాలంలో ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందిపడ్డాను. బాధతో "నాకు ఎందుకు బాబా, ఇలాంటి పరిస్థితి, నాకెప్పుడు ఉద్యోగం వస్తుంది?" అని అడుగుతుండేదాన్ని. బాబా ఏదో ఒక ఫోటో రూపంలో లేదా క్వశ్చన్&ఆన్సర్ సైటు ద్వారా, "శ్రద్ధ, సబూరీతో ఉండమ"ని చెప్తుండేవారు. 'ఆలస్యం జరుగుతుందంటే బాబా ఏదో గొప్ప సహాయం చేస్తార'ని అర్థం. అందుచేత నేను సహనంతో ఆయననే తలుచుకుంటూ ఉండేదాన్ని. ఇంకా బాబా దయతో నేను 11 వారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. 11 వారాల పూజ పూర్తవుతూనే నాకు ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీరెప్పుడూ నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను".


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  3. Sashi eapcet qualify avvali please baba.. miracle chei baba please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo