సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా అంత లీల చేసి ఎందుకు నా ఇంటికి వచ్చారో?


నేను భువనేశ్వర్ నుంచి మాధవి. "అనంతా తులాతే కసేరే స్తవావే" అని మనమంతా రోజూ ఆరతులలో పాడుతూ ఉంటాము. అనంతమైన బాబా లీలలు ఎవ్వరూ కనుక్కోలేరు. ఆ అనంతుడు అంటే వెయ్యితలల ఆదిశేషుడు కూడా ఆ స్వామి లీలలు లెక్కపెట్టలేడు. ఇంక మనమెంత? ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆయన లీలలు జరుగుతున్నాయి, ఇకపైన కూడా జరుగుతూనే ఉంటాయి. తరాలు మారినా ఆయన లీలలు జరగడం ఆగదు. అనంతజీవన స్రవంతిలో అనంతుని లీలలు ఇవి. అందరూ ఆ లీలలను ఆస్వాదించి ఆనందించవలసిందే.

అది 2015వ సంవత్సరం. నేను భువనేశ్వర్ లో NABM అనే చోట జాబ్ చేస్తున్న రోజులు. నా ఫ్రెండ్ గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించింది. నేను తనకి ఒక మంచి బాబా ఫోటో గిఫ్ట్ ఇద్దామనుకొని బాబా ఫోటో తీసుకోవడానికి ఒక షాపుకు వెళ్లి ఒక మంచి బాబా ఫోటో చూపించమని అడిగాను. అతను చూపించేంతలో అక్కడ ఒక పెద్ద బాబా విగ్రహం చూసాను. అది చాలా చాలా బాగుంది. 'బాబా నిజంగా నావైపు చూస్తున్నారా!' అన్నట్లు ఉంది.



ఆ బాబా రూపం నా మనస్సుకెంతో హత్తుకోవడంతో, "ఆ విగ్రహం ఖరీదెంత?" అని షాపతనిని అడిగాను. అతను ఆరువేల రూపాయలని చెప్పాడు. "అమ్మో, అంత ఖరీదా? వద్దులే, ఇంట్లో బాబా విగ్రహం ఉంది కదా!" అనుకొని బాబా ఫోటో మాత్రం కొనుక్కుని ఇంటికి వచ్చేసాను. ఆరోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, "నేను నీ ఇంటికి వద్దామనుకుంటే, నీవు నన్నే వెల కట్టాలని చూస్తున్నావా?" అని అడిగారు. అంతే! ఉలిక్కిపడి లేచాను. ఏమిటో నా భ్రమ అనుకొని ఆ కల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాని సంగతే పూర్తిగా మర్చిపోయాను. అయితే మళ్ళీ మరుసటిరోజు కూడా బాబా కలలో దర్శనమిచ్చి, "నీ ఇంటికి రావాలని నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, నువ్వు ఈ కొంచెం దూరం(షాపు నుంచి ఇంటికి) నన్ను తీసుకెళ్లవా?" అని నన్ను నిలదీసి అడుగుతున్నారు. అప్పుడు అర్థం అయ్యింది, బాబాయే స్వయంగా నా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని. ఇంకేమీ ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా మరుసటిరోజే షాపుకి వెళ్లి ఆరువేల రూపాయలు చెల్లించి బాబా విగ్రహం తీసుకున్నాను. అప్పుడు ఆ షాపతను విగ్రహాన్ని పైకి ఎత్తుతూ ఆశ్చర్యంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, అతను, "మేడమ్! ఈ విగ్రహం కొనడానికి నిన్న ఒకతను వచ్చాడు. నిన్న షాపులో పనిచేసే అబ్బాయి రాలేదు. నేను ఒక్కడినే ఈ విగ్రహాన్ని పైకి ఎత్తలేకపోయాను, అంత బరువు ఉంది. అందువలన కొనాలని వచ్చిన అతను వెళ్లిపోయాడు. ఈరోజేమిటి ఇంత తేలికగా ఉంది ఈ విగ్రహం?" అని అన్నాడు. అది విని నాకు కూడా నోటమాట రాలేదు. నేను ఆ విగ్రహం తీసుకొని ఇంటికి వచ్చి పూజగదిలో పెట్టుకొని, అప్పటినుండి రోజూ బాబాను పూజించుకుంటున్నాను. ఇది బాబా మా ఇంటికి వచ్చిన అద్భుతమైన లీల. నేనెప్పుడూ ఇంత పెద్ద బాబా విగ్రహం కొనాలని అనుకోలేదు. మరి బాబా ఇంత లీల చేసి ఎందుకు నా ఇంటికి వచ్చారో? చాలా తేలికగా ఉండే ఆ విగ్రహం, ఇంకొకతను కొనాలని వస్తే అంత బరువుగా ఎందుకు ఉందో? బాబాకే తెలియాలి!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo