ఈ భాగంలో అనుభవాలు:
1. పెద్ద కర్మను చాలా చిన్నదిగా చేసి తీసేసిన బాబా
2. బాబా ఆశీస్సులు
పెద్ద కర్మను చాలా చిన్నదిగా చేసి తీసేసిన బాబా
సాయి బిడ్డలకి మరియు బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు నిర్మలాదేవి. నా సొంత ఊరు గుడివాడ. నేను సాయిబాబా మరియు దత్తభగవానుల భక్తురాలిని. నేను గత కొన్ని సంవత్సరాలుగా శిరిడీలో నివాసముంటున్నాను. 2023, జనవరి 26న నేను శిరిడీ నుంచి గాణుగాపురం వెళ్లి, అక్కడ వారంరోజులుండి పారాయణ చేయాలనే సంకల్పంతో బయలుదేరి వెళ్ళాను. కానీ వెళ్ళిన మరుసటిరోజు నుంచి విపరీతమైన కడుపునొప్పి మరియు వీపునొప్పులతో నేను చాలా బాధపడ్డాను. ఆ నొప్పులు కేవలం నాకుండే గ్యాస్ట్రిక్ సమస్య వలన వచ్చాయని నా దగ్గరున్న గ్యాస్ట్రిక్ మందులు వాడాను. కానీ లాభం లేకపోయింది. నేను వెంటనే తిరుపతిలో వున్న హోమియోపతి వైద్యురాలైన నా కూతురికి ఫోను చేసి విషయం చెప్పాను. తను వెంటనే బయలుదేరి తిరుపతికి వచ్చేయమంది. నేను దత్తతండ్రికి క్షమాపణ చెప్పుకొని భరించరాని నొప్పితో ఎలాగో బాబా దయవల్ల తిరుపతి చేరుకున్నాను. వెంటనే గ్యాస్ట్రిక్ డాక్టరుని సంప్రదిస్తే టెస్టు చేసి, నాకు వచ్చింది గ్యాస్ట్రిక్ సమస్య కాదని, "గాల్‌బ్లాడర్‌లో సుమారు 60-70 రాళ్ళు వున్నాయి. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసినా ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్సెస్. ఆపరేషన్ కూడా ఇక్కడ సాధ్యపడదు" అన్నారు. దాంతో నేను చెన్నై వెళ్లి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు, "వెంటనే ఆపరేషన్ చేసి రాళ్లు తొలగించాలి. లేకపోతే చాలా ప్రమాదం. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్, అలాగే పచ్చకామెర్లు తీవ్రస్థాయిలో(5.5) ఉన్నాయి. కామెర్లు తగ్గేవరకు ఆపరేషన్ సాధ్యపడదు" అని అన్నారు. అటువంటి స్థితిలో నా తండ్రి సాయినాథుడు తప్ప నాకున్న కామెర్లను వెంటనే ఎవరు తగ్గించగలరు? అందుచేత నేను, "బాబా! అసలే ఆపరేషన్ అంటే భయం. దానికి తోడు ఈ పచ్చకామెర్లు. ఇప్పుడెలా బాబా?" అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆర్తిగా బాబాను ప్రార్థిస్తూ ఆ రాత్రి హాస్పిటల్ గదిలో గడిపాను. ఇంక నా తండ్రి లీలలు చూడాలి. మరునాడు ఉదయం కామెర్ల టెస్టుకి వెళితే, ముందురోజు కన్నా కామెర్ల తీవ్రత తగ్గింది. అంతేకాదు, మరుసటిరోజుకి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ మరో సమస్య వచ్చిపడింది. అదేమిటంటే, గాల్‌బ్లాడర్‌లో ఉన్న సుమారు 60-70 రాళ్ళను ఆపరేషన్ చేసి బ్లాడర్ తీసేయాల్సి ఉన్నప్పటికీ "స్టోన్ ప్రేగు నాళాల్లోకి వెళ్లినట్లు ఉంది. దానివల్లే యూరిన్ ఇన్ఫెక్షన్, పచ్చకామెర్లు వచ్చి ఉంటాయి. స్టోన్ ప్రేగు నాళాల్లోకి వెళ్ళిందీ లేనిదీ తెలియాలంటే MRI స్కాన్ చేయాలి. ఒకవేళ వెళ్లినట్లైతే ముందు స్టెంట్ వేసి, తరువాత 10 రోజులకి టెస్టు చేసి ఆపరేషన్ ద్వారా గాల్‌బ్లాడర్ తొలగించాలి. 7, 8 వారాల తరువాత స్టెంట్ తీసేయాలి" అని డాక్టర్ చెప్పారు. ఇంక నేను భయంతో, "బాబా! మీకు నా మీద ఎందుకు దయలేదు? ఎప్పుడూ మీ దర్శనం చేసుకుంటూ, మీ భజనలనే పాడుకుంటూ, మీ నామస్మరణే చేసుకునే నాకు ఈ కష్టం ఏమిటి? స్టెంట్ అంటున్నారు. కొన్ని వారాల తర్వాత వచ్చి తీయించుకోవాలంటున్నారు. ఇంకా ఏదేదో చెప్తున్నారు. నాకు భయమేస్తోంది బాబా" అని ఆర్తిగా బాబాను వేడుకొని రాత్రంతా చాలా దుఃఖంతో గడిపాను. మరునాడు MRI స్కాన్ తీశాక నేను బాబా మెుదటి అద్భుతం చవిచూశాను. అదేమిటంటే, స్టెంట్ వేయకుండానే స్టోన్ ప్రేగునాళాల్లో నుండి జారి కిందకి వచ్చేసింది. అది డాక్టరుకే ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు డాక్టర్, "స్టెంట్ అవసరం లేదు. ఆపరేషన్ చేసి గాల్‌బ్లాడర్ తొలగిస్తే చాలు" అని చెప్పారు. కానీ ఇంజక్షన్ అంటేనే హడలిపోయే నాకు ఆపరేషన్ చేయించుకునే ధైర్యం ఎక్కడిది? అలాంటిది మరునాడు ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళాక నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగిందో కూడా తెలియలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నన్ను నిద్రలేపుతూ నా ప్రక్కనే నా చెల్లెలు కనిపించింది. అప్పుడు నాకనిపించింది, 'డాక్టరు రూపంలో నా సాయితండ్రే నాకు ఏమీ తెలియకుండా ఆపరేషన్ చేశార'ని. స్టెంట్ ఖర్చు లేకుండా, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పని లేకుండా, మేము ఊహించిన దానికంటే తక్కువ బిల్ కట్టేలా అనుగ్రహించి పెద్ద కర్మను చాలా చిన్నదిగా చేసి తీసేశారు బాబా. డాక్టర్లు సైతం 'పెద్ద మిరాకిల్' అన్నారు. ఈరోజు ఈ లీలను మీతో ఇలా పంచుకున్నానంటే ఇది కేవలం నా తండ్రి సాయి దయే. "ధన్యవాదాలు బాబా".
బాబా ఆశీస్సులు
నా పేరు లలిత. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా తోటికోడలికి ఇద్దరు ఆడపిల్లలు, మా అక్కావాళ్ళకి ఇద్దరు పాపలు, మా అన్నయ్యకి కూడా ఇద్దరు పాపలు. ఇలా ఎటు చూసినా మా కుటుంబంలో ఆడపిల్లలే. నాకు కూడా తొలికాన్పులో ఆడపిల్లే పుట్టింది. మా అత్తయ్య, 'రెండోసారి కూడా నాకు పాపే పుడుతుందేమోన'ని భయపడ్డారు. ఒకసారి నేను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, "బాబా! నాకు ఈసారి బాబు పుడితే నేను మీ దర్శనానికి శిరిడీ వస్తాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా ఆశీస్సులతో రెండేళ్ల తరువాత నాకు బాబు పుట్టాడు. బాబా దర్శనానికి శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటే సరిగా బయలుదేరే సమయానికి నా నెలసరి సమయం అయింది. అప్పుడు నేను, "నాకు ఏ ఆటంకం లేకుండా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు ఏ ఆటంకం లేకుండా బాబా దర్శనం చాలా బాగా జరిగింది. బాబా దయ, ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sai sri sai jaya jaya sai.
ReplyDeleteAkilandakoti bramandanayaka rajadiraja yogiraja parabrahma sri sachitananda sadguru sanath maharaj ki jai
ఓం సాయిరామ్
ReplyDelete