సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1413వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. యాక్సిడెంట్ జరిగినా పెద్ద నష్టం వాటిల్లకుండా అన్నివిధాలా  మేలు చేసిన బాబా
2. అడిగింది ఇచ్చిన బాబా

యాక్సిడెంట్ జరిగినా పెద్ద నష్టం వాటిల్లకుండా అన్నివిధాలా  మేలు చేసిన బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు భావన. నాకు మూడేళ్ల వయస్సున్నప్పటినుంచి బాబా నాతో ఉన్నారు. ఆయన కృప నామీద ఎప్పుడూ ఉంది. విషయం చిన్నదైన, పెద్దదైన ఆయన నన్ను సదా అనుగ్రహిస్తూ సమస్యల నుంచి కాపాడుతున్నారు. కొన్నిసార్లు ఊహించని సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు నేను అడగకపోయినా, అలాగే కొన్ని సంఘటనలు జరగడానికి ముందే బాబా నన్ను వాటినుండి రక్షించారు. నేను ఇప్పుడు బాబా నన్ను, నా భర్తని, నా భర్త స్నేహితులని ఒక యాక్సిడెంట్ నుంచి ఎలా కాపాడారో పంచుకుంటాను.


మేము కెనడాలో ఉంటున్నాము. 2022, అక్టోబర్ నెల సెలవుల్లో నేను, నా భర్త, తన స్నేహితుడు, అతని భార్య కలిసి వేరే సిటీలో ఉన్న ఫాల్ కలర్స్ చూద్దామని వెళ్లి అక్కడంతా చూసుకుని తిరుగు ప్రయణమయ్యాము. నా భర్త కారుకి 'లేన్ అస్సిస్ట్' ఉంచి కారు నడుపుతున్నారు(లేన్ అసిస్ట్ అంటే కారు ఆటోమేటిక్‍గా రోడ్డుపై ఉన్న లైన్లను గుర్తించి కారు చక్రాలు ఆ లైన్లను దాటకుండా చూస్తుంది). ఇంకా గంటన్నరలో మేము ఇంటికి చేరుకుంటామనగా మేము ఒక హైవే మీదకి వెళ్ళాము. ఆ రోడ్డులో మరమ్మత్తు పనులు జరుగుతున్నందున 'కన్స్ట్రక్షన్స్ జోన్' అని ఆరెంజ్ కలర్ లైన్లు ఉన్నాయి. నా భర్త కారు నడుపుతూ మొబైల్లో అడ్రస్ చూస్తుండగా కారు చక్రాలు వైట్ లైన్స్ నుండి ఆరంజ్ లైన్స్‌లోకి వెళ్ళడం, లేన్ అసిస్ట్ ఆ ఆరంజ్ లైన్లను గుర్తించకపోవడం వల్ల మా కారు రోడ్డుకి కుడివైపున ఉన్న రైలింగ్‍కి తగిలింది. దాంతో సుమారు గంట 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మా కారు 180డిగ్రీల ఏంగిల్‍లో తిరిగి మాకు వ్యతిరేఖ దిశలో వాహనాలు వచ్చే దారి వైపు ఉన్న రైలింగ్‍కి గుద్దుకుని ఆగిపోయింది. కారు ఇవతలి వైపు నుంచి అవతలి వైపుకి వెళుతున్న క్రమంలో ఏం జరిగిందో మొదటి కొన్ని సెకన్లపాటు మాకు అర్థం కాలేదు. తరువాత ఆక్సిడెంట్ అవుతుందని తేరుకుని రెండు, మూడు సెకండ్ల తర్వాత నేను, మావారి స్నేహితుని భార్య 'బాబా బాబా' అని బిగ్గరగా అరిచాము. వెంటనే మా కారు ఆగిపోయింది. అన్ని వైపుల నుండి వస్తున్న కార్లన్నీ కూడా ఆగిపోయాయి. ఆయా కార్లలో ప్రయాణిస్తున్న కొంతమంది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కారులో నుంచి బయటకి దించారు. బాబా అనుగ్రహం వల్ల మాకు ఫ్రాక్చర్లు వంటి పెద్ద పెద్ద దెబ్బలు తగలలేదు. చిన్న చిన్న దెబ్బలతోనే అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము. అయితే మాలో ఎవరికైన లోలోపల ఏమైనా దెబ్బలు తగిలాయా అన్నది మాత్రం తెలియదు. 'మాతో వచ్చిన స్నేహితులకు ఏం జరిగిందో అని మాకు భయమేసింది. కాసేపటికి పోలీసులు వచ్చేసరికి 'కారు నడుపుతున్న నా భర్తపై కేసు ఏమైనా అవుతుందేమోన'ని కూడా చాలా భయమేసింది. ఇంతలో కారు తీసుకెళ్లడానికి వచ్చిన టోయింగ్‌వాళ్ళు కారుని కొలీషన్ సెంటర్‌కి తీసుకెళ్తామని, కారులో ఉన్న వస్తువులు తీసుకోమన్నారు. వాటికోసం కారులో వెతుకుతుండగా నాకు కారు డాష్ బోర్డ్ మీద ఉన్న బాబా విగ్రహం గుర్తొచ్చి 'బాబా విగ్రహంకి ఏమీ కాకూడదు. ఆ విగ్రహానికి ఏమీ కాకపోతే మాకు కూడా బాబా ఏమీ అవ్వనివ్వరు. మాలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదము ఉండదు(లోలోపల ఏమైనా దెబ్బలు తగిలాయా అన్న దాని గురించి). ఇంకా కారుకి సంబంధించి ఫైనాన్షియల్ మరియు పోలీసు వ్యవహారాలు అన్నీ సవ్యంగా జరుగుతాయని అర్థం' అని నా మనసుకి అనిపించింది. ఈలోగా బాబా విగ్రహం దొరికింది. ఆక్సిడెంట్ జరిగినప్పుడు కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి వాటి అతి వేగానికి కారు చాలా డామేజ్ అయింది. డాష్ బోర్డు మీద ఉన్న బాబా విగ్రహం కింద పడిపోయింది. అది గాజు విగ్రహామైనప్పటికీ దానికి ఏమీ కాలేదు. బాబా విగ్రహానికి ఏదైనా జరిగి ఉంటే నా మనసుకి చాలా బాధ కలిగేది. కానీ అలా జరగకుండా విగ్రహం క్షేమంగా ఉండటం ద్వారా 'నేను నీతో ఉన్నాను' అని బాబా నిరూపించారు. అంతటితో బాబా ఉన్నారని నాకు ఒక ధైర్యం వచ్చింది. అలాగే ఆయన అనుగ్రహం అర్థమైంది. మా కారు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వేగంగా తిరిగినప్పుడు అటువైపు నుండి వస్తున్న కార్లకి గాని, మా వెనక వస్తున్న కార్లకి గాని తగిలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అసలు జరిగే పరిణామాలు ఊహించడానికి కూడా చాలా భయానకంగా ఉంది. చాలా పెద్ద పోలీసు కేసు కూడా అయ్యేది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే మేము అపరాధ భావానికి గురయ్యేవాళ్ళము. కానీ అవేమీ లేకుండా, మా వల్ల ఇంకొకరికి ప్రమాదం, నష్టం జరగకుండా బాబానే కాపాడి చిన్న ప్రమాదంతో బయటపడేసారు. పోలీసులు కేవలం 'కేర్ లెస్ డ్రైవింగ్' అన్న ఒక్క టికెట్టు ఇచ్చి కోర్టులో హాజరవ్వమని ఒక నోటీసు మాత్రమే ఇచ్చారు. ఇంకా జరిగిన కారు డామేజ్‍కి ఇన్స్యూరెన్సు డబ్బులు రావడంతో ఫైనాన్షియల్‍గా ఎలాంటి ఇబ్బంది మాకు కలగలేదు. నేను, నా భర్త మా సంగతి ఎలా ఉన్నా మాతో వచ్చిన మావారి స్నేహితునికి, అతని భార్యకి ఏమీ జరగకూడదని బాబాను ప్రార్థించాము. మేము కోరుకున్నట్లే వాళ్లకి చిన్న చిన్న దెబ్బలు తప్ప ప్రమాదకరంగా ఏమీ జరగలేదు. ఆక్సిడెంట్ జరిగే క్షణాల్లో 'బాబా బాబా' అని నాకు బాబా పేరు ఎలా వచ్చిందో అర్థం కాలేదుకానీ 'పిలిచిన వెంటనే పలుకుతాను, రక్షణనిస్తాను' అన్న వాగ్దానాన్ని బాబా నిలుపుకున్నారు. ఇదంతా ఆయన మాపై చూపిన అనుగ్రహం.


ఇంకో విషయం, ఆక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి మేము కెనడాలోనే ఉంటున్న మావారి బాబాయ్‍కి ఫోన్ చేసి విషయం చెప్పాము. ఆయన చాలా దూరంలో ఉన్నప్పటికీ రాత్రివేళ అని చూడకుండా వెంటనే తన కారు తీసుకుని మా ఇంటికి వచ్చి మరుసటిరోజు వరకు మాతోనే ఉండి, మమ్మల్ని తనతో తీసుకుని వెళ్ళి మూడు రోజులు తమ ఇంట్లో ఉంచుకున్నారు. అది కూడా బాబా ద్వారా మాకు అందిన సహాయమే అని చెప్పాలి. లేకపోతే జరిగిన ఆక్సిడెంట్ గురించే ఆలోచించుకుంటూ మేమిద్దరం కంగారుపడుతూ ఉండేవాళ్ళము. అలా కాకుండా ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ మాకు అందేలా చేశారు బాబా.


ఆక్సిడెంట్ జరిగిన తరువాత చాలా రోజుల వరకు నా మనసు చాలా ఆందోళనగా ఉండేది. ఎందుకంటే, సంవత్సరం క్రితమే ఒక ఆక్సిడెంట్ జరిగింది(ఆ అనుభవం ఇదివరకు బ్లాగులో పంచుకున్నాను. - https://saimaharajsannidhi.blogspot.com/2022/02/1049.html). సంవత్సరం కూడా కాకుండా మళ్లీ ఇలా ఆక్సిడెంట్ అయ్యేసరికి నాకు చాలా బాధగా అనిపించి, 'బాబా అసలు ఆక్సిడెంట్ జరగకుండానే ఆపి ఉంటే బాగుండేది కదా, ఎందుకిలా జరిగేలా చేశారు' అని అనిపించింది. నిజానికి జరిగిన ప్రమాదానికి సంబంధించి బాబా నాకు చాలా మేలు చేశారు. అయినా చిన్న కష్టాన్ని కూడా భరించలేని నా సున్నిత మనసుకి 'బాబా ఇది కూడా జరగనివ్వకుండా ఉంటే బాగుండేది, ఎందుకు జరగనిచ్చారు?' అని బాధ కలిగేది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రశ్నకు బాబా సమాధానం ఇచ్చారు. ఒకరోజు సచ్చరిత్ర పారాయణలో భాగంగా ప్రమాదాల నుండి భక్తులను కాపాడిన లీలలు నేను చదివాను. వాటి ద్వారా 'మన కర్మ ప్రకారం ఏదైనా జరగాలని ఉంటే అది జరుగుతుందికానీ, దానివల్ల మనకు ఎలాంటి తీవ్రమైన ఇబ్బంది కలగకుండా బాబా మనల్ని కాపాడుతార'ని బాబా సమాధానం నాకు దొరికింది.


ఇకపోతే, 'కేర్ లెస్ డ్రైవింగ్' తాలూకు టికెట్‍కి సంబంధించి మేము 2022, డిసెంబర్ 1, గురువారంనాడు కోర్టులో హాజరయ్యాము. కోర్టు ఆ కేసుని 2023, జనవరి 26కి, మార్చ్‌కి వాయిదా వేసింది. ఒకవేళ నిజంగా 'కేర్ లెస్ డ్రైవింగ్' అని కోర్టు భావిస్తే నా భర్త డ్రైవింగ్ రికార్డు మీద చాలా ప్రభావం పడుతుంది. ఇన్స్యూరెన్స్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అసలే మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. "బాబా! మీ కృపతో కోర్టు ఆ టికెట్‍ని డిస్మిస్ చేయాలి, మావారి డ్రైవింగ్ రికార్డు మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు, అలాగే నా తప్పులేవైనా ఉన్నా మన్నించండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః


అడిగింది ఇచ్చిన బాబా

ప్రియమైన సాయి భక్తులారా! అందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు 'ఆధునిక సచ్చరిత్ర'. ఎందుకంటే, ఈ గొప్ప బ్లాగుకి సృష్టికర్త బాబానే. ఈ బ్లాగులో ఉన్న చైతన్య శక్తి(కాస్మిక్ ఎనర్జీ) పాఠకులందరికీ సానుకూల స్పందనలను ఇస్తుంది. ఇక నా అనుభవానికి వస్తే.. నేను ఒక సాయి భక్తుడిని. కోవిడ్ మహమ్మారి బారిన పడిన వారిలో నేను కూడా ఒకడిని. అప్పట్లో నేను ఒక ప్రీ ప్రైమరీ స్కూలు నడుపుతుండేవాడిని. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి దాన్ని అనివార్య పరిస్థితుల వల్ల(ముఖ్యంగా కోవిడ్ కాలంలో తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని స్కూలుకి పంపకపోవడం) మూసివేయాల్సి వచ్చింది. అది నాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. తిండికి, బట్టకు సంపాదన ఎలా అన్నది ప్రశ్నార్థకరమైనప్పటికీ ఇకపై ఏ వ్యాపారం చేయాలని నా మనసుకి అనిపించలేదు. అట్టి స్థితిలో నా నమ్మకం బాబా మాత్రమే. ఈ నమ్మకమే మనల్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. అయితే ఇక్కడ శ్రద్ధ, సబూరీలు ప్రధాన పాత్ర వహిస్తాయి.


కొన్నిరోజుల తర్వాత నేను 'బాబా నాకు అత్యంత విలువైనదిస్తారు, అందులో సందేహం లేదు. ఆయన తన బిడ్డలని నడిరోడ్డు మీద వదిలేయరు" అని గ్రహించాను. దాంతో ఏదో ఒకరోజు సంతోషకరమూ, సంపన్నమూ అయిన జీవనం సాగించేందుకు బాబా నాకొక అద్భుతమైన మార్గాన్ని చూపుతారని దృఢంగా అనుకున్నాను. దాంతో బాబాను ఏదైనా ఉద్యోగం కోరుకోవాలని అనిపించింది. అయితే నేను టెక్నికల్ నాలెడ్జి ఉన్న వ్యక్తినైనప్పటికీ నా వయస్సు, జాబ్ గ్యాప్స్, బిజినెస్ చేయడం వంటి అనేక అవరోధాల కారణంగా ఏదైనా ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి నాకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. అయినప్పటికీ బాబా మీద నాకున్న నమ్మకం దృఢమైనదని నాకు తెలుసు. ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలరు. అందులో ఆయన నిష్ణాతులు. అదే సమయంలో నేను ఆశించేవి సాధారణమైనవి కావు. నేను కోరుకునే టెక్నాలజీతో USA ఉద్యోగం, అందమైన జీతం, అది కూడా ఇంటి నుండి పని చేసే ఉద్యోగం కావాలి. ఈ విషయంగా అందరూ నా ముఖం చూసి నవ్వుకోవచ్చు కానీ, నేను బాబాను చాలా దృఢంగా నమ్మాను. ఎందుకంటే, బాబాతో నాకు చాలా బలమైన అనుబంధముంది. అందుచేత నేను ఎవరినీ ఉద్యోగం కోసం అడగలేదు. కేవలం బాబా మీదే ఆధారపడ్డాను. ఆయన సరైన సమయంలో సరైన వ్యక్తులతో కనెక్ట్ చేస్తారు. అకస్మాత్తుగా ఒకరోజు నా క్లోజ్ ఫ్రెండ్ మరియు కజిన్ నాకు కాల్ చేసి, తన USA కంపెనీలో ఒక US ప్రాజెక్ట్‌‌కి సంబంధించి ఓపెనింగ్ ఉందని చెప్పి, నేను కోరుకునే ఉద్యోగం, అందమైన జీతం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అన్ని వివరాల గురించి చర్చించాడు. ఇదే నేను బాబాని అడిగాను, ఆయన ఇచ్చారు. ప్రియమైన భక్తులారా, దయచేసి బాబాపై నమ్మకం ఉంచండి, సానుకూలంగా ఆలోచించండి, బాబాతో ప్రతిదీ సాధ్యమే. ఆయన సృష్టికర్త, ఈ విశ్వానికి అధిపతి, నిర్దేశకుడు. "ధన్యవాదాలు సాయి".


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయి వంశీ మనస్సు మంచిగా మార్చేసాయి తను నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి తనను మళ్ళీ కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించిన చూడు సాయి వాళ్ళ అన్నకి ఇవ్వాలని బుద్ధి చెప్పు సాయి నన్ను నా భర్తని కలుపు సాయి నా కాపురాని నిలబెట్టు సాయి నీ మీద నమ్మకం ఉంచి బతుకుతున్నాను సాయి ఏదైనా చెప్పినా సరే నాకు బాబా ఉన్నాడు నాకు సాయి ఉన్నాడు నాకు ఏం కాదు అని చెబుతాను సాయి నా నమ్మకం నిలబెట్టి సాయి నిజంగా నా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అనుకోలేదు సాయి ఓం సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo