సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1194వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని విశేషానుగ్రహం
2. 'బాబా' అని తలుచుకుంటే చాలు ప్రేమతో పరిష్కార మార్గం చూపే బాబా
3. సాయిబాబా ఉండగా భయపడాల్సిన పనిలేదు

శ్రీసాయినాథుని విశేషానుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


నమ్ముకున్నవారి కోరికలను తీర్చే సాయినాథునికి నా ప్రణామాలు. సాయిభక్తులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. మావారి పేరు శ్రీకాంత్. మాది మహబూబ్ నగర్ జిల్లా. నాకు ఏ భాద వచ్చినా నేను సాయినాథునితో చెప్పుకుంటాను. ఆయన నన్ను చాలా విషయాలలో అనుగ్రహించారు. ఈమధ్యనే మాకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునే భాగ్యం లభించింది. ఆ సద్గురుని దయవలన మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఇక నా అనుభవానికి వస్తే... ఇటీవల నా కూతురుకి ఇంటర్ సెకండియర్ పరీక్షలు రేపు మొదలవుతాయనగా ముందురోజు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మేము ముందు మామూలు గ్యాస్ నొప్పేమో అనుకున్నాము. కానీ మరుసటిరోజే పరీక్ష ఉన్నందున ఎందుకైనా మంచిదని పాపని సమీపంలో ఉన్న హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. డాక్టర్ పరీక్షించి, "ఇది అపెండిక్స్ నొప్పి, ఆపరేషన్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. తొలిదశ కాబట్టి నొప్పి తీవ్రంగా లేదు" అని చెప్పారు. తరువాత ఇంకో హాస్పిటల్‍కి వెళ్ళాం. అక్కడ సర్జరీ చేసే డాక్టరు ఉన్నారు. ఆ డాక్టర్ కూడా అది అపెండిక్స్ నొప్పేనని, తొలిదశలో ఉందని, స్కానింగ్ తీయించమని చెప్పారు. మేము "రేపటి నుండి పాపకి పరీక్షలున్నాయ"ని చెప్తే, 3 రోజులకు మందులు రాసిచ్చి, "రోజూ ఉదయం, సాయంకాలం గ్లూకోజ్ ఎక్కించాల"ని చెప్పారు. పరీక్ష రేపనగా పాప అలా అనారోగ్యానికి గురి కావడం నాకు, మారికి చాలా బాధను కలిగిచింది. మేమిద్దరమూ చాలా నిరుత్సాహానికి గురయ్యాము. ఆపరేషన్ గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల మా ఆరోగ్యాం కూడా దెబ్బతింది. వెంటనే మేమిద్దరమూ ఆ సాయినాథుని పాదాలకు నమస్కరించుకుని, "బాబా! మా కూతురుకి ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గేలా చేసి, ఇంటర్మీడియట్ పరీక్షలు మంచిగా వ్రాసేలా చూడండి. మా అనుభవాన్ని తప్పకుండా మీ బ్లాగ్ ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటామ"ని బాబాకి మాటిచ్చాము.


మరుసటిరోజు ఉదయం 9 గంటలకి పాపకి పరీక్ష ఉండగా 6 గంటలకే గ్లూకోజ్ ఎక్కించుకుంది. నేను, "బాబా! పాపకి ఆపరేషన్ చేయించాల్సి ఉంది. కానీ తనకి ఈ రోజే పరీక్షలు మొదలవుతున్నాయి. మీ మీద భారమేసి తనని పరీక్షకు పంపుతున్నాము. మీరే నా బిడ్డను కాపాడాలి సాయి. తనకి కడుపునొప్పి రాకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో తగ్గిపోయేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవలన పాపకి కడుపునొప్పి రావడం తగ్గింది. పాప తెలుగు, ఇంగ్లీష్ పరీక్షలు బాగా వ్రాసింది. తరువాత ఆదివారం వచ్చింది. ఆరోజు సెలవు దినం కనుక డాక్టరు, "పాపని వనపర్తికి తీసుకెళ్ళి, అక్కడ కలర్ స్కానింగ్ చేయించండి. సమస్య ఏమిటో స్పష్టంగా కనబడుతుంది" అని చెప్పారు, సరేనని అక్కడికి వెళ్ళాము. వనపర్తిలోని డాక్టర్ ముందు తన దగ్గర ఉన్న చిన్న స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్‍లో అసలేమీ కనపడలేదు. దాంతో డాక్టరు, "చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంది, పెద్ద కలర్ స్కానింగ్‍లో స్పష్టంగా కనబడుతుంద"ని స్కానింగ్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసారు. అయితే వాళ్ళు ఆరోజు స్కానింగ్ సెంటర్‍ను తొందరగా మూసేసారు. దాంతో డాక్టరు మూడు రోజులకు మందులు వ్రాసిచ్చారు. పాప ఫిజిక్స్, మేథమేటిక్స్ పరీక్షలు రాసింది. తరువాత రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నాబిడ్డ, "అమ్మా! నా నోరు చేదుగా ఉంది, కడుపు తిప్పుతున్నట్లు ఉంది, ఏమీ తినాలనిపించట్లేదు" అని కొబ్బరిబోండం త్రాగి పరీక్షకి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక తన ఒళ్ళు చల్లబడిపోయి, చెమటలు పెట్టేసి నీరసంగా ఉందని ఏడ్చింది. నేను ఇంట్లో బాబా ఫోటో ముందు నిలబడి, "బాబా! మీరే నా బిడ్డను కాపాడాలి. తనకి ఎలాంటి అపెండిక్స్ కడుపునొప్పి రాకుండా చూడాలి. నా బిడ్డ ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్ష మంచిగా వ్రాసేలా చేయండి బాబా" అని పాప ఇంటికి వచ్చేవరకు బాబాని వేడుకుంటూ ఉన్నాను. 12:30కి పరీక్ష అయిపోయిన వెంటనే పాపని వనపర్తికి తీసుకెళ్ళి కలర్ స్కానింగ్ చేయిస్తే, 'ఎప్పుడు నొప్పి వస్తుందోనని భయపడాల్సిన' టెన్షన్ ఉండదని అనుకున్నాము. అనుకున్నట్లే అక్కడికి వెళ్లేముందు నేను, "బాబా! పెద్ద స్కానింగ్ తీసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎప్పటికీ కడుపునొప్పి రాకుండా చూడండి. అలాగే ఆపరేషన్ అవసరం లేకుండా చేయండి బాబా. డాక్టరు ఆపరేషన్ అవసరం లేదని చెప్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అక్కడికి వెళ్ళాక కలర్ స్కానింగ్ తీయించి, రిపోర్టు డాక్టరుకి చూపించాము. డాక్టర్, "అపెండిక్స్ సమస్య చాలా మైల్డ్ గా ఉంది. చెప్పుకోదగ్గ అంతగా లేదు. దీనికి భయపడాల్సిన పనిలేదు. మందులతో తగ్గించొచ్చు. తగ్గిపోయే అవకాశం ఉంది" అని చెప్పి మందులు వ్రాసిచ్చారు. మేము అమిత ఆనందానికి లోనయ్యాము. వెంటనే ఆ సద్గురు సాయినాథునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాము. "ధన్యవాదాలు బాబా!! ఉన్న ఆ కొద్దిపాటి సమస్యను కూడా లేకుండా చేసి నా బిడ్డను రక్షించండి. మీ దయతో నా బిడ్డకి పూర్తిగా తగ్గిపోయిన తరువాత మీ కృపను మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను. ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేలా మా కుటుంబాన్ని అనుగ్రహించు తండ్రి. నా కొడుకు, కూతురులకు సద్బుద్ది, సద్భక్తి, మంచి విద్యను ప్రసాదించమని వేడుకుంటూ మీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను తండ్రి".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


'బాబా' అని తలుచుకుంటే చాలు ప్రేమతో పరిష్కార మార్గం చూపే బాబా


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులందరికీ నా నమస్సులు. నా పేరు ధనలక్ష్మి. మాది హైదరాబాద్. నేను మొదటిసారి నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నేను చాలారోజులుగా నా అనుభవాలను ఎలా పంచుకోవాలో తెలియక చాలా బాధపడ్డాను. చివరికి బాబా నాకు దారి చూపించారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను బాబాను దాదాపు 1997 నుండి నమ్ముతున్నాను. మా పెళ్ళైన కొత్తలో మేము పంజాగుట్టలో ఉండేవాళ్ళము. అక్కడున్న బాబా గుడికి మావారు నన్ను తీసుకుని వెళ్లారు. నేను అదే మొదటిసారి బాబా గుడికి వెళ్లడం. నేను బాబాని దర్శించుకుని "నన్ను ఆశీర్వదించండి బాబా" అని అడిగాను. అప్పటినుండి బాబా నన్ను వదల్లేదు. ఆయన నా ప్రతి అడుగులో తోడుగా ఉంటూ నా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. నాకు చిన్న, పెద్ద ఏ కష్టమొచ్చినా నేను 'బాబా' అని తలచుకుంటాను. ఆయన ప్రేమతో నాకు పరిష్కార మార్గం చూపిస్తారు. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


దాదాపు పది సంవత్సరాల క్రితం నాకు ఇరవై వేల రూపాయలు అత్యవసరంగా కావాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నేను ఎవ్వరినీ అడగలేను. మీరే నాకు దిక్కు" అని చెప్పుకుని నా డ్యూటీ పూర్తయిన తర్వాత పంజాగుట్ట బాబా గుడికి వెళ్లి చాలా బాధతో బాబాను ప్రార్థించాను. తరువాత ఇంటికి వచ్చి పడుకుని లేచాక నా ఫోన్‍లో మెసేజ్ చూస్తే, నా అకౌంటులో సరిగ్గా 20 వేల రూపాయలు జమై ఉన్నాయి. అవి ఎలా వచ్చాయని నాకు చాలా ఆశ్చర్యమేసింది. మా బ్యాంకులో కనుక్కుంటే, ఏదో అకౌంట్ నుండి ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్పారు. నాకు ఎవరు పంపారో అర్థం కాలేదు. ఆలోచిస్తే, ఒక రెండు నెలల క్రితం నా సహోద్యోగి ఒకరు చెప్పిన మాట గుర్తు వచ్చింది. తను తనకు రావాల్సిన డబ్బుని నా అకౌంటులో జమచేయమని ఒకరితో చెప్పిన విషయం నేను పూర్తిగా మర్చిపోయాను  వెంటనే ఆమెకు ఫోన్ చేసి, "డబ్బులు వచ్చాయి, నాకు అవసరం ఉంది వాడుకుంటాను" అని అన్నాను. అందుకు తను, "తీసుకో" అని చెప్పింది. ఇక నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇలా బాబా నన్ను ఎన్నో విధాల కాపాడుతున్నారు. ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీ అందరితో పంచుకుంటాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన మీ అందరికి నా వందనాలు.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


సాయిబాబా ఉండగా భయపడాల్సిన పనిలేదు


ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు మరియు సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2022, మే 9 రాత్రి నేను నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్నప్పుడు వర్షంలో తడిచాను. దాంతో బాగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వచ్చి సీరియస్ అయింది. మూడు రోజులు చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో రోజూ చదివే బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదవలేకపోయాను. తరువాత గురువారంనాడు బ్లాగులోని అనుభవాలు ఎలాగైనా చదవాలని చదివాను. అప్పుడు, 'నా తండ్రి(బాబా) ఉండగా నాకు భయమెందుకు?' అనిపించి, "బాబా! నేను ఈ బాధ భరించలేకున్నాను తండ్రి. రేపటి ఉదయానిల్లా నా కష్టం తీరితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని సాయితండ్రిని వేడుకున్నాను. అంతే, మన తండ్రి ఉదయానికి 80% నయమయ్యేలా దీవించారు. నిజంగా మన సాయిబాబా ఉండగా మనం భయపడాల్సిన పనిలేదు. ఇలా మొదటిసారి నా అనుభవం మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి బాబా. అలాగే ఇన్నాళ్లు నా అనుభవాలను ఎలా పంచుకోవాలో తెలియక పంచుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి సాయి".


సాయినాథ్ మహరాజ్ కి జై!!!


6 comments:

  1. Jaisairam bless amma for her healt and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om sai ram today is my root canal theyrapi .At 4p.m. treatment is there baba please be with me.i am feeling tense sai baba.This is 2nd sitting father sai.After 1st sitting i am suffering from weekness because some. Medicines. Won't suits me.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo