1. భవిష్యత్తు నాశనమైపోకుండా బాబా చేసిన అద్భుతం
2. ఎక్కడున్నా బాబా అనుగ్రహానికి లోటు లేదు
భవిష్యత్తు నాశనమైపోకుండా బాబా చేసిన అద్భుతం
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
"సాయినాథా! మీకు శతకోటి వందనాలు". ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను చిన్నప్పటినుండి శ్రీసాయిబాబా భక్తురాలిని. నాకు ఊహ తెలిసాక నేను కొలిచిన మొట్టమొదటి దైవం శ్రీసాయిబాబా. నేను ఇంతకముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఎందుకంటే, నా జీవితంలో ఆరోజు మరుజన్మ లాంటిది. స్వయంగా బాబానే వచ్చి నన్ను ఈ గండం నుండి బయట పడేసారనిపించింది. ఎంత పెద్ద మిరాకిల్ జరిగిందో చదివితే సాయి భక్తులందరూ చాలా సంతోషిస్తారు. "బాబా! నాకు మంచి వాక్చాతుర్యం లేదు. అందుకే నేను వ్రాస్తున్న ఈ అనుభవాన్ని తోటి భక్తులు చదివి ఆనందించేలా, మీ మీద వాళ్లకున్న భక్తి మరింత పెరిగేలా చేయి తండ్రి".
2022, మే 16, సోమవారం. ఆ రోజు నేను ఆఫీసులో నా అలమారా చెక్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎందుకో ఆఫీసర్ సర్వీస్ రిజిస్టర్(SR) బుక్ కోసం చూస్తే, అది కనిపించలేదు. ఒకటికి మూడుసార్లు బీరువా అంతా వెతికినా ఆ రిజిస్టర్ దొరకలేదు. ఇక అంతే నా కాళ్ళుచేతులు వణకడం మొదలైంది. మనసంతా ఆందోళనతో ఒకటే దుఃఖం తన్నుకొస్తుంటే, "బాబా! మొత్తమంతా వెతికినా ఆఫీసర్ గారి సర్వీస్ రిజిస్టర్ కనిపించటం లేదు. దాన్ని నేను ఎక్కడైనా పొరపాటున పెట్టి మర్చిపోయానా అంటే, అలా జరగలేదు. మరి ఎవరు దాన్ని తీసి ఉంటారు సాయి? ఎవరైనా పగతో కావాలని SR బుక్ దాచిపెట్టి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారా? అదే జరిగితే, నా జీవితం, నా కెరీర్, భవిష్యత్తు అంతా నాశనమైపోతుంది. ఇప్పటికే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఎంతో నిజాయితీగా కష్టపడి పని చేస్తున్నా కూడా చివరికి నేను ఏమీ చెయ్యనిదానికిందికే వచ్చేసింది. ఆఫీసులో నాపై చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా అన్ని పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ పోతున్నా కూడా నాకు ఎదురు దెబ్బలే తగిలాయి సాయి. ఎంతోమంది తరపున నిలిచి వాళ్ళకి మంచే చేసాను. కానీ నా వరకు వచ్చేసరికి ఏ ఒక్కరూ ముందుకి రాలేదు సాయి. అయినా నేను నా ధర్మాన్ని విడవలేదు. ఆఖరికి శత్రువుకి నా సహాయం అవసరం ఉందన్నా అన్ని మర్చిపోయి సహాయం చేస్తాను. ఎందుకంటే, నాకు మీ భయం ఎక్కువ. మీ మాట (నీతి, ధర్మం) వినట్లేదని నా మీద మీకు కోపం వస్తుందేమో, మీరు నాపై అలుగుతారేమో అని. కానీ ఈరోజు నాకు ఎందుకిలా జరిగింది సాయి? సర్వీస్ రిజిస్టర్ పోతే నా జీవితం నాశనమైపోతుందని మీకు తెలుసు కదా! మరి నన్ను ఈ గండం నుండి ఎలా బయటపడేస్తావు తండ్రి. ఎవరైనా ఆ రిజిస్టర్ తీసుంటే మాత్రం వాళ్ళ మనసు మార్చి, మళ్లీ ఆ బుక్ అక్కడే పెట్టేసేలా అనుగ్రహించండి తండ్రి. ఇక నా భారం అంతా మీదే బాబా" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. 16, 17 తేదీలలో అల్మారాను మళ్ళీ మళ్ళీ వెతికాను కానీ, ఆ రిజిస్టర్ దొరకలేదు. అప్పుడే, "చింతించకు అంతా నేను చూసుకుంటాను" అన్న బాబా మెసేజ్ ఒకటి వచ్చింది. బాబా ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాను.
మే 18వ తేది నుండి 22 వరకు సెలవులో ఉన్న నేను రోజూ 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ, ఆ నామాన్ని 108 సార్లు వ్రాసాను కూడా. 23వ తేదీన నేను తిరిగి డ్యూటీలో జాయిన్ అయి ఆ రోజంతా కూడా సర్వీస్ రిజిస్టర్ కోసం వెతికాను కానీ, దొరకలేదు. టెన్షన్ తట్టుకోలేక 24వ తేది నుండి 30 వరకు మొత్తం 6 రోజులు సెలవు పెట్టేసాను. మొత్తం 15 రోజులు నాకు ఆనందమన్నది లేదు. రోజూ రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదాన్ని. ఉన్నట్టుండి గుండెల్లో ఎదో పెద్ద రాయి పడినట్టు హార్ట్ బీట్ పెరిగిపోతుండేది. నేను మానసికంగా చాలా కృంగిపోయాను. బాబాకి మ్రొక్కని మొక్కులేదు. ఒకటే టెన్షన్‍తో సెలవు పూర్తయింది. 30వ తేది రానే వచ్చింది. నేను ఆరోజు డ్యూటీలో తిరిగి జాయిన్ అవ్వాలి. అంతేకాదు, ఆరోజు ఎలాగైనా SR బుక్ గురించి బయటపడాలి. నేను, 'బాబా మీద భారం వేసాను కదా, అంతా తాము చూసుకుంటామని బాబా చెప్పారు కదా' అని అనుకుంటూ ఆఫీసుకి వెళ్ళాను. మనసులో, "బాబా! నాకు ఈరోజు మర్చిపోలేని రోజు అవ్వాలి. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోవాలి. మిరాకిల్ జరగాలి" అనుకుంటూ బీరువా తెరిచాను. అంతే! మొట్టమొదటగా పోయిందనుకున్న ఆఫీసరు సర్వీస్ రిజిస్టర్ నా కంటపడింది. నన్ను నేను నమ్మలేకపోయాను. మళ్లీ మళ్లీ చూసాను. అది ఆఫీసర్ రిజిస్టర్ పుస్తకమే. నా శరీరమంతా షేక్ అయిపోతుంటే ఆనందం పట్టలేక ఏడ్చేసాను. ఎంత వెతికినా దొరకని బుక్ బీరువాలో పైనే ఉండటం ఎంత అద్భుతం!!
"థాంక్యూ సో మచ్ బాబా. నీ బిడ్డను కాపాడి మరో జీవితాన్ని ప్రసాదించావు. ఇంతమంచి అనుభవాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వెంటనే నా అనుభవాన్ని రాస్తున్నాను తండ్రి. నేను తెలిసీతెలియక తప్పులు చేస్తే, మనస్ఫూర్తిగా క్షమించి మీ పాదాల చెంత నాకు కొంచెం చోటు ఇవ్వు తండ్రి. నాకు ఎప్పుడూ మంచి ఆలోచనలే ఇచ్చి నీతినిజాయతీలతో ధర్మంగా జీవించేలా అనుగ్రహించు సాయి. నాకు ఎప్పుడు సమయం దొరికినా నేను మీ నామస్మరణే చేస్తూ ఉండాలి. నాకు కొంచెం కోపం ఎక్కువ. దాన్ని నియంత్రించుకోలేక నోరు జారుతున్నాను. దయచేసి నా కోపాన్ని అదుపులో ఉండనివ్వండి. నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. నా మాట తీరుతో ఎదుటివాళ్ళని అస్సలు ఆకట్టుకోలేకపోతున్నాను. నా మాటతీరు పూర్తిగా మారిపోయింది. నా భావాలు, బాధలు సరిగ్గా మీ ముందు ఉంచలేకపోతున్నాను సాయి. ప్రధానమైన నా సమస్యలు రెండు(నిజామాబాద్‍కి బదిలీ, ప్రమోషన్) మీ పాదాల చెంత ఉన్నాయి. ఈ రెండూ 2015 నుండి అలాగే ఉండిపోయాయి. 10 సంవత్సరాల నుండి నాకు నిజామాబాద్‍కి పోస్టింగ్ ఇవ్వట్లేదు సాయి. ప్లీజ్ ఒక్కసారి దాని గురించి ఆలోచించండి సాయి. ఇకపోతే కావాలనే నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు సాయి. ఒకవేళ ధర్మంగా, న్యాయంగా ప్రమోషన్ నాకు రాసిపెట్టి ఉంటే వస్తుంది. అంతా మీ మీదే భారం వేసాను బాబా. నాకు న్యాయం జరిగేలా చూడు తండ్రి సాయి".
ఎక్కడున్నా బాబా అనుగ్రహానికి లోటు లేదు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు సుబ్బారావు. నేను హైదరాబాదులో ఉంటున్నాను. ముందుగా మన గురువు, దైవం, మార్గిదర్శి అయిన శ్రీ సాయిబాబాకు నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి, అనుభవాలు చదువుతున్న భక్తులకు నా నమస్కారాలు. 'మన అనుభవాలను బ్లాగులో పంచుకుంటామ'ని బాబాకి మ్రొక్కుకుంటే, ఆయన మన కర్మలను తొలగించి మన కోరికలను తీరుస్తున్నారు. నేనిప్పుడు ఒక బాబా అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నా స్నేహితుడు ఒకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అస్సాంలోని దుబ్రిలో అతని తల్లి ఉంటుంది. 2022, మే 16వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకి లో-బిపి వచ్చి, పల్స్ రేటు బాగా తగ్గిపోయింది. ఆ విషయం తెలిసిన నా స్నేహితుడు దాదాపు ఆశలు వదులుకుని ఉన్నపళంగా తన తల్లి దగ్గరకి వెళ్ళలేనని భయాందోళనలకు గురయ్యాడు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఆమెను రక్షించండి. మీరు అనుగ్రహిస్తే, నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. మీ కృపకు నిదర్శనంగా నాకు ఫోటో రూపంలో దర్శనమిస్తే, నేను నా స్నేహితునికి తన తల్లికి ఏమీ కాదన్న విశ్వాసం ఇవ్వగలను" అని బాబాను ప్రార్థించాను. అప్పుడు నేను బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో బాబా నాకు దర్శనమిచ్చే అవకాశం లేదు. కానీ బాబా చేసిన అద్భుతాన్ని చూడండి. నేను కాసేపటికే నిద్రపోయాను. బాబా నాకు కలలో దర్శనమిచ్చి 'అంతా బాగుంటుంద'ని సూచించారు. నా స్నేహితుడు కలకత్తా, గౌహతిల మీదుగా మరుసటిరోజు సాయంత్రానికి దుబ్రి చేరుకున్నాడు. బాబా దయవల్ల అతని తల్లి బాగానే ఉంది. వెంటనే నా స్నేహితుడు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన మీదట డాక్టరు ఆమెకు గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్లు గుర్తించి, "వెంటనే ఆమెను గౌహతికి తీసుకుని వెళ్లి, తప్పనిసరిగా స్టెంట్ వేయించాల"ని చెప్పారు. ఇప్పుడు ఇంకో సమస్య ఏమిటంటే, చికిత్స మరియు ఇతరత్రా ఖర్చులకు దాదాపు 3 లక్షల రూపాయలు అవసరమవుతాయి. కానీ ఆ డబ్బు ఏవిధంగానూ సమకూరని పరిస్థితి. అయితే బాబా మళ్ళీ అద్భుతం చేసారు. మా జీతాలు ICICI బ్యాంక్‌లో క్రెడిట్ చేయబడ్డాయి. సరిగా ఆ రోజే మా మొబైల్ నుండి నేరుగా పర్సనల్ లోన్ పొందే సదుపాయాన్ని బ్యాంకు కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది నిజంగా అద్భుతం. బాబా అనుగ్రహం తప్ప మరొకటి కాదు. బాబా దయవల్ల ఆమెకి విజయవంతంగా స్టెంట్ వేశారు డాక్టర్లు. ఒక వారం తర్వాత ఆమెను దుబ్రికి తరలించారు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహం వల్లనే జరిగింది. ధన్యవాదాలు బాబా.
Om sai ram
ReplyDeleteనివృత్తి పాటిల్ జీవిత చరిత్ర చాలా బాగుంది. ఇలాంటి కథలు చాలా బాగున్నాయి. మాకు తెలియని సంగతులు తెలుస్తున్నాయి. సాయి మా గరివిడి ప్రయాణం బాగా జరిగేలాగ దీవెనలు ప్రసాదించు. నాకు కడుపు నొప్పి తగ్గించు ఆరోగ్యం ప్రసాదించు. నా కుటుంబాన్ని రక్షించు. సాయి తండ్రి ఈ సహాయం చేయి తండ్రి
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete