సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1200వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పెద్ద కష్టం కాకుండా కాపాడిన బాబా
2. నమ్ముకున్నవారికి బాబానే వైద్యుడు
3. బాబా దయ

పెద్ద కష్టం కాకుండా కాపాడిన బాబా

శ్రీసాయినాథునికి ప్రణామాలు. సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నా ఎడమ ఛాతి మీద చిన్న సైజ్ మొటిమలా ఒక చీము పొక్కు లేచింది. అది చూసి నాకు భయమేసి, "బాబా! మీ ఊదీ రాసుకుంటాను. ఈ పొక్కు తగ్గిపోయేలా చూడండి. అది తగ్గిపోతే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన ఆ చీము పొక్కు రెండు రోజులలో తగ్గిపోయింది.

ఒకసారి మావారు తన పాన్ కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. తరువాత తనకి ఏదో ముఖ్యమైన పని పడటంతో పాన్ కార్డు అవసరమయ్యింది. అప్పుడు నేను, "బాబా! పాన్ కార్డు దొరికేలా అనుగ్రహించండి. అది దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని ' ఓం శ్రీసాయి సుక్ష్మాయ నమః' అని జపించాను. బాబా దయవల్ల కొద్దిసేపట్లో పాన్ కార్డు దొరికింది. అలానే ఒకసారి నేను నా ఫోన్ మాల్‍‍లో మర్చిపోయానని భయపడ్డాను. ఎక్కడ వెతికినా దొరకలేదు. అప్పుడు కూడా బాబాకి మ్రొక్కుకోగానే నా మొబైల్ దొరికింది.

ఒకసారి నా రోజువారీ పనులు చేస్తున్నపుడు అనుకోకుండా నా నడుము పట్టేసింది. నేను ఆ నొప్పిని భరించలేక పెద్దపెద్దగా ఏడవటం మొదలుపెట్టాను. అది చూసి మావారు కూడా బాధపడ్డారు. ఆరోజు శనివారం అవ్వటం వల్ల యు.ఎస్.ఏలో డాక్టర్లు అందుబాటులో ఉండరు కాబట్టి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ నేను కనీసం కదిలే స్థితిలో కూడా లేను. పోనీ వీడియో అప్పాయింట్మెంట్ తీసుకుని టాబ్లెట్లు తెచ్చుకుందామంటే అది కూడా సాధ్యపడలేదు. నేను చాలా భయపడి నొప్పిని భరించలేక బాబాను తలుచుకుంటూ ఉండసాగాను. శనివారం నొప్పి మొదలైతే కనీసం మామూలు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోకుండా సోమవారం వరకు గడిపాను. ఇక అప్పుడు, "బాబా! నా భర్తను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కనీసం బాత్రూమ్‍కి వెళ్లి నా పనులు నేను చేసుకునే శక్తినివ్వు" అని బాబాను వేడుకున్నాను. తరువాత బాబా దయవల్ల నేను కాస్త కదలగలిగే స్థితికి వచ్చాను. అంతేకాదు టాబ్లెట్లు కూడా దొరికాయి. కానీ నా నడుముకి ఏమైనా అయిందేమోనని నాకు లోలోపల చాలా భయంగా ఉండేది. అయిన్పప్పటికీ స్కానింగ్ చేయించుకోవడానికి నేను ఇష్టపడలేదు. అటువంటి నాపై బాబా దయ చూపారు. మేము డాక్టరుని సంప్రదించినప్పుడు చిన్న వ్యాయామాలు చేయించి, "స్కానింగ్ అవసరం లేదు, ఫిజియో థెరపీతో సమస్య పరిష్కారమవుతుంది" అని చెప్పారు. బాబా దయవల్ల ప్రస్తుతం నేను థెరపీ చేయించుకుంటూ నా పనులు, ఇంటి పనులు చేసుకోగలుగుతున్నాను. ఈ కష్టకాలంలో నేను బాబా ఊదీని, సచ్చరిత్ర పుస్తకాన్ని నాతోనే ఉంచుకున్నాను. తద్వారా బాబా నాతోనే ఉండి నాకు పెద్ద కష్టం కాకుండా కాపాడారని నా నమ్మకం. కర్మ ఫలాన్ని అనుభవించాలి కాబట్టి బాబా నాకు ఆ నొప్పిని ఇచ్చినా పెద్ద సమస్య కాకుండా చూసుకున్నారు. "థాంక్యూ బాబా. నేను చేసిన తప్పులను మన్నించి నన్ను, మావారిని మీ బిడ్డలుగా స్వీకరించి సదా కాపాడు తండ్రి".

నమ్ముకున్నవారికి బాబానే వైద్యుడు

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వము. సాయి లేకుండా ఒక అర సెకండ్ కూడా నేను లేను. సాయితండ్రి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. అందులో నుండి ఒక అనుభవం నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022, మే 12, గురువారం నా ఎడమ మోచేతి దగ్గర చర్మం లోపల వాపు వచ్చింది. కొంచం నొప్పిగా కూడా ఉండింది. మాటల్లో చెప్పలేనుగాని నాకు చాలా ఆందోళనగా అనిపించి 'ఈ వాపు ఏమిట'ని ఏవో ఏవో ఆలోచనలతో ఒకటే భయమేసింది. ఆ విషయమై బాబాని ఏం అడగాలో కూడా నాకు అర్థం కాలేదు. మావారికి చూపిస్తే, "ఇదేమిటో, హాస్పిటల్లో చూపించాలి" అన్నారు. దాంతో హాస్పిటల్‍కి వెళితే, వాళ్ళు ఏమంటారో అని నా భయం ఇంకా ఎక్కువై ఏడుస్తూ, "బాబా! మీరు వైద్యులకే వైద్యుడు. మిమ్మల్ని మించిన డాక్టరు ఎవరు?" అని బాబాతో అన్నాను. అయితే కొన్నిసార్లు నా భయం బాబాపైన నాకున్న నమ్మకాన్ని అధిగమించేది. అంతగా నేను భయపడుతూ మా అమ్మతో చెప్పుకుంటే, "ఏమి కాదు. మనకి బాబా ఉన్నారు. ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు, తగ్గిపోతుంది" అని అంది. మావారు కూడా బాబా భక్తులే. ఆయనకి తన ఉద్యోగంలో బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. ఆయన అవన్నీ నాతో ఆనందంగా పంచుకునేవారు. అందువలన నేను ఆయనతో, "ఒకసారి నా గురించి బాబాను ప్రార్థించండి" అని అడిగాను. ఆయన అలాగే చేసారు. బాబా దయవల్ల నొప్పి అయితే తగ్గింది కానీ వాపులో ఏ మార్పు రాలేదు. నేను రోజూ రాత్రి వాపు ఉన్నచోట బాబా ఊదీ రాసి, 'సాయినాథా రక్ష' అని అనుకుంటూ పడుకునేదాన్ని. ఉదయాన వాపు తగ్గిందా అని చూసుకుని బ్లాగులోని అనుభవాలు చదివేదాన్ని. నాకు చాలా ధైర్యం వచ్చేది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన "బాబా! వాపు తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆయన దయవల్ల 4, 5 రోజులకి వాపు తగ్గడం మొదలై మే19 నాటికి దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. "నా పైన భారం వేయండి నేను మోస్తాను" అన్న తమ మాట నిజమని ఋజువు చేసారు నా తండ్రిసాయి. 'సాయి' అని పిలిస్తే, తప్పక పలుకుతారు. సాయినాథునికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సాయి చల్లని నీడలో మనమందరమూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.
 
సమర్థ సద్గురు సాయికి జై!!!

బాబా దయ

నేను బాబా భక్తురాలినైనప్పటి నుండి ఆయన నాకు ప్రసాదించిన అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. "బాబా! మీకు శతకోటి ధన్యవాదాలు". నాకు చిన్న వయస్సు నుండి నెలసరి సమస్య ఉంది. కొన్నాళ్ళకి అది పీసీఓడీ సమస్య అని తెలిసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. పెళ్లయ్యాక ఆ సమస్య విషయంలో నాకు చాలా భయమేసింది. బాబాని నమ్మటం మొదలుపెట్టాక ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగడం ప్రారంభించాను. కొన్ని రోజులు తర్వాత హాస్పిటల్‍కి వెళ్లి టెస్టు చేయించుకుంటే, రిపోర్టులో 'పీసీఓడీ సమస్య చాలావరకు తగ్గింద'ని వచ్చింది. అంతా బాబా దయ.

ఈమధ్య ఒకరోజు మా చెల్లెలు హాస్టల్ నుండి ఇంటికి రావడానికి ట్రైన్‍లో బయలుదేరింది. ట్రైన్ మా ఊరు చేరుకునే సమయానికి చెల్లికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. అలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు భయమేసింది. ఇక అప్పుడు నేను, "బాబా! చెల్లి క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక అరగంటకి చెల్లి క్షేమంగా ఇంటికి వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా".

4 comments:

  1. సాయిరాం

    ReplyDelete
  2. నమ్ముకున్న వారికీ, కుటుంబ సభ్యులకు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే షిర్డీ సాయి నాధుడు మన దైవం.. భయం వద్దు.. బాబా మీద భారం వేసి శ్రద్ధ సబూరి తో ఉంటే సాయిబాబా మన వెంటనే ఉండి అంతా బాగు చేస్తారు నిజం.. ప్రత్యక్ష సాక్షాలు ఎన్నోసార్లు అనుభవాలు చూసాము.. బాబా తండ్రి కృతజ్ఞతలు ధన్యవాదములు సాయిరాం

    ReplyDelete
  3. బాబా కు భవిష్యత్ తెలుసు సాయి మన కుటుంబ సభ్యులను కాపాడుతారని తెలిసిన తర్వాత నాకు ఆం దోళన తగ్గినది. నేను మానసిక రోగిని. ఎలా మారేను అంటే. మానాన్న గారు పోయే ముందు అమెరికా లో వుండే వారు. డయాబెటిస్ వలన 2కాళ్ళు మోకాళ్ల దగ్గరకు తీసేశారు. మా తండ్రి ని చూడలేదని మాసికంగా భాద పడిన తర్వాత డిప్రెషన్ వచ్చింది. అప్పటికి సాయి భక్తురాలి కాను.ఇప్పుడు నమ్మకం వచ్చింది

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo