1. కల్పతరువు మన సాయినాథుడు
2. నమ్ముకున్న బాబా కుటుంబాన్ని కాపాడారు
3. రావాల్సిన డబ్బులో కొంత వచ్చేలా అనుగ్రహించిన బాబా
కల్పతరువు మన సాయినాథుడు
సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు గీత. 2022, నవంబర్ 5వ తేదీన మా ఆడపడుచువాళ్ల గృహప్రవేశం జరిగింది. ఆ ఇల్లు చూడాలని బాగా వయసుపైబడిన మా అత్తమ్మ, మామయ్యలు ఆశపడటంతో మేము వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాము. అక్కడికి చేరుకున్నాక ముందుగా అతమ్మను కారు దింపాము. తరువాత మామయ్యని దింపేలోపు ఆవిడ ఆతృతలో ముందుకు వెళ్ళి అక్కడున్న మెట్టు గమనించకపోవడం వలన పక్కకు పడిపోయారు. అందరం పరుగున వెళ్ళి ఆవిడను లేపితే ఆవిడ నొప్పితో విలవిలలాడిపోయారు. నేను సదా తలుచుకునే మన తండ్రి సాయినాథుని తలుచుకుని, "బాబా! అతమ్మకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసి గృహప్రవేశం బాగా జరిగేటట్లు అనుగ్రహించండి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత అత్తమ్మను హాస్పిటల్‍కి తీసుకుని వెళితే పరీక్షించి, "కుడి భుజం ఎముక కొద్దిగా చిట్లింది. చేయి కదపకుండా బెల్ట్ వేసుకుని 15 రోజులు ఉండాల"ని డాక్టర్ చెప్పారు. అయితే పెద్దగా ప్రమాదం లేనందున నేను నా మదిలోనే ఆ సాయితండ్రికి థాంక్స్ చెప్పుకున్నాను. బాబాను పరిపూర్ణంగా నమ్ముకుంటే, ఎల్లవేళలా మన బాగోగులు చూసుకుంటారు. "నమస్కారం సాయితండ్రీ! ఆవిడకు కొద్దిగా నొప్పి ఉంది. మీ దయతో ఆవిడ నిదానంగానైనా కోలుకుంటే మాకు అంతే చాలు తండ్రి".
మా ఆడపడుచువాళ్ల గృహప్రవేశం నుండి తిరిగొచ్చాక పనుల ఒత్తిడి వల్ల తీసుకుని వెళ్లిన నగలను సరి చూసుకోకుండానే ఓ చోట పెట్టేసాను. 2022, నవంబర్ 12 రాత్రి ఆ నగలు తీసి సర్డుతుంటే రెండు జతల కమ్మలు కనిపించలేదు. నేను తీసుకెళ్లిన ప్రతి బ్యాగు వెతికాను కానీ, అవి ఎక్కడా లేవు. నాకు చాలా భయమేసి, 'ఇలా జరిగిందేంటి బాబా?' అని బాధపడ్డాను. తరువాత బాబా మీద పరిపూర్ణమైన నమ్మకముంచి ఆయన ఏమి సెలవిస్తారో అని ఆయన సందేశం కోసం చూస్తే, "దొరుకుతాయి" అని వచ్చింది. నేను ఆయన మీద విశ్వాసంతో నిశ్చింతగా నిద్రపోయాను. ఉదయాన్నే మా ఆడపడుచు ఫోన్ చేసి, "నీ రెండు జతల కమ్మలు మా ఇంట్లో ఉన్నాయి" అని చెప్పింది. బాబా మాకు అండగా నిలిచి మా కష్టార్జితాన్ని కాపాడారు. "ధ్యన్యవాదాలు బాబా".
2022, నవంబర్ 17న తిరుమల స్పెషల్ దర్శనానికి మేము ఎంపిక అయ్యాము. అయితే 17వ తేదికి ముందు వారం, పదిరోజుల్లో రెండు, మూడు కార్యక్రమాలకు వెళ్ళి రావడంతో 16వ తేదీ సాయంత్రం నేను కడుపుబ్బరం, నీళ్ల విరోచనాలతో ఇబ్బందిపడ్డాను. మంచి-చెడు చెప్పుకోవడానికి మన తండ్రి ఉన్నారుగా. నేను ఆయనతో నా బాధ చెప్పుకుని ఊదీ నీళ్లలో వేసుకుని త్రాగి భోజనం మానేసి పడుకున్నాను. ఆశ్చర్యం! ఉదయం 3.30కు లేచేసరికి కడుపులో ఏ ఇబ్బందీ లేదు. ఇక సంతోషంగా మేము 6.30 కల్లా తిరుమల చేరుకుని మంచిగా స్వామి దర్శనం చేసుకున్నాము. తరువాత శ్రీవరాహస్వామిని, తిరుపతిలో కపిల తీర్థం, శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మోహన్‍బాబు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీసాయి మందిరాన్ని కూడా దర్శించుకున్నాము. నమ్మినవారి కల్పతరువు మన సాయినాథుడు.
ఈ మధ్యకాలంలో చలి, మంచు ఎక్కువగా ఉండటం వల్ల వయసుపైబడిన మా మావయ్యగారికి బాగా జలుబు చేసి, దగ్గు కూడా వచ్చింది. ఆ కారణంగా ఆయనకి రాత్రిళ్ళు నిద్రపట్టక నిలకడ లేకుండా దగ్గుతోనే ఉండేవారు. డాక్టరు ఇచ్చిన మందులు పది రోజులు వాడినా ఆయనకి దగ్గు తగ్గలేదు. నేను అర్థరాత్రి వరకు ఆయనను కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఒకరోజు ఆయన దగ్గుతో చాలా తీవ్రంగా ఇబ్బందిపడుతుంటే నేను బాబాను తలచుకుని, "తండ్రీ! పెద్దాయన చాలా ఇబ్బందిపడుతున్నారు. నీళ్లలో ఊదీ కలిపి ఆయనకి ఇస్తాను. దగ్గు తగ్గేలా చూడండి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. మూడు పూటలా నీళ్లలో ఊదీ కలిపి ఆ తీర్థాన్ని మావయ్యగారికి ఇచ్చాను. ఎంత బాధ ఉన్నా సాయితండ్రికి చెప్పుకున్న వెంటనే తగ్గిపోతుంది కదా! ఆ మరుసటిరోజు నుండి మావయ్యగారికి నిద్రలో దగ్గు రాలేదు. ఇంకా మామూలుగా వచ్చే దగ్గు కూడా తగ్గడం మొదలైంది. అందుకోసం మందులు వాడుతున్నాము. ఆయన బాధను ఎంతగానో నయం చేసిన బాబా మేలును నేను మరువలేను.
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నమ్ముకున్న బాబా కుటుంబాన్ని కాపాడారు
సాయి బంధువులందరికీ శ్రీసాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా దక్కాలని ప్రార్దిస్తున్నాను. నా పేరు గంగాభవాని. నేను గత 26 సంవత్సరాలుగా సాయి బిడ్డగా ఉన్నాను. బాబా ఎన్నో ప్రమాదాల నుండి నన్ను కాపాడారు. ఏ దారి లేని నన్ను, నా జీవితాన్ని ఒడ్డుకు చేర్చారు బాబా. అందుకు నేను ఆజన్మాంతం బాబాకు ఋణపడి ఉంటాను. 2022, దసరా సమయంలో నాకు అనుకోకుండా జ్వరమొచ్చింది. ఆ సమయంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా నేను 'బాబా చూసుకుంటారులే' అని కేవలం ఆయననే ప్రార్థిస్తూ ఏ హాస్పిటల్‍కి వెళ్ళలేదు. బాబా దయవలన రెండురోజుల్లో నాకు జ్వరం తగ్గిపోయింది. అదే సమయంలో ఊరిలో ఉన్న మా బావగారికి కూడా జ్వరం వచ్చింది. రెండు రోజుల తరువాత టెస్టు చేస్తే ఆయనకు డెంగ్యూ అని రిపోర్టులో వచ్చింది. సిటీకి తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. కానీ మా దురదృష్టం కొద్దీ ఎంతలా చికిత్స అందించినా నాలుగు రోజుల్లో ప్లేట్లెట్లు పడిపోయి కిడ్నీ ఫెయిల్ అయి ఆయన మాకు దక్కలేదు. అనుకోని ఆ ఘటన వలన మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబమంతా అల్లాడిపోయింది. ఆ దుఃఖంలోనే మేము జరగవలసిన కార్యక్రమాలన్ని చేసాము. రెండో రోజు మావారికి, మూడోరోజు మా మరిదికి కూడా జ్వరాలు వచ్చి ఇద్దరికీ ప్లేట్లెట్లు పడిపోయాయి. నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. ఒకరి తరువాత ఒకరం జ్వరపీడితులు అవుతుండటంతో అందరూ మా కుటుంబాన్ని చూసి 'వీళ్లకు కూడా ఏమన్నా అవుతుందేమోన'ని కంగారుపడ్డారు. హాస్పిటల్లో ఉన్న మాకు రెండు రోజులు నిద్రలేదు. ఆ రెండు రోజులూ నేను బాబాని వదిలిపెట్టలేదు. "బాబా! నా భర్తని క్షేమంగా ఇంటికి పంపు" అని ఏడుస్తూనే ఉన్నాను. బాబా నా మొర విన్నారు. రెండో రోజు సాయంత్రానికి పరిస్థితి నార్మల్‍కి వచ్చింది. బాబా దయతో నా భర్తని ఇంటికి తీసుకొచ్చాము. మా మరిదికి తగ్గడానికి 5 రోజులు పట్టింది. మధ్యలో ఆయన కాస్త కంగారు పెట్టారుకానీ బాబా దయవలన తగ్గి ఇంటికి వచ్చారు. అప్పటివరకూ నేను నమ్మకంతో బాబా పాదాలు వదలలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నేను బాబాను వదలను. ఆయన నన్ను ఎన్నో కష్టాల నుండి బయటపడేసారు. "మీ ప్రేమకు పాత్రులమైనందుకు ధన్యులం బాబా. ప్రస్తుతం నేను ఏ సమస్యలో ఉన్నానో మీకు తెలుసు బాబా. గతంలో, వర్తమానంలో మీరు ఉన్నారు. ఇక మీదట కూడా మీరు ఉంటారనే నమ్మకం నాకుంది బాబా. దయచేసి ఎప్పటిలాగే మీ చేయి అందించి మమ్మల్ని ఈ సమస్య నుండి గట్టెక్కించండి బాబా ఈ కష్టం గట్టెక్కిన వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుని మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అప్పటివరకు నేను శ్రద్ధ-సబూరీ కలిగి ఉండేటట్లు మీరే అనుగ్రహించండి".
సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
రావాల్సిన డబ్బులో కొంత వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు కళ్యాణి. నేను గతంలో ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటాను. మావారికి తను పనిచేసే కంపెనీ నుండి చాలా డబ్బులు రావలిసి ఉన్నప్పటికీ కొన్ని కారాణాల వల్ల అవి రాకుండా ఆగిపోయాయి. ఆరు మాసాలు గడిచినా ఆ డబ్బులు రాలేదు. మాకు చాలా ఇబ్బందిగా, బాధగా ఉండేది. నేను, "బాబా! దయతో కొంత డబ్బైనా ఇప్పించండి" అని రోజూ బాబాను ప్రార్థించాను. ఆయన దయతో రెండు మాసాల డబ్బులు మా అకౌంటులో వేయించారు. మిగితా డబ్బులు కూడా వేయిస్తారని నా నమ్మకం. మావారికి మంచి ఉద్యోగం రావడం, మా అబ్బాయి విదేశీ ప్రయాణం కూడా బాబా దయవల్ల మంచిగా జరిగితే ఆ అనుభవం మీతో పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలి".
🙏🕉️✡️🙏 ఓంసాయిరాం శ్రీసాయిరాం
ReplyDeleteఅంతా సాయి మయం 🙏🕉️✡️🙏