1. పునర్జన్మను ప్రసాదించిన గొప్ప దేవుడు శ్రీశిరిడీ సాయిబాబా
2. బాబా ఉండగా మనకు చింత ఏల?
3. శరణువేడితే అండగా నిలబడతారు బాబా
పునర్జన్మను ప్రసాదించిన గొప్ప దేవుడు శ్రీశిరిడీ సాయిబాబా
నా పేరు సాయి రాజ్‍కుమార్. మాది వరంగల్ జిల్లా. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నా పద్దెనిమిదో ఏట అంటే సరిగ్గా 24 సంవత్సరాల క్రితం శ్రీ శిరిడీ సాయినాథుని దివ్య ఆశీస్సుల వలన ఒక అత్తమ్మగారి ఇంట్లో నాకు బాబా దివ్య దర్శనమైంది. నేను ప్రప్రధమంగా ఆశీర్వదిస్తూ ఉన్న నిలువెత్తు సాయిబాబా ఫోటోను వారింట్లో చూశాను. అప్పుడు అత్తమ్మ, "బిడ్డా! నీ జీవితం బాగుపడితే, బాబాను దైవంగా కొలుచుకుంటానని, మంచిగా ఉంటానని బాబాకి మ్రొక్కుకో" అని అన్నారు. అప్పటినుండి నేను భక్తి, శ్రద్ధలతో సాయిబాబాని నిత్యం పూజిస్తూ వారి స్మరణలో ఉంటున్నాను. వారి దివ్య ఆశీస్సులతో నేను ఎన్నో మహిమలు, అనుభవాలను చవిచూశాను. గతంలో నేను మన ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు పునర్జన్మను ప్రసాదించిన గొప్ప అనుభవం పంచుకుంటున్నాను.
2010వ సంవత్సరం జూన్ నెల 30వ తేదీన వరంగల్-ఖమ్మం రహదారిలోని మామునూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న నన్ను, నాతోపాటు ఉన్న మరో ఇద్దరిని ఒక కారు ఢీకొట్టింది. మేము దూరంగా రోడ్డు పక్కకి ఎగిరిపడ్డాము. అందరూ నేను చనిపోయానని అనుకునేంతలో నేను 'సాయి సాయి' అన్న నామస్మరణ చేశాను. నా దైవం సాయిబాబా నా దగ్గరకొచ్చి నా తల మీద స్పృశించి దీవించిన అనుభూతి నాకు కలిగింది. అయితే తలకి బాగా దెబ్బలు తగలడం వల్ల నేను కోమాలోకి వెళ్ళిపోయాను. కోమా నుంచి బయటికి వచ్చేసరికి హాస్పిటల్‍లో ఉన్నాను. అంటే, నేను కోమాలోకి వెళ్ళిపోయిన తరువాత పోలీసులు వచ్చి, నన్ను 108లో మా అన్నయ్య రాజు హాస్పిటల్‍కి తీసుకుని వెళ్లారు. కోమా నుండి బయటకి వచ్చిన నేను నా శరీరంలో అవయవాలేమైనా పోయాయేమోనన్న భయంతో కళ్ళు తెరవడానికి భయపడ్డాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ "నీ సాయిబాబా నీ ప్రాణాలు పోకుండా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. పునర్జన్మను ప్రసాదించారు. ఆయన నిజంగా దేవుడు" అని అన్నారు. నేను 'సాయిరామ్ సాయిరామ్' అని సాయి నామస్మరణ చేసుకుంటూ ఆయన మీద నమ్మకంతో ఉండసాగాను. ఐదు రోజులు తరువాత నేను క్షేమంగా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. బాబా లేకుంటే నేను బ్రతికే వాడినే కాదు. దయతో ఆయన తమ చేతి స్పర్శ ద్వారా దివ్యాశీస్సులిచ్చి నాకైన గాయాలను అదృశ్యం చేసి పెద్ద సమస్యలేమీ లేకుండా చేసారు. అలా నా ప్రాణాలు కాపాడిన సాయికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను నా కుటుంబంతో అదే నెలలో బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాను. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గడ్డం ఉన్న ఒక వయసు పైబడిన పెద్దాయన కలిసి "బాబా దయవలన పెద్ద ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డ అదృష్టవంతుడివి నువ్వు" అని అన్నారు. నేను ఆయనతో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత హఠాత్తుగా ఆయన ఎటు వెళ్లిపోయారో మరి కనిపించలేదు. అంతా బాబా దయ. "సాయినాథా! మాపై ఎనలేని కరుణాకటాక్షాలు కురిపిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి. 'సాయి సాయి' అంటే ఎనలేని మహిమలు చూపే దైవం మీరు. మీరు మా జీవితంలో ఉండటం మా పూర్వజన్మ సుకృతం, ఎన్నో జన్మల అనుబంధం. సాయీ శరణం. మీరు కలరు. మీరు తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ లేరు. మీరే మాకు తల్లి, తండ్రి, సర్వమూ. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే దీవిస్తూ ఉండండి సాయినాథ. మీకు వేలకోట్ల ప్రణామాలు, సాష్టాంగ నమస్కారాలు. తప్పులుంటే మన్నించు, తప్పక దర్శనం ఇప్పించు శ్రీ శిరిడీ సాయీశ్వరా".
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!!
బాబా ఉండగా మనకు చింత ఏల?
అందరికీ నమస్తే. ఇలాంటి బ్లాగుని మాకు అందించిన మీకు ఎంతో ధన్యవాదాలు సాయి. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా నాన్నగారికి 64 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయనకి ఈమధ్య హఠాత్తుగా కడుపునొప్పి ఎక్కువగా వస్తుంది. ఆ కారణంగా ఆయన రాత్రంతా నిద్రలేక ఇబ్బందిపడుతున్నారు. మందులు వాడినా పూర్తిగా తగ్గట్లేదు. ఒకసారి కడుపునొప్పి బాగా ఎక్కువగా ఉండటంతో నాన్న స్కాన్ చేయించుకుందామని డాక్టరు దగ్గరకి వెళ్లారు. అక్కడ స్కాన్ చేసాక డాక్టరు, "రిపోర్టులో స్పష్టంగా ఏమీ తెలియడం లేదు. ఒక గంట తరవాత మళ్ళీ స్కాన్ చేద్దాం" అని అన్నారు. ఆ విషయం నాన్న ఫోన్ చేసి ఇంట్లో చెప్పారు. ఇక ఇంట్లో అందరూ 'ఏం ప్రాబ్లెమ్ ఉంటుందో!' అని చాలా టెన్షన్ పడ్డారు. నేను బాబా మీద భారం వేసి, "బాబా! నాన్న రిపోర్టు నార్మల్ రావాలి. అలా వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు గంటల తర్వాత నాన్న ఫోన్ చేసి, "రిపోర్టు నార్మల్" అని చెప్పారు. అది విన్న నా మనసు చాలా ప్రశాంతించింది. నా బాబా నా చేయి ఎప్పుడూ వదలరు. ఆ నమ్మకం నాకు ఉంది. సాయి భక్తులందరూ కూడా నమ్మకంతో బాబాను ప్రార్థించండి. ఎలాంటి కష్టాన్నైనా ఆయన తరిమికొడుతారు.
మేము ఉండే చోటు నుండి చాలా దూరంలో మా అమ్మానాన్న ఉంటున్నారు. నాన్న కొంతమందికి డబ్బులు అప్పుగా వడ్డీకి ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఈరోజు మాకు శత్రువులుగా తయారయ్యారు. 64 ఏళ్ళ వయసులో నాన్న తన డబ్బులకోసం రోజూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. చూడటానికి చాలా బాధగా ఉంటుంది. ఒకరోజు నాన్న తాను అప్పుగా డబ్బులిచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్లి చాలాసేపైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన వెళ్లిన చోటు అమ్మవాళ్ళు ఉన్న ఊరికి దగ్గరలోనే ఉంటుంది. కానీ రాత్రి పది గంటలవుతున్నా నాన్న రాకపోయేసరికి ఇంట్లో ఒక్కతే ఉన్న అమ్మ టెన్షన్ పడుతూ మాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే నేను నాన్నకి ఫోన్ చేశాను. కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో నేను టెన్షన్ పడుతూనే బాబాని తలుచుకుని, "బాబా! నాన్న క్షేమంగా ఇంటికి రావాలి" అని చెప్పుకుని ఆయన మీద భారం వేసాను. బాబా దయవల్ల నాన్న ఒక అరగంటలో ఇంటికి వచ్చేసారు. నాన్న తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చూసుకోలేదంట. ఏదేమైనా బాబా ఉండగా మనకు చింత ఏల? అన్ని ఆయనే చూసుకుంటారు. ఇలా నాకు సాయితో ఎన్నో అనుభవాలున్నాయి. కొన్ని మాత్రమే పంచుకున్నాను. ఆ సాయిబాబా కృప నా మీద ఉండాలని నా జీవితంలో ఎన్నో అనుభవాలు జరగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. అన్నిటికీ మాకు మీరు ఉన్నారు. మేము మిమ్మల్నే నమ్ముకున్నాము సాయితండ్రి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి. ప్రస్తుతం కుటుంబమంతా పెద్ద టెన్షన్‍లో ఉన్నాము బాబా. ఆ సమస్యను కూడా తొలగించండి. అదే జరిగితే ఆ అనుభవం కూడా బ్లాగులో పంచుకుంటాను. నాన్నవాళ్ళు తొందరగా మేము ఉండే చోటుకి వచ్చి స్థిరపడేలా చేయండి బాబా. ఇంకా ఎప్పటినుంచో నేను రెండు కోరికలు కోరుతున్నాను. అవి జరిగేలా చూడండి బాబా".
శరణువేడితే అండగా నిలబడతారు బాబా
ముందుగా బాబా మాకు ప్రసాదించే అమూల్యమైన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశాన్నిస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు శివకుమార్. మాది పాలకొల్లు ప్రక్కన చిన్న గ్రామం. నేను ఇంతకు మునుపు కొన్ని అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నా భార్య రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పుకి నెల రోజులు ముందు తన ఒంట్లో రక్తం శాతం తక్కువ ఉందని రెండు ఇంజెక్షన్లు చేసారు. అయితే రక్త శాతం పెరగలేదు. కాన్పుకి ఐదు రోజులు ముందు కూడా రక్తం తక్కువగానే ఉంది. దాంతో డాక్టరు ఎవరైనా రక్తదానం చేసే వాళ్ళని చూసుకోమని చెప్పారు. నాకు చాలా భయమేసి బాబాని శరణువేడి, "బాబా! రక్తానికి ఇబ్బంది లేకుండా, అలాగే ఆపరేషన్ సక్రమంగా జరిగి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా అనుగ్రహించండి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆపరేషన్ జరిగే రోజు నేను, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాము. బాబా దయవల్ల ఆపరేషన్ సక్రమంగా, సురక్షితంగా జరిగింది. రక్తం అవసరం అస్సలు రాలేదు. ఇంత మేలు చేసిన బాబాకు నా ధన్యవాదాలు. నీవే దిక్కని శరణువేడితే, అండగా నిలబడతారు బాబా.
ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమః!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sairam
ReplyDelete