సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

త్రయంబక్ గోవింద్ సామంత్


1915వ సంవత్సరంలో త్రయంబక్ గోవింద్ సామంత్ మొదటిసారిగా శిరిడీ వెళ్ళాడు. అప్పుడతని జేబులో 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అందులో నుండి ఒక రూపాయి బాబాకు దక్షిణ ఇచ్చాడు. బాబా ఆ రూపాయిని తీసుకొని మరో రూపాయి కూడా ఇమ్మన్నారు. అతడు మరో రూపాయి ఇవ్వటానికి విముఖత చూపాడు. కానీ బాబా మళ్ళీ మళ్ళీ అడగటంతో సామంత్ మరో రూపాయి సమర్పించుకున్నాడు. బాబా ఆ రెండు రూపాయలను పైకి క్రిందకి తిరగేసి చూసి, "నీవు ఈ రెండు రూపాయలు గణపతి భగవానునికి ఇచ్చావు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, గణు మహారాజ్ నిన్ను ఆశీర్వదిస్తాడ"ని అన్నారు. బాబాకు మరో రూపాయిచ్చి నష్టపోయానన్న ఆందోళనలోనూ, తిరిగి ఇంటికి వెళ్ళే ఆతురతలోనూ ఉన్నందున బాబా మాటలలోని ఆంతర్యం అతనికి అర్థం కాలేదు. వాస్తవానికి బాబా అతనిని ఆవిధంగా దీవించడం ద్వారా గతంలో అతనికి గణూమహరాజ్‌గా దర్శనం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేయాలని ప్రయత్నించారు. అసలు విషయమేమిటంటే, అతనికి 21 సంవత్సరాల వయస్సున్నప్పుడు బాబా అతనికి గణూమహరాజ్‌గా దర్శనమిచ్చి గణపతి యొక్క ఏకాక్షర మంత్రం చెప్పారు. అప్పుడు సామంత్ ఆ మంత్రాన్ని కోటిసార్లు జపించాడు.

తరువాత సామంత్ అసంతృప్తిగా ప్రధాన రహదారి చేరుకున్నాడు, అక్కడ కోపర్‌గాఁవ్ వెళ్ళడానికి టాంగా అందుబాటులో లేదు. ఇంతలో రహతా నుండి టాంగాలో ఒక గుజరాతీ వ్యక్తి ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. అతడు సామంత్‌ని చూచి తనతోపాటు రమ్మని కోరాడు. సామంత్ సరేనని అతని పక్కన కూర్చున్న తరువాత ఆ గుజరాతీ వ్యక్తి సామంత్‌ని, "మీరు బాబా దర్శనం చేసుకొని వస్తున్నారా? మీరు ఒక రూపాయిస్తే ఆయన మరో రూపాయిని అడుగుతారు" అని అన్నాడు. ఆ మాటలు విని సామంత్ దిగ్భ్రాంతి చెందాడు. ఇతనికివన్నీ ఎలా తెలుసని ఆశ్చర్యపోయాడు! కోపర్‌గాఁవ్ చేరుకున్న తరువాత ఆ గుజరాతీ వ్యక్తి టాంగావానికి ఇవ్వవలసిన వారిద్దరి ఛార్జీలను ఇవ్వడమే కాకుండా దాదర్‌కి రెండు టిక్కెట్లు కూడా అతనే కొనుగోలు చేశాడు. ఇద్దరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేసి దాదర్ చేరుకున్నారు. తరువాత గుజరాతీ వ్యక్తి సామంత్‌కి హృదయపూర్వకంగా భోజనం కూడా పెట్టాడు. సామంత్ అతని దయాగుణానికి ఆశ్చర్యపోయాడు. తరువాత సామంత్ గుజరాతీ వ్యక్తిని అతని పేరు, చిరునామా అడిగాడు. అతడు "గణూ మర్వాడీ, ప్లాట్ నెంబర్-1, బుందేర్ మసీదు వెనుక" అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు సామంత్ అతనిని కలుసుకొని డబ్బును తిరిగిద్దామని అతని చిరునామా వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ గణు మర్వాడీ పేరుతో ఆ ప్రాంతంలో ఎవరూ నివసించటంలేదు. మొత్తం ప్రాంతమంతా ముస్లింలు నివసిస్తున్నారు. ఆ తరువాత ఆలోచిస్తుండగా బాబా మాటలు గుర్తు వచ్చి, అసలు బాబా మాటలలో ఆంతర్యం ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు గతంలో తనకి త్రయంబకేశ్వరం సమీపంలోని అరణ్యంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి. ఆ సమయంలో కొందరు దోపిడీదారులు అతనిని ఒక గుహకు తీసుకొని వెళ్లి బంధించి చంపేస్తామని బెదిరించారు. రక్షణ కోసం అతను గణపతిని తీవ్రంగా ప్రార్థించాడు. వెంటనే, "జై మల్హరీ" అని ఒక పెద్ద అరుపు వినపడింది. ఆ శబ్దానికి దొంగలు భయపడి అతనిని విడిచిపెట్టారు.

మరొక సందర్భంలో సామంత్ అదే అడవిలో వెళ్తూ దారి తప్పిపోవడంతో మళ్ళీ గణపతిని ప్రార్థించాడు. హఠాత్తుగా కుష్ఠురోగంతో బాధపడుతున్న ఒక నల్లని వ్యక్తి అతని ముందు నిలబడి, "నా పేరు గణూ మహర్. నీవు వెళ్ళవలసిన మార్గం తప్పిపోయావు, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, కానీ నీవు వెనుకకు తిరిగి చూడకూడదు. ఇది నీకు అంగీకారమా?" అని అడిగాడు. అందుకు సామంత్ అంగీకరించడంతో ఇద్దరూ ముందుకు నడవడం ప్రారంభించారు. గణు మహర్ అతని వెనుక ఉండి, అతనితో మాట్లాడుతూ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. వారు ప్రధాన రహదారి చేరుకోగానే గణూ మహర్ నిశ్శబ్దంగా ఉన్నారు. సామంత్ తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు.

ఆ సంఘటనల ద్వారా తనను పట్టుకున్న దొంగల బారినుండి తనని కాపాడినది, అరణ్యంలో గణు మహర్ రూపంలో దారి చూపినది, శిరిడీ నుండి వచ్చేటప్పుడు గుజరాతీ వ్యక్తి గణు మార్వాడి రూపంలో తనకు సహాయపడినది బాబానే అని గ్రహించాడు. అప్పటినుండి సామంత్ బాబాను గణపతి రూపంగా పూజించటం మొదలుపెట్టాడు.

చిదంబరరావు గాడ్గిల్: ఇతను నిజానికి గణపతి భక్తుడు. ఒకసారి శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. అప్పటినుండి తన ఇంటిలో బాబాను గణపతిగా పూజించేవాడు. కొన్నాళ్ళకు అతను మళ్ళీ శిరిడీ వచ్చినపుడు బాబా నవ్వి, "ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు" అన్నారు.

బాంద్రా మహిళ: ఒకప్పుడు ఈమె శిరిడీ వచ్చి సాయికి నమస్కరించి, ఆయనెదుట కూర్చోగానే, 7 సంవత్సరాలుగా తనని బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, "అమ్మా! నీ చిన్నతనంనుండి నాకన్నీ సమృద్ధిగా తినబెడుతున్నావు" అన్నారు. ఆమెకేమీ అర్థంకాలేదు. బాబా నవ్వుతూ, "నీవెవరిని పూజిస్తావు?" అన్నారు. అందుకామె "గణపతిని పూజిస్తానని" చెప్పింది. అప్పుడు బాబా, "నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి" అన్నారు. విఘ్నేశ్వరుడు భోజనప్రియుడు, ఆ గణపతియే తామని బాబా సూచించారు.

సోర్స్: Ambrosia in Shirdi Part-I (Baba's Leelas before 1918), శ్రీసాయిలీలామృతం.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo