సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1414వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనం వదిలేసినా బాబా మనల్ని వదిలిపెట్టరు
2. కోరుకున్న సమయానికి ఉద్యోగం పర్మినెంట్ చేసిన బాబా

మనం వదిలేసినా బాబా మనల్ని వదిలిపెట్టరు


ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా అభినందనలు. నేనొక క్రైస్తవ మతస్తురాలిని. బాబా నా జీవితంలోకి అనుకోని రీతిన వచ్చారు. దాని గురించే నేనిప్పుడు మొదటిసారిగా మీ అందరితో పంచుకుంటున్నాను. మా అమ్మానాన్నలకు మేము నలుగురం కుమార్తెలం. నేను చివరి అమ్మాయిని. నాకు వివాహమై 11 సంవత్సరాలైంది. నాకు ఒక పాప, ఒక బాబు. నా ముగ్గురు అక్కలకు మొదటి కాన్పులో మగపిల్లలు పుట్టారు. నాకు మాత్రం మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మొదట అది పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ 'మా అమ్మకు మగపిల్లలు పుట్టలేదు కనుక నాకు కూడా పుట్టరని, అమ్మ పోలిక నాకు వస్తుంద'ని అన్నారు. అందరూ అలా అంటుంటే భయంతో నాలో ఆలోచన మొదలై నా అత్తవారింటి వైపు నుండి ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ, 'మగపిల్లాడు పుడితే బాగుండు' అనుకున్నాను. ఆ సమయంలో మా అక్క నాతో, "సాయిబాబాను అడుగు. నీకు ఖచ్చితంగా మగపిల్లాడు పుడతాడు" అని చెప్పింది. అన్నివిధాలా కడుపులో ఉన్నది ఆడపిల్లేనని అనిపిస్తున్నప్పటికీ మా అక్క చెప్పినట్లు నేను  మనస్పూర్తిగా బాబాను, "నాకు మగబిడ్డను ప్రసాదించమ"ని అడిగాను. బాబా నా ప్రార్థన విని నాకు బాబుని ప్రసాదించారు. నేను కృతజ్ఞతగా పుస్తకంలో 'సాయిరాం సాయిరాం' అని వ్రాసి బాబా గుడిలో ఇచ్చాను. తరువాత మా అత్తగారింటికి వెళ్లాను. బాబాను మర్చిపోయాను. బాబా విలువ తెలియక నేను అప్పుడు తప్పు చేశాను. అయితే నేను వదిలేసినా బాబా నన్ను వదలలేదు. అది ఎలాగో చూడండి.


మా బాబు పుట్టిన ఆరేళ్ల తర్వాత 2022, సెప్టెంబరులో నాకు, మావారికి మధ్య చిన్న గొడవ జరిగి నేను నా పుట్టింటికి వచ్చేశాను. మావారే నన్ను, నా పిల్లల్ని మా అమ్మావాళ్ళ ఇంట్లో వదిలేశారు. అసలు విషయమేమిటంటే, అప్పటికి ఒకటిన్నర సంవత్సరం క్రితం నేను ఒక మొబైల్ యాప్‌లో స్టోరీస్ చదివేదాన్ని(మా ఇంట్లో టీవీ లేదు). అలా కొంతకాలం చదివాక ఒక స్టోరీ బాగా నచ్చి, దాన్ని వ్రాసిన అతనికి కామెంట్ పెట్టాను. నేను నా జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని పెద్ద తప్పు అది. నా కామెంట్‌కి అతను రిప్లై ఇచ్చాడు.  అది మొదలు కొద్దిరోజులు నేను అతనితో చాటింగ్ చేశాను. ఆ సమయంలో అతను తన స్టోరీస్‌కి ఉపయోగపడుతుందని నాది, మావారిది లవ్ స్టోరీ చెప్పమంటే చెప్పాను. నాకు తెలియని విషయమేమిటంటే, నా ఫోను మావారి ట్యాపింగ్‌లో ఉందని. ఇది తెలియని నేను అతనితో ఫ్రెండ్లీగా ఉన్నాను. అది మావారికి నచ్చక నాతో తేడాగా ప్రవర్తిస్తుండేవారు. ఆయన అలా చేయకుండా వెంటనే నాతో చెప్పేసి ఉంటే నేనసలు చాటింగే చేసేదాన్ని కాదు. అయినా అది తప్పని నేను అనుకోలేదు. అది కూడా యాప్‌లో చాటింగ్ చేశానేగానీ, నా ఫోన్ నెంబర్ అతనికిగానీ, అతని ఫోన్ నెంబర్ నాకుగానీ తెలియవు. కానీ అవతల ఉన్నది మగవ్యక్తి  కావడం సమస్య అయింది. మంచిగా మాట్లాడుతున్నప్పటికీ పరాయి వ్యక్తితో మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి మావారికి నచ్చలేదు. ఆయన భూతద్దంలో చూసి నాపైన అనుమానం పెంచుకున్నారు.


నేను మూడు నెలల తరువాత ఆ యాప్ తీసేశాను. అంతా మామూలుగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు నేను మావారితో, "ఆ విషయం మీకెలా తెలుసు?" అని అడిగితే, నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్న విషయం చెప్పి, "అలా చేయడం నాకు నచ్చలేదు" అని అన్నారు. నేను కూడా నాది పొరపాటేనని ఒప్పుకుని 'ఇంకెప్పుడూ ఎవరితో మాట్లాడను' అని మావారికి మాటిచ్చాను. దాంతో మావారు నా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆపేశారు. కానీ నన్ను ఒంటరిగా ఉండనిచ్చేవారు కాదు. ఎప్పుడూ నన్ను వదలకుండా వెంటే ఉండేవారు. అది నాపై ప్రేమ అని సరిపెట్టుకున్నాను. కొన్నాళ్ళకి పండగకని మావారు తన చెల్లిలి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్లారు. మావారికి ఉద్యోగం లేకపోయినా (కరోనా సమయంలో స్కూలు మూసేయడంతో మావారి ఉద్యోగం పోయింది. తరువాత ఆయన ఏ ఉద్యోగానికీ ప్రయత్నించలేదు) వాళ్ళు మమ్మల్ని, మా పిల్లల్ని 9 నెలలు బాగానే చూసుకున్నారు. కానీ ఎంత సొంతవాళ్ళైనా ఊరికే తిని కూర్చోవడం సరికాదని అప్పుడప్పుడు మావారిని హెచ్చరించేదాన్ని. కానీ ఆయన వినేవారు కాదు. ఒకటిన్నర సంవత్సరం భరించాను. నాకు రానురాను దిగులు ఎక్కువైపోయింది. ఇంకా నా వల్ల కాలేదు. చివరికి ఒకరోజు గొడవపడ్డాను. ముఖ్యంగా మా పిల్లల చదువు గురించి. కరోనా మొదలైనప్పటినుండి మా పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆరవ తరగతిలో ఉండాల్సిన మా పాప మూడవ తరగతిలోనే ఉండిపోయింది. బాబు చదువు యూకేజీతోనే ఆగిపోయింది. ఈ విషయంలో గొడవపడి చివరికి 'నేను ఇక మా ఆడపడుచు వాళ్ళింట్లో ఉండలేనని, మా అమ్మావాళ్ళింటికి తీసుకెళ్లమ'ని మావారిని అడిగాను. అందుకాయన, "నువ్వు వెళ్ళు. పిల్లల్ని పంపను" అన్నారు. "పిల్లలు లేకుండా నేను వెళ్ళన"ని అంటే రెండోరోజు పొద్దున్నే నన్ను, నా పిల్లల్ని మా అమ్మావాళ్ళింట్లో వదిలేశారు.


ఆయన తిరిగి వెళుతూ వెళుతూ నా మీద కోపంతో తను ఉద్యోగం చేయట్లేదన్న నా కంప్లైంట్‌ను పక్కనపెట్టి ఎప్పుడో నేను చేసిన చాటింగ్ విషయమే కాకుండా లేనిపోని అబద్ధాలు కల్పించి మా నాన్నకి చెప్పారు. నా గురించి తెలిసి కూడా నా తల్లిదండ్రులు నన్ను నమ్మలేదు. నేను నా పిల్లల మీద, దేవుని మీద ఒట్టేసి 'నా భర్తతో తప్ప నాకు ఎవరితో ఎటువంటి సంబంధం లేద'ని చెప్పాను. నేను తట్టుకోలేక చాలా ఏడ్చాను. మానసికంగా కృంగిపోయాను. నా బాధ చూసిన సాయిభక్తురాలైన మా అక్క, "మళ్లీ బాబాని అడిగి చూడమ"ని చెప్పింది. నేను, "ఒకప్పుడు బాబు కావాలని అడిగి, బాబు పుట్టాక బాబాను వదిలేశాను. అలాంటి నన్ను బాబా మళ్ళీ ఆదరిస్తారా?" అని అడిగాను. అందుకు అక్క, "బాబా తన పిల్లల్ని ద్వేషించర"ని బాబా గురించి చాలా విషయాలు చెప్పి, శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేయమని నన్ను ఒక బాబా గుడికి తీసుకెళ్ళింది. అది ఒక పురాతనమైన గుడి. అక్కడి పూజారి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. మేము వెళ్లిన సమయంలో గుడి మూసేసి ఉంది. నేను బాబా దర్శనం అవలేదని బాధపడుతుంటే కిటికీ సందులోంచి బాబా కొద్దిగా కనిపించారు. మేము తీసుకెళ్లిన పూలలో కొన్ని గుమ్మం దగ్గర పెట్టి, మిగిలినవాటిలోని కొన్ని మందారపూలను కిటికీ సందులోనుంచి బాబా ముందు వేద్దామనుకున్నాం. బాబాకి నా యందు ఉన్న దయ చూడండి. ఆ తండ్రి తమ బిడ్డలు తమని వదిలేసినా తాము తమ బిడ్డలను ఎప్పటికీ వదిలిపెట్టమనే నిదర్శనాన్ని చూపించారు. నేను ఒక మందారపువ్వుని చేతిలోకి తీసుకుని కిటికీ గుండా బాబాని చూస్తూ, "బాబా! నా తప్పు లేకుంటే, నాయందు మీకు దయవుంటే ఈ సమస్య నుండి బయటపడేయండి. నా భర్త మనసు మార్చండి" అని అడిగి చేతిని కిటికీ సందు లోపలికి పెట్టి పువ్వును బాబా ముందుకు విసిరాను. ఆ కిటికీ బాబా విగ్రహానికి ఎడమవైపున ఉన్నందున చేయి లోపలికి పెట్టినప్పుడు పువ్వు ఎక్కడ కనపడలేదు. నేను పువ్వును విసిరి పక్కకు వచ్చేశాక మా అక్క లోపలికి చూసి, "ఎవరు విసిరింది ఆ పువ్వు?" అని అడిగింది. "నేనే విసిరింది" అన్నాను. అప్పుడు మా అక్క ఆనందాశ్చర్యాలతో "బాబా నిన్ను స్వీకరించారు. నీకు తోడుగా ఉంటారు. నువ్వేం భయపడుకు" అంది. చూస్తే, నేను విసిరిన పువ్వు బాబాకి ఎదురుగా ఉన్న ఆయన పాదాల మీద చేత్తో పెట్టినట్లుగా పడివుంది. 'చూసీచూడకుండా విసిరిన పువ్వు అలా సరిగా బాబా పాదాల మీదే పడివుందంటే బాబాకు నాపై దయ ఉన్నట్లే కదా' అని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక ఏమైనా బాబాని వదలకూడదని నిర్ణయించుకున్నాను. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. శ్రీ సాయిసచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, "ఇది పూర్తయ్యే లోపల నా తప్పేమీ లేదని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. నా భర్త మనసు మార్చి నేను కోరుకున్న విధంగా నా దగ్గరకి పంపించండి" అని బాబాకు చెప్పుకుని సమస్యను ఆయనకు వదిలేశాను. ఆ తర్వాత కూడా కొద్దిరోజులు మావారు అసభ్యకరంగా మాట్లాడారు. ఒకరిద్దరి దగ్గర నన్ను చంపేస్తానని కూడా అన్నారని తెలిసి బాధ కలిగింది. కానీ భయపడలేదు. "మీ చిత్తం ఎలా ఉంటే అలా జరిపించండి" అని బాబా మీద భారమేసి ధైర్యంగా రోజుకు ఒక అధ్యాయం చొప్పున సచ్చరిత్ర చదువుతుండేదాన్ని. ఆ సమయంలో ఒకరోజు కలలో బాబా ముఖదర్శనమై నాకు చాలా ఆనందం కలిగి నా కళ్ళ వెంట నీళ్లు కారాయి. చివరి అధ్యాయం చదవాల్సిరోజు 'నా జీవితంలో ఏం అద్భుతం చేస్తారో బాబా' అనుకుంటూ ఆ అధ్యాయం పూర్తి చేశాను. అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం చూడండి. మధ్యాహ్నం పారాయణ పూర్తయితే సాయంత్రానికి మావారు మా అమ్మావాళ్ళింటికి వచ్చి నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు క్షమాపణ చెప్పి, నా తప్పు ఏమీ లేదని ఒప్పుకున్నారు. "ఇంక కొత్త జీవితం ప్రారంభిద్దాం" అన్నారు. ఆ మాటలను ఎవరూ నమ్మలేకపోయారు. నేను కూడా ఇంత తక్కువ సమయంలో అంత మార్పు అస్సలు ఊహించలేదు. కానీ, బాబా మీద నమ్మకంతో మావారితో వెళ్లాను. బాబా దయవల్ల ఇప్పుడు నన్ను మావారు ప్రేమగా చూసుకుంటున్నారు. అంతకంటే నాకు ఏం కావాలి?


ప్రస్తుతం మావారు బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించాలని నేను మళ్లీ శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. శ్రీసాయిలీలామృతం కూడా పారాయణ చేశాను. సాయిరాం నామాల బుక్ వ్రాస్తున్నాను. "ధన్యవాదాలు సాయితండ్రీ. రెండవసారి శ్రీసచ్చరిత్ర మొదలుపెట్టాను. అది పూర్తయ్యే లోపు మావారి వ్యాపారం మొదలయ్యేలా దీవించు తండ్రీ. మాపై దయ చూపించు తండ్రీ. మిమ్మల్ని మరిచినందుకు నన్ను క్షమించండి తండ్రీ. ఎప్పటికీ మీ ముద్దుబిడ్డగా ఉండనివ్వండి సాయితండ్రీ. ఏమైనా పంచుకోవడం మర్చిపోతే నన్ను క్షమించు బాబా". బాబా దయ నాపైన, నా కుటుంబంపైన, మనందరిపైన ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. 


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


కోరుకున్న సమయానికి ఉద్యోగం పర్మినెంట్ చేసిన బాబా


నా పేరు విజయభారతి. సాయిభక్తురాలిగా నా అనుభూతిని పంచుకోడానికి అవకాశం కల్పించిన 'సాయి మహరాజ్ సన్నిధి' నిర్వాహకులకు నా వందనాలు. ఈ బ్లాగ్ గురించి నాకు మా అన్న ద్వారా తెలిసింది. కానీ ఇన్నిరోజులుగా నా అనుభూతిని, సాయి నాకు, నా కుటుంబానికి చేసిన సహాయాన్ని ఎలా పంచుకోవాలో తెలియలేదు. చివరికి ఇలా మీ ముందుకు వచ్చాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని సమయంలో నేను రెండోసారి గర్భవతినయ్యాను. బంధువులందరూ, "ఈ సమయంలో ఇంకో బిడ్డ ఎందుకు? ఒక్క అమ్మాయి చాలు" అని అన్నారు. కానీ నేను సాయిపై భారమేసి ప్రతిరోజూ సాయినామం వ్రాస్తూ, "నా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. అలాగే నాకు డెలివరీ అయ్యే సమయానికి నా కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెట్ అయ్యేలా చేయండి" అని వేడుకునేదాన్ని.  సాయి నా మొర విన్నారు. నేను డెలివరీ అయిన మూడవరోజు నా ఉద్యోగం పర్మినెంట్ చేశారు. ఇలా ఉద్యోగం విషయంలోనే కాదు, నా ప్రతి కష్టంలో, బాధలో సాయి నన్నెప్పుడూ వీడలేదు. ఆయన నా ప్రతి కష్టంలో నాకు తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల మా పెద్దమ్మాయికి ఫ్రీ మెడికల్ సీట్ వచ్చేలా అనుగ్రహించారు. శ్రీసాయి దయవల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. "ధన్యవాదాలు బాబా. అలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమాపణలు తండ్రీ".



4 comments:

  1. ఓం సాయి రామ్ సాయి నేను మీ మీద చాలా నమ్మకం ఎదురుచూస్తున్నాను సాయి. నిజంగా నా నమ్మకం నిజంగా నిరూపించండి సాయి ఒకసారి నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నాను సాయి కానీ నేను అనుకున్న దానికి ఎంత వ్యతిరేకంగానే జరిగింది సాయి. అయినా నేను మీ మీద నమ్మకం లేదు సాయి. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సాయి. ఎవరు నన్ను ప్రశ్నించిన సరే నా బాబా నాకు ఉన్నాడు ఆయనకి అన్యాయం చేయడం చెప్తున్నాను సాయి. ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా అవమానిస్తున్నారు మీకే తెలిసి సాయి నీ మీద ఎంతో నమ్మకం ఉంది సాయి నాకు. నా భర్తలో అయితే ఇప్పటిదాకా అసలు ఈ మార్పు లేదు సాయి కానీ ఒక జ్యోతి స్కూల్ చెప్పారు నా భర్త ఈ నెలలోనే దగ్గరకు వచ్చేస్తానని కానీ ఇప్పటివరకు ఏ మార్పు లేదు నాకసలు తన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా అని మీ దగ్గర నేను చీటీలు వేసాను సాయి అతను చెప్పింది జరుగుతుందని వచ్చింది నేను మామూలుగా జ్యోతిష్యాలయం అసలు నమ్మను సాయి నమ్మకం అంతా మీ మీద పెట్టుకుంటాను సాయి. ఆరోజు కూడా మిమ్మల్ని అడిగారు దగ్గరికి వెళ్ళాను సాయి ఏంటి బాబా నన్ను తన దెగ్గరికి పంపారు కానీ అతను చెప్పేది జరుగుతుందా లేదా అని కూడా మిమ్మల్ని అడిగాను సాయి జరుగుతుందని వచ్చింది ఇంకా 16 రోజులు కూడా లేదు నా భర్తలో ఏ మార్పు లేదు సాయి. కానీ మీరు చెప్పారని నమ్మకంతో నేను మా ఇంటికి చెప్పాను సాయి. మా ఆంటీ క్రిస్టియన్ సాయి ఆమె అన్నది నిజంగా నీ బాధనే ఉంటే నీ భర్తని మార్చిన దగ్గరికి రమ్మను నేను అప్పుడు నీతో బాధ గుడికి వస్తాను అని నేను ఎంతో నమ్మకంతో చెప్పాను సాయి చూడు రెండు నెలల్లో నా భర్త నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడానికి తీసుకెళ్లకపోతే అని సాయి నా నమ్మకాన్ని నిజమైన నిరూపించు సాయి చాలా నమ్మకం పెట్టుకొన్న సాయిని మీతో ఇంతకటికమైన పరీక్ష అని ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు సాయి. కానీ నేను నీకు కష్ట కాలంలో కూడా మిమ్మల్ని వదలలేదు సాయి నేను మీ మీద పెట్టుకున్నా నమ్మకం జరగకపోయినా సరే ఆ నమ్మకంగా అలానే ఉంచుకున్నాను సాయి మళ్లీ పోయి కష్టకాలంలో నేను మిమ్మల్ని పూజిస్తున్నాను సాయి. సత్యహరి పారాయణం చేస్తున్నాను మనకేదైనా ఇష్టమైంది వదిలేస్తే కొద్ది రోజులు మన కొరకు త్వరగా తిడుతుంది అని సచ్చరిత్రలో ఉంది కదా సాయి. అది కూడా చేస్తున్నాను సాయి. రోజు బావ దగ్గరికి వెళ్తున్నాను కోరుకుంటున్నాను సబితాపారాయణం చేస్తున్నాను దివ్య పూజ చేస్తున్నాను ఇక్కడ నేను మిమల్ని నమ్మకాన్ని కోల్పోలేదు సాయి. నిజంగా అతను చెప్పినట్టు మీ మీద చీటీలు వేసింది గాని నిజంగా జరిగితే ఈ ప్రపంచంలో నాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు సాయి నేను సాయి మరస్థాయిలో అనుభవాన్ని పంచుకోవాలి సాయి అదృష్టాన్ని నాకు ప్రసాదించండి సాయి

    ReplyDelete
  2. Modhati anubhavamlo baba prema entha bhagundho nijanga manam babani vadhilina baba manani vadhalaru chivarakantu gamyam cherustharu ….thana bhartha manasu maari thana daggaraku raavadam antha baba grace ye …..baba meedha poorthi nammakamtho undatame manam cheyalsindhi.

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo