1. బాబా ఎప్పటికీ మన చేయి వదలరు
2. ఆపరేషన్ విజయవంతమయ్యేలా అనుగ్రహించిన బాబా
3. సమస్యేమీ లేకుండా మందులతోనే తగ్గేలా అనుగ్రహించిన సాయితండ్రి
బాబా ఎప్పటికీ మన చేయి వదలరు
శ్రీసాయి లీలలను అందరికీ తెలిపేలా ఏర్పాటు చేయబడ్డ ఈ బ్లాగు చాలా బాగుంది. ఈ మధ్యనే మా చెల్లి ఈ బ్లాగు గురించి నాతో చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాపేరు సత్య. గత 30 సంవత్సరాలుగా నాకు శ్రీసాయితో అనుబంధం ఉంది. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదని బాధపడితే, వెంటనే ఆయన "నేనున్నాను" అని దైర్యం చెప్తారు. ఆయన ప్రతిరోజూ నాకు ఏదో ఒక అనుభవం ప్రసాదిస్తుంటారు. 1992లో నేను శ్రీఎక్కిరాల భరద్వాజగారి 'సాయి లీలామృతం' గ్రంధాన్ని నిత్య పారాయణ చేసాను. అందులోని ఒక అధ్యాయంలో ఒక భక్తునికి శ్రీనరసింహస్వామి ఫోటో నుండి బాబా వచ్చి నేను, నరసింహాస్వామి ఒకటే అని చెప్పినట్లు ఉంటుంది. అది చదివిన నాకు, 'అలా ఎలా జరుగుతుంది?' అని అనిపించింది. విచిత్రంగా అదే కల నాకు వచ్చింది. నేను ఆయన పాదాలు తాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ చరణాల స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది.
నాకు పెళ్లైన వెంటనే మేము శిరిడీ వెళ్ళాము. ఆ తరువాత మా పెద్ద బావగారు అనారోగ్యం పాలయ్యారు. డాక్టర్లు "నెలలోపు చనిపోతారు" అని చెప్పారు. అలాగే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయింది అనారోగ్యం కారణంగానే అయినా మావారు నన్ను ఎప్పుడూ శిరిడీకి తీసుకుపోనని తేల్చి చెప్పేసారు. శిరిడీ వెళితే ఇంట్లో ఎవరో ఒకరు పోతారని ఆయన అనుకునేవారు. అయితే బాబాను పూజించ వద్దని అనలేదు. కానీ సుమారు 8 సంవత్సరాలు శిరిడీ పోలేదు. 2016లో మావారు లక్ష రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం మానేసి ఒక కంపెనీ పెట్టారు. అందులో 40 లక్షల వరకు నష్టం వచ్చింది. ఆర్థికంగా అంత నష్టం వాటిల్లడంతో పిల్లలు చదువులు, ఇల్లు గడవటం చాలా కష్టమైంది. అంత కష్టంలోనూ నేను బాబాను నమ్మడం మానలేదు. బాబా చరిత్రలోని ఇద్దరు గోవా పెద్ద మనుషుల లీలలో "నీకు ఇష్టమైనది వదలి నన్ను పూజించు" అన్న వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. 2019లో 45 రోజలు నేను అన్నం తినకుండా రెండుపూటలా అల్పాహారం మాత్రమే తీసుకుంటూ బాబాను ప్రార్థించాను. 2019, ఆగస్టులో మావారి మనస్సు మారి శిరిడీ వెళదాం అన్నారు. నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. చాలా సంతోషంగా శిరిడీ వెళ్లి బాబాను మా ఆర్థిక పరిస్థితి గురించి మ్రొక్కుకున్నాను. మావారు కూడా తనకి ఉద్యోగం వచ్చినట్లైతే, వచ్చే జీతంలో 10% అన్నదానానికి ఇస్తానని అనుకున్నారు. నెలలోపు అసలు అప్లై చేయని కంపెనీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. బాబా దయతో మావారు మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాసయ్యారు, ఆయనకి ఉద్యోగం వచ్చింది.
2020, కరోనా సమయంలో మా అమ్మగారి ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. ఆమెకు మేము ముగ్గురు ఆడపిల్లలం. ఆ కష్ట సమయంలో మాలో ఒక్కరమూ అమ్మ దగ్గర లేము. ఆమె కాలం చేసిన తరువాత వెళ్లి చాలా బాధపడ్డాము. ఆ బాధలో 3 రోజులు నేను నిద్రపోలేదు. మూడో రోజు అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. అప్పుడు కలలో బాబా అమ్మని శ్మశానం నుండి తనతో తీసుకువెళుతూ, "ఇక బాధపడకు. మీ అమ్మను నేను తీసుకు వెళ్తున్నాను" అని చెప్పారు. ఆ తరువాత నా బాధ చాలావరకు తగ్గింది. నెలరోజుల తర్వాత నేను అమ్మను ఇంకెప్పటికీ చూడలేను, భౌతికంగా ఆమెను తాకలేను, మాట్లాడలేను అని బాధపడ్డాను. ఆ రాత్రి కలలో బాబా మా అమ్మను తీసుకొచ్చారు. నేను అమ్మతో మాట్లాడి, ఆమె పాదాలను కూడా తాకాను. ఆ స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. తరువాత కూడా నేను ఎప్పుడైనా అమ్మ గురించి బాధపడితే, అమ్మతో మేము గడిపిన మధురస్మృతులను బాబా గుర్తు చేస్తుంటారు. బాబాని నమ్ముకున్నవాళ్ళు ఎప్పటికీ మోసపోరు. కష్టంలో ఉన్నప్పుడు బాబా మనలను పట్టించుకోవడం లేదని మనకి అనిపిస్తుంది. కానీ ఆయన ఎప్పటికీ మన చేయి వదలరు. చివరిగా ఒక విషయం, మాకు బాబు పుట్టిన తర్వాత బారసాల ముందురోజు రాత్రి కలలో బాబా బాబుకి 'సాత్విక్' అని పేరుపెట్టు అని చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుటికీ మా చేయి వదలకండి".
ఆపరేషన్ విజయవంతమయ్యేలా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికీ, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా పాపకి ఇప్పుడు సంవత్సరం వయసు. తను పుట్టిన 15 రోజులకి తన గుండెకు సమస్య ఉందని, సంవత్సరంలోపు ఆపరేషన్ చెయ్యాలని డాక్టరు చెప్పారు. నేను ఎంత బాధపడ్డానో చెప్పలేను. నా జీవితంలోనే అత్యంత ఒత్తిడిని అనుభవించిన సమయమది. బాబానే నమ్ముకుని, ఆయన స్మరణలోనే గడిపాను. ఈ సంవత్సర కాలంలో పాప రెగ్యులర్ చెకప్స్, వ్యాక్సినేషన్స్, తనకొచ్చిన కడుపునొప్పి ఆయా సందర్భాలలో తను ఎక్కువగా ఏడవకూడదని బాబాను వేడుకోవడం, ఆయన అనుగ్రహించడం మొదలైన ఎన్నో అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ప్రతి అనుభవం చివరన, "బాబా! పాపకి ఆపరేషన్ అవ్వకూడదు. ఒకవేళ అయినా మీ దయతో విజయవంతమవ్వాలి" అని బాబాను ప్రార్థించాను. చివరికి బాబా అనుగ్రహించారు. పాపకి సంవత్సరం పూర్తి కావస్తుందనగా డాక్టరు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను ఏడుస్తూ స్తవనమంజరి చదువుతూనే ఉన్నాను. బాబా దయవలన ఆపరేషన్ విజయవంతమైంది. పట్టలేని ఆనందంతో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
తరువాత పాపకి వేసిన కుట్ల దగ్గర వాపు వస్తే, మళ్ళీ ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టరు. అది విని ఒక్కసారిగా మేము షాకయ్యాం. "అయ్యో బాబా! ఎందుకిలా చేసావు?" అని ఎంతో బాధపడ్డాము. అయితే బాబా అప్పుడు కూడా ఆపరేషన్ సక్సెస్ చేసారు. కానీ తర్వాత కూడా కుట్ల దగ్గర వాపులా కనపడింది. నేను మూడో ఆపరేషన్ చేయాలంటారేమో అని ఎంతో టెన్షన్ పడి బాబా ముందు ఏడ్చి, "సాయి సచ్చరిత్ర ఏడు రోజులు చదువుతాను బాబా. అది పూర్తయ్యేలోపు పాప కుట్ల దగ్గర వాపు తగ్గిపోవాలి" అని వేడుకున్నాను. హాస్పిటల్లో ఒకపక్క పాపని చూసుకుంటూ, మరోపక్క సాయి సచ్చరిత్ర ఏడు రోజులు పారాయణ చేశాను. అద్భుతం! 5వ రోజుకి పాప వాపు మాయమైంది. డాక్టర్స్ అంత బాగానే ఉందని చెప్పారు. ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు తిరిగి బాబా పాదాల మీద వాలిపోయాను. ఇది బాబా మాకు చేసిన పెద్ద సహాయం. మేము మొత్తం 15రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఆ సమయంలో మేము ఎంతో మనోవేదనను అనుభవించాము. మనోధైర్యాన్ని ఇవ్వడంతోపాటు ఆర్థికంగా కూడా బాబా చాలా చాలా సహాయం చేసారు. "థాంక్యూ బాబా. మా పాపని సదా ఇలాగే రక్షించు సాయితండ్రి. ఆపరేషన్ తర్వాత పాపకి మందులు ఇవ్వడం, డ్రెస్సింగ్ చేయడం మొదలైనవన్నీ చూసుకోవడంలో నా మనసు స్తంభించిపోయింది. అందువల్ల ఏదన్నా మీ అనుగ్రహం పంచుకోకుండా మర్చిపోయి ఉంటే క్షమించండి. మరోసారి పంచుకుంటాను బాబా".
పాప ఆపరేషన్ సమయంలో విపరీతమైన ఒత్తిడి వల్ల నాకు ఫైల్స్ సమస్య వచ్చింది. నా బాధ వర్ణణాతీతం. దాదాపు ఒక నెల అనుభవించాను. చివరికి "బాబా! 7 రోజుల పారాయణ చేస్తాను బాబా. నా పైల్స్ సమస్య ఆపరేషన్ లేకుండా నయమవ్వాలి" అని బాబాకి మ్రొక్కుకుని పారాయణ మొదలుపెట్టాను. బాబా దయవల్ల ఆ సమస్య తగ్గుముఖం పట్టింది. "పూర్తిగా నయమయ్యేట్టు చేయండి బాబా. ఏవైనా నా తప్పులుంటే క్షమించండి బాబా. నా కుటుంబాన్ని సంరక్షించండి బాబా"
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
సమస్యేమీ లేకుండా మందులతోనే తగ్గేలా అనుగ్రహించిన సాయితండ్రి
శ్రీసాయి మహారాజ్ కీ జై!!! ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా రోజుని బాబాను చూశాకే మొదలుపెడతాను. ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సప్ గ్రూపులో వచ్చే మెసేజ్లు చదివిన ప్రతిసారీ, 'బాబా మనతోనే ఉన్నార'ని నాకు మరింత ధైర్యం వస్తుంది. ఇక నా అనుభవానికి వస్తే.. గత ఆరు నెలలుగా మా అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదు. ఒకసారి అమ్మ నాతో హాస్పిటల్‍కి వెళ్ళాలని చెప్పింది. అప్పటినుండి నేను ఎప్పుడు హాస్పిటల్‍కి వెళ్ళమన్నా అమ్మ 'ఆ పని అయిపోయాక వెళ్తా, ఈ పని అయిపోయాక వెళ్తా' అంటూ ఆరు నెలలు గడిపేసింది. చివరికి హఠాత్తుగా ఒకరోజు "నేను రేపు హాస్పిటల్‍కి వెళ్తాను" అని సీరియస్‍గా చెప్పింది. నిజానికి అమ్మ అలా ఎప్పుడూ చెప్పదు. అందువల్ల నాకు భయమేసి, "ఏదైనా సమస్య అవుతుందా?" అని అమ్మను అడిగాను. అందుకు అమ్మ, "ఏం లేదు, మామూలుగానే వెళ్తున్నాను" అని చెప్తూనే, "కడుపు దగ్గర ఏదో గడ్డలా ఉంద"ని అంది. దాంతో నా భయం ఇంకా ఎక్కువై, "బాబా! అమ్మకి ఎటువంటి సమస్య లేకుండా చూసి మందులతో తగ్గేలా అనుగ్రహించు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం అమ్మ హాస్పిటల్‍కి వెళ్ళింది. డాక్టర్, "కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుని మందులు వేసుకుంటే తగ్గుతుంద"ని చెప్పారు. ఆ మందులతో ప్రస్తుతం అమ్మకి కొంచెం తగ్గింది. "ధన్యవాదాలు బాబా. అమ్మకి పూర్తిగా తగ్గేలా అనుగ్రహించు తండ్రి. తనకి ఇంకా చెయ్యి నొప్పులు కూడా ఉన్నాయి. దయతో అవి కూడా తగ్గించి తనకి ఏ సమస్యా లేకుండా చూడు తండ్రి. అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడితే తనని శిరిడీ తీసుకొస్తాను తండ్రి. మాకు సదా తోడుగా ఉండి కాపాడు సాయితండ్రి".
సాయి నన్ను వంశీ నీ కలపు సాయి నా కాపురాన్ని నిలబెట్టే సాయి నిన్ను నమ్ముకుని ఎదురు చూస్తున్నాను సాయి చాలా కష్టంగా ఉంది సాయి ప్లీజ్ నాకు సహాయం చేయండి సాయి నేను కూడా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుంటాను సాయి అదృష్టాన్ని నాకు ప్రసాదించండి సాయి నా భర్త అంటే నాకు చాలా ఇష్టం సాయి ప్లీజ్ సాయి ప్లీజ్ కాపాడండి సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me