సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1411వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలో ఎంతో అండగా ఉండే బాబా
2. సాయి కృప

ప్రతి విషయంలో ఎంతో అండగా ఉండే బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ఈ బ్లాగు నిర్వహిస్తూ సాయి భక్తులందరిలో సాయిబాబాపై ఎంతో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, 'ఎవరు లేకపోయినా బాబా ఉన్నారు, అంతా అయినే చూసుకుంటార'నే మనోధైర్యాన్ని కలిగిస్తున్న బ్లాగు నిర్వాహకులకు, అలాగే తోటి సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయి భక్తురాలిని. నా వయస్సు 48 సంవత్సరాలు. నాకు శ్రీసాయిబాబాపై భక్తి కుదిరి 25 సంవత్సరాలవుతుంది. నాటినుండి ఈనాటివరకు నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటాను. ఆయన నాకు ఎంతో అండగా ఉండి ఎంతో ధైర్యాన్నిస్తూ ఒంటరిగా సమస్యలను ఎదురుకునే తెలివితేటలను ప్రసాదించారు. ఎన్నో సమస్యల నుండి నన్ను ఆదుకున్నారు. ఏ జన్మలో చేసిన పాపాల ఫలమో ఏమోగానీ చిన్నప్పటినుండి నా జీవితంలో మానసిక ఆనందం అనేది చాలా అరుదు. నాకు వివాహమై 25 సంవత్సరాలైంది. నా వైవాహిక జీవితంలో కూడా ఎన్నో సమస్యలు. వాటిని అధిగమించి ఈ రోజు నేనిలా బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు వ్రాయగలుగుతున్నానంటే అది బాబా పెట్టిన భిక్షే.


ఒకసారి నేను ఆఫీసులో ఉండగా కాలికి పట్టీలు పెట్టుకునే చోట విపరీతమైన నొప్పి వచ్చి, క్షణక్షణానికి పెరుగుతూ వచ్చింది. నాకు చాలా భయమేసి, 'ఇలాగే ఉంటే రేపు ఆఫీసుకు రాగలనో, లేదో' అనిపించింది. వెంటనే నా ముందు ఉన్న కంప్యూటరులో బాబా మిరాకిల్స్ చూస్తూ, వాటిలో బాబాను దర్శిస్తూ "తండ్రీ! ఈ నొప్పి తగ్గిపోయేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే పది నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది.


ఇంకోసారి ఇంట్లో ఉన్నప్పుడు నా నడుము బాగా బిగుసుకుపోయినట్లై అస్సలు వంగలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. అంత విపరీతమైన నొప్పి కూడా కాసేపట్లో తగ్గిపోయి నేను నా ఇంటి పనులు చేసుకోగలిగాను.


మరోసారి ఇంట్లో నీళ్ళన్నీ అయిపోయాయి. మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు రాలేదు. నాకేమో అఫీసుకు టైమ్ అయిపోతుంది. స్నానం చేయడానికి నీళ్లు లేవు. ఆ స్థితిలో నేను బాబాను ప్రార్థించాను. నిజానికి నేను ఈ బ్లాగులో ఎవరైనా సాయిభక్తులు ఫ్రిడ్జ్, ఏసీ, ఫోన్ గురించి పంచుకుంటే, 'చిన్న వాటికి కూడా బాబాను విసిగించాలా?' అని అనుకునేదాన్ని. తీరా నాకు అవసరం వచ్చేసరికి నేను కూడా బాబాను ఆశ్రయించాను. తద్వారా పరిస్థితులు అలా ప్రేరేపిస్తాయని బాబా నాకు తెలియజేసారు. ఇకపోతే నేను బాబాను ప్రార్థించాక కూడా మోటార్ ద్వారా నీళ్ళు రాలేదు. కానీ మావారు రెండు టిన్నులలో నీళ్ళు తెచ్చారు. అయినప్పటికీ నేను, 'ఇదేంటి బాబాను అంతలా వేడుకున్నా కూడా మోటార్ నుండి నీళ్లు రాలేదు. అంటే బాబాకు నాయందు దయ లేదు. ఇప్పటివరకు నాకు జరిగినవన్నీ జరగవలసి జరిగినవేమో, నేనే బాబాకి అన్వయించుకున్నానేమో!' అని అనుకుని మావారు తెచ్చిన నీళ్ళు స్నానానికని బకెట్లో పోసుకున్నాను. ఆ బకెట్ పట్టుకుని వెళ్తుంటే నా మనసులో, 'ఛ.. బాబా నాయందు లేకపోవడమేమిటి? నేను ఇందాక బాబాను నీళ్ళు రప్పించు తండ్రి అని వేడుకున్నానేగాని మోటారు బాగై దాని ద్వారా నీళ్ళు రావాలి అని అనుకోలేదుగా. ఇప్పుడు ఊదీ తీసుకెళ్లి, ట్యాప్‍కి పెట్టి బాబాకి దణ్ణం పెట్టుకుని మరోసారి ప్రయత్నిద్దామ'ని అనుకున్నాను. అనుకున్నట్లే ట్యాప్ దగ్గరకెళ్ళేసరికి నీళ్లు చాలా ఫోర్స్ గా వచ్చాయి. అది చూసి 'బాబా నా ప్రతి కదలికను గమనిస్తున్నార'ని నాకు చాలా సంతోషమేసింది. నా ఆనందానికి అంతులేదు.


ఒకసారి మా మేడమ్ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడుతున్న సమయంలో నేను ఆమెతో చాలా దగ్గరగా మాట్లాడవలసి వచ్చింది. కాసేపటికే నాకు కూడా దగ్గు మొదలైంది. దాంతో ఇదేదో వైరస్‍లా ఉందని నాకు చాలా భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన ప్రేరణ వలన నాకు లాక్‍డౌన్ సమయంలో వైరస్ రాకుండా ఉండడానికి వాడిన 'ఆర్సెనిక్ ఆల్బం' అనే హోమియో మందు గుర్తుకు వచ్చింది. ఆ సాయంత్రానికి ఒళ్లునొప్పులు, జ్వరం కూడా వచ్చేసరికి మా మేడంతో, "నేను ఆర్సెనిక్ ఆల్బం వేసుకుంటాను. మీరు కూడా వేసుకోండి. మీరు 4 రోజుల నుండి ఇబ్బందిపడుతున్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి టెస్టు చేయించుకోండి. నేను రేపు చూసి, ఎళ్ళుండి టెస్టు చేయించుకుంటాను" అని చెప్పాను. ఆమె టెస్టు చేయించుకుంటే టైఫాయిడ్ అని నిర్ధారణ అయింది. ఆమె వారం రోజులు సెలవు తీసుకున్నారు. నా విషయానికి వస్తే, ఆ మందు వేసుకున్న మరుసటిరోజుకి నాకు జ్వరం, దగ్గు అన్నీ తగ్గాయి. కానీ బాగా నీరసంగా ఉండింది. ఆ తర్వాత అది కూడా తగ్గిపోయింది.. అలా బాబా నన్ను ఎంతగానో ఆదుకున్నారు.


ఒకసారి మా పైఆఫీసర్ నాతోపాటు మరో ముగ్గురిని పిలిచి వేరే పని అప్పగించి, మా సెక్షన్ నుండి ఇద్దరిని, మరో సెక్షన్ నుండి ఒకళ్ళని వెళ్ళమని, ఒకరిని సెక్షన్ వర్క్ చేయమని చెప్పారు. నేను సెక్షన్ వర్క్ చేయగా మిగిలిన వాళ్ళు వేరే వర్క్ చేసారు. ఆ ముగ్గురూ ఆ రాత్రి చాలా పొద్దుపోయేవరకు వర్క్ చేసి కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. ఆ కారణంగా మా పైఆఫీసరుకి కోపం వచ్చింది. ఆ విషయంలో నాకు సంబంధం లేకపోయినప్పటికీ నేను కూడా ఆఫీసరు కోపానికి గురయ్యాను. నాకు చాలా బాధేసి బాబాను ప్రార్థించాను. బాబా దయతో ఆఫీసరు చేత నా తప్పేమీ లేదని, నా గురించి వారేమీ అనలేదని చెప్పించి నా మనోభారాన్ని దించేశారు. ఇలా ప్రతి విషయంలో బాబా నాకు ఎంతో అండగా ఉంటారు.


ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి కృప


నా పేరు వెంకట సుబ్బరావు. నేను ఒక ఉపాధ్యాయుడిని. మా పాప డెలివరీ కోసం మా ఇంటికి వచ్చింది. మేము రెగ్యులర్‍గా తనని విజయవాడలోని ఒక ప్రముఖ పిల్లల వైద్యశాలకి తీసుకు వెళ్లి చెకప్ చేయిస్తుండేవాళ్ళము. తనకి 9 నెలలు నిండి 10వ నెల వచ్చినా డెలివరికి సంబంధించి ఏ లక్షణాలూ కనిపించలేదు. దాంతో మేము 2022, నవంబర్ 7న తనని విజయవాడ హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. ఆ సమయంలో ఎప్పుడూ మా పాపను చూసే డాక్టరు లేకపోవడంతో వేరే డాక్టరు చూసి, "మీరు బాగా ఆలస్యం చేసారు. లోపల బేబీ గ్రోత్ ఎక్కువైంది. మీరు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి" అని చెప్పింది. మేము, "రేపు గ్రహణం ఉంది. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రికి వచ్చి అడ్మిట్ అవుతాము" అని అన్నాము. అందుకామె, "మీ ఇష్టం, లోపల బేబీ గ్రోత్ ఎక్కువైంది" అని మమ్మల్ని కంగారు పెట్టింది. ఆపై స్కాన్ చేసి, "లోపల బిడ్డ కదలికలు అంతగా లేవు. మీరు భోజనం చేసి రండి. మళ్లీ స్కాన్ చేద్దాం" అని చెప్పింది. సరేనని, మేము భోజనం చేసొచ్చి మళ్లీ స్కాన్ చేయించాం. డాక్టర్, "ఇప్పుడు బిడ్డ కదలికలు బాగున్నాయి. మీరు 9వ తేదీన వచ్చి అడ్మిట్ అవ్వండి" అని చెప్పింది. మేము ఇంటికి వచ్చి ఆరోజు రాత్రి మేముండే టౌన్‍లో డాక్టరుకి చూపిద్దామని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. రాత్రి పడుకునే ముందు, "స్వామీ! ఎవరినైనా పంపి మాకు మంచి సలహా ఇప్పించండి" అని బాబాను వేడుకున్నాను. తెల్లవారాక మా ఎదురింటి ఆవిడ వచ్చి, "పదండి, నేను కూడా వస్తాను" అంటే, అందరమూ కలిసి మా పాపని టౌన్‍లోని హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాము. డాక్టరు టెస్టు చేయించి, "వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. లేదంటే విజయవాడ వెళ్ళండి" అని చెప్పారు. మేము, "ఇక్కడే అడ్మిట్ చేస్తాం" అని చెప్పగానే ఆమె అమ్మాయిని హాస్పిటల్లో చేర్చుకుని ఆపరేషన్ చేసి పండంటి మగబిడ్డను మా చేతిలో పెట్టింది. ఇదంతా బాబా కృప వల్లే జరిగింది. "ధన్యవాదాలు బాబా. బాబును సదా సంరక్షించండి బాబా".


మా పాపకు బాబు పుట్టిన తర్వాత నలబైఐదు రోజులకు వేయవలసిన వాక్సిన్ కోసం ఒకరోజు గవర్నమెంట్ హెల్త్ సెంటరుకి వెళ్ళాం. అక్కడ ఎఎన్ఎం, "బాబుకు జలుబు ఉంది. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ వేయము. మళ్ళీ బుధవారం రండి. అప్పటికి జలుబు తగ్గితే, డాక్టరు గారికి చూపించి, వ్యాక్సిన్ వేయమంటే వేద్దాం" అని అంది. మేము, "బాబా! బాబుకు జలుబు తగ్గేలా చూడండి" అని బాబాను వేడుకున్నాము. తరువాత బుధవారంనాడు బాబుని తీసుకుని మళ్ళీ హెల్త్ సెంటరుకి వెళ్ళాం. ఎఎన్ఎం బాబును చూసి వ్యాక్సిన్ వేసింది. బాబు కూడా బాబా దయవల్ల చక్కగా వేయించుకున్నాడు. ఆ రాత్రి బాబుకి జ్వరం వస్తే, సిరప్ వేసాము. బాబా దయవల్ల రెండురోజుల్లో జ్వరం తగ్గి బాబు నార్మల్ అయ్యాడు. ఇలా బాబా ఎప్పుడూ నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. నిత్యం మిమ్మల్ని స్మరిస్తూ మీ పాదాల వద్ద సదా ప్రణమిల్లాలని, మీ దయ ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తున్నాను తండి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


3 comments:

  1. ఓం సాయిరాం సాయి నన్ను నా భర్తని కలుపు సాయి తనకి మంచి మనసునివ్వ సాయి తనని అర్థం చేసుకునేలా చూడు సాయి అని భార్యగా స్వీకరించి కాపురం తీసుకెళ్లిన చూడు సాయి అసలు అర్థం చేసుకునే మనసును ప్రసాదించు సాయి మనిషిని అర్థం చేసుకోమని చెప్పు సాయి వంశీకి. కాపురాన్ని నిలబెట్టి సాయి మిమ్మల్ని నమ్ముకున్నాను సాయి ఎన్నో సంవత్సరాల ఎదురుచూస్తున్నాను సాయి నాకు సహాయం చేయండి సాయి నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకునే అదృష్టం ప్రసాదించండి సాయి ఓం సాయిరాం

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo