1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. మనసు పెట్టి అడగాలేకాని అన్నీ ఇస్తారు బాబా
3. తెల్లజిల్లేడు పాలు కంట్లో పడినా ఏ సమస్య లేకుండా కాపాడిన సాయి
శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఇటీవల రెండు సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సున్న మా సాయికి జ్వరం వచ్చింది. ఒకే నెలలో జ్వరం రావడం తనకది మూడోసారి కావడం వల్ల నాకు భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి జ్వరం తగ్గితే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత బాబా దయవల్ల మా సాయికి జ్వరం తగ్గింది. ఆ తరువాత కొన్నిరోజులకు నాకు జ్వరం వచ్చింది. అప్పుడు నేను బాబాను తలుచుకుని, "నాకు కూడా జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని అనుకున్నాను. బాబా దయవల్ల నాకు కూడా జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఒకరోజు మాబాబు మా ఇంట్లోని బెడ్ రూమ్ తాళం ఎక్కడో పెట్టేశాడు. దాని అవసరం చాలా ఉంది. పైగా ఆ తాళం చాలా ఖరీదైనది. అది పోతేగనక ఆ మొత్తాన్ని మేము ఇంటి యజమానికి చెల్లించాల్సి వస్తుంది. నేను అన్నిచోట్లా చాలాసేపు వెతికానుకానీ, ఆ తాళం కనిపించలేదు. అదింక దొరకదేమో అని బాధగా అనిపించి, "బాబా! తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అలా చెప్పుకున్న పది నిమిషాల్లో మావారికి ఆ తాళం దొరికింది. అలాగే ఇంకోసారి బాబు ఆ తాళం ఎక్కడ పడేసాడో తెలియలేదు. నేను మరలా బాబాకి, "మీ దయతో ఈసారి కూడా తాళం దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పికున్నాను. బాబా దయవల్ల వెంటనే నాకు ఆ తాళం మా ఇంటి గార్డెన్‍లో కనిపించింది. మామూలుగా అయితే గడ్డిలో తాళం అంత సుళువుగా కనపడదు. అలాంటిది అంతా త్వరగా కనపడిందంటే అది కేవలం బాబా అనుగ్రహం వల్లే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ నాపై, భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
ఈమధ్య ఒకరోజు నేను, మావారు, మా బాబు సాయి ముగ్గురమూ కలిసి ఒక షాపుకి వెళ్ళొచ్చాము. తరువాత మావారు మాతో చెప్పకుండా మళ్లీ బయటకి వెళ్ళారు. సాయంకాలం కదా, కాసేపు అలా బయటకి వెళ్లుంటారని ప్రశాంతంగా ఉన్నాను. కానీ కొంత సమయం అయినా ఆయన తిరిగి రాకపోయేసరికి టెన్షన్‍గా అనిపించింది. ఫోన్ చెద్దామంటే, ఆయన తన మొబైల్ ఇంట్లోనే వదిలేశారు. కాస్త భయమేసి, "బాబా! మీ దయవల్ల ఎలాంటి సమస్య లేకుండా మావారు త్వరగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే మావారు ఇంటికి వచ్చారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఇంకోసారి 2022, మే 1న నా భర్త కూరగాయల మార్కెట్‍కి వెళ్ళారు. మామూలుగా మార్కెట్‍కి వెళ్లి రావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అలాంటిది ఆరోజు 4 గంటల సమయమైనా ఆయన తిరిగి రాలేదు. ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసినందున ఆయనని సంప్రదించడానికి కూడా లేదు. నాకు చాలా టెన్షన్‍గా అనిపించి, "బాబా! నా భర్త ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా త్వరగా ఇంటికి వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి మావారు ఇంటికి వచ్చారు. ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్ కాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
బాబా అనుగ్రహంతో ఇటీవల నా ప్రెగ్నెన్సీ నిర్థారణ అయింది. మేము ఉండే చోట ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని టెస్టులు చేస్తారు. అలా టెస్టులు చేసినప్పుడు నేను, 'టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ అని వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్. మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాను సాయి".
మేము ఇటీవల బెల్జియం నుంచి ఇండియాకి ప్రయాణం చేయాల్సి వచ్చింది. గతంలో ప్రయాణ సమయంలో మేము చాలా సమస్యలు ఎదురుకున్నందున నేను, "ఈసారి ప్రయాణమంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మా ప్రయాణం సాగింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
మనసు పెట్టి అడగాలేకాని అన్నీ ఇస్తారు బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! శ్రీసాయినాథుని పాదపద్మములకు నా ప్రణామాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో రెండు అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 2022, ఏప్రిల్ 11వ తారీకున మా పాపని కొత్త కాపురానికి పంపించాలని 10వ తారీఖున అన్ని సర్దుకుంటున్నాము. నగలు కూడా సర్దుదామని బీరువా తీసి పాప వస్తువులన్నీ సర్దుతుంటే, ఒకే చోట పెట్టిన రెండు చెవి బుట్టలలో ఒకటి కనిపించలేదు. నేను 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ ఇల్లంతా చాలాసేపు వెతికినా ఆ చెవిబుట్ట కనిపించలేదు. దాంతో మావారికి ఫోన్ చేసి, "లాకర్‍లో పెట్టామా?" అని అడిగితే, ఆయన "లేదు" అన్నారు. అప్పుడు, "సాయినాథా! చెవిబుట్ట దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని మరోసారి వెతుకుదామని బీరువా దగ్గరకు వెళ్ళాను. చాలా ఆశ్చర్యంగా బీరువా దగ్గరే ఆ చెవిబుట్ట దొరికింది. పొద్దుటినుండి చాలాసార్లు వెతికినా దొరకనిది, బాబాకి చెప్పుకోగానే దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".
2022, ఏప్రిల్ నెల మూడో వారంలో నా ఫోన్ పని చేయలేదు. టచ్ పోయిందేమో అనుకున్నాను. ఈ మధ్యనే కొన్న ఫోన్ అలా అయ్యేసరికి ఏమి చేయాలో అర్థంకాక సాయిబాబాని తలుచుకుని బాబా ఊదీ ఫోన్‍కి పెట్టి, "బాబా! ఈ ఫోన్ మళ్ళీ పనిచేస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల సాయంత్రానికి ఫోన్ మళ్ళీ మామూలుగానే పని చేసింది. మనం మనసు పెట్టి సాయినాథుని అడగాలేకాని వారు అన్నీ మంచిగా చేస్తారు. "సాయినాథా! మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండండి. మమ్మల్నే కాదు, అందరినీ చల్లగా చూడండి సాయినాథా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
తెల్లజిల్లేడు పాలు కంట్లో పడినా ఏ సమస్య లేకుండా కాపాడిన సాయి
నేనొక సాయి భక్తురాలిని. ముందుగా సాయి భక్తులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. ఒకరోజు నేను తెల్లజిల్లేడు పూలు కోస్తున్నప్పుడు అనుకోకుండా ఆ చెట్టు పాలు నా కంట్లో పడ్డాయి. దాంతో కన్ను నుండి నీరు కారటం, మసక బారటం జరిగింది. తెలిసినవాళ్ళు 'తెల్లజిల్లేడు పాలు కంట్లో పడితే ప్రమాదమని, కంటిచూపు పోతుందని' చెప్పారు. నాకు భయమేసి, "బాబా! నా కంటికి ఏమీ కాకూడదు. మామూలుగా తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మరునాటికల్లా సమస్య తగ్గింది. "సాయి మహరాజుకు దన్యవాదాలు".
