సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ గజానన్ గోవింద్ దభోల్కర్


శ్రీ గోవింద్ రఘునాథ్ దభోల్కర్(హేమాడ్ పంత్), రుక్మిణి దంపతుల ఏకైక మగబిడ్డ గజానన్ గోవింద్ దభోల్కర్ 1903, సెప్టెంబరు 23న బాంద్రాలో జన్మించాడు. అతడు గిర్‌గాఁవ్ లోని ఆర్యన్ ఎడ్యుకేషన్ సొసైటీ నందు మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. 1918వ సంవత్సరంలో ముంబాయిలోని టోపీవాలా మెడికల్ కాలేజీలో చేరి 1921లో విజయవంతంగా తన కోర్సు పూర్తిచేసి 'లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్' గా గుర్తింపు పొందాడు. అదే సంవత్సరంలో అతడు లక్ష్మీబాయిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలలో ఆ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. పిల్లలందరూ సంతోషంగా పెళ్ళిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. 1971వ సంవత్సరంలో గజానన్‌కు పక్షవాతం వచ్చేంతవరకు తన మెడికల్ ప్రాక్టీస్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఆ పక్షవాతం నుంచి కోలుకున్నాక కండరాల బలహీనత కారణంగా అతడు వృత్తివిరమణ చేయాల్సి వచ్చింది.

గజానన్ తన అనుభవాన్నిలా చెప్తున్నారు: "ఒకసారి మా నాన్నగారు శిరిడీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఆయనతో వెళ్ళాలని నాకు చాలా ఆసక్తిగా ఉండి, తనతోపాటు నన్ను తీసుకెళ్ళమని పట్టుబట్టాను. అంతేకాదు, ఏడవడం కూడా మొదలుపెట్టాను. చివరికి ఆయన అంగీకరించడంతో నేను కూడా ఆయనతో శిరిడీ ప్రయాణమయ్యాను. అదే నా మొదటి శిరిడీ దర్శనం. ఆ చిన్నవయసులో నేను ఎందుకు శిరిడీ వెళ్తున్నానన్న సంగతి పట్టించుకోలేదు. అప్పటికి బాబా దైవత్వం గురించి నాకేమీ తెలీదు. అయితే రైలులో దూరప్రయాణమని, ఇంకొక గ్రామాన్ని చూడబోతున్నానని, అక్కడ చాలా ఆనందించవచ్చని నేను చాలా సంతోషంగా ఉన్నాను. శిరిడీ చేరుకున్నాక మేము సాఠేవాడాలో బసచేశాము. గ్రామంలో చిన్న మట్టిగుడిసెలతో పోలిస్తే అది ఒక పెద్ద వాడా. మేము స్నానం చేసిన తర్వాత ద్వారకామాయికి వెళ్ళాము. అది శిథిలావస్థలో ఉన్న పాత మసీదు. అక్కడ కటకటాల దగ్గర కూర్చుని ఉన్న ఒక ముసలి ఫకీరును నేను చూశాను. ఆయన ఒక చిరిగిన, బాగా మురికిగా ఉన్న పాత కఫ్నీ ధరించి ఉన్నారు. ఆయన తలకు మురికిగా ఉన్న ఒక తెల్లనిగుడ్డ చుట్టబడి, ఎడమచెవి వెనకవైపుగా ముడి వేయబడి వుంది. నేను ఆయనే సాయిబాబా అయివుంటారని అనుకున్నాను. మా నాన్నగారు ఆయన పాదాల వద్ద కూర్చున్నారు. అందుకని నేను కూడా అక్కడే కూర్చున్నాను. ఆయన ముందు 15-20 మంది ప్రజలు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి కూర్చుని ఉన్నారు. కొంతమంది ఆయన పాదాలు ఒత్తడం, చిలిం వెలిగించడం వంటి సేవలు చేసుకుంటున్నారు. పాడుబడ్డ ఆ మశీదు క్రిందప్రాంగణంలో కొంతమంది పిల్లలు, "బాబా, బాబా, సాయిబాబా" అని అరుస్తూ ఎగిరి దూకుతూ ఆటలాడుతున్నారు. బాబా కొన్ని పేడాలను చేతిలోకి తీసుకుని వాళ్ళవైపు విసిరారు. వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ఆ మిఠాయిలను సేకరించుకుంటున్నారు. ఇంకా మిగిలిన ఉన్న ప్రసాదాలను తమ ముందు కూర్చునివున్న భక్తులకు పంచిపెట్టారు. కొంతసేపటి తరువాత బాబా నా చెయ్యి పట్టుకుని తమ దగ్గరకు లాక్కుని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా 'బాపూ' అని సంబోధిస్తూ నన్ను హత్తుకున్నారు. నేను చాలా భావోద్వేగానికి గురై కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. దీన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. 

మేఘుడు ఆరతి పూర్తిచేశాక, బాబా మృదువైన స్వరంతో ప్రేమగా అందరినీ ఇంటికివెళ్ళి భోజనం చెయ్యమని చెప్పారు. ఆయన, "కాకా, నానా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఆకలితో ఉండి ఉంటారు, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. రెండు, మూడు గంటల తరువాత మీరు మళ్ళీ ఇక్కడకు రావచ్చు. అప్పుడు అందరం కూర్చుని అల్లా గురించి మాట్లాడుకుందాం" అని అన్నారు. అక్కడ ఉన్న భక్తులకు తమ కడుపులు ఆకలితో నకనకలాడుతున్నప్పటికీ ఇంటికి వెళ్ళడానికి అయిష్టంగా ఉంది. పరమ కారుణ్యమూర్తి, దయాళువైన ఫకీరు సాంగత్యాన్ని ఎవరు విడిచి వెళ్ళగలరు? భక్తులు ఇంటికి తిరిగి వెళ్ళేముందు బాబా ధునిమాయి ముందు నిలబడి వెచ్చటి ఊదీని ధునినుండి తీసి ప్రతి ఒక్క భక్తుని చేతినిండా ఇచ్చారు. ఊదీ అంటుకున్న ఐదువేళ్ళతో బాబా భక్తుల నుదుటిమీద కొంచెం బలంగా పెట్టారు. ఆ స్పర్శకు స్వర్గంలో ఉన్నంత అనుభూతి నాకు కలిగింది. నా చెక్కిళ్ళపైనుండి ఆనందభాష్పాలు జలజలా జారాయి. ఆ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. ఇటువంటి గొప్ప అనుభవాన్ని కానుకగా ఇచ్చిన మా నాన్నగారికి కృతజ్ఞతలు మాత్రమే చెప్పగలను".

1. గజానన్ మొండిగా ఏడ్చి శిరిడీకి తనని తీసుకెళ్ళాలని పట్టుబట్టాడు. అలాగే మనం కూడా ఆత్రుతగా, బలమైన కోరికతో మన సద్గురువును కలవాలని ఏడవాలి.
2. వాళ్లు సాఠేవాడాలో బస చేశారు. మట్టిగుడిసెలతో పోలిస్తే అది సిమెంటుతో గట్టిగా కట్టబడింది. సాఠేవాడా అనేది చెక్కుచెదరకుండా ఉన్న శరీరంలో నివసించే ఆత్మకు ప్రతీక.
3. మనమందరము ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండాలని అనుకుంటాము, అయినప్పటికీ మన పంచేంద్రియాలు (1+4=5) మరియు  పంచమహాభూతాలు సమర్పించాలి.
4. అప్పుడు బాబా మనల్ని తమ దగ్గరకు లాక్కుని హత్తుకుని ప్రేమతో 'బాపూ' అని పిలుస్తారు.

డా‌. గజానన్ బాబా సంస్థాన్‌లో కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేసిన అదృష్టవంతుడు. ఆవిధంగా తన సద్గురువుకు సేవచేసుకునే గొప్ప భాగ్యాన్ని పొందాడు. అతడు ఎంత అదృష్టవంతుడంటే, తన జీవితమంతా 'సాయినివాస్'లో గడిపాడు.

ఈ 'సాయినివాస్' గురించిన వివరాలు రేపటిభాగంలో....

Ref: Sai Leela Magazine year 57, ank 2, May of 1978
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri

4 comments:

  1. Om Sairam ��

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌸🥰🌺🤗

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo