సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1415వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్ని సందర్భాల్లోనూ అండగా ఉంటున్న సాయిబాబా
2. ప్రతిసారీ కష్టం నుంచి బయటపడేస్తున్న బాబా

అన్ని సందర్భాల్లోనూ అండగా ఉంటున్న సాయిబాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సద్గురు శ్రీసాయినాథునికి నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నా వందనాలు. నేనొక సాయిభక్తురాలిని. మేము 1995లో ఒక స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణం చేశాము. అక్కడ ఒక చిన్న పాకలో శ్రీసాయిబాబా విగ్రహం ఉండేది. అప్పుడే శ్రీసాయి గురించి నాకు తెలిసింది. అంతవరకు నాకు బాబా గురించి ఏమీ తెలియదు. మా కొత్త ఇంటి గృహప్రవేశానికి మావారి ఫ్రెండు ఒకాయన బాబా ఫోటో మాకు కానుకగా ఇచ్చారు. అలా బాబా మా ఇంటికి వచ్చారు. నేను కూడా బాబా భక్తురాలినయ్యాను. ఆయన పిలిస్తే పలికే దైవంగా మాకు తోడు-నీడగా ఉంటున్నారు. 


2000వ సంవత్సరంలో మా ఇంటి దగ్గర్లో బాబా ఉంటున్న చిన్నపాక కూలిపోయింది. అప్పుడు ఇక్కడుండే అందరం కలిసి పెద్ద గుడి నిర్మించుకున్నాము. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వార్షికోత్సవం చాలా ఘనంగా జరిపిస్తాము. ఆ మూడు రోజులు మేము అక్కడే ఉండి పూజ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటాం. ఎప్పుడైనా తప్పనిసరై వార్షికోత్సవాలకు దూరంగా వేరే చోట ఉంటే మాకు ఇబ్బందులు వస్తాయి. అలా రెండుసార్లు జరిగింది. ఇక అప్పటినుంచి మేము సెంటిమెంట్‍గా భావించి ఆ మూడు రోజులు మేము ఎక్కడికీ వెళ్ళట్లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే బాబా గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తానని బాబాకి మ్రొక్కుకుంటే ఆ పని పూర్తవుతుంది. ఇకపోతే, ఈమధ్యనే నాకు ఈ బ్లాగు గురించి తెలిసి రోజూ సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. అప్పటినుంచి బాబా మీద నాకు ప్రగాఢమైన భక్తి ఏర్పడింది. ఈమధ్యనే మావారు ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నారు. ఇప్పుడు నేను ఇలా కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.


ఈమధ్య మా కోడలికి పాప పుట్టింది. తరువాత ఆ పాపకి హార్ట్‌లో సమస్య ఉందని మాకు తెలిసింది. డాక్టరు, "ఆపరేషన్ చేయాలి. నెలరోజులు హాస్పిటల్లో ఉండాలి" అని అన్నారు. అది విని మేమందరం డిప్రెషన్‍లోకి వెళ్లిపోయాము. కానీ మేము బాబా మీద భారమేసి పాపని బెంగళూరు తీసుకెళ్ళాము. బాబా దయవల్ల ఆపరేషన్ బాగా జరిగి వారం రోజుల్లో ఇంటికి వచ్చేశాము. అంతా ఆ సాయినాథుని దయ. "ధన్యవాదాలు బాబా. మా మనవరాలికి ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడు తండ్రీ.


ఈమధ్యనే మా కోడలు ఒక కంపెనీకి మారింది. అక్కడ ఆరు నెలలకే ప్రాజెక్ట్ పూర్తవడంతో వేరొక ప్రాజెక్టు చూసుకోమన్నారు. తను చాలా టెన్షన్ పడింది. ఒక్క ఇంటర్వ్యూలోనూ సెలెక్ట్ అవ్వక తను చాలా బాధపడింది. వారం తర్వాత తాను ఇంకొక ఇంటర్వ్యూ ఉందని నాతో చెప్పింది. నేను, "బాబా! తను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మర్నాడు ఉదయం మా కోడలు ఫోన్ చేసి 'ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాన'ని చెప్పింది. అంతా శ్రీసాయినాథుని దయ.


ఈమధ్య మా అమ్మాయికి, మనవడికి జ్వరాలు వచ్చి వారం రోజులైనా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "టెస్టులు చేయించుకోమ"ని చెప్పారు. నేను, "బాబా! మీ దయవలన రిపోర్టులు నార్మల్‍గా వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. జ్వరాలు కూడా తగ్గాయి. అంతా బాబా దయ. ఈవిధంగా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా 'బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్న వెంటనే సమస్యలు తీరుస్తున్నారు బాబా.


దీపావళి రోజున గారెలు వేస్తుంటే, చేతిమీద నూనె పడి నా చెయ్యి అంతా కాలిపోయింది. మా కోడలు ఆయింట్మెంట్ రాసింది. నాకు సాయిభక్తుల అనుభవాలు గుర్తొచ్చి నేను బాబా ఊదీని చేతిపై చల్లాను. బొబ్బలు వచ్చి ఇబ్బందిపడతానని మావాళ్ళు చాలా కంగారుపడ్డారు. కానీ బాబా దయవల్ల ఏమీ కాలేదు. ఇప్పుడు నా చేయి చూస్తే, కాలిన ఆనవాళ్లు కూడా లేవు. అప్పటినుంచి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా నేను ఊదీ రాయడం, నీటిలో కలుపుకుని త్రాగటం చేస్తున్నాను. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం మన తండ్రి సాయినాథుడు. ఆయన ఉండగా మనకి ఎలాంటి భయం లేదు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


ప్రతిసారీ కష్టం నుంచి బయటపడేస్తున్న బాబా


శ్రీసాయిబాబాకు నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు లత. నేను శ్రీసాయి భక్తురాలిని. చిన్న, పెద్ద ఏ సమస్య, కష్టం వచ్చినా నాకు శ్రీసాయిబాబానే దిక్కు. ఆయన ప్రతీసారి ఏదో ఒక రూపంలో ఆ సమస్యలకి పరిష్కారం చూపి నన్ను కష్టం నుంచి బయటపడేస్తున్నారు. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబుకి చాలా జ్వరమొచ్చి ఒళ్ళు కాలిపోతుంటే నాకెంతో భయమేసింది. టెంపరేచర్ ఎంతకీ తగ్గకపోవడంతో నేను బాబా ఊదీని బాబు తలపై రాసి, "బాబా! నీవే దిక్కు. ప్రస్తుతం వైరల్ ఫీవర్లు, డెంగ్యూలూ ఎక్కువైపోయాయి. దయచేసి బాబుకి అలాంటి ప్రమాదం రాకుండా కాపాడు తండ్రి" అని దణ్ణం పెట్టుకుని మరికొంత ఊదీని బాబు నోటిలో వేశాను. కొంచెంసేపటికి బాబు ఒళ్ళు చల్లగా అయింది. ఆరోజు రాత్రి కొద్దిగా జ్వరం వచ్చినప్పటికీ తెల్లవారేసరికి తగ్గిపోయి మళ్ళీ రాలేదు. బాబా దయవల్ల బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. "శతకోటి కృతజ్ఞతలు బాబా".


ఒకప్పుడు మా నాన్న తరచూ యూరిన్‍కి వెళుతూ ఉండేవారు. ముఖ్యంగా రాత్రి ప్రతి గంటకి ఒకసారి యూరిన్‍కి వెళ్ళవలసి వచ్చేది. ఆ కారణంగా ఆయనకి సరిగా నిద్ర ఉండేది కాదు. పగలు కూడా ఆయనకి నిద్రపట్టేది కాదు. డాక్టరుని సంప్రదిస్తే, ప్రొస్టేట్ గ్రంధి సమస్య అని మందులిచ్చారు. అయితే సమస్య రోజురోజుకీ ఎక్కువైందిగానీ తగ్గలేదు. అప్పుడు డాక్టరు బయాప్సీ చేయించమన్నారు. బయాప్సీ అనగానే మేము చాలా ఆందోళన చెంది, "బాబా! నీవే దిక్కు. రిపోర్ట్ నార్మల్‍గా వచ్చేలా చేయి తండ్రీ" అని అనుకున్నాము. అలాగే నేను మా నాన్నని రోజూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించమని లేదా ఉదయాన్నే వినమని చెప్పాను. ఆయన దేవుడి మీద ఎంతో నమ్మకం ఉంచారు. 15 రోజులు రిపోర్టు ఎలా వస్తుందోనని మేము చాలా టెన్షన్ పడ్డాము. చివరికి బాబా దయవల్ల ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేవని రిపోర్టు రావడంతో "మందులు వాడితే తగ్గిపోతుంది" అని డాక్టరు చెప్పారు. బాబా కృప లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే చాలా భయంగా ఉంది. "శతకోటి వందనాలు బాబా. ఎల్లవేళలా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ చల్లగా కాపాడండి బాబా. నా భర్తకున్న షుగర్‌ని కంట్రోల్లో ఉంచి వేరే ఏ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడండి. త్వరలో మమ్మల్ని శిరిడీకి రప్పించి మీ దర్శనభాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ఇంట్లో నాకు, పిల్లలకి ఎవరికి బాగలేకపోయినా మీ ఊదీయే మాకు ఔషధం. ఆ ఊదీ అయిపోవస్తోంది. ఏదో ఒక రూపంలో ఊదీ మాకు అందేలా చేయండి. అయినా మీకు తెలియనిది ఏముంది బాబా? నేను అనుకున్నట్లు నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకున్నాను. పొరపాటున ఏదైనా తప్పు జరిగినా, మరిచిపోయినా నన్ను క్షమించండి బాబా. మేము తెలిసో, తెలియకో చేసిన తప్పులను, పాపాలను మన్నించండి. ఈర్ష్య, అసూయలను తొలగించి మాకు మంచి బుద్ధిని ప్రసాదించండి. చివరిగా, ఎల్లప్పుడూ మీ దయ మా కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తూ మరొక్కసారి నా సాష్టాంగ ప్రణామాలు".


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo