1. కష్టకాలంలో బాబా ఆదరణ
2. 'నేనున్నాను' అని నాకు సూచనలిస్తూ తండ్రిలా తోడు ఉండే బాబా
కష్టకాలంలో బాబా ఆదరణ
సాయి భక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా జీవితంలోని కష్టాలను తట్టుకోలేక ఈ మధ్యనే బాబాని పూజించడం మొదలుపెట్టాను. 2022, మార్చిలో నేను శిరిడీ వెళ్లినప్పుడు సమాధి మందిరంలో ఒక ఆవిడ నాకు ఇచ్చిన 'సాయి దివ్యపూజ' పుస్తకంలో ఉన్నట్టు బాబాను పూజిస్తున్నాను. బహుశా నాకు ఈ కష్ట పరిస్థితి వస్తుందని బాబాకి తెలుసునేమో! నన్ను శిరిడీకి పిలిపించి మరీ ఆ పుస్తకం నా చేతికి ఇచ్చారు. నా స్వహస్తాలతో బాబాని పూజిస్తుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా సాయిని పూజిస్తున్నప్పటి నుండి నేను బాబాకి దగ్గర అవుతున్నాను. ఇదివరకు నాకు బాబా మీద ఉన్న భక్తి వేరు, ఇప్పుడు ఉన్న భక్తి వేరు. ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకుంటాను.
నేను నా ఎంబీబీస్ పూర్తిచేసి టీసీ తీసుకోవడానికి కాలేజీకి వెళదామనుకున్నాను. కాని ఫ్రెండ్స్ ఎవరూ తోడుగా లేకపోవడంతో ఒక్కదాన్నే వెళ్లాలంటే బెంగగా అనిపించి, సాయిని తలచుకుని వెళ్ళాను. కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు, "ఈ మధ్యాహ్న వేళ ఎవరూ రార"ని అన్నారు. అయితే నేను వెళ్లిన కొంతసేపటికి నా ఫ్రెండ్ ఒకరు రావడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకో విషయం, ఆ ఫ్రెండ్ పట్టుకున్న ఫైల్ మీద బాబా ఫోటో ఉంది. తద్వారా తామే నా ఫ్రెండ్ని ఆ సమయానికి అక్కడికి వచ్చేటట్లు చేసారని నాకు తెలియజేశారు బాబా.
నేను నా ఎంబీబీస్‍కి సంబంధించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్(PR) కోసం విజయవాడ వెళ్ళాను. ఆ సమయంలో నేను కొన్ని పరిస్థితుల వల్ల డిప్రెషన్‍లో ఉన్నందున మా ఫ్రెండ్స్ ని సరిగ్గా కనుక్కోకుండా 'ఏదైనా బాబా చూసుకుంటార'న్న ధీమాతో మా నాన్నగారితో కలిసి వెళ్లాను. మేము వేకువఝామున 3:30 ప్రాంతంలో విజయవాడ చేరుకున్నాము. మా నాన్నబుక్ చేసిన హోటల్‍వాళ్ళు ఉదయం 11 గంటలకైతేనే చెక్ ఇన్ చేస్తామని అన్నారు. మేము ఏం చేయలేక బయటకి వచ్చేసరికి ఒక రిక్షావాడు, "నా రిక్షా ఎక్కండి, నేను మిమ్మల్ని హోటల్‍కి తీసుకుని వెళ్తాను" అని అన్నాడు. మేము ఆ రిక్షా ఎక్కాము. అతను ఒక హోటల్‍కి తీసుకుని వెళ్లాడు. ఆ హోటల్లో కేవలం ఒకేఒక్క రూమ్ ఖాళీ ఉంది. అది మా అదృష్టమని అనుకున్నాం కానీ, 'ఆ సమయంలో ఏవో పరీక్షలు అవుతున్నాయని, ఎక్కడా రూమ్స్ ఖాళీ లేవ'ని తరువాత మాకు తెలిసి అదంతా బాబా దయ అని నేను గ్రహించాను. తరువాత PR కోసం వెళ్లి ఓ చోట కూర్చుని నా నెంబర్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తుండగా కొంతసేపటికి నా ఫ్రెండ్స్ ఇద్దరు(ఒక అమ్మాయి, అబ్బాయి) కనిపించారు. ఆ అబ్బాయిది నా ముందు నెంబర్. 'ఇలా జరగటం నిజంగా అరుదు. ఇదేదో బాబా లీలలా ఉంద'ని నాకనిపించింది. మేమంతా మా నెంబర్ల కోసం వేచి ఉండగా ఆ అబ్బాయి, "అఫిడవిట్ చేయించారా?" అని అడిగాడు. నేను, ఆ అమ్మాయి ఇద్దరమూ అఫిడవిట్ చేయించలేదు. అందువల్ల ఎంతో ధీమాగా ఉన్న నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. కానీ బాబా దయతో ఆ అబ్బాయివాళ్ల అన్నయ్య మానాన్నని, ఆ అమ్మాయి తండ్రిని తన కారులో లాయర్ దగ్గరకి తీసుకెళ్ళాడు, 30-40 నిమిషాల్లో పని అయిపోయింది. ఆ అబ్బాయికి థాంక్స్ చెప్తుండగా అతని ఫైల్లో బాబా ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను. వాళ్లు కూడా బాబా భక్తులే! బాబా వాళ్ళని పంపకపోతే అంత తేలికగా ఆ పని అయ్యేది కాదు, సాయంత్రం ట్రైన్కి మేము అందుకునేవాళ్ళం కాదు. ఆ అమ్మాయి కూడా మా ట్రైన్కి టైమ్ అవుతుందని తెలిసి, నా పని త్వరగా అయ్యేలా నన్ను ముందు వెళ్లమని చెప్పి, తను వెనక నిల్చుంది. అలా బాబా దయతో సకాలంలో మా పని పూర్తయి మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. బాబాకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు.
ఇటీవల నేను శిరిడీ నుండి తెచ్చుకున్న 'మాతృసాయి' పుస్తకం చదవడం మొదలుపెట్టాను. కొన్నిరోజులకి గురువారంనాడు ఒక పిల్లి మా ఇంటికి వచ్చి అరవసాగింది. సరిగ్గా అప్పుడే నేను ఆ పుస్తకంలో బాబా పశుపక్షులన్నిటి రూపాలలో ఉంటారని చదివినందువల్ల ఆ పిల్లిని బాబాయే పంపించారనిపించి దానికి పాలు పెట్టాను. అప్పటినుండి ఆ పిల్లి ప్రతీ గురువారం వస్తుండేది. కొద్దిరోజులకి రోజూ రావడం మొదలుపెట్టింది. నెమ్మదిగా అది నాకు ఒక మంచి స్నేహితురాలు అయ్యింది. నేను ఎప్పుడైనా డిప్రెషన్‍లోకి వెళ్లిపోతుంటే అది 'మ్యావ్ మ్యావ్' అని అరుస్తూ నా దగ్గరకి వచ్చేస్తుంది. బాబానే బాధలో ఉన్న నా దగ్గరకు ఆ పిల్లిని పంపించారు. నిజానికి నాకు ఎప్పటినుంచో పిల్లిని పెంచుకోవాలని కోరిక. కాని మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఆ కోరికను విడిచిపెట్టాను. కాని ఈ పిల్లి తనంతట తానుగా మా ఇంటికి వస్తుండటంతో మా ఇంట్లో ఎవరూ ఏమీ అనలేదు. ముఖ్యంగా మా అమ్మకి బయటకి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే మంచిదికాదని సెంటిమెంట్. నేను మా అమ్మ మనసు మార్చమని బాబాను వేడుకున్నాను. అలా వేడుకున్న తరువాత రెండు రోజుల్లో ఆ పిల్లి ఎడమ కాలు ఫ్రాక్చర్తో మా ఇంటికి వచ్చింది. అది చూసి మా ఇంట్లో అందరికీ దాని మీద జాలి కలిగింది. నేను దానికోసం బాబాని వేడుకుని కట్టు కడదామంటే అది సహకరిస్తుందో, లేదో అని భయమేసింది. అందుచేత నేను దాని కాలికి బాబా ఊదీ రాశాను. 3 రోజుల్లో అది మామూలుగా నడవడం మొదలుపెట్టింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. మూగజీవులకు ఆ దేవుడే రక్ష అని బాబా నిరూపించారు. అలాగే ఆ పిల్లి ద్వారా నా మనసు ఎంత సున్నితమైనదో బాబా తెలియజేసారు. ఇకపోతే, ఆ పిల్లిపట్ల మా ఇంట్లోవాళ్ళకి కలిగిన జాలి నెమ్మదిగా ప్రేమగా మారింది. పిల్లి అంటే సెంటిమెంట్గా ఉన్న మా అమ్మ ఇప్పుడు ఆ పిల్లి ఒక్క పూట రాకపోతే చాలు బాధపడిపోతుంది. మొత్తానికి ఆ పిల్లిని బాబానే పంపించారని అందరికీ అర్థం అయ్యింది. ఈ లోకం అంతా ఆ సాయిదే. మనమే ఇళ్లు కట్టుకుని, ఈ భూమి నాది అన్న అహంతో ఇంటికి వచ్చిన మూగజీవుల ఆకలి తీర్చకుండా తరిమేస్తున్నాం. వాటికి, మనకి ఆకలి ఒకేలా ఉంటుందని, వాటిలో కూడా ప్రాణం, దైవం ఉంటాయని మర్చిపోతున్నాం. అందంగా కనిపించే జంతువే కాదు, నల్లగా ఉన్న కాకిలో కూడా జీవం ఉంది కదా!
బాబా నాకు ఇచ్చిన అనుభవాలలో ఇవి కొన్ని. ఆయన మన అందరికీ చాలా అనుభవాలు ప్రసాదిస్తూ ఉంటారు. కాని మనం బాబా చెప్పినట్టు ఆచరిస్తూ, అన్ని జీవులని ఒకేలా చూస్తూ మనలోని అహం వంటి చెడు భావాలను విడిచిపెట్టి బాబా పాదాల వద్ద సర్వస్య శరణాగతి పొందాలి. కానీ కొంతమంది బాబా భక్తులమని చెప్పుకుంటూ, బాబా ద్వారా మేలు పొందుతూ కూడా బాబా చెప్పినట్టు నడుచుకోరు. కులం, మతం అని అహంకారంతో, పౌరుషంతో ఉంటారు. మన భావాలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించుకుంటే ఎంతో మేలు పొందుతామని నా ఆలోచన. మనం అందరం బాబా బిడ్డలం. బాబా మనపై స్వఛ్ఛమైన ప్రేమను చూపుతూ మనం ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒకరోజు మారుతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తుంటారు. అలాంటి బాబా చెప్పిన మాటలను మనమంతా ఆచరణలో పెట్టాలి కదా!
బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి శిరిడీ రమ్మని పిలిచారు. డిసెంబరు 1న శిరిడీ వెళ్ళాను. ఆ అనుభవాలు మరోసారి పంచుకుంటాను.
'నేనున్నాను' అని నాకు సూచనలిస్తూ తండ్రిలా తోడు ఉండే బాబా
సాయి బంధువులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా విశ్వాసం సడలిన ప్రతిసారీ బాబా 'నేనున్నాను' అని నాకు సూచనలిస్తూ తండ్రిలా తోడు ఉంటున్నారు. నేను నా గత అనుభవంలో మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదని మీతో పంచుకున్నాను. అమ్మకి కొన్నిరోజులపాటు ఒక మనిషి తోడు అవసరం ఉండటంతో నేను అమ్మతో ఏలూరులో ఉంటున్నాను. మావారు, పిల్లలు హైదరాబాద్‍లో ఉన్నారు. శ్రీసాయి కృపవలన అమ్మ ఆరోగ్యం ఇప్పుడు కొంత కుదుటపడింది. "సాయితండ్రీ! మీకు అనేక నమస్కారాలు. త్వరగా అమ్మ పూర్తిగా కోలుకునేలా అనుగ్రహించి మా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉండేలా ఆశీర్వదించండి బాబా".
ఇకపోతే ఈ బ్లాగులో ఒక భక్తురాలి అనుభవం(సాయిభక్తుల అనుభవమాలిక 1334వ భాగం.... కోరుకుంటే నిరాశపరచరు బాబా అన్న టైటిల్‍తో వచ్చిన భక్తురాలి అనుభవం చదివాక దాదాపు అటువంటి అనుభవమే నాకు జరగడం వల్ల చాలా ఆశ్చర్యం కలిగింది. దాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆ అనుభవంలో ఒక పెద్దావిడ తన మనవడికోసం వీడియో కాల్ చేస్తే, ఆవిడ కోడలు, కొడుకు మధ్య గొడవ జరగడం, దానికి ఆ పెద్దావిడ బాధపడి బాబాకు మొక్కుకుంటే, కొన్ని రోజుల్లోనే వాళ్ళు కలిసిపోవటం గురించి ఆవిడ పంచుకున్నారు. సరిగ్గా నేను ఆ అనుభవం చదవడానికి రెండు, మూడు రోజుల ముందు అంటే 2022, నవంబర్ 23న మా అమ్మ మా పిల్లలతో మాట్లాడాలని మావారికి వీడియో కాల్ చేసింది. అమ్మ మాటల్లో సరదాగా పిల్లల్ని, 'డాడీ ఏమి వండారు?' అని అడిగినందుకు మావారు కోప్పడి నాతో మాట్లాడటం మానేశారు(సహజంగా మావారు మంచివారే, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ). నేను పిల్లలకోసం రెండు రోజులు ఫోన్ చేసినా మావారు ఫోన్ ఎత్తలేదు. నేను బెంగపడి అమ్మవారి పారాయణ, బాబా పారాయణ చేసుకుంటూ, "మావారి కోపం తగ్గితే కొబ్బరికాయ కొడతాను" అని బాబాకి మొక్కుకున్నాను. శుక్రవారం పూజయ్యాక పైన చెప్పిన పెద్దావిడ అనుభవం బ్లాగులో చదివాను. దాంతో ఆ అనుభవంలో చెప్పినట్లే మా మధ్య గొడవ సమసిపోతుందని బాబా సూచన ఇస్తున్నట్లు నాకనిపించి, 'అది నిజమైతే, బాబా ఆకుపచ్చ లేదా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనం ఇవ్వాలి' అని అనుకున్నాను. నేను అలా సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుకోని అమ్మకి టిఫిన్ పెట్టేసి, నా ఫోన్ తీసి చూస్తే, ఫేస్బుక్ లో ఒక బ్లాగువారు పెట్టిన ఆరోజు శిరిడీ సమాధి మందిరంలోని సంధ్య హారతి ఫోటోలలో బాబా ఆకుపచ్చ రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు. అదికాక ఒక భక్తుడు తన కచేరీకి బాబా ఆశీర్వదిస్తున్నట్లైతే ఆకుపచ్చ వస్త్రాల్లో బాబా కనపడాలని కోరుకోవడం, బాబా అలాగే అతనికి దర్శనం ఇవ్వడం గురించి నా కంటపడింది. నేను నా అజ్ఞానం, బాధ వల్ల అదంతా నా చిత్తభ్రమ అనుకున్నాను. కానీ మరుసటిరోజు నేను మామూలుగా దీపం పెట్టగానే మావారు నాకు ఫోన్ చేసి మామూలుగా మాట్లాడారు. "ధన్యవాదాలు బాబా. మా మధ్య గొడవలు పూర్తిగా లేకుండా చేసి మేమెప్పుడూ మా పుట్టింటివాళ్ళు, అత్తింటివాళ్ళతో ప్రశాంతంగా కలిసి ఉండేలా, మా పిల్లలు, మా తమ్ముడు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేలా ఆశీర్వదించండి బాబా".
సాయి దయ చూపు సాయి ప్లీజ్ సాయి నేను చాలా కష్టం లో ఉన్నాను సాయి నాకు మీ సహాయం ఇప్పుడు చాలా అవసరం సాయి ప్లీజ్ సాయి నన్ను నా భర్తని కలుపు సాయి నా భర్త మనసు మంచిగా మార్చు సాయి బాబా నిలబెట్టు బాబా అందరూ బ్లాక్లో షేర్ చేసుకుంటాను కాని మన కోరికను నెరవేరుతున్నాయి బావ కానీ నేనేం పాపం చేశాను బావ నేను అడుగుతూనే ఉన్నాను బావ దగ్గర జరిపించారు మామ నా భర్త దగ్గర కూడా పంపించండి బావ నేను ఎంత ప్రయత్నించినా తనలో మార్పు రావట్లేదు పాప ఇక నాకు భావంతోనే నమ్ముకోవడం తప్ప వేరే ఆశ లేదు బాబా నేను ఇంత ప్రయత్నిస్తుంటే తనంత దూరం అయిపోతున్నాడు బాబా కాపాడు తండ్రి సాయి ఓం సాయి రామ్ నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుని అదృష్టాన్ని ప్రసాదించు సాయి
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼🌺🌹😍🌸💕❤😊💚
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me