సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1206వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలో తోడుగా ఉండే బాబా 
2. మాట పడనివ్వని బాబా

నేను ఒక బాబా భక్తురాలిని. ప్రతిక్షణం, ప్రతినిమిషం మనకు తోడుండే ఆ సాయినాథుడు మనకు ప్రసాదించిన ఎన్ని అనుభవాలను పంచుకున్నా ఇంకా ఉన్నాయనే అనిపిస్తుంటుంది. ఆయన అనుగ్రహాన్నంతా వ్రాయాలంటే ఈ జీవితం సరిపోదేమో! కానీ వాటిని వ్రాస్తుంటే జీవితంలో ప్రతినిమిషం బాబా నా పక్కనే ఉంటూ అన్నీ చేస్తున్నారనిపిస్తుంది. ఎవరికీ చెప్పుకోలేని బాధను బాబాతో చెప్పుకుంటే, ఆయన ఆ బాధలను తీరుస్తారు. "ఇంతలా ప్రేమను చూపుతున్న మీకు థాంక్యూ సో మచ్ బాబా. ఇంతకుమించి నేను మీకు ఏం చెప్పగలను?". ఇకపోతే ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్న నేను బాబాకి మాటిచ్చిన ప్రకారం ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.


ఒకసారి నేను బాబాను ఒక కోరిక కోరుకుని, అది నెరవేరితే ఆయన చరిత్ర పారాయణ చేద్దామని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా నా కోరిక నెరవేర్చారు. కానీ పారాయణ చేద్దామంటే ఏదో ఒక సమస్య వచ్చి చాలారోజులు వాయిదాపడుతూ వచ్చింది. ఆ సమయంలో బాబా ఏదో ఒక విధంగా పారాయణ గురించి నాకు గుర్తుచేస్తూ ఉండేవారు. చివరికి ఒక గురువారంనాడు నేను ఎలాగైనా పారాయణ మొదలుపెట్టాలనుకుని అలాగే మొదలుపెట్టాను. అయితే పారాయణ పూర్తి చేయటానికి ఒక వారంరోజులు పడుతుంది. కానీ అది నా నెలసరి సమయమైనందున నాకు ఏం చేయాలో అర్థంకాక, "బాబా! పారాయణ పూర్తయ్యేవరకు నాకు నెలసరి రాకుండా చేయండి. అదే జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల పారాయణ పూర్తయ్యేవరకు నాకు నెలసరి రాలేదు. మరుసటిరోజు ఉదయం వచ్చింది. "ఆటంకం లేకుండా పారాయణ పూర్తిచేయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మా ఇంట్లో నాకు ఒక పెళ్లి సంబంధం చూశారు. కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం చేసుకోవటం నాకు ఇష్టంలేదు. వాళ్ళు నన్ను చూడటానికి వస్తామని ఎన్నోసార్లు వాయిదా వేసి, ఆఖరికి కొన్ని నెలల తర్వాత వచ్చారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు, "నీ అభిప్రాయం ఏదైనా నేను గౌరవిస్తాను" అని అన్నాడు. దాంతో నేను ధైర్యం చేసి ఆ అబ్బాయితో నాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేద్దామనుకున్నాను. అయితే ముందు నేను ఏం చెప్పినా ఎవరికీ చెప్పనని మాట ఇమ్మని అడిగాను. అందుకు తాను అలాగే ఎవరికీ చెప్పను అన్నాడు. అప్పుడు నేను "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా ఇంట్లో నా అభిప్రాయాన్ని పట్టించుకోరు. కాబట్టి మీకు నచ్చలేదని చెప్పండి" అని అన్నాను. అందుకు తను, "అలాగే చెప్తాను. నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను" అని అన్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ అబ్బాయి నాకు మాటిచ్చినట్లు కాకుండా "ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని నాతో చెప్పింద"ని తన ఇంట్లోవాళ్ళకి చెప్పాడు. అతను అలా చెప్పడం తప్పుకాకపోయినప్పటికీ, నాతో చెప్పనని చెప్పి కూడా అలా చేయడం నాకు బాధ కలిగించింది. ఒకవేళ తను అలా చేయాలనుకుంటే ముందే నాకు చెప్పి ఉంటే, నేనే ఏదోలా మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేదాన్ని. 'ఇప్పుడు నేనే వద్దన్నానని బయటవాళ్లకి, ముఖ్యంగా సంబంధం తెచ్చిన మధ్యవర్తులకు తెలిస్తే ఏమవుతుందో, మా ఇంట్లో ఏమంటారో' అని నాకు చాలా భయమేసింది. దాంతో నేను ప్రతిక్షణం, "ఏ సమస్యా రాకుండా చూడండి బాబా. ప్లీజ్ బాబా. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. నా బాధ, సమస్య మీకు తెలుసు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి" అని బాబాని ప్రార్థిస్తూ ఆయన్నే తలచుకుంటూ ఎంత బాధపడ్డానో నాకు, ఆ బాబాకే తెలుసు. నేను బాబాను ప్రార్థిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో ఆయన కనిపిస్తూ, 'నీకు నేనున్నాను' అని ధైర్యాన్నిస్తుండేవారు. చివరికి 'ఇది నా సమస్య. నేనే పరిష్కరించుకోవాలి. ఎవరినో ఏదో చేయమని అడగటం దేనిక'ని నేరుగా మా ఇంట్లో "నాకు ఈ సంబంధం ఇష్టంలేద"ని చెప్పేశాను. అంతే, ఇంక ఏ సమస్యా లేకుండా అది అంతటితో ఆగిపోయేలా బాబా చేశారు. "బాబా! అటువంటి కఠిన సమయంలో మీరు నాకు తోడుగా ఉన్నారన్న విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. థాంక్యూ సో మచ్ బాబా".


ఒకసారి మా డాడీ తన కంపెనీవాళ్ళు ఏదో దైవదర్శనం నిమిత్తం టూరుకి తీసుకువెళ్తుంటే వెళదామనుకున్నారు. నాకు తెలిసి అప్పటివరకు డాడీ ఏ టూరుకి వెళ్లడం గుర్తులేదు. డాడీ ఆ టూర్ వెళ్లి, రావడానికి మూడు రోజులు పడుతుంది. పెద్ద వయస్సులో అన్నిరోజుల బస్సు ప్రయాణమంటే నాకు భయమేసి, "బాబా! డాడీకి ఏ ఇబ్బందీ కలగకుండా చూడండి. ఆయన క్షేమంగా టూరుకి వెళ్లి, తిరిగి వస్తే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల డాడీ ఏ సమస్యా లేకుండా క్షేమంగా టూరుకి వెళ్ళొచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే తోడుండండి".


మా కంపెనీవాళ్ళు వారంలో రెండు రోజులు ఆఫీసుకి రమ్మని చెప్పారు. అందువల్ల నేను మా ఊరి నుండి బస్సులో ఆఫీసుకి వెళ్లొస్తుండేదాన్ని. ఒక్కోసారి వేరే అవకాశం లేక స్లీపర్  బస్సులో చివరి సీట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. డ్రైవర్ బస్సును చాలా స్పీడ్‍గా నడపటం, ఒకసారి బస్సులో ఎటు చూసినా అబ్బాయిలే ఉండటం వంటి ఎన్నో సందర్భాలలో నాకు చాలా భయమేసి బాబాని తలుచుకుని, "ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చమ"ని వేడుకునేదాన్ని. ఆయన దయవల్లే నేను ఎన్నోసార్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణాన్ని చేయగలిగాను. "చాలా చాలా థాంక్స్ బాబా".


వారంలో రెండుసార్లు ఆఫీసుకి వెళ్లొచ్చే క్రమంలో ప్రస్తుత వేసవి ఎండల వల్ల ఒకరోజు బాగా డీహైడ్రేషన్ అయి కడుపునొప్పి వచ్చింది. డాక్టరు దగ్గరకి వెళ్తే, "డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది" అన్నారు. టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి తగ్గి, టాబ్లెట్స్ వేసుకోకపోతే నొప్పి వచ్చేది. నేను ఆ నొప్పిని తట్టుకోలేక, "ఎలాగైనా నొప్పి తగ్గిపోవాలి బాబా" అని బాబాతో చెప్పుకుని కొంచం ఊదీ నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీ కడుపుకు రాసుకుని, ఇంకొంత ఊదీ నోట్లో వేసుకుని నీళ్లు తాగేదాన్ని. బాబా నెమ్మదిగా నొప్పి తగ్గేలా చేశారు. ఒక మూడు రోజులకి మళ్లీ నొప్పి వచ్చినట్టుంటే బాబాని తలుచుకుని టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఏ నొప్పీ రాలేదు. "బాబా! నొప్పి తగ్గితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని మీకు చెప్పినట్లు పంచుకుని నా మొక్కు తీర్చుకున్నాను. ఎలాగైనా నాకు ఇంటి నుండి పని చేసుకునే అవకాశమొచ్చేలా చూడు తండ్రి. ఇలా నేను తిరగలేకపోతున్నాను".


సాధారణంగా నాకెప్పుడూ నెలసరి సక్రమంగా వస్తుంది. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం టాబ్లెట్స్ వాడటం వల్లనో లేక మరే కారణం చేతనో తెలీదుగానీ ఈసారి నెలసరి సమయానికి రాలేదు. వ్యాయామాలు, ఇంకా ఏ ఫుడ్ తీసుకుంటే మంచిదో అవన్నీ చేశాను. కానీ నెలసరి రాలేదు. అది రాకపోగా వ్యాయామాలు చేసిచేసి బాగా ఒళ్లునొప్పులు వచ్చాయి. ఇక అన్నీ అపేసి, "బాబా! ఇక మీ దయ. ఏ సమస్యలు లేకుండా నెలసరి వచ్చేలా అనుగ్రహించండి" అని బాబా మీద భారం వేసాను. ఇక అప్పుడు ఇన్స్తా గ్రామ్ మరియు వేరే ఇతర సోషల్ మీడియా ద్వారా "నీ ప్రాబ్లమ్ తీరిపోతుంది" అని బాబా మెసేజ్లు వచ్చాయి. అంతేకాదు బాబా దయవల్ల మరుసటిరోజే నెలసరి వచ్చింది. "ఏ ప్రాబ్లమ్ లేకుండా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు".


ఒకరోజు నేను, నా ఫ్రెండ్ ఆఫీసులో కూర్చుని వర్క్ చేస్తున్నాము. హఠాత్తుగా హెచ్.అర్. మా ఫ్రెండ్‍ని తన క్యాబిన్‍కి రమ్మని పిలిచారు. అంతకుముందే మేము ప్రొడక్ట్ డెమో ఇచ్చినప్పుడు మా ఫ్రెండ్‍కి 'కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోమ'ని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మళ్లీ అంతలోనే హెచ్ ఆర్. పిలిచేసరికి నాకు 'తనని ఏమంటారో' అని చాలా భయమేసి, "బాబా! ఏ ప్రాబ్లమ్ లేకుండా చూడండి. అంతా మంచిగా ఉంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చాక అడిగితే, "ట్రైనింగ్ ప్లాన్ గురించి చెప్పారు, ఏం సీరియస్ కాదు, ఫీడ్ బ్యాక్ గురించి అస్సలు కాదు" అన్నారు. అది విని నేను సంతోషంగా బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! ఇలాగే ఏ ప్రాబ్లమ్ లేకుండా మా జాబ్స్ కన్ఫర్మ్ అయి ఇద్దరం ఒకే టీమ్‍లో వర్క్ చేసేలా చూడు తండ్రి. అదే జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నేను తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. ఎవరి మీద కోప్పడకుండా, ఆవేశపడకుండా, ప్రశాంతంగా ఉండే మనసుని నాకు ఇవ్వండి బాబా. ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు ఉన్న లేకపోయినా మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని ప్రతి విషయంలో నాకు ఇవ్వండి బాబా".


మాట పడనివ్వని బాబా


సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన నిత్య జీవితంలో ప్రతిక్షణం బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. ఆయన దయవల్ల నేను ఇదివరకు ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకరోజు ఐదు నెలల గర్భవతిగా ఉన్న మా పిన్నిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. డాక్టరు కొన్ని బ్లడ్ టెస్టులు, థైరాయిడ్ టెస్టు వ్రాసి, "ఈసారి వచ్చినప్పుడు రిపోర్టులు తీసుకుని రండి" అని అన్నారు. మేము టెస్టులు చేయిస్తే, "మూడు రోజుల తరువాత వచ్చి రిపోర్టు తీసుకోండి" అని చెప్పారు. నేను అలాగే మూడురోజుల తరువాత వెళ్లి రిపోర్టులు తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న ఒక డెస్క్ లో పెట్టాను. తీరా డాక్టరు దగ్గరకి వెళ్ళేటప్పుడు ఆ డెస్క్ లో చూస్తే రిపోర్టులు కనిపించలేదు. నేను వాటికోసం చాలాసేపు వెతికినాకానీ అవి దొరకలేదు. దాంతో నా అజాగ్రత్తకి పిన్ని తిడుతుందేమోనని చాలా భయపడి, "బాబా! రిపోర్టులు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. వెంటనే రిపోర్టులు కనిపించాయి. చెప్పడానికి చిన్న విషయమే అయినా నాకు మాత్రం ఇది బాబా చేసినా ఒక పెద్ద అద్భుతం. ఆయన నన్ను ఎవరిచేత మాట పడనివ్వలేదు. "థాంక్యూ సో మచ్ బాబా. నిన్ను నమ్ముకున్నవారిని ఎల్లవేళలా కాపాడు తండ్రి".




3 comments:

  1. Jaisairam today my sister birthday. Bless her sairam

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo