సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1209వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శరణన్న వారిని ఎటువంటి సమస్యల నుండైనా బయటపడేస్తారు బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా తోటి సాయి భక్తులకు నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి శుభాభినందనలు. సమస్యల్లో ఉన్నప్పుడు బ్లాగులోని భక్తుల అనుభవాలు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి. అంతేకాదు నేను బ్లాగులోని తోటి సాయి భక్తుల అనుభవాలు చదవటం వలన బాబాను మరింత దగ్గరగా తెలుసుకోగలుగుతున్నాను. ఇంకా బాబాతో భక్తులకుండే రకరకాల మానసిక అనుబంధాల గురించి, అతి సులభంగా బాబాకి దగ్గరయ్యే మార్గం(శరణాగతి) గురించి తెలుసుకుంటున్నాను. మనలో చాలామంది అనుభవిస్తున్న లౌకిక, ఆధ్యాత్మిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని బాబా ఏవిధంగా చూపుతున్నారో, వాళ్ళని రక్షించి తమ దగ్గరకు ఎలా చేర్చుకుంటున్నారో తెలుసుకుంటున్నాను. సమస్యలలో ఉన్నప్పుడు ఎలా బాబా మీద నమ్మకం, శ్రద్ధ, సబూరీలతో ఉండాలో, మన భక్తిని ఎలా నిశ్చలపరుచుకోవాలో తెలుసుకుంటున్నాను. ఇకపోతే, నేను ఇదివరకు కొన్ని అనుభవాలు తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు బాబాకి మాట ఇచ్చిన ప్రకారం మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.


మేము ఎప్పుడు ఏది కొన్నా, అమ్మినా బాబా అనుమతితోనే చేస్తాము. అలాగే బాబా అనుమతితో మేము 2021, డిసెంబర్ నెలలో ఒక ఎకరం భూమి కొనుగోలు చేసాము. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ భూమి యజమానికి, వాళ్ళ బంధువులకి సంబంధించి పాత భూ సమస్యలున్నాయని, అందుచేత ఒప్పందం ప్రకారం ఈ ఎకరం భూమిలో రెండు గుంటల భూమి వాళ్ళకి ఇచ్చేయాలని మాకు చెప్పారు. అప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసాం కనుక చేసేదేం లేక మేము సరేనని ఒప్పుకున్నాము. తరువాత ఎందుకైనా మంచిదని భూమి సర్వే చేయించి, బుల్డోజర్‌తో భూమి మొత్తం క్లీన్ చేయించి, రాళ్లు పాతించే పనులు చేయించాము. అలా పనులు చేస్తుంటే ఆ భూమికి ఆనుకుని ఉన్న భూమి యజమానులతో సరిహద్దు సమస్యలు ఏమైనా ఉన్నా, కోర్టు లేదా ఇతర అభ్యంతరాలు, గొడవలు ఉన్నా బయటపడతాయని మా ఉద్ధేశ్యం. అయితే అటువంటివేవీ బయటకి రాకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము.


ఇరవైరోజుల తర్వాత మేము పాతించిన రాళ్లు  పీకేసారని మాకు తెలిసింది. ఎవరికైతే రెండు గుంటల భూమి ఇవ్వాలన్నారో అతనే ఆ రాళ్లు పీకించాడని తెలిసి మాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, ఆ భూమి సర్వే చేసిన రోజు అతను కూడా అక్కడున్నాడు. అప్పుడు మౌనంగా వెళ్లి, మళ్ళీ ఇప్పుడు ఇదేంటని మేము అయోమయంలో పడ్డాము. మాకు ఆ భూమిని ఇప్పించిన మధ్యవర్తులతో మాట్లాడాము. వాళ్లు అతన్ని అడిగితే, తన భూమిలో పాతినందువల్ల పీకేసానని చెప్పాడట. "సర్వే చేయించేటప్పుడు, రాళ్ళు పాతేటప్పుడు మౌనంగా ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఈ కొత్త డ్రామాలేంట"ని గట్టిగా అడిగితే, "అదంతా నాకు తెలీదు. నా రెండు గుంటల భూమి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల"ని మూర్ఖపు వాదన తీసుకొచ్చాడు. మావారు, "మీ పాలెగాళ్ళ కొట్లాటలో తాతల నుండి వస్తున్న గొడవలతో ఇలా నా భూమిలో రాళ్లు పీకేసి గొడవ చేయటం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీరు, మీరు తేల్చుకోండ"ని గ్రామపెద్దలు, కులపెద్దల సమక్షంలో చెప్పి నెలరోజులు టైం ఇచ్చి వచ్చేసారు.


అయితే రెండు నెలలైనా ఆ సమస్య విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఎవరికి వాళ్ళు ఏమీ పట్టనట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మాకు భూమి అమ్మినతనితో, "ఏమయ్యా! డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. మాకు భూమి తక్కువ వచ్చింది. నువ్వేమో రోజూ తాగి ఫోన్ ఎత్తవు, మనుషులు ఇంటికి వస్తే, దొరకవు. ఈ గొడవ తీర్చే భాధ్యత నీదే కదా!" అని అంటే "నాకేం సంబంధం? నేను రిజిస్ట్రేషన్ చేసాను. అంతే, నాకు ఏం అవసరం?" అంటాడు అతను. అతను ఎంత మూర్ఖుడంటే, మావారు ఫోన్ చేసినా, ఏజెంట్లు ఫోన్ చేసినా చేయలేదంటాడు. ఏజెంట్లు రోజూ అతని ఇంటికి వెళ్లి, అతని తల్లిని కలిసి వచ్చినా మా ఇంటికి ఎవరూ రాలేదంటాడు. కులపెద్దలు ఫోన్ చేసినా రెస్పాండ్ అవడు, పంచాయతీకి రాడు. ఒకసారి అతను ఫోన్ ఎత్తినప్పుడు, "నేను హైదరాబాద్ నుండి వచ్చిన ప్రతీసారి నాకు రెండు వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఇలా పంచాయతీ తెగగొట్టకుండా ఎన్ని నెలలు సతాయిస్తావ"ని మావారు అడిగితే, "మీరు ఎప్పుడు వచ్చారు సార్? అసలు మీ ఫోన్ ఒక్కసారి కూడా నాకు రాలేదు" అన్నాడు అతను. అలాంటి తాగుబోతు మూర్ఖుడతను. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టినందుకు మేము ఎటూ పీక్కోలేక మాకు పిచ్చెక్కేది. పైగా డిస్ప్యూట్ ల్యాండ్ అని పేరుపడితే, తిరిగి ఆ భూమిని అమ్మటం కూడా చాలా కష్టమవుతుంది. మొదటి రెండు నెలలు చాలా మానసిక వేదన అనుభవించాక మేము, 'వేరే రకంగా పొందవలసిన మానసిక వ్యధను బాబా ఈ రకంగా తీరుస్తున్నారేమో! అసలు మాకు సంబంధమే లేని గొడవలలో ఇరుక్కునేలా, ఆ సమస్య తీర్చుకునేలా చేస్తూ తద్వారా ఆయా వ్యక్తులతో ఉన్న గత జన్మ కర్మఫలాలను అనుభవింపజేస్తున్నారేమో! ఏదైనా సహనంతో ఉండాలి' అనుకుని, "బాబా! మీరు ఎలా చేస్తారో, ఎంత సమయం తీసుకుంటారో, నెలలా, సంవత్సరమా మీకే తెలుసు. ఇక మేము చేయటానికి ఏమీలేదు. ఏం చేసినా మీరే చేయాలి. ఇలాంటి మనుషులతో కష్టం బాబా. ఆ భూ సమస్యను పరిష్కరించి మంచిరేటుకి మీరే అమ్మించండి. మీదే భారం బాబా" అని బాబాతో చెప్పుకుని సమస్యను బాబా దివ్యచరణాలకే వదిలేసాము. ఆయన ఈ సమస్య నుండి ఎలా బయటపడేశారో చూడండి.


మరో మూడు నెలలు గడిచాయి. ఆ ఐదు నెలల కాలంలో అదేదో మా కుల పంచాయతీ అయినట్లు మావారు అక్కడికి తరచూ వెళ్లి వస్తుండేవారు. మావారి మంచితనాన్ని చూసిన ఒక కులపెద్ద ఒక వ్యక్తిని చూపి, "సార్... ఈ గొడవ అంతటికి సూత్రధారి వీడే. వీడు పెద్దదొంగ. మీకు భూమి అమ్మిన అతనిని పంచాయతీకి రావద్దని చెప్పేదే వీడు. వాళ్ళిద్దరూ కలిసి తాగుతారు" అని చెప్పాడు. అది విని మేము ఎంత షాకయ్యామో బాబాకే తెలుసు. ఒక మనిషిని ఇంత నమ్మకంగా మోసం చేస్తారా అని ఆశ్చర్యపోయాము. ఎందుకంటే, ఆ వ్యక్తి వేరెవరో కాదు, మాకు ఆ భూమి అమ్మిన వ్యక్తి కజిన్. అతని భూమి మేము కొనుగోలు చేసిన భూమినానుకునే ఉంది. మేము భూమిని చూసింది మొదలు సర్వే చేయించడం, బుల్డోజర్ వర్క్, రాళ్లు పాతించటం, రిజిస్ట్రేషన్ అప్పుడు సాక్షి సంతకం పెట్టడం, పంచాయతీలో ముఖ్యపాత్ర పోషించటం వరకూ అన్నిట్లో ఉన్నది అతనే. అతను మొదటి నుండి చివరివరకూ మావారితో నమ్మకస్తునిలా నటిస్తూ, పంచాయతీ విషయంలో అంతా తానై వ్వవహరిస్తున్నట్టు బిల్డప్పులిస్తూ మావారి దగ్గర నుండి డబ్బులు గుంజాలని చూస్తుండేవాడు. అలాంటి వ్యక్తి నిజస్వరూపాన్ని బయటపెట్టించి మన వెనకే తిరుగుతూ గోతులు తీసేవాళ్ళు ఉంటారని అనుభవపూర్వకంగా బాబా మాకు తెలియజేసారు.


నిజానికి మావారు ఒక సర్వేయర్. ఆయనకి ఆ పనిలో పాతికేళ్ళకు పైబడి అనుభవముంది. ఆయనే భూమిని కొలిస్తే అసలు సమస్యే ఉండకపోయేది. కానీ అవతలి వాళ్ళకి ఎప్పటినుంచో పంచాయతీ ఉండటం వల్ల వాళ్ళ నమ్మకం కోసం ఊళ్లో భూమి కొలిచే వాళ్ళతో కులపెద్దల సమక్షంలో భూమిని కొలిపించారు. అది కూడా మూడుసార్లు సర్వే చేయించారు. అయితే పైన చెప్పిన వ్యక్తి, అదే మాతో నమ్మకస్తునిలా వ్యవరించిన వ్యక్తి తన భూమి మాత్రం కొలవనీయకుండా, తన భూమిని ఆనుకుని ఉన్న మేము కొన్న భూమి అంచు నుండే కొలిపించేవాడు. దానివల్ల ఎంతసేపూ రెండు గుంటలు తక్కువ వచ్చేది. అతని గురించి కులపెద్ద చెప్పాక మావారికి అనుమానం వచ్చి అసలు ఇతనెందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడని గూగుల్ మ్యాప్‍లో ఏరియల్ సర్వే ద్వారా భూమి కొలిచారు. అప్పుడు నిజంగా షాక్ అయ్యాము. ఎందుకంటే ఏ రెండు గుంటల భూమికోసం తన్నుకు చస్తున్నారో ఆ భూమి అతని భూమిలోనే ఉంది. అతను వాళ్ళ పాలెగాళ్ళ భూమి మంచిగా కబ్జా చేసి అది బయటపడకుండా ఇన్నేళ్ళూ అందరినీ మోసం చేస్తూ వచ్చాడు. అది అర్థమయ్యాక మావారు ఏజెంట్లకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో పాటు, ఎవరైతే మోసం చేసాడో అతనికి ఫోన్ చేసి "నువ్వు పిచ్చి వేషాలేయకు. గోడ మీద పిల్లిలాగా ఎటు వీలైతే అటు దూకుదామనుకుంటే చేసిన పాపం ఒక్కోసారి వంశాన్నే పట్టి కుదిపేస్తుంది. రెండు గుంటల భూమి నీ భూమిలోనే ఉంది. ఇప్పటికే ఊళ్ళో నిన్ను అందరూ చెడుగా అనుకుంటున్నారు. అనవసరంగా ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోకు" అని ఒకవైపు వార్నింగ్ ఇస్తూనే ఇంకోవైపు మంచిగా చెప్పారు. ఇంక తన బండారం బయటపడటంతో చేసేదేమీ లేక మళ్ళీ సర్వే చేయించి ఆ రెండు గుంటల భూమి ఇచ్చేసాడు. అంతేకాదు అతనే మా భూమిని మళ్ళీ రీసేల్ చేయించి కమీషన్ కూడా తీసుకున్నాడు. ఇలా చివరికి ఐదు నెలల తర్వాత 2022, మే రెండవ వారంలో బాబా సమస్యను పరిష్కరించి మా టెన్షన్ తీర్చారు.  "ధన్యవాదాలు బాబా. మీరు మాకు ఎప్పుడూ మంచే చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీపట్ల మాకు ధృఢ భక్తిని ప్రసాదించండి. మా చివరి ఘడియ వరకూ మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి బాబా".


నేను ఈ అనుభవం చిన్నగా వ్రాయాలనుకున్నాను. కానీ మన చుట్టూ మనతో మంచిగా ఉంటూనే ఎలా మోసం చేస్తారో చెప్పటానికి వివరంగా రాయాల్సి వచ్చింది. అందరూ సాయి స్వరూపాలే. కానీ ఏ సాయి అంతరంగం ఎలా ఉంటుందో ఎవరికెరుక? ఒక్కొక్కరి ఆలోచన విధానం చూస్తుంటే భయమేస్తుంది. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు నమ్మొద్దు.


ఇంకో అనుగ్రహం: బాబా అనుగ్రహంతో ఏడాది కిందట అంటే 2021లో మేము ఇంకో సైట్ కూడా కొన్నాము. అందులో ఒక పెద్ద బావి తవ్వించాము. బాబా అనుగ్రహంతో మంచిగా నీళ్ళు పడ్డాయి. "మీరు చాలా లక్కీ సార్, నీళ్లు చాలా బాగా పడ్డాయి. వేరే వాళ్ళు మీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా వాళ్ళకి నీళ్లు పడలేదు" అని అక్కడికి వచ్చిన ఊరి వాళ్ళు అన్నారు. దానికి మేము, "అంతా బాబా కృప అండి. అదే మా అదృష్టం" అని చెప్పాము. తరువాత మేము అక్కడ మా ఇంటి దేవతకి పూజ చేసుకోవాలనుకున్నాము. కానీ కరోనా కారణంగా చేయలేకపోయాము. అందుచేత ఈ సంవత్సరం ఎలాగైనా ఆ పూజ చేసుకోవాలని అనుకున్నాము. అయితే గతంలో మాకు ఎదురైన ఒక అనుభవం దృష్ట్యా నేను బాబాతో, "బాబా! ఇది మీ ఇల్లు, మీ సంసారం, మేము మీ మనుషులం. రూపమేదైనా(అమ్మవారు) ఇదీ మీ పూజే, మీ వేడుకే. కాబట్టి మా తప్పులేమైనా ఉన్నా క్షమించి కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడండి. అంతేకాదు ఇక్కడికి వచ్చిన అందరూ క్షేమంగా ఉండాలి. అలా అనుగ్రహించి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయతో ఆ కార్యక్రమాన్ని చాలా చాలా బాగా జరిపించారు. ధన్యవాదాలు బాబా.


ఇంకో అనుభవం: ఈమధ్య మాకు బాగా కావాల్సిన ఒక అంకుల్ బైక్ మీద వెళ్తుంటే, వెనకనుంచి ఒక డి.సి.ఎమ్ వ్యాన్ గుద్దేసింది. ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు వయస్సు ఉంటుంది. ఆయనకి షుగర్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. ఇన్సులిన్ వేసుకుంటారు. అలాంటి ఆయనకి చాలా పెద్ద ఆక్సిడెంట్ అయి ఐ.సి.యులో పెట్టి, "24 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమ"ని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం తెలిసి నేను, "బాబా! అంకుల్ బాగై క్షేమంగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల అంకుల్ ఇప్పుడు బాగున్నారు. "ధన్యవాదాలు సాయినాథా. లవ్ యు బాబా. నాకు తెలుసు, మీకు కూడా నేనంటే చాలా ఇష్టమని. అయితే మీ ప్రేమ నిస్వార్థమైనది. మరి నా ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. ఏదో ఒకటి కోరుకోవటం స్వార్థమే కదా! కానీ ఏదో ఒకరోజు నేను కూడా మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేలా అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను బాబా. నేను మిమ్మల్ని ఒకటి అడిగాను బాబా. అది నెరవేర్చి ఆ అనుభవం కూడా బ్లాగులో పంచుకునేలా అనుగ్రహించండి".


సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!!!


7 comments:

  1. Today's sai leela is very.she nerrated nicely.with baba blessings our problems can solve.we must keep sharanagati in. Him.Tharkad story is very nice.we are knowing new stories in sai devotes.No full information in sai satcharitra .You are doing great.Hats off to you and your team.

    ReplyDelete
  2. Titel is very nice.sai can solve any problem.He has that power

    ReplyDelete
  3. Om Sairam 🙏🏻 Antha baba krupa varsham !!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo