సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1429వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి నెరవేర్చిన కోరికలు
2. పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
3. దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా

శ్రీసాయి నెరవేర్చిన కోరికలు


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! శ్రీసాయిబాబా పాదారవిందాలకు నా మనఃపూర్వక నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు కృతఙ్ఞతలు. నా పేరు ఉమ. మాది కృష్ణ జిల్లాలోని ఘంటసాల గ్రామం. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. కార్తీకమాసంలో ఒకరోజు రాత్రి నా భర్తకి ఆక్సిడెంట్ అయినట్లు నాకు కల వచ్చింది. మెలుకువ వచ్చి చూస్తే తెల్లవారుఝామున గం. 3:20 నిమిషాలైంది. వెంటనే నేను నా మనసులో శ్రీసాయిబాబాకి నమస్కరించుకుని, "ఈ కార్తీకమాసం పూర్తయ్యేలోపు నేను శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేసేలా అనుగ్రహించండి. అలా జరిగితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ తండ్రి దయవల్ల కార్తీకమాసంలో చివరిరోజున నేను మా అన్నయ్య, వదినలతో కలిసి శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేశాను. శ్రీమల్లన్నస్వామి దర్శనం చక్కగా జరిగింది. ఇంకా నేను ముందుగా అనుకున్న విధంగా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుందామని అనుకునేలోపు మరో అనుభవం జరిగింది. అదేమిటంటే, మా అన్నయ్య, వదినలకు పెళ్ళై 8 సంవత్సరాలైంది. కానీ వాళ్ళకి సంతానం లేదు. నేను ఇదివరకు ఆ విషయం ఈ బ్లాగులో చెప్పుకుని, అన్నయ్య వాళ్ళకు ఎదో విధంగా ఒక బిడ్డ దక్కాలి అని అనుకున్నాను. అన్నయ్యవాళ్ళు  ఇద్దరు డాక్టర్లకి ఎవరైనా పిల్లలుంటే, దత్తత తీసుకుంటామని చెప్పారు. మేము శ్రీశైలం నుండి వచ్చిన తరువాత 3 రోజులకి మా ఆయనకి, "ఒక పాప పుట్టింది, తీసుకుంటారా?" అని ఒక ఫోన్ వచ్చింది. అందుకు మా అన్నయ్యవాళ్ళు సరేననడంతో  మరుసటిరోజు మేమందరం వెళ్లి, ఆ పాపని తీసుకున్నాము. అయితే ఆ పాప బరువు చాలా తక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందువల్ల పాపని హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను మనసులో, "బాబా! మీ దయవలన పాపకి ఇన్ఫెక్షన్ తగ్గి, త్వరగా కోలుకుని ఇంటికి రావాలి. అలా జరిగితే నేను మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన 10 రోజులకు పాపకి తగ్గి క్షేమంగా ఇంటికి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పాప క్షేమంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలి తండ్రి. అలాగే మా అమ్మవాళ్ల కుటుంబమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేలా అనుగ్రహిచండి బాబా".


2022, నవంబర్‍లో నేను ఒక స్టోన్స్ నెక్లెస్ చేయిద్దామని మాకు దగ్గరలో ఉన్న ఒక బంగారం షాపులో ఆర్డర్ ఇచ్చాను. ఆ షాపతను, "ఇక్కడ అంత బాగా చెయ్యటం కుదరదు, అది చాలా కష్టం. వేరేచోట చేయిస్తాము. అయితే అక్కడివాళ్ళు ఏమైనా తేడా వస్తే, వస్తువు మార్చరు. కాబట్టి ఎలా ఉన్న మీరు ఉంచుకోవాల్సిందే" అని చెప్పారు. అది విని నాకు కొంచెం ఆందోళనగా అనిపించి మనసులో, "బాబా! నేను అనుకున్న విధంగా అనుకున్న బడ్జెట్‍లో వస్తువు అందంగా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత డిసెంబర్ రెండో వారంలో షాపతను వస్తువు తీసుకుని వచ్చారు. అది చాలా అందంగా, అనుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్ కన్న తక్కువగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి తండ్రి. మా కుటుంబ ఆరాధ్య దేవత శ్రీకోట ముత్యాలమ్మ తల్లిని, మా గ్రామంలోని శ్రీఅభయ ఆంజనేయస్వామిని, శ్రీకనకదుర్గమ్మని(విజయవాడ), అలాగే మిమ్మల్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా తొందరలో దర్శించి నా మొక్కులు తీర్చుకునేలా అనుగ్రహించమని ఈ బ్లాగు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి".


పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా


నా పేరు శివ. మాది నర్సాపురం. నేను ఇప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం పంచుకుంటున్నాను. నేను ఈమధ్య అయ్యప్ప మాల వేసుకున్నాను. ఆ సమయంలో తుఫాన్ రావడం, అప్పుడు కూడా నేను రోజూ చన్నీళ్ల స్నానం చేయడంతో నాకు తలనొప్పి మరియు గొంతునొప్పి వచ్చి నన్ను చాలా బాధపెట్టాయి. రెండు రోజులు పూజ కూడా సరిగా చేయలేకపోయాను. మూడో రోజు రాత్రి పూజ జరుగుతున్నప్పుడు గొంతు బాగా ఇబ్బందిపెట్టింది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకున్నా ఉపయోగం లేకపోయింది. అప్పుడు నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ నా లాంటి సమస్యకు సంబంధించిన ఒక భక్తుని అనుభవం ఉంది. ఆ భక్తుడు తనకి గొంతునొప్పి వస్తే, తను ఆ నొప్పి తగ్గితే తన అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నానని, బాబా దయతో తనకి నొప్పి తగ్గిందని పంచుకున్నాడు. అది చదివి నేను షాకయ్యాను. వెంటనే నేను బాబాని మనసులో తలుచుకుని, "బాబా! నాకు కూడ గొంతునొప్పి తగ్గి, రేపు ఉదయం పూజకు ఏ ఇబ్బంది లేకపోతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి గొంతునొప్పి ఉందికానీ, పూజలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బాబా దయవల్ల పూజంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. తొందరగా నా గొంతునొప్పిని పోగొట్టి, అయ్యప్ప దీక్ష సక్రమంగా జరిగి, స్వామిని దర్శించి క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకునేలా అశీర్వదించు తండ్రి. ఈ అనుభవం పంచుకోవటం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా


సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. మాది శ్రీకాకుళం. మా అమ్మానాన్నలిద్దరికీ గుండె ఆపరేషన్ జరిగింది. 2022, ఏప్రిల్ 6వ తేదీన నాన్న కాలం చేసారు. ప్రస్తుతం అమ్మ మాత్రమే ఉంది. ఆమె ఒంటరిగా ఉంటున్నా దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేదు. నాకు పెళ్ళై మూడు సంవత్సరాలవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ప్రెగ్నన్సీ వస్తేనైనా అమ్మని జాగ్రత్తగా చూసుకునే భాగ్యం నాకు లభిస్తుందని నా ఆశ. ఇక అసలు విషయానికి వస్తే.. అసలే ఆరోగ్యం బాగాలేని మా అమ్మ ఒకసారి పొడి దగ్గుతో మరింత బాధపడసాగింది. ఒక్కోసారి ఆమె దగ్గుతుంటే, నాకు చాలా భయమేసి ఊపిరి ఆగిపోయేంత పని అవుతుండేది. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో నేను అమ్మతో ఫోన్‍లో మాట్లాడుతుండగా అమ్మకి చాలా తీవ్రంగా దగ్గు వచ్చింది. ఎంతలా అంటే దగ్గటం కూడా తనకి చాలా కష్టంగా ఉంది. ఆమె అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేక, "బాబా! అమ్మ ఆరోగ్యం నాకు చాలా అవసరం. ఆమె దగ్గుతో చాలా బాధపడుతోంది. ఆ దగ్గుతో తనకి నిద్రపట్టడం లేదు. దగ్గు కాస్త తగ్గుముఖం పట్టి అమ్మ చక్కగా నిద్రపోయేలా చూడు బాబా" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం అమ్మ ఫోన్‍లో, "దగ్గు తగ్గింది" అని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "బాబా! మీ కరుణకు నేను చాలా కృతజ్ఞురాలిని. నీ మహిమ చెప్పనలవి కాదు. అందరినీ కాపాడు బాబా. మీ దరికి చేరే మార్గాన్ని మాకు చూపించు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1428వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వేడుకున్నంతనే బాధలు తీర్చే బాబా
2. కారు తాళాల సమస్య సులభంగా పరిష్కారమయ్యేలా సహాయం చేసిన బాబా
3. శ్రీసాయినాథుని దయతో సుఖప్రయాణం

వేడుకున్నంతనే బాధలు తీర్చే బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా మనకి సర్వం అయినటువంటి శ్రీసాయినాథునికి శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి సదా శ్రీసాయినాథుని దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు యశోద. మాది అనంతపురం. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలతో మీ ముందుకి వచ్చాను. ముందుగా ఈ అనుభవాలను పంచుకోవడంలో కొద్దిగా ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 2022, నవంబర్ 24న మేము శిరిడీ వెళ్లాలని 2 నెలల ముందు టికెట్లు, శిరిడీలో రూములు బుక్ చేసుకున్నాము. అన్ని యాత్ర స్థలాలకు ఎప్పుడనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు, కానీ, శిరిడీ వెళ్లాలంటే శ్రీసాయినాథుడే మనల్ని పిలవాలి. ఆయన మనలను పిలవకపోతే ఎవరూ ఇంటి గడపను దాటలేరని సాయి భక్తుల విశ్వాసం. అలాంటిది బాబా ఒకే సంవత్సరంలో మూడుసార్లు శిరిడీ రప్పించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించండి. అవును బాబా దయతో నేను 2022వ సంవత్సరంలో అది మూడోసారి శిరిడీ వెళ్లబోవటం. అందుకే నేను మూడోసారి శిరిడీ దర్శన భాగ్యం కలుగుతున్నందుకు ఎంతో పొంగిపోయాను. అలా పొంగిపోతూ నవంబర్ 24 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గడిపాను. ఇంతలో నవంబర్ నెల రానే వచ్చింది. సరిగ్గా మా ప్రయాణానికి నాలుగు రోజుల ముందు అంటే 20వ తేది నుండి హైదరాబాద్‍లో ఉంటున్న మా అమ్మాయికి జ్వరం, ఆయాసం ఎక్కువగా ఉండసాగాయి. తను నాకు ఫోన్ చేసి, "డాక్టర్ వద్దకు వెళ్లినా తగ్గలేదు. చాలా ఆయాసంగా ఉంటుంది" అని చెప్పింది. అప్పటినుండి నాకు చాలా దిగులుగా అనిపించి 'అమ్మాయికి తగ్గకపోతే నేను శిరిడీ ఎలా వెళ్ళేద'ని చాలా బాధపడ్డాను. కానీ 'బాబా పిలిచారంటే, ఆయనే రప్పించుకుంటార'ని ఆయన మీద విశ్వాసంతో ఉంటూ అమ్మాయిని, "బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగమ"ని చెప్పాను. తను అలాగే చేసింది. నేను, "బాబా! నేను శిరిడీకి ప్రయాణమయ్యేనాటికి మా అమ్మాయికి తగ్గిపోవాలి. అలాగైతే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నవంబర్ 24వ తేదీ ఉదయం మా అమ్మాయి ఫోన్ చేసి, "జ్వరం, ఆయాసం లేవు. పూర్తిగా తగ్గిపోయాయి" అని సంతోషంగా చెప్పింది. మేము సంతోషంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చాము.


నేను గవర్నమెంట్ టీచర్ని. 2022, డిసెంబరులో నేను వారం రోజులు సెలవు పెట్టి, హైదరాబాదులో ఉన్న మా అమ్మాయి దగ్గరకి వెళ్లాను. మేము మా వృత్తిరిత్యా ఆదివారాలు, పబ్లిక్ సెలవులు, మేము పెట్టుకున్న సెలవులు అన్నీ కలిపి పదిరోజులకి మించితే మాకు ఇబ్బంది అవుతుంది. అందువలన డిసెంబరు 23వ తేదీన నేను ఖచ్చితంగా స్కూలుకు వెళ్లాలి. ఎందుకంటే, అప్పటికే నేను హైదరాబాద్ వచ్చి 9 రోజులు అయింది. కాబట్టి డిసెంబరు 22న అనంతపురం వెళ్లడానికి బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాను. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి బస్సు. మా అమ్మాయివాళ్ళు హైదరాబాదులోని నల్లగండ్లలో ఉంటారు. బస్సు కూకట్‍పల్లిలో ఎక్కాల్సి ఉండగా మేము గం.8:45 నిమిషాలకు అక్కడ ఉండాలి. మేము రాత్రి ఏడున్నరకి తయారై కారులో బయలుదేరుతుండగా ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసి ఒక గంట ఆలస్యంగా రమ్మని చెప్పారు. మేము బయలుదేరిపోయామని చెప్తే, "సరే, మియాపూర్‍కు రండి. బస్సు అక్కడ నుండే బయలుదేరుతుంది" అని చెప్పారు. సరేనని, మేము అక్కడికి వెళ్లాం. అక్కడ, "బస్సు చెడిపోయింది. రిపేర్ అవ్వడం కష్టమ"ని చెప్పారు. అప్పటికప్పుడు వేరే బస్సుకి టికెట్ దొరకదు. నాకేం చేయాలో తోచక, "రేపు స్కూలుకి వెళ్ళాలి. ఇలా అయిందేంటి?" అని చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే మన తండ్రికి దణ్ణం పెట్టుకుని, "ఎలాగైనా బస్సు రిపేర్ అయి, రేపు ఉదయానికి నేను స్కూలుకి వెళ్లగలిగేలా చేయండి బాబా. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన పది నిమిషాల్లో, "బస్సు రెడీ అయింది, బస్సు ఎక్కండి" అని చెప్పారు. నాకు ఎంత ఆనందమేసిందో చెప్పలేను. అలా ఆ సాయినాథుని దయతో నేను క్షేమంగా మా ఊరు చేరుకుని, నా డ్యూటీకి వెళ్ళాను. ఏమిచ్చి బాబా ఋణం తీర్చుకోను?


మా అమ్మాయివాళ్ళు డిసెంబర్ 23, 24 తేదీలలో శిరిడీ వెళ్లాలనుకున్నారు. కానీ టికెట్లు దొరకలేదు. అప్పుడు వాళ్ళు శిరిడీ వెళ్లకుంటే, తరువాత వెళ్లడానికి కుదరదు. అందువలన నేను బాబాను ప్రార్థించాను. బాబా దయవలన వెంటనే బస్సు టికెట్లు దొరికి మా అమ్మాయివాళ్ళు క్షేమంగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుని, తిరిగి ఇంటికి వచ్చారు. అంతా సాయి దయ. వేడుకున్నంతనే బాధలు తీర్చే మన బాబాకు ఎన్ని జన్మలలో సేవ చేసినా ఆయన ఋణం తీర్చుకోలేము. "ధన్యవాదాలు సాయినాథా! నాకు ఒక్కటే కోరిక, 'తుదిశ్వాస వీడే సమయంలో కూడా మీ రూపమే, మీ నామమే నాకు గుర్తుండాలి బాబా"'.


శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!


కారు తాళాల సమస్య సులభంగా పరిష్కారమయ్యేలా సహాయం చేసిన బాబా


నా పేరు కుమార్. నేను హైదరాబాద్ నివాసిని. ఒకరోజు నేను, నా స్నేహితుడు బైక్ మీద వెళ్తుండగా నా ప్యాంటు జేబులో ఉన్న నా కారు తాళం ఎక్కడో పడిపోయింది. సంవత్సరం క్రితం మొదటి తాళం పోగొట్టుకున్నాను. ఇప్పుడు పోయింది రెండో తాళం. ఎంత వెతికినా ఆ తాళం దొరకలేదు. బాబాకి నమస్కరించుకుని చాలాసేపు వెతికాను. అయినా దొరకలేదు. ఇంక చేసేది లేక తాళాలు చేసే వ్యక్తి దగ్గరకి వెళ్ళి నా కారుకి ఒక తాళం చేసివ్వమని అడిగాను. అతను నాకు కొన్ని సలహాలిచ్చి, "కారు కొన్నప్పుడు కారు తాళాలతోపాటు ఒక తాళం కోడ్ (నెంబర్) ఇస్తారు. ఆ నెంబర్ ఉంటే చాలా సులభంగా కారు తాళం తయారుచేయవచ్చు, లేకపోతే చాలా కష్టం అవుతుంది" అని చెప్పాడు. నేను వెంటనే ఇంటికి వచ్చి ఆ తాళం కోడ్ నెంబర్ కోసం ఇల్లంతా చాలా వెతికాను. రెండురోజులపాటు అన్ని చోట్ల, అన్ని కాగితాలలో వెతికాను. కానీ ఆ కోడ్ దొరకలేదు. కారు కొని 5 సంవత్సరాలు అయినందున ఆ నెంబర్ ఎక్కడో పోయుంటుంది, ఇంకిప్పుడు దొరకడం కష్టం అని అనుకుని చివరి ప్రయత్నంగా బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయవలన ఎలాగైనా ఆ నెంబర్ దొరికితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న 10 నిమిషాల్లోనే ఆ కోడ్ నెంబర్ దొరికింది. కారు ఇన్వాయిస్‍లో ఆ నెంబర్ వ్రాసి ఉంది. అది చూసి ఎంతో ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని, తాళాలు చేసే అతని దగ్గరకి వెళ్ళి ఆ నెంబర్ ఇచ్చాను. అతను 30 నిమిషాల్లో తాళాలు తయారుచేసి ఇచ్చాడు. ఆ నెంబర్ దొరకకపోయుంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిపడి ఉండేవాడిని. బాబా దయవలనే చాలా సులభంగా పని అయింది. ఏ కష్టమొచ్చినా బాబాతో చెప్పుకుంటే, ఆ కష్టం ఇట్టే తీరిపోతుంది. సాయినాథుడు ఎంతో దయామయుడు. మనం కష్టపడటం ఆయన అస్సలు చూడలేరు. ప్రతిక్షణం కంటి రెప్పలా కాపాడుతున్న నా తండ్రి సాయినాథునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


శ్రీసాయినాథుని దయతో సుఖప్రయాణం


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు కళ్యాణి.  శ్రీసాయినాథుని పాదపద్మములకు ప్రణామాలర్పించి బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. హఠాత్తుగా మా పిన్నిగారు మరణించడంతో నేను, మా అబ్బాయి ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆకస్మిక ప్రయాణం వల్ల రిజర్వేషన్ లేకుండా టికెట్ కొనుక్కొని జనరల్ బోగిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అప్పుడు శ్రీసాయినాథుని తలుచుకుని, "బాబా! ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగేలా చూడండి. మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ప్రయాణం చాలా బాగా జరిగింది. తిరుగు ప్రయాణమప్పుడు మా బావగారు జనరల్ బోగిలో జనం ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్ బోగీలో మమ్మల్ని ఎక్కించారు. నేను, మా అబ్బాయి చాలా భయపడ్డాము. అయితే శ్రీసాయినాథుని చమత్కారం చూడండి. నేను ఆయన్ను కేవలం కూర్చోడానికి సీటు అడిగితే, ఏకంగా బెర్త్  ఇప్పించారు. చాలా ఆనందంగా మా జర్నీ పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మరెన్నో అనుభవాలు నా జీవితంలో జరగాలి. మీ కృప అందరి మీద ఉండాలి తండ్రి".  మరో అనుభవం మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.


సాయిభక్తుల అనుభవమాలిక 1427వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు
2. తోడుగా ఉండి క్షేమంగా యుఎస్ చేర్చిన బాబా
3. బాబా చూపించిన చమత్కారం

బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు


శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు దేన్నైనా ఒరిజినల్‍గా చూస్తేనే తృప్తి. అందువలన నేను బాబా డ్రాయింగ్స్ కన్నా ఒరిజినల్ ఫోటోలను ఎక్కువగా ఇష్టపడతాను. నేను ఈమధ్య బాబాను, "బాబా! నేను మిమ్మల్ని రోజూ ఒకే రూపంలో దర్శిస్తున్నాను. మీరు ఈశ్వరుడని నా భావన. నా నమ్మకాన్ని పెంచేటట్టుగా మీరు నాకు ఈశ్వరునిగా దర్శనమివ్వరా?" అని అడిగాను. తరువాత నేను పింటరెస్టు ఓపెన్ చేస్తే, బాబా నాకు క్రింది విధంగా దర్శనమిచ్చి నా నమ్మకాన్ని బలపరిచారు.

ప్రాచీనకాలంలో ఈశ్వరుడు పులిచర్మం మరియు బూడిద ధరించి ఉండగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాయిబాబా కేవలం కఫనీ ధారిగా(ఆ కఫనీ చిరిగినా ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు) అవతరించారు. ఈమధ్యనే బాబాకి దగ్గరవుతూ, ఇప్పుడిప్పుడే దైవాన్ని అర్ధం చేసుకుంటున్న నాకు ఈ అనుభవం ద్వారా  కాలానికి అనుగుణంగా దైవ అవతారం, దైవ లీలలు ఉంటాయని అర్థమైంది. ఈ కారణంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చాలా ఉత్సహాన్నిస్తున్నాయి. ఇవి బాబా నాకు నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు అని నేను అనుకుంటున్నాను.


నేను ఇదివరకు బాబా చరిత్ర ఎన్నోసార్లు చదివాను. అందులో బాబా అద్భుతాలు చేస్తారని వచ్చినప్పుడు 'ఆయన దేవుడు కాబట్టి, అది సహజమే' అని అనుకునేదాన్ని. కానీ బాబా చర్యలను పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలిసేది కాదు. ప్రతిదీ లాజిక్‍తో ఆలోచించడం అలవాటైన నాకు శ్రీసచ్చరిత్రలో బాబా సన్నని గుడ్డపీలికలతో కట్టిన చెక్కబల్ల మీద నిద్రపోయే లీల ఎన్నిసార్లు చదివినా పెద్దగా మనసుకి ఎక్కేది కాదు. అయితే ఈమధ్య ఆ లీల చదువుతున్నప్పుడు "నీ తెలివిని పక్కనపెట్టి నమ్మకంతో మనసుపెట్టి ఏ ఆలోచన చెయ్యకుండా చదువు" అని బాబా నాకు చెప్తున్నట్లు అనిపించింది. అంటే ఆ లీల నాకు అర్ధం కాదన్న నిజాన్ని బాబా నాకు అర్ధమయ్యేలా చేసారు. నేను ఆ లీలలో బాబా దైవత్వం, గొప్పతనం, అనంతశక్తి ఇందులో ఏ మాటలతో చెప్పాలో తెలియట్లేదుగాని దానిని తెలుసుకోవాలంటే బాబా పాదాల దగ్గర పడి ఉండడం ఒక్కటే మార్గమని నాకు ఇప్పుడు అర్ధమైంది. అంతేకాదు లాజిక్‍తో దైవాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేమని కూడా గ్రహించాను. అందుకే బాబా చరణాల వద్ద నా లాజిక్, తెలివినంతటిని సమర్పిస్తున్నాను. ఇలా చెయ్యడం కష్టంగానే ఉంది. కానీ ఇదే బాగుంది. ఇలా ప్రయత్నిస్తూ ఉండడం కూడా జీవితంలో ఒక భాగమేమో. అది కూడా సాయికే తెలుసు మరి!


ఈమధ్య తరుచుగా బాబా నాకు స్వప్న దర్శనం ఇస్తున్నారు. నాకు ఎప్పుడు దుస్వప్నాలు వచ్చినా కొన్నిసార్లు విగ్రహ రూపంలో, కొన్నిసార్లు ఊదీ రూపంలో, మరికొన్నిసార్లు ఫకీర్ రూపంలో, ఈశ్వరునిగా, మారుతిగా బాబా నన్ను ఆపదల నుండి రక్షిస్తున్నారు. కలలో కూడా నాకు ఏ హాని కలగకుండా కాపాడుతున్న సాయిబాబాకి నేను ఎలా కృతఙ్ఞతలు చెప్పగలను? "కలలో కూడా నీకు హాని జరగనివ్వను" అన్న బాబా పలుకులు 100% నిజం. ఆయన ప్రేమ కన్నా మధురమైనది ఏదీ లేదు, ఉండబోదు. బాబాని పొగడడం నా వల్ల కాదు కానీ, ఎంత చెప్పినా తక్కువే. మరెన్నో అనుభవాలు ప్రసాదించి, వాటిని మీతో పంచుకునేలా బాబా నన్ను అనుగ్రహించుగాక! 


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


తోడుగా ఉండి క్షేమంగా యుఎస్ చేర్చిన బాబా


ముందుగా సాయి భక్తులకి, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు సాయిలత. నేను మా పాప గురించి బాబాను ఒక కోరిక కోరుకుని, అది నెరవేరితే నా  అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ అనుభవాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటాను. "బాబా! నన్ను క్షమించు తండ్రి. నా అనుభవాన్ని పంచుకోవడం ఆలస్యమైంది". ఇక నా అనుభవం విషయానికి వస్తే.. ఈమధ్య మా పాపకి యు.ఎస్‍లో ఎమ్ఎస్ చేయడానికి అవకాశమొచ్చి, వీసా వచ్చింది. తనకి ఇద్దరు పిల్లలు. పాప వాళ్ళని తీసుకుని క్షేమంగా యుఎస్ వెళ్లాలని నేను బాబాకి చెప్పుకున్నాను. పాప జూన్‍లో ఎడ్యుకేషన్ లోన్‍కి అప్లై చేసి ఆగష్టు 4న యుఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంది. కానీ ఈలోపు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. నేను, "బాబా! ఏమిటి నాయనా ఇన్ని అవాంతరాలు?" అని బాబాకి మొరపెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాగే పాప యుఎస్ వెళ్లేముందు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని, తరువాత తను యుఎస్ వెళితే బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ పాపకి జూలై 29 వరకు బ్యాంకు లోన్ పనులతోనే సరిపోయింది. బాబా దయతో ఆరోజు లోన్ రావడం, ఇంకా అవాంతరాలన్నీ తొలగడంతో సమయం లేక పాప శిరిడీ వెళ్లకుండానే యుఎస్ వెళ్లేందుకు సిద్ధమైంది. తను తన లగేజీ సర్దుకునేటప్పుడు బాబా విగ్రహాన్ని లాప్టాప్ బ్యాగులో పెట్టుకుంది. ఆ బ్యాగు, ఇంకో లగేజీ బ్యాగు చేతిలో పట్టుకుని ఫ్లైట్ ఎక్కి బ్యాగులు రెండూ పైన పెట్టబోతుంటే, ఫ్లైట్ సిబ్బంది లగేజీ బ్యాగు పైన పెట్టి, లాప్టాప్ బ్యాగు కాళ్ళ దగ్గర పెట్టుకోమన్నారు. పాప, 'బ్యాగులో బాబా ఉన్నారు కదా! కాళ్ళ దగ్గర ఎలా పెట్టాల'ని పక్క సీట్ వాళ్ళు వచ్చేవరకు ఆ బ్యాగును పక్క సీట్‍లో పెడదామని పెట్టింది. సామాన్యంగా ఇంటర్నేషనల్  ట్రావెల్స్ లో 99% ఎవరూ టికెట్ క్యాన్సిల్ చేసుకోరు. అలాంటిది పాప హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లెవరకూ పక్క సీట్‍లోకి ఎవరూ రాలేదు. ఇది ఎంత అద్భుతమో చూసారా! శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోకుండానే పాప యుఎస్ వెళ్తుందని నేను బాధపడితే, ఆయన ఏకంగా పాప పక్క సీట్‍ను బుక్ చేసుకుని, పాపని జాగ్రత్తగా యుఎస్‍కి తీసుకెళ్లారు. అది తెలిసినపుడు నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పనలవి కానిది. ఆ ఆనందం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. "ధన్యవాదాలు బాబా. నేను నిన్ను కోరిన ప్రతి కోరిక నెరవేర్చావు తండ్రి. పాపవాళ్ళ పిల్లల ఎఫ్2 వీసా కోసం ఆగష్టు నుంచి ఎదురుచూస్తున్నాం. స్లాట్ దొరకడం లేదు బాబా. మీ అనుగ్రహం ఉంటే ఏదీ అసాధ్యం కాదు కదా! మీ దయతో పిల్లలకు ఎఫ్2 వీసా వచ్చేస్తే, ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను తండ్రి. పిల్లల్ని తొందరగా తల్లి దగ్గరకు చేర్చు తండ్రి. మా బ్రతుకులు మీవి తండ్రి. మాపై సదా మీ కృపాదృష్టి ఉండనీ తండ్రి".


బాబా చూపించిన చమత్కారం

నా పేరు డా. శివరామ. నాకు, కౌజలగి దేవస్థానం సభ్యులకు బాబా చూపించిన చమత్కారం గూర్చి నేనిప్పుడు మీకు చెప్తాను. పై ఫొటోలో ఉన్న బాబా విగ్రహాన్ని నేను జైపూర్ నుంచి తెచ్చి, బెలగాంలోని మా హాస్పిటల్లో స్థాపించాను. కాని భగవాన్ శ్రీసాయిబాబా ఉద్దేశ్యం వేరుగా ఉంది. ఆయన సంకల్పానుసారం నేను కొన్ని కారణాల వలన మా హాస్పిటల్లో ఉన్న బాబాను ఏదైనా బాబా గుడికి తరలిద్దామని అనుకున్నాను. ఆ క్రమంలో ఒక బాబా భక్తుని ద్వారా నాకు కౌజలగి దేవస్థానం సభ్యుల నెంబర్ దొరికింది. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను. మరుసటిరోజే ఆ దేవస్థానం సభ్యులందరూ బెళగాం వచ్చి బాబాని చూసి ఆనందంతో అంతకు పూర్వం ఒక గురువుగారు వాళ్ళకి చెప్పిన విషయాన్ని నాతో చెప్పి పరవశించిపోయారు. విషయమేమిటంటే, కౌజలగిలో దేవస్థానం సిద్ధం చేసాక వాళ్ళ దగ్గర బాబా విగ్రహాన్ని తీసుకురావడానికి అవసరమయ్యే డబ్బు లేకపోయింది. వాళ్ళు ఒక గురువుగారిని కలిసి తమ సమస్యను చెప్పుకుని బాధపడ్డారు. అప్పుడు ఆ గురువుగారు, "మీరెందుకు బాధపడతారు? బాబానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి" అని అన్నారట. ఇంకో ముఖ్య విషయం, వాళ్ళు శిరిడీలో ఉండే శ్రీసాయిబాబా మూర్తి ఏ సైజులో ఉంటుందో అదే సైజు విగ్రహం కావాలని ఆశపడ్డారు. నేనిచ్చిన విగ్రహం అదే సైజులో ఉండడం వాళ్ళని అత్యంత ఆశ్చర్యచకితులను చేసింది. ఇలాంటి కోకొల్లల చమత్కారాలను తమ భక్తులకోసం, వారి శ్రద్ధ, సబూరీలను పటిష్టంగా ఉంచడంకోసం శ్రీశిరిడీ సాయిబాబా చేస్తుంటారు. ఆయన మహిమలను స్తుతించడానికి వేయినోళ్ళున్న ఆదిశేషునికే తరము కాదు. 


డాక్టర్ శివరామ,

శ్రీ శిరిడీ సాయిబాబా హాస్పిటల్, 

బెలగాం,

కర్ణాటక.


సర్వేజనా సుఖినోభవంతు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1426వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో నెరవేరిన సొంతింటి కల - ఆయన పాదాల వద్దే ఉద్యోగం
2. చెప్పినట్లే, టెన్షన్ లేకుండా చేసిన బాబా
3. కోరుకున్నట్లే నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన సాయి

బాబా దయతో నెరవేరిన సొంతింటి కల - ఆయన పాదాల వద్దే ఉద్యోగం


నేను ఒక చిన్న సాయి భక్తుడిని. నా పేరు తిరుమలకృష్ణ. నేను నా చిన్నతనంలో అంటే 6వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మగారు బాబా చరిత్ర పారాయణ చేయడం చూసి నేను కూడా పారాయణ చేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. బాబా మందిరానికి వెళ్తే, ఎనలేని ప్రశాంతత, భక్తిభావం కలుగుతుంది. అలా ఉంటాయి బాబా మందిరాలు. నేడు నాకు, నా కుటుంబానికి నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్తున్నాయి అంటే అది బాబా ఆశీర్వాదం, ఆయన చలవే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... ఎన్నో ఏళ్ళుగా సొంతిల్లు కట్టుకోవాలన్నది నా కల. అందుకోసం బాబాను ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆ కల ఈ సంవత్సరం(2022) ఆగస్టులో నెరవేరింది. అది బాబా చలవే. ఎందుకిలా అంటున్నానంటే, మేము ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం ఉన్న చోట కేవలం 8 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. మా స్థలానికి మూడువైపులా ఇండ్లు కట్టేసుకున్నారు. అక్కడ మా స్థలం మాత్రమే ఖాళీగా ఉంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి కావల్సిన మెటీరియల్ వేసుకోవడానికి, దూరంగా వేస్తే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కారణంగా ఏ బిల్డరుని అడిగినా రేట్ ఎక్కువ చెప్పేవాళ్ళు. కొంతమంది ఆ సందులో కట్టడం కష్టం అనేవారు. అలా ఎవరూ ముందుకి వచ్చేవారు కాదు. కానీ ఆ బాబా కృప ఉంటే ఆపడం ఎవరి తరం కాదు కదా! ఆయన దయతో 2021, ఆగస్టు 21న మా ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికి  చిన్నచిన్న గొడవలు, ఆటంకాలు అన్ని బాబా దయతో సద్దుమణిగాయి. నా చేతిలో చిల్లిగవ్వ  లేకపోయినా మా ఇంటి పునాది పడింది. దానికి బాబా భక్తుడైన నా మేనమామ ఆర్థికంగా సహాయసహకారాలు అందించారు. ఇల్లు నిర్మాణం పూర్తయ్యే దశలోనే డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతాయి. ఆ సమయంలో కూడా నేను అడగకుండానే నా మేనమామ 5లక్షల రూపాయలు సహాయం చేసి కష్టసమయంలో  నన్ను ఆదుకున్నారు. ఆ సమయంలో అతను చేసిన సహాయం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా బాబా దయవల్లనే మేము ఈ సంవత్సరం ఆగస్టు 4న మా కొత్తింట్లో దిగాము. ఎప్పుడో నా అంతిమ దశలో అవుతుందనుకున్న పని బాబా దయవల్ల చాలా తొందరగా పూర్తయింది. మా అమ్మానాన్నలను నా సొంతింటిలో కూర్చోపెట్టాలనే నా కోరికను బాబా ఎంతో ప్రేమతో మన్నించారు. "ధన్యవాదాలు బాబా. ఆ ఇంట్లో మీ పేరున అఖండజ్యోతి ప్రజ్వలన చేయాలన్నది నా కోరిక. దయతో తొందరలోనే అది నెరవేరేలా అనుగ్రహించండి బాబా".


నేను ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లో ఉండేవాడిని. కానీ ఆ ఉద్యోగంలో ఎదుగుదల చాలా తక్కువగా ఉండటం, దానితోపాటు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా బదిలీ అవడం, దానివల్ల కుటుంబానికి దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉండేది. అందువలన నేను ఈ మధ్యకాలంలో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ప్రయత్నిస్తే మంచి జీతం, హోదా గల ఉద్యోగం దొరికింది. కానీ నాకు తెలిసిన చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం వదులుకుని ప్రైవేట్ ఉద్యోగానికి రావడమేమిటని నన్ను తిట్టారు, అలా చేయవద్దని మందలించారు. అయినా సరే నేను, "బాబా! మీ ఆజ్ఞ లేనిదే నేను ఏమీ చేయలేను. మీరు ఏం చేసిన నా మంచికే అని నాకు తెలుసు. మీ కృపవలనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇక మీదట కూడా మీరే నాకు దారి చూపాలి బాబా" అని బాబా మీద భారం వేసి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నాను. కొత్త ఇంటికి హోమ్ లోన్ చెల్లిస్తున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగానికి 2 లక్షలు కట్టి మరీ రాజీనామా చేసి ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను పనిచేస్తున్న కంపెనీలో బాబా మందిరం ఉంది. అది నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎక్కడున్నా సరే మీ పాదాలకి దగ్గర్లోనే ఉండాలని బాబాను కోరుకున్నాను. ఆయన నా కోరిక మేరకు తమ పాదాల వద్దే నాకు ఉద్యోగం ఇచ్చారు. అందుకు నేను ఆయనకు సర్వదా కృతజ్ఞుడిని. బాబా దయవల్ల ఇప్పుడు అంతా బాగుంది. ఆయన కృపతో కొద్దికాలంలో ఇంకా మంచి పొజిషన్లో ఉంటానని అనుకుంటున్నాను. దానికి తగ్గట్లు కృషి కూడా చేస్తాను. నేను బాబాని ఇప్పుడు, ఎప్పుడూ అడిగేది ఒక్కటే, "కుదిరితే పదిమందికి సహాయం చేయగలిగే శక్తిని ఇవ్వు, లేదంటే ఎవరికీ ఏ అన్యాయం, అపకారం చేయకుండా నా పని నేను చేసుకునేటట్లు చూడు స్వామి" అని.


చెప్పినట్లే, టెన్షన్ లేకుండా చేసిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న బృందానికి బాబా కృపాకటాక్షాలు సదా ఉండాలని కోరుకుంటూ బాబా ప్రసాదించిన మరో అనుభవం మీతో పంచుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా పిన్ని(మా అమ్మగారి చెల్లెలు) బాబా భక్తురాలు. 2022, జూన్ నుంచి ఆమె ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తను ఎన్నో హాస్పిటల్స్ కి వెళ్ళింది కానీ, ఎక్కడా తనకున్న సమస్య ఇదని ఖచ్చితంగా చెప్పలేదు. సుమారు అక్టోబర్ నెల నుండి ఉన్న సమస్య చాలదన్నట్లు బ్లీడింగ్ కూడా అవ్వసాగింది. దానివల్ల తను బలహీనంగా అయిపోయి చాలా బాధను అనుభవించింది. హాస్పిటల్ వాళ్ళు తన బ్లడ్ సాంపిల్స్ ముంబయి పంపి, "అవసరం అయితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంద"ని చెప్పారు. పిన్ని రిపోర్టు ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడింది. మరోపక్క బ్లడ్ చాలా పోతుందని మానసిక ఒత్తిడికి గురైంది. ఆ స్థితిలో నేను, "బాబా! పిన్ని రిపోర్టులన్నీ మంచిగా ఉండాలి. తన ఆరోగ్యం బాగుండాలి. తను మునుపటిలా సంతోషంగా ఉండాలి" అని బాబాతో చెప్పుకుని పిన్నిని తలుచుకుని బాబా ఊదీ నా కడుపుకి రాసుకున్నాను. ఇంకా, "రిపోర్టులన్నీ నార్మల్‍గా వస్తే, 'సచ్చరిత్ర' పారాయణ చేస్తాను, మీ కృపను తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత రిపోర్టులు రావడానికి ముందురోజు ఇంస్టాగ్రామ్ ద్వారా "ఆరోగ్యం బాగుంటుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు" అని బాబా సందేశమిచ్చారు. అయినా మనిషిని కదా, కాస్త టెన్షన్ పడ్డాను. బాబా ఎప్పుడూ కష్టకాలంలో నాకు తమ సంకేతాలు ఇస్తుంటారు. అయినా నేను ఏదో తెలియని భయంతో బతుకుతూ ఉంటాను. "నాకు కాస్త ధైర్యాన్ని ప్రసాదించు బాబా". ఇకపోతే, డిసెంబర్ 15, గురువారంనాడు నేను భయపడుతూనే మా పిన్నికి ఫోన్ చేశాను. తను, "రిపోర్టులన్నీ మంచిగా వచ్చాయ"ని సంతోషంగా మాట్లాడింది. నాకు కూడా చాలా సంతోషమేసింది. బాబా దయతో తను పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. "మీ కృపకు చాలా ధన్యవాదాలు సాయినాథ్".


కోరుకున్నట్లే నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన సాయి


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీవాణి. నేను కొన్ని నెలలుగా గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతూ టాబ్లెట్లు వాడుతున్నాను. టాబ్లెట్లు వాడినంత కాలం మంచిగా ఉండి, టాబ్లెట్లు వేసుకోవడం ఆపేస్తే మళ్ళీ యధావిధిగా గ్యాసు పట్టేస్తోంది. చివరికి మావారు నన్ను గాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. డాక్టర్ ఏం చెప్తారో అని నాకు చాలా భయమేసి, "సాయీ! మీరే నన్ను ఆరోగ్యంగా ఉంచాలి. నాకు ఏమీ లేదు, అంతా నార్మల్‍గా ఉందని రిపోర్టులో వచ్చేలా చూడు సాయి" అని డాక్టరును కలిసే వరకు బాబాని మ్రొక్కుతూనే ఉన్నాను. ఇంకా డాక్టరుని కలిసి నా సమస్య గురించి చెప్తే, ఎండోస్కోపి చేస్తానన్నారు. అది విని లోపల ఏమన్నా సమస్య ఉందేమోనని నేను భయపడ్డాను. 'సాయి సాయి' అని తలుచుకుంటూ సాయి రూపం నా కళ్ళలో నింపుకుని, "బాబా! లోపల అంతా నార్మల్‍గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగానే ఉందని రిపోర్టులో రావాలి. అదే జరిగితే మీ దర్శనానికి వచ్చి కలకండ పంచుతాను. అలాగే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను. నా మీద దయ చూపు సాయి. నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే నాయన" అని వేడుకున్నాను. ఆయన నా మీద దయ చూపారు. రిపోర్టులో అంతా నార్మల్‍గా ఉందని వచ్చింది. డాక్టరు, "గొంతు దగ్గర గ్యాస్ రిలీజై కొంచెం ఎర్రగా మారింది. మందులతో తగ్గిపోతుంది. ఏమి ప్రాబ్లం కాదు" అని చెప్పి మందులిచ్చారు. "ధన్యవాదాలు సాయి. మీ దయవల్ల ఈ టాబ్లెట్లతో గ్యాస్ పట్టే సమస్యను పూర్తిగా తగ్గేటట్లు చేయండి సాయి. అలాగే త్వరలోనే మీ దర్శనానికి మాకు మీ అనుమతిని ఇవ్వండి. మాపై దయతో మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు సాయి".


సాయిభక్తుల అనుభవమాలిక 1425వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారు - తలచుకోగానే ప్రక్కనే ఉండి బాధలు తీరుస్తారు
2. శ్రీసాయి ప్రసాదించిన చిరు అనుభవాలు 
3. ఆపద వాటిల్లినా చిన్న దెబ్బతో సరిపెట్టిన బాబా

బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారు - తలచుకోగానే ప్రక్కనే ఉండి బాధలు తీరుస్తారు


సాయి భక్తులందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. శ్రీసాయినాథుడు మాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఒక స్థలం కొనదలచి దాదాపు నాలుగు, ఐదు నెలలు తిరిగాను. తిరిగి తిరిగి అలసిపోయానుగాని సరైన స్థలం కుదరలేదు. చివరికి ఒక స్థలం చూసి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఆ స్థలానికి నైరుతి మూల ఉంది. వాస్తుపరంగా అలాంటి స్థలం మంచిది కాదు. ఆ విషయం నాకు ముందు తెలియదు. ఆ స్థలం తీసుకోవడానికి ముందురోజు మా పక్కింటివాళ్ళు ఆ విషయం గురించి నాతో చెప్పారు. అంతటితో నేను ఆ స్థలం తీసుకోవడం మానుకున్నాను. నా తండ్రి బాబానే వాళ్ళ ద్వారా నేను ఆ స్థలం కొని ఇబ్బందులు పాలుకాకుండా కాపాడారని నా నమ్మకం. తరువాత వేరొక స్థలం చూసి, దాన్ని తీసుకోవడానికి ముందు, "ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి బాబా. అలాగే అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకుని భారం ఆయన మీద వేసి అగ్రిమెంట్ చేసుకున్నాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే ఎటువంటి సమస్యలు లేకుండా నవంబర్ 18వ తారీఖుకు డబ్బు సమకూరి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ తండ్రి కరుణ వల్ల నా కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నాం. "ధన్యవాదాలు తండ్రి. మా పిల్లలు పై చదువులకోసం ప్రయత్నిస్తున్నారు. వారికి మీరు తోడుగా ఉండి వారు అనుకున్న చదువు చదువుకునేందుకు సీటు వచ్చేలా అనుగ్రహించండి. అలాగే మా అందరి ఆరోగ్యాలు బాగుండేటట్లు మీ చల్లని చూపును మాపై ప్రసరించండి. చివరిగా నా అనుభవం పంచుకోవటంలో ఆలస్యం అయినందుకు నన్ను క్షమించు బాబా".


ఇటీవల ప్రభుత్వం టీచర్ల బదిలీలకి అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా 8 సంవత్సరాల కాలం ఒకే చోట పనిచేసిన వారిని తప్పక బదిలీ చేయమని ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి 5 సంవత్సరాలుగా ఒకే స్కూలులో పనిచేస్తున్న నా భార్యకి బదిలీ ఉండదని, మాకు ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకున్నాను. కానీ ఒక చిక్కు సమస్య వచ్చింది. అదేమిటంటే, నిబంధనల ప్రకారం నా భార్య పని చేస్తున్న స్కూల్లో ముగ్గురు టీచర్లు పని చేయాల్సి ఉండగా ఈమధ్య ఆ స్కూలుకి ఒక HM పోస్ట్ మంజూరు అయింది. అందువల్ల రేషనలైజేషన్‍లో ఒక పోస్ట్ పోతుంది. అందువల్ల స్కూలులో పనిచేస్తున్న సీనియర్/జూనియర్ ఒకరు తప్పక బదిలీ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ స్కూల్లో జూనియర్ అయిన నా భార్యకి తప్పనిసరిగా బదిలీ అయ్యే పరిస్థితి వచ్చింది. అలా జరిగే పక్షంలో నా భార్యకు తక్కువ పాయింట్స్ ఉండటం వలన చాలా దూరప్రాంతానికి అనగా జిల్లా బోర్డర్‍కు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న నా భార్యకి బదిలీ అయితే తను చాలా ఇబ్బందిపడుతుంది. ఈ ఒక సంవత్సరం బదిలీ ఆగితే తనకి ఇబ్బంది ఉండదు. అంటే 2023 వేసవి సెలవుల్లో నా భార్యకు బదిలీ అయితే సమస్య ఉండదు. మేము మా తండ్రి బాబాను, "బాబా! ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేవరకు మిమ్మల్నే తలుచుకుంటూ మీమీదే నమ్మకం పెట్టుకున్న మాకు ఇంత ఇబ్బంది ఎలా కలిగిస్తావు? ఎలాగైనా ఇప్పుడు బదిలీలు జరగకుండా, వచ్చే వేసవి సెలవుల్లో జరిగేటట్లు చేసి ఈ ఆపదను తప్పించండి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని ఎంతగానో వేడుకున్నాము. నా భార్య అయితే 2, 3 రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపింది. తను ఆ తండ్రి విగ్రహం పట్టుకుని, "నన్ను కాపాడు" అని కన్నీళ్ళతో వేడుకుంది. "పిలిస్తే పలుకుతాను. తక్షణమే మీ కష్టాలు తొలగిస్తాను" అని మన అందరికీ అభయమిచ్చిన బాబా ఆ మూడు రోజులు ఈ బ్లాగు ద్వారా "మీకు నేను ఉన్నాను. మీకు ఏ ఇబ్బందీ కలగకుండా నేను చూసుకుంటాను" అని, "భయపడకు అంతా నేను చూసుకుంటా" అని, "సదా నన్ను గుర్తుంచుకో, నీకు ఎంతో మేలు జరుగుతుంది" అని సందేశాలిస్తూ మీకు నేనున్నానని తెలియజేసారు. మేము ఆ తండ్రి మీద నమ్మకం ఉంచాము. బాబా పెద్ద అద్భుతం చేశారు. ఆ స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్ బదిలీ మీద వేరే చోటకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలా నా భార్యకు బాబా ఊరట కలిగించారు. కానీ ఆ టీచరుకి ఇబ్బంది అవుతుందేమో అని మేము బాధపడ్డాము. మరుసటిరోజు ప్రభుత్వ అధికారులు ఆ స్కూలుకి రేషనలైజేషన్ లేనందున ఎవరూ ఆ స్కూలు నుండి బదిలీ మీద వెళ్లాల్సిన పనిలేదు అని చెప్పారు. అలా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాబా కాపాడారు. నా తండ్రి చేసిన ఈ అద్భుతాన్ని తలుచుకుంటుంటే బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారని, తలచుకోగానే వచ్చి మన ప్రక్కనే ఉంటారని, మన భాధలు తీరుస్తారని అనిపిస్తుంది. నా తండ్రి బాబాకు మేము ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి? ఈ ప్రాణం ఉన్నంతవరకు ఆ తండ్రి పాదాల వద్ద సర్వస్య శరణాగతి చెందటం తప్ప ఏం చేయగలం? "ధన్యవాదాలు బాబా. మా పిల్లలకు ఉన్నత విద్యను, ఉన్నత స్థాయిని, మంచి బుద్ధిని, నడవడికను, పదిమందికి సహాయపడే తత్వాన్ని, ఎటువంటి ఇబ్బంది లేని మంచి జీవితాన్ని ప్రసాదించి ఉన్నంతలో మా కుటుంబాన్ని సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి".


సర్వం శ్రీసాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు.


శ్రీసాయి ప్రసాదించిన చిరు అనుభవాలు 


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


శ్రీసాయినాథుని పాదాలకు వేలకోట్ల ప్రణామాలు. నా పేరు లత. 2014 వరకు నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. ఎన్నో సమస్యలు చుట్టుముట్టి జీవితం చాలా భయంగా గడుపుతున్న సమయంలో మా ఎదురింట్లో పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శిష్యులు ప్రతి గురువారం భజన, ప్రవచనాలు చేస్తూండేవాళ్లు. వాళ్ళు శరత్ బాబూజీ రచించిన పత్రికలు ఇస్తుండేవాళ్ళు. ఆ పత్రికల్లోని భక్తుల అనుభవాలు చదివి నేను కూడా బాబాకి శరణాగతి చేసుకుంటే, నా సమస్యలు తీరుతాయోమో, కష్టాలు గట్టెక్కుతానేమో అని బాబాకి శరణాగతి చేసుకున్నాను. అంతలోనే బాబా మా ఊరికి వచ్చారు. గుడి నిర్మించారు. ఒకరోజు శ్రీభరద్వాజ మాస్టర్ గారి 'సాయి లీలామృతం' పుస్తకం నాకు ఒకరి ద్వారా లభించింది. ఆ పుస్తకం చదువుతూ, బాబాని సేవించుకున్నప్పటినుంచి బాబా నా భయాలను, ఆందోళనలను తొలగించి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. బాబాకి శరణాగతి చేసుకున్న కొత్తలో మా ఇంట్లో సువాసన వెదజల్లే  పరిమళం వస్తుండేది. ఒకసారి మా ఇంటి తాళం చెవి కనబడకపోతే బాబాను ప్రార్థించాను. రెండవరోజు తోటలో ఆ తాళం చెవి కనపడింది. ఈ మధ్యకాలంలో నా బంగారు గాజు ఒకటి కనిపించలేదు. మావారు టాయిలెట్లో పడిపోయి ఉంటుంది, దొరకదు అన్నారు. కానీ 'నాకు బాబా ఉన్నారు. నా గాజు దొరుకుతుంద'నే గట్టి నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకమే మా కోడలికి బట్టలు సర్దుతుంటే నా గాజు కనిపించేలా చేసింది. ఒకసారి నాలుగు నెలల పసిపాపకు టీకా వేయిస్తే, ఎందుకనో బాగా ఏడ్చింది. పాపకు బాబా ఊదీ పెట్టి, సాయినామం జపిస్తే పాప ఏడుపు ఆపి నిద్రపోయింది. మాది కేబుల్ టీవీ కాకపోవడం వల్ల మా టీవీలో తెలుగులో 'సాయి టీవీ' ఛానల్ రాదు, తమిళంలో వస్తుంది. దాన్ని కూడా నవంబర్ 26 నుంచి రద్దు చేస్తామని స్క్రోలింగ్లో వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఆ ఛానల్ తీసేస్తే ఎలా తండ్రి? అందులోనే కదా,  పొద్దున్నే నిన్ను దర్శించుకుంటాను తండ్రి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. నాయందు దయుంచి ఆ ఛానల్ తీయకుండా అనుగ్రహించారు బాబా. ఇవన్నీ ఎవరికైనా సిల్లీగా అనిపించవచ్చునేమోగాని ఇవి ముమ్మాటికీ సత్యం. "సాయితండ్రీ! మీ పాదాలకు సదా ప్రణామాలు. ఇంకా కొన్ని సమస్యలున్నాయి. కర్మఫలం ఇంకా పూర్తవలేదేమో సాయితండ్రి. త్వరగా పూర్తయ్యేలా చేసి ఆ సమస్యలను కూడా పరిష్కరించు తండ్రి. నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. ఏవైనా తప్పులుంటే క్షమించు తండ్రి".


ఆపద వాటిల్లినా చిన్న దెబ్బతో సరిపెట్టిన బాబా


సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు సుదర్శన్. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి గురువారం బాబా గుడిలో ధూప్ ఆరతికి వెళ్తాను. ఒకరోజు నా కుటుంబం కూడా నాతో గుడికి వచ్చింది. మేము పల్లకి సేవలో పాల్గొనగా మా అమ్మాయి ధ్యానంలో కూర్చుంది. కాసేపటికి తనకి ధ్యానంలో 'నాకు ఆపద ఉందని, తమకు చక్కెర నివేదించమని' బాబా చెప్పారు. పల్లకి సేవ అనంతరం మా అమ్మయి నాకు ఆ విషయం చెప్పింది. నేను బాబా మీద భారం వేసి బైక్ మీద నా కుటుంబంతో ఇంటికి బయలుదేరాను. మా అమ్మాయి మెల్లగా వెళ్ళమని చెప్తుంటే, మెల్లగానే వెళ్ళాను. అయినా ఆపద తప్పలేదు. పెద్ద ప్రమాదమే జరిగింది కానీ, మాకు పెద్దగా ఏం కాలేదు. నాకు చిన్న దెబ్బ తగిలి నొప్పిగా ఉండింది. ఇంటికి వచ్చాక, "నొప్పి తగ్గేలా చూడు సాయితండ్రి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత మా అమ్మాయికి ధ్యానంలో "పెద్దదాన్ని చిన్నదిగా చేశాను. ఊదీ పెట్టుకుంటే నొప్పి అదృశ్యమవుతుంది" అని బాబా మాటలు వినిపించాయి. మా అమ్మాయి ఆ విషయం చెపితే నేను ఊదీ పెట్టుకున్నాను. రాత్రి కలలో నొప్పి ఉన్న చోట ఊదీ పెడుతున్నట్లు బాబా దర్శనమిచ్చారు. ఇలా నా సాయినాథుడు నాకు ఎల్లవేళలా సహాయం చేస్తున్నారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1424వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ అనుభూతులు  
2. నడక భారమైన భక్తుని చేత గిరిప్రదక్షిణ పూర్తి చేయించిన బాబా

శిరిడీ అనుభూతులు  


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు సాయిఅంజని. మేము 2022, సెప్టెంబర్ 30న శిరిడీకి ప్రయాణమయ్యాము. మా యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయి సురక్షితంగా ఇంటికి వస్తే నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. ఆ అనుభవాన్ని ముందుగా పంచుకుంటాను. మేము ఎక్కిన ట్రైన్ ఆలస్యమై అక్టోబర్ 1, ఉదయం 7 గంటలకి నాగర్‌సోల్ చేరుకోవాల్సింది కాస్తా 9 గంటలకి చేరుకుంది. మేము 20 రోజుల ముందు కీరవాణి సత్రంలో రూమ్ బుక్ చేసుకున్నాము. వాళ్ళు, "మీకోసం రైల్వేస్టేషన్‍కి టాక్సీ పంపుతాం, మీరు రైలు దిగేసరికి మా డ్రైవర్ మీ దగ్గరకి వస్తాడ"ని చెప్పి, అతని పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ డ్రైవర్ పేరు ఏంటంటే 'బాబా'. నాకు ఆ పేరు వినగానే బాబానే ఆ రూపంలో మాకోసం వచ్చారనిపించింది. మేము 11 గంటలకి శిరిడీలోని కీరవాణి సత్రం చేరుకున్నాము. గదులు చాలా విశాలంగా బాగున్నాయి. భోజనాలు చేసి సుమారు మధ్యాహ్నం 2-30కి బాబా దర్శనం కోసం వెళ్ళాము. సమాధిమందిరానికి వెళ్ళినప్పుడు నేను నా మనసులో 'బాబా! మీరు నన్ను చూస్తున్నారని ఏదో ఒక విధంగా తెలియజేయండి' అని అనుకున్నాను. నేను, నా భర్త, సంవత్సరం 11 నెలల వయసున్న మా చిన్నబాబు బాబాను దర్శించుకుని బయటకు వెళ్లబోతుండగా ఒక పూజారి నా భర్తని పిలిచి బాబా దగ్గర ఉన్న ఒక స్వీట్ తీసి మా బాబుకివ్వమని ఇచ్చారు. బాబా నన్నే చూస్తున్నారని నాకర్థమై నాకు ఆనందభాష్పాలు వచ్చాయి. ఇకపోతే, ఆరోజు జనం తక్కువగా ఉండటం వల్ల మేము వెంటనే మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాము. అప్పుడు బాబా తమ ముందు 10 నిమిషాలు ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు.  అక్కడ సెక్యూరిటీవాళ్ళు మమ్మల్ని వెళ్ళమని అస్సలు చెప్పలేదు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది.


రెండవరోజు ఉదయం కాకడ ఆరతికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అంటే, మేము ఉదయం 4 గంటలకల్లా క్యూలో ఉండాలి. అయితే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తెల్లవారుఝామున వాళ్ళని లేపితే ఏడుస్తారేమో అని భయపడ్డాను. కానీ బాబా దయవల్ల వాళ్ళు లేపగానే లేచి ఫ్రెష్ అయ్యారు. మేము 4:30 కల్లా మందిరానికి వెళ్ళాము. ఇంకా ముందు వెళ్లుంటే బాబా ముందు ఉండేవాళ్ళము. కానీ ఆలస్యం అవటం వల్ల కొంచెం వెనకపడ్డాం. అయినా కాకడ ఆరతి అనుభవం నాకు చాలా బాగా అనిపించింది. మొదటిసారి కాకడ ఆరతికి హాజరయ్యేవాళ్ళు చాలా మంచి అనుభూతితో బయటకి వస్తారు. నాకూ అదే అనుభవం అయింది. తరువాత మేము భీమశంకర్(జ్యోతిర్లింగం) వెళ్లి శివుని దర్శించుకుని రాత్రి 7-30కి మా గదికి చేరుకున్నాము. భోజనం చేసి శేజారతికి వెళ్ళాము. మూడోరోజు అభిషేకం టిక్కెట్లు బుక్ చేశాము. బాబా దయవల్ల అభిషేకం చాలా బాగా జరిగింది


అదేరోజు సాయంత్రం మేము తిరుగు ప్రయాణానికి బయల్దేరి నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‍కి చేరుకున్నాము. స్టేషన్లో లైట్లు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. రాత్రి 9 గంటలకి రైలు రాగానే చాలా జాగ్రత్తగా మా లగేజీ అంతా తీసుకుని రైలు ఎక్కి సామానంతా సర్దుకుని నిద్రపోయాము. ఉదయం లేచేసరికి మా హ్యాండ్‌బ్యాగ్ కనిపించలేదు. అంతా వెతికి చూశాము, కానీ బ్యాగ్ కనిపించలేదు. ఒక పోలీసుని అడిగితే, "నాందేడ్ స్టేషన్‍లో దొంగలు ఎక్కుతారు. వాళ్లే తీసుంటారు" అని అన్నారు. ఆ బ్యాగులో సాయి స్తవనమంజరి పుస్తకం ఉంది. నేను ఎక్కడికి ప్రయాణమైనా నాతో ఆ స్తవనమంజరి తీసుకెళ్తాను. అది నా అలవాటు. అలాంటి పుస్తకం పోయిందని నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చాక, "ఏం పోయినా పరవాలేదు బాబా. నా స్తవనమంజరి మాత్రం వేరే బ్యాగులో ఉండేలా చేయండి బాబా" అని అనుకున్నాను. బాబా దయ చూపారు. వేరే బ్యాగులో నా పుస్తకం ఉంది. ''చాలా చాలా ధన్యవాదాలు బాబా''. శిరిడీ వెళ్ళేవాళ్ళు నాగర్‌సోల్‌లో ట్రైన్ ఎక్కితే మీ సామాను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. 


శిరిడీ నుండి వచ్చాక ఉండ్రాళ్లతద్ది, అట్లతద్ది నోముల ఉద్యాపన కోసం మేము మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాము. 'ఎలాంటి సమస్యలు లేకుండా నా ఉద్యాపన పూర్తయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా ఉద్యాపన పూర్తయింది. 'ధన్యవాదాలు బాబా'.


నవంబర్ 6న మా చిన్నబాబు రెండో పుట్టినరోజు పార్టీ పెట్టుకున్నాము. అందరినీ ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కానీ అది నాకు, మా సిస్టర్‌కి నెలసరి సమయం. నెలసరి వస్తే, పార్టీ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను బాబాతో, "ప్లీజ్ బాబా ఎలాగైనా పార్టీ అయ్యేదాక నాకు, మా సిస్టర్‌కి నెలసరి రాకుండా చూసి పార్టీ బాగా జరిగేలా చూసుకోవాలి" అని చెప్పుకున్నాను. మా సిస్టర్‌కి పీరియడ్స్ ముందే వచ్చినా పార్టీ అయితే ఎలాంటి సమస్యలు లేకుండా బాగా జరిగింది. ఆ మరుసటిరోజు ఉదయం నాకు నెలసరి వచ్చింది. నాకైతే చాలా అద్భుతమనిపించింది. ''చాలా ధన్యవాదాలు బాబా''.


నడక భారమైన భక్తుని చేత గిరిప్రదక్షిణ పూర్తి చేయించిన బాబా


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా శ్రీసాయిసమర్థులకు, సాయిబంధువులకు మరియు బ్లాగ్ నిర్వాహకులకు అనేక నమస్కారాలు.  నేను ఒక సాయిభక్తుడిని. నా పేరు నాగయ్య. నా వయసు 63 సంవత్సరాలు. నేను గతంలో రెండుసార్లు నా అనుభవాలు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకున్నాను. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం చాలా విశిష్టమైనది. శ్రీసాయిసమర్థులు ఎంతటి అద్భుతాలు చేయగలరో తెలుపుతుంది. మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో నా కాలి మడమ పైభాగంలో కీలు విరిగి ఒక సంవత్సరంపాటు ఎటూ కదలలేకపోయాను. ఆ తర్వాత కర్ర సాయంతో నడుస్తున్నాను. అయితే ఎక్కువ దూరం నడవాలంటే మాత్రం కష్టంగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే... ఈమధ్య నెల్లూరులో ఉంటున్న పూర్వాశ్రమ మిత్రులు అరుణాచలం రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను గిరిప్రదక్షిణ(14 కిలోమీటర్లు) చేయలేనని నా బలహీనతను వారికి తెలియజేశాను. అందుకు వాళ్ళు, "అక్కడ ఉండడానికి ఇబ్బంది లేదు. ఒక ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంది. నడవలేని పక్షంలో ఆ ఆశ్రమంలో ఉండవచ్చ"ని చెప్పారు. అప్పుడు నేను వాళ్లతో నడవలేని పక్షంలో ఆటోలో వెళ్ళవచ్చునని, అది కూడా కష్టంగా ఉంటే ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవచ్చునని భావించి బాబాతో చెప్పుకుని వాళ్లతో వెళ్ళడానికి మొగ్గుచూపాను. 2022, డిసెంబర్ 6, ఉదయం నెల్లూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు మేము అరుణాచలం చేరుకున్నాం. అది కృత్తిక దీప సమయం కావడం వలన ఆశ్రమం వరకు వెళ్లేందుకు దారి లేక ఊరు బయటే మా కారు ఆపివేయవలసి వచ్చింది. ఎటు చూసినా జన సందోహం. దాదాపు 15 లక్షల మంది జనాభా ఆ సమయంలో అరుణాచలంలో ఉన్నారని అంచనా. ఆటోలుగానీ, మరే ప్రయాణ సాధనాలుగానీ లేవు. ఉండడానికి వసతి గృహాలు లేవు. నా ముందున్న మార్గం ఒకటే, సాయితండ్రికి సమస్యను నివేదించుకుని అందరితోపాటు నడవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. అంతే, సాయికి చెప్పుకుని ఆయన నామం జపిస్తూ కర్ర సాయంతో నడక ప్రారంభించాను. కానీ విపరీతమైన కాలినొప్పి వలన ఎక్కడ పడిపోతానో తెలియదన్నట్టుంది నా పరిస్థితి. అయినా నా సాయితండ్రి నా చేయి పట్టుకుని(స్నేహితుల ఆసరాతో) 14 కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణ విజయవంతంగా పూర్తిచేయించారు. తరువాత అరుణాచల జ్యోతిదర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాను. నేను గిరిప్రదక్షిణ చేశానంటే నా బంధువర్గంలో ఎవ్వరూ నమ్మలేదు. అంతా ఆ సాయినాథుని కృప. ఇంతకంటే అద్భుత కార్యం నా జీవితంలో మరేదీ లేదు. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1423వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా అనుగ్రహం
2. సమస్య వచ్చిన ప్రతిసారీ ఆ సమస్యలను దాటిస్తున్న బాబా 
3. క్షమాపణ చెప్పించి బాధను తొలగించిన బాబా

బాబా అనుగ్రహం


శ్రీసాయి భక్తులకు నమస్కారం. నా పేరు అంజలి. బాబా నాపై చూపిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, కార్తీకమాసంలో చివరి ఆదివారం మా కుటుంబం, బాబా ఇచ్చిన తమ్ముడు ప్రసాద్ కుటుంబం కలిసి శ్రీశైలం వెళ్ళాము. ఆరోజు ఆలయం చాలా రద్దీగా ఉంది. అయినా దయతో బాబా వేరేవాళ్ళ ద్వారా మాకు చాలా తొందరగా దర్శనం అయ్యేలా అనుగ్రహించారు. దర్శనానంతరం మేము తిరుగు ప్రయాణమయ్యాం. రాత్రివేళ, ఘాట్ రోడ్డులో హఠాత్తుగా మా కారు లైట్లు ఆగిపోయాయి. మాకు చాలా భయమేసింది. రెండు నిమిషాలు అలాగే లైట్లు లేకుండా చీకట్లో ప్రయాణించాక నేను బాబాను శరణువేడాను. ఆయన దయవల్ల కారు లైట్లు వెంటనే వెలిగాయి. తరువాత ఏ ఇబ్బందీ లేకుండా అర్థరాత్రికి మేము నల్గొండ చేరుకున్నాము. నిజంగా కారు లైట్లు వెలగకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది. అంతా బాబా దయ. ఆయన తమ భక్తులను అడుగడుగునా కాపాడుతుంటారు. ఆయన ఉండగా భయమెందుకు? శ్రీశైలం నుండి వచ్చాక ప్రసాద్ వాళ్ళ పిల్లలు అనారోగ్యం పాలుకాకుండా చూడమని బాబాను వేడుకున్నాను. ఎందుకంటే, అతని పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. బాబా దయవల్ల వాళ్ళందరూ బాగున్నారు, ఏ సమస్యా లేదు. కానీ మా బాబుకి జ్వరం వచ్చింది. అయితే బాబా దయవల్ల ఒక్కరోజులోనే తగ్గిపోయింది. వెంటనే నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాననుకున్నాను, కానీ కొంచెం ఆలస్యమైంది. "క్షమించు తండ్రీ".


గత సంవత్సరంలో ఒక ఆరు నెలలపాటు మా జీతాలు ఆలస్యంగా పడుతుంటే నేను, "ప్రతినెలా ఒకటో తారీఖున జీతం మా అకౌంటులో పడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల ఒకటో తారీఖున మా జీతాలు మా అకౌంటులో పడుతున్నాయి. ప్రతినెలా మా మావయ్య కొంత డబ్బు మా అకౌంటులో వేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్ నెలలో మావయ్య డబ్బులు వేయలేదు. అసలే ఆ నెల డబ్బులకు కాస్త ఇబ్బంది ఉండటం వల్ల నేను, 'ఆ డబ్బులు వస్తే, బాగుండు' అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత బాబా దయవల్ల మాకు డబ్బులు అందాయి. "ధన్యవాదాలు బాబా".


చాలా రోజుల క్రితం నాకు వేడి గడ్డలు వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఈ గడ్డలు తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఆయన దయతో ఆ గడ్డలు వెంటనే తగ్గిపోయాయి. కానీ నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం మర్చిపోయాను. కొద్దిరోజులకు గడ్డలు మళ్లీ వచ్చాయి. "బాబా! ఈ గడ్డలను ఎలాగైనా తగ్గించండి. ఈసారి తప్పకుండా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకు గడ్డలు తగ్గిపోయాయి. ఈ బ్లాగులో పంచుకుంటామనుకుంటే చాలా పనులు నెరవేరుతున్నాయి. ఈ బ్లాగు నిజంగా ఆధునిక శ్రీసాయిసచ్చరిత్ర. దీన్ని బాబానే దగ్గరుండి నడిపిస్తున్నారు, మా అందరితో ఇలా అనుభవాలు వ్రాయిస్తున్నారు. ఇంకా ఎన్నో అనుభవాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. "అన్ని విధాలా మీరు మాపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సమస్య వచ్చిన ప్రతిసారీ ఆ సమస్యలను దాటిస్తున్న బాబా


నేను ఒక బాబా భక్తురాలిని. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని ఎన్నటికీ వదలనని ప్రతిక్షణం భక్తులకి తోడుగా ఉంటూ ఎన్నో కష్టాలు, సమస్యల నుండి తప్పిస్తున్న బాబాకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ.. ప్రతిక్షణం ఇలాగే తోడుగా ఉండమని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా కంపెనీలో వారానికి మూడు రోజులు ఆఫీసుకి వెళ్లి పనిచేయాలి. నేను లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‍కి మారకుండా మా ఊళ్ళోనే ఉంటూ వారంవారం ఆఫీసుకి వెళ్లొస్తున్నాను. ఎప్పుడైనా ఒకరోజు మానేస్తే మా మేనేజర్ ఈమధ్య పదేపదే ఎత్తి చూపడం మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితిలో నేను ఒకరోజు ఇంటి నుండి పనిచేసి తరువాత రెండు రోజులు ఆఫీసుకి వెళదామనుకున్నాను. కానీ ఆ విషయం తెలియజేస్తూ మెయిల్ పెట్టాలంటే మేనేజర్ ఏమంటుందో అని భయమేసింది. అందుచేత అంతకు ముందు వారంలో నా ఆరోగ్యం బాగాలేనప్పప్పటి మెడికల్ సర్టిఫికెట్ అటాచ్ చేసి ఈ వారంలో రెండు రోజులే వస్తానని మా మేనేజర్‍కి మెయిల్ పెట్టి,  "బాబా! ఆవిడ ఏమి అనకుండా ఉండేలా చూడండి. అంతా మంచిగా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ మెయిల్ చూసి ఆవిడ ఏమీ అనుకుండా నా అభ్యర్థనను ఆమోదించింది. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే తోడుండి నన్ను ముందుకు నడిపించండి.


ఇకపోతే నేను ఆ కంపెనీలో చేరిన 6 నెలల తర్వాత రివ్యూ చేసి నా జాబ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉండగా రివ్యూలో నా పనితీరు మెరుగుపరుచుకోవాలని, అందుకోసం ఇంకో నెల గడువు పెంచి, నెల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తామన్నారు. తరువాత ఒక నెల గడిచాక ఒక రోజు రివ్యూ మీటింగ్ షెడ్యూల్ చేసారు. నా జాబ్ కన్ఫర్మ్ చేస్తారో, లేదో అని నాకు చాలా భయమేసి బాబాని చాలా ప్రార్థించి మీటింగ్ మొదలయ్యే సమయం వరకు బాబా సందేశాలు చూస్తూ గడిపాను. బాబా ఆ సందేశాల ద్వారా 'అంతా మంచి జరుగుతుంద'ని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో తెలియని భయం. అందువల్ల, "బాబా! నా ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఇంతలో మీటింగ్ సమయమైంది. బాబా దయవల్ల నా పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని నా జాబ్ కన్ఫర్మ్ చేసారు. ''చాలా చాలా కృతఙ్ఞతలు బాబా. సమస్య వచ్చిన ప్రతిసారీ నా చేయి పట్టుకుని దాన్ని దాటిస్తూనే ఉన్నావు తండ్రి. వ్యక్తిగత సమస్యల వల్ల నా ఆలోచన అంతా అటు పోయి ఏ పని చేయలేకపోతున్నాను. అందుకే మీకు మాటిచ్చి కూడా 2 రోజులు ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నాను. అందుకు నన్ను క్షమించండి బాబా. ఇకపోతే నాతోపాటు జాబ్‍లో జాయిన్ అయిన నా ఫ్రెండ్ జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా చూడు తండ్రి. ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను, నా పెళ్లి విషయంలో నేను ఒక సమస్యని ఎదుర్కొంటున్నాను. ఎవరికీ చెప్పుకోలేని బాధనిచ్చావు. అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. విషయం మీకు తెలుసు బాబా. ఆ విషయంలో నా మనసుకి నచ్చింది జరిగేలా చూసి మీరే ఈ గండాన్ని దాటించాలి తండ్రి. మీమీదే భారం వేసాను. అంతా మంచిగా జరిపి బ్లాగులో పంచుకునేలా అనుగ్రహించండి బాబా. మీరు తప్ప నా బాధని అర్ధం చేసుకునేవారెవరూ లేరని మీకు చెప్పుకుంటున్నాను బాబా. ఏవైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించి ఇంకోసారి ఆ తప్పులు చేయని విధంగా మా మనసులను మలచండి బాబా".


క్షమాపణ చెప్పించి బాధను తొలగించిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని.  నేను అడగకనే బాబా నన్ను తమ భక్తురాలిగా చేసుకున్నారు. ఏ ఆపద వచ్చినా 'బాబా' అని తలచినంతనే 'నేనున్నాను' అని ఆ ఆపదల నుండి, సమస్యల నుండి కాపాడుతున్నారు. ఆయన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఏమి చేసినా నేను ఆయన ఋణం తీర్చుకోలేను. ఈమధ్య ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేసి, బంధువులలో నా పరువు తీసి మానసికంగా నాకు చాలా బాధ కలిగించాడు. అక్రమంగా సంపాదిస్తున్నానని తప్పుడు ప్రచారం చేసి బంధువుల దగ్గర తలదించుకునేలా చేశాడు. నేను, "బాబా! మీరే అతనికి బుద్ది చెప్పాలి" అని బాబాకి చెప్పుకుని వదిలేసాను. ఆయన ఏం చేశారో గానీ సరిగ్గా ఒక నెల తర్వాత ఆ వ్యక్తి, "నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నాను" అని అన్నాడు. బాబా దయవలన అతని వలన నాకొచ్చిన సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1422వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య ప్రదాయక సాయినాథ
2. శ్రీసాయి అనుగ్రహం

ఆరోగ్య ప్రదాయక సాయినాథ


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


నా పేరు ఉపేంద్ర. మాది విజయవాడ. నేను గతంలో బాబా దయతో ఆయన నాపై చూపిన ప్రేమను ఈ బ్లాగులో పంచుకున్నాను. శ్రీసాయినాథుని అనుగ్రహం వలన నాకు ఈమధ్య వరుసగా కొన్ని అనుభవాలు కలిగాయి. వాటిని ఇప్పుడు పంచుకుంటాను. ముందుగా మా అమ్మాయి ఆరోగ్య విషయంలో బాబా చూపిన అనుగ్రహం గురించి చెప్తాను. 2022, నవంబర్‌లో మా అమ్మాయికి జలుబు చేసి, దగ్గు కూడా మొదలైంది. మొదట మేము గృహ చిట్కాలు పాటించాము. వాటితో తగ్గకపోవడంతో నాలుగు రోజుల తరువాత డాక్టరును సంప్రదించాము. డాక్టరు ఒక వారం రోజులకి మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా పాపకి దగ్గు తగ్గలేదు. దాంతో పాపను మళ్లీ డాక్టర్ దగ్గరకి తీసుకెళితే. ఆస్తమా లక్షణాలున్నాయని రెండు నెలలపాటు ఇన్హేలర్, మరికొన్ని మందులు వాడమన్నారు. అయితే అవి వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఇక ఈసారి పాపను ఆయుర్వేద వైద్యుడికి చూపించి మందులు తీసుకున్నాము. ఆ మందులతో పాపకి దగ్గు తగ్గలేదు సరికదా మూడోరోజు రాత్రంతా తను ఆపకుండా దగ్గుతూనే ఉంది. ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ నిద్రలేదు. పాప పరిస్థితి మాకు చాలా బాధను కలిగిచింది. అప్పటికి దగ్గు మొదలై దాదాపు నెల రోజులైంది. మాకు భయమేసి మరుసటిరోజు ఉదయం ఛాతి వైద్య నిపుణుడిని దగ్గరకి వెళదామనుకున్నాము. వెళ్ళేముందు, "బాబా! రెండు రోజుల్లో పాపకు దగ్గు తగ్గించు తండ్రి. అలా తగ్గిస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టరుని సంప్రదించడానికి వెళ్ళి, అక్కడ వెయిట్ చేస్తుండగా బయట నుండి బాబా పాటలు వినిపించాయి. బయటకి వెళ్ళి చూస్తే, దూరంగా బాబా ఫొటోలతో ఒక బండి వెళుతోంది. అక్కడున్న ఒక మెడికల్ షాపు బోర్డు మీద పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతే, నాకు చాలా ధైర్యం వచ్చింది, ఎంతో సంతోషం కలిగింది. తరువాత డాక్టరుగారు మమ్మల్ని లోపలికి పిలిస్తే, వెళ్ళాము. డాక్టరు మా అమ్మాయిని పరీక్షించి చెస్ట్ స్కానింగ్ వ్రాసి, రక్త పరీక్షలు కూడా చేయించమన్నారు. ఆ రిపోర్టులు చూసి డాక్టరుగారు మీ అమ్మాయికి 'వైరల్ నిమోనియా' అని, "హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది. ఆలోచించుకుని చెప్పండి" అన్నారు. నేను బాబా మీద నమ్మకంతో, "మందులు ఇవ్వండి సార్. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, అవసరమైతే వచ్చి అడ్మిట్ చేస్తాము" అని చెప్పాను. డాక్టరు మూడు రోజులకు మందులు ఇచ్చారు. బాబా దయవలన ఆ మందులు పనిచేసి మా అమ్మాయి ఆ రాత్రి నుండి దగ్గకుండ నిద్రపోయింది. పగలు మాత్రం అప్పుడప్పుడు కొంచెం దగ్గు వస్తుండేది. మూడు రోజుల తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్తే మరో ఐదు రోజులపాటు మందులు వాడమన్నారు. బాబా నా మొర విని, నెల రోజులుగా ఉన్న అనారోగ్యాన్ని రెండు రోజుల్లో చాలావరకు తగ్గించారు. మరో ఐదు రోజులలో పూర్తిగా తగ్గిస్తారనే సంపూర్ణ విశ్వాసముంచి ఐదు రోజుల తరువాత డాక్టరు దగ్గరకి వెళితే టెస్టులు చేసి, "ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గిపోయింది. ఆక్సిజన్ లెవల్ నార్మల్‍గా(98) ఉంది(మునపటివారం 92-94 ఉంది). ఇక ఇబ్బంది లేదు. నాలుగు రోజుల తరువాత అమ్మాయిని స్కూలుకు కూడా పంపవచ్చు" అని చెప్పి కొన్ని మందులిచ్చారు. బాబా దయవలన డిసెంబర్ 17 నాటికి పాపకి బలహీనత కూడా తగ్గి తన ఆరోగ్యం సాధారణ స్థాయికి చేరుకుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎల్లపుడూ మీ బిడ్డలందరిని చల్లగా చూడు తండ్రీ".


ఇప్పుడు నా విషయంలో బాబా చూపిన ప్రేమను, రక్షణను మీతో పంచుకుంటాను. 2022, డిసెంబర్ 22, బుధవారంనాడు నేను ఆఫీసుకు బయలుదేరేటప్పుడు నా ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. అయినా బాబాను తలచుకుని ధైర్యంగా బయలుదేరాను. నేను ఎల్లపుడూ నా వెన్నంటి ఉండమని బాబాను కోరుకుంటాను. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళేటపుడు దారిలో ఏదో ఒక చోట బాబా ఫోటో రూపంలో నాకు దర్శనం ఇస్తుంటారు. కానీ ఆరోజు దారిలో బాబా దర్శనం కోసం ఎంతగానో ఎదురుచూసినప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అందువల్ల నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అయితే ఆఫీసు దగ్గరకు చేరుకున్న క్షణాన ఒక బైక్ నన్ను దాటుకుంటూ వెళ్ళింది. ఆ బైక్ వెనక లైటుపై 'ఓం సాయిరాం' అన్న అక్షరాలు కనిపించాయి. వాటిని చూడగానే నా మనసు కుదుటపడింది. తరువాత 12.00 గంటల సమయంలో నా ఛాతీలో నొప్పి ఎక్కువగా అనిపించింది. నాకు భయమేసి నా మిత్రులతో కలిసి మా ఆఫీసు ప్రాంగణంలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళాను. డాక్టరు ఈసీజీ చేసి, "చాలా తేడాగా ఉంది. మీరు వెంటనే విజయవాడలోని పెద్ద ఆస్పత్రికి వెళ్ళండి" అని అంబులెన్స్ పిలిపించారు. నాకు చాలా భయమేసింది, నా బీపీ పెరిగిపోయింది. వెంటనే మిత్రులతో కలిసి విజయవాడకు ప్రయాణమయ్యాను. విజయవాడలోకి ప్రవేశిస్తూనే మా అంబులెన్స్ వెనక ఒక లారీ, ఆ లారీపైన అభయహస్తంతో నిలువెత్తు బాబా ఫోటో కనిపించేసరికి నాకు చాలా సంతోషం కలిగింది. 'బాబా నా వెంటే ఉన్నారు' అనే ధైర్యం వచ్చింది. హాస్పిటల్‌కి చేరుకున్న తరువాత కార్డియాలజీ డాక్టర్ ప్రాథమిక పరీక్షలు(ఈసీజీ, 2డి ఎకో, బ్లడ్ టెస్టులు) చేసి, "మీకు స్ట్రోక్ వచ్చిన సూచనలేమీ లేవు. బహుశా మీకొచ్చింది కండరాల నొప్పి అయి ఉండాలి. అయినప్పటికీ చివరగా సిటీ స్కాన్, ఆంజియోగ్రామ్ చేసి చూద్దామ"ని చెప్పి ఆ పరీక్షల కోసం అంబులెన్స్‌లో పరీక్ష చేసే చోటుకు పంపించారు. నాకు మళ్ళీ భయమేసి బాబాను తలచుకుని, "ఈ పరీక్షల్లో కూడా నెగిటివ్ రావాలి బాబా" అని కోరుకున్నాను. నేను అలా బాబాను తలచుకున్న వెంటనే మా అంబులెన్స్ ముందున్న కారు వెనక బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. ల్యాబ్‌కి చేరుకునేవరకు ఆ కారు మా అంబులెన్స్ ముందు పైలట్ వెహికల్ లాగా వచ్చి ముందుకు వెళ్ళిపోయింది. నాకు చాలా ధైర్యం వచ్చింది. బాబాకి తన భక్తులంటే ఎంత ప్రేమో! సిటీ, ఆంజియోగ్రామ్ చేశాక, "రిజల్ట్స్ మరుసటిరోజు వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళి, రేపు రండి" అని చెప్పారు. మరుసటిరోజు గురువారం. నేను బాబాకి పూజ చేసి, ఆయన మీద నమ్మకంతో రిజల్ట్స్ కోసం ఎదురుచూసాను. కొంతసేపటికి హాస్పిటల్ నుండి, "రిజల్ట్స్ వచ్చాయి. మీరు రండి" అని ఫోన్ చేశారు. నేను వెళ్ళే దారిలో బాబా గుడిలో దర్శనం చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. రిపోర్ట్స్ చూసిన డాక్టర్, "మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. నొప్పి కండరాల నొప్పి అయుంటుంది. గుండెకు సంబంధించినది కాదు. కేవలం 10% బ్లాక్స్ ఉన్నాయి. వాటికి మందులు ఇస్తాను వాడండి" అని చెప్పారు. నేను నమ్ముకున్న నా దేవుడు, నా సర్వస్వం బాబానే. ఆయన నాకు తోడుగా, నీడగా ఉండి నన్ను కాపాడారు. కన్నీళ్లతో(ఆనందభాష్పాలు) తప్ప ఆయనకి నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. "ధన్యవాదాలు బాబా. మీరు చెప్పిన మార్గంలో నడిచే శక్తిని ఇవ్వండి. అలాగే శ్రద్ద, సహనం పెంపొందేలా అనుగ్రహించండి బాబా. ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ, నన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న మీకు శతకోటి వందనాలు. థాంక్యూ బాబా. ఐ లవ్ యూ బాబా". ఆ కరుణామూర్తి దయవల్ల అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


ఓం శ్రీసాయి ధన్వంతరియే నమః!!!

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


శ్రీసాయి అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు విజయ. నేను శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను. ముందుగా నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఈమధ్య చెన్నైలో ఉంటున్న మా అమ్మాయి ఒళ్లంతా రాషెస్ చాలా ఎక్కువగా వచ్చాయి. తను స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించుకుంటే, కిడ్నీ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ అని చాలా టెస్టులు వ్రాసారు. 50 వేల రూపాయలు దాకా అయింది. మా అమ్మాయి చాలా భయపడి మాకు విషయం చెప్పింది. అది విని మాకు కూడా చాలా భయమేసింది. నేను బాబా దగ్గర చెప్పుకుని బాధపడి, 'సాయీ! అన్ని రిపోర్టులు నార్మల్‍గా వచ్చేలా చూసి అమ్మాయి ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించు తండ్రి. నా సంతోషం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ బాగా వచ్చాయి. "ధన్యవాదాలు సాయితండ్రి. మీ పాదాలే శరణం గురుదేవా".


ఒకసారి నేను, మావారు మా మానవడిని తీసుకుని ఒక మాల్‍కి వెళ్ళాము. మా అమ్మాయి ఆఫీస్ నుంచి నేరుగా మాల్‍కి వచ్చింది. తను బాబుని గేమ్స్ ఆడిస్తుంటే, నా చేతిలో ఉన్న పర్సు తనకిచ్చి నేను, మావారు ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాము. మా అమ్మాయి నేను పర్సు ఇచ్చిన విషయం మరిచిపోయి ఆ పర్సును అక్కడే కింద వదిలేసింది. తర్వాత డబ్బులు కావాల్సి వచ్చి మా మనవడు పర్సు అడిగాడు. అప్పుడు పర్సు కోసం చూస్తే కనిపించలేదు. ఆ పర్సులో బ్యాంక్ కార్డులు, 20,000 రూపాయలు ఉన్నాయి. ఆ మాల్‍లో చాలా జనం ఉన్నారు. అంత జనంలో అంతా వెతికాము కానీ పర్సు దొరకలేదు. కానీ నాకెందుకో పర్సు దొరుకుతుందనిపించి సాయిస్మరణ చేస్తూ ఉన్నాను. కాసేపటికి ఆ మాల్‍లో పనిచేసే ఒక వర్కర్‍ని పర్సు గురించి అడిగితే, "అక్కడ ఆఫీస్ రూములో అడగండి. ఎవరికైనా దొరికి ఉంటే అక్కడ ఇస్తారు. అలా ఇచ్చి ఉంటే మీ పర్సు మీకు దొరకవచ్చు" అన్నాడు. అక్కడికి వెళ్లి అడగగానే వాళ్ళు "ఎర్ర పర్సా?" అని అడిగారు. అవును అనగానే వాళ్ళు మా పర్సు మాకిచ్చారు. కొన్ని వందల మంది తిరిగే చోట పోయిన పర్సు దొరకడమంటే నిజంగా బాబా ఆశీర్వాదమే. 'చాలా చాలా ధన్యవాదాలు బాబా'.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo