సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 462వ భాగం....



ఈ భాగంలో అనుభవం:
  • బాబా దయ అపారమైనది

ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ బ్లాగును విజయవంతంగా నిర్వహిస్తున్న వారందరికీ సాయిబాబా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజూ పొద్దున్నే ఈ బ్లాగులో ప్రచురిస్తున్న భక్తుల అనుభవాలు చదువుతాను. దానివలన మనసుకి శాంతి లభిస్తుందినిజం చెప్పాలంటే ఈ అనుభవాలను చదువుతున్నప్పుడు నాకు నిత్యపారాయణ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా "సాయి అనుగ్రహసుమాలు" చాలా బాగుంటాయి. ఆ లీలలు నాకు ఇప్పటిదాకా తెలియవు. అందుకే ఈ బ్లాగ్ నిర్వాహకులకు సగర్వంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరోసారి నా అనుభవాలను పంచుకుంటున్నాను.

నేను 2003-2011లో ఢిల్లీలో పనిచేస్తుండేవాడిని. బాబా దయవలన ఇంచుమించుగా 2003 నుంచి ప్రతి సంవత్సరం నాకు శిరిడీ వెళ్లే అదృష్టం కలుగుతూ ఉంది. బాబా పిలుపు వస్తుంది, వెళ్తున్నాను. 2005లో అనుకుంటాను, ఒకసారి ఆఫీస్ పనిమీద నేను ముంబై వెళ్ళవలసి వచ్చింది. ముంబై నుంచి శిరిడీ దగ్గరే కాబట్టి, ఆఫీస్ పని పూర్తయిన తర్వాత శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, ఢిల్లీ తిరిగి వచ్చేద్దామనుకున్నాను. ముంబైలో ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని సాయంత్రం నాలుగు గంటలకు శిరిడీ బస్సు ఎక్కాను. రాత్రి పదకొండు గంటలకి శిరిడీ చేరుకుని, హోటలుకు వెళ్లి పడుకున్నాను. ఉదయమే లేచి మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా దర్శనంతో ఎంతో తృప్తిని, సంతోషాన్ని పొంది బయటకు వచ్చాను. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకి ముంబై నుండి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అందుకోవాల్సి ఉంది. అయితే ట్రైన్ టికెట్ ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉంది.

నేను ముంబై వెళ్లటానికి శిరిడీ నుండి ఉదయం 11 గంటలకి బయలుదేరే బస్సుకి టికెట్ కొనుక్కుని, బస్సు దగ్గరికి వెళ్ళాను. బస్సులో క్లీనర్ తప్ప ఎవరూ లేరు. అతను, “ఈ బస్సు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు ముంబై చేరుతుంది. అంతేకాదు, శిరిడీ నుంచి ముంబై వెళ్ళే అన్ని బస్సులూ మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే బయలుదేరుతాయి. మీకు టికెట్ అమ్మిన వాడు అబద్ధం చెప్పాడు” అని అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏమి చేయాలో తెలియలేదు. “సాయంత్రం ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అందుకోవాలి. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే ముంబైలో ఎక్కడ ఉండాలి? మళ్ళీ తర్వాత రోజున ఇంకో ట్రైన్ దొరుకుతుందని గ్యారెంటీ ఏముంది?” ఇలా పరిపరివిధాల ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఆ సమయంలో బాబాను తలచుకోవాలన్న ఆలోచన నాకు తట్టలేదు. కానీ ఎల్లవేళలా మనల్ని కనిపెట్టుకొని ఉండే బాబా ఊరుకుంటారా? హఠాత్తుగా ఎవరో, “నాసిక్ కు వెళ్ళండి, అక్కడ నుంచి ముంబైకి ట్రైన్ దొరకవచ్చు” అని సలహా ఇచ్చారు. దాంతో శిరిడీ నుండి ముంబైకి బుక్ చేసుకున్న బస్సు టికెట్ క్యాన్సిల్ చేసుకుని, వేరే బస్సు ఎక్కాను. నాసిక్‌లో దిగి రైల్వేస్టేషనుకి వెళ్లి విచారిస్తే ఆ సమయానికి ముంబై వెళ్లే ట్రైన్లు ఏమీ లేవని తెలిసింది. ఒకవైపు సమయం గడిచిపోతోంది, ముంబై చేరే మార్గం కనపడటం లేదు. నాకు ఆందోళన ఎక్కువ అయింది. మరలా రైల్వేస్టేషన్లోనే అడిగాను, “ముంబై అర్జెంటుగా వెళ్లాలి, ఎలా?” అని. అప్పుడు వాళ్ళు, “ఒక సెంటర్ ఉంది. అక్కడకు వెళ్ళండి. అక్కడినుంచి మీకు ట్యాక్సీలు  దొరుకుతాయి” అని చెప్పారు. వెంటనే ఆ సెంటరుకు ఆటోలో వెళ్లాను. అక్కడ మధ్యలో ఎక్కడా ఆపకుండా నేరుగా ముంబై వెళ్ళే ట్యాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క ట్యాక్సీలో ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. మనిషికి ఏడు వందల రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. అయితే అక్కడ నేను తప్ప ముంబై వెళ్లేవారు ఎవరూ లేరు. నేను ఒక్కడినే ట్యాక్సీలో వెళ్లాలంటే 2100 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర 1500 నుండి 1700 మాత్రమే ఉన్నాయి. దాంతో ఇంకా ఎవరైనా ముంబై వస్తారేమో అని ఎదురుచూస్తున్నాను. సమయం గడిచిపోతోంది. అప్పుడు సాయిబాబా గుర్తుకువచ్చారు. అప్పటిదాకా నేను బాబాని స్మరించకపోయినా ఆయనే నన్ను ప్రేరేపిస్తూ, మార్గాన్ని చూపుతూ నాసిక్ వరకు చేర్చారని అర్థం అయ్యింది. వెంటనే నేను, “బాబా! నా దగ్గర 2100 రూపాయలు లేవు. నా దగ్గరున్న డబ్బులతో నేను ఒక్కడినే ముంబైకి వెళ్ళలేను. ఇంకో ఇద్దరు వస్తే నేను 700 రూపాయలతో ముంబై చేరుకోగలను. కాబట్టి కనీసం ఇంకొకరినైనా నాతోపాటు ముంబై వచ్చేవారిని పంపించు, నేను 1400 పెట్టుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా తమ లీలను చూపారు. సరిగ్గా బాబాను ప్రార్థించిన ఐదు నిమిషాలలో ఒక ఆటో వచ్చింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. వారు కూడా ముంబైకి వెళ్ళాలి. ముగ్గురం కలిసి ట్యాక్సీ ఎక్కాము. బాబా దయవలన 700 రూపాయలతోనే ట్యాక్సీలో వెళ్ళగలిగేలా ఏర్పాటు చేసారు. బాబా దయ అపారమైనది. ఒకరిని పంపమని అడిగితే ఇద్దర్ని పంపారు. ట్యాక్సీ ఎక్కిన తర్వాత తెలిసింది, వాళ్లు కూడా ఢిల్లీ వెళ్లే ట్రైను అందుకోవాలి అని. అందరం రైల్వేస్టేషనుకు వెళ్ళాలి. కానీ డ్రైవర్, “మిమ్మల్ని రైల్వేస్టేషన్ దగ్గర దింపటానికి కుదరదు. ముందు అనుకున్న ప్రకారం ముంబైలోని మా ఆఫీస్ దగ్గర దింపుతాను” అన్నాడు. అలా జరిగితే మళ్ళీ ఆలస్యమై ట్రైన్ మిస్ అవుతాము. అందుకని మేమందరం డ్రైవరుని బ్రతిమాలుకుని, మమ్మల్ని రైల్వేస్టేషన్లో దింపమని, దానికి అదనంగా డబ్బులు ఇస్తామని కూడా చెప్పాము. అతను ఒప్పుకున్నాడు. బాబా దయవలన 4:30 కి స్టేషనుకు చేరుకున్నాము

మరో ముఖ్య విషయం, బాబా కృపతో ప్రయాణం మొదలవగానే ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సాయిబాబా అడుగడుగునా మనవెంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆయన మన నుంచి పెద్దగా ఏమీ కోరరు. మన ప్రవర్తన బాగుండాలి, ధర్మంగా బ్రతకాలి, వీలైనంతగా ఇతరులకు సహాయపడాలి. అహంకారాన్ని వదిలి, సత్వగుణం కలిగి ఉండాలి. సాయిబాబాకు జయము జయము!

రెండవ అనుభవం:

మా అమ్మాయి బీ-టెక్ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో అమెజాన్‌లో అప్రెంటిస్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటికింకా తన ఎగ్జామ్స్ పూర్తికాలేదు. కానీ మంచి కంపెనీ కదా అని తను ఆ కంపెనీలో జాయినయింది. మధ్యలో వచ్చి ఎగ్జామ్స్ వ్రాసి వెళ్ళింది. తరువాత బీ-టెక్ రిజల్ట్ రావడం, తను పాసవడం జరిగింది. బాగా వర్క్ చేస్తేనే కంపెనీవాళ్ళు పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు, కానీ అందరికీ ఇవ్వరు. మా అమ్మాయి బాగా వర్క్ చేసినప్పటికీ కంపెనీవాళ్లు తనకి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు మా అమ్మాయి వేరే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించింది. ఒక ఉద్యోగానికి ఎంపికైంది కూడా. కానీ జీతం తక్కువ. అప్పుడు మా అమ్మాయి, “ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీవాళ్ళు పర్మినెంట్ చేస్తారని గ్యారెంటీ లేదు. అందువల్ల ఆ కంపెనీ వదిలేసి వేరే కంపెనీలో జాయిన్ అవనా?” అని నన్నడిగింది. నేను సాయిబాబానే నమ్ముకుని, “వద్దు, నువ్వు ఇదే కంపెనీలో ఉండు. బాబా మనకి సహాయం చేస్తారు” అన్నాను. దాంతో మా అమ్మాయి తను పనిచేస్తున్న కంపెనీలోనే ఉండిపోయింది.

మా అమ్మాయి ఉద్యోగం అమెజాన్ కంపెనీలోనే పర్మినెంట్ అవ్వాలని బాబాకి మ్రొక్కుకొని, బాబా చరిత్ర సప్తాహపారాయణ చేశాను. బాబా ఆశీర్వాదంతో ఒక నెలరోజుల్లో అదే కంపెనీలో మా అమ్మాయికి పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చారు. జీతం కూడా ఎక్కువే ఇస్తున్నారు. ఈ విధంగా సాయిబాబా మా అమ్మాయికి చదువు పూర్తికాగానే ఉద్యోగం ఇప్పించి ఎంతో ఉపకారం చేశారు. ప్రస్తుతం మా అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. గత నెలలో తనకు ప్రమోషన్ కూడా వచ్చింది. అది కూడా సాయిబాబా అనుగ్రహం వలనే. సాయిబాబాకు జయము జయము.

మూడవ అనుభవం:

2016లో నేను బదిలీపై వైజాగ్ వచ్చాను. అక్కడ ఈస్ట్ పాయింట్ కాలనీలో అద్దెకు ఫ్లాట్ చూడటం మొదలుపెట్టాను. ఒక ఫ్లాట్‌లో తలుపు తీయగానే ఎదురుగా పెద్ద సాయిబాబా ఫోటో కనిపించింది. అంతకుముందు ఎవరైతే అద్దెకున్నారో వారు ఆ ఫోటోని అక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్లున్నారు. బాబాను చూడగానే చాలా సంతోషమేసింది. ‘మాకన్నా ముందుగానే బాబా వచ్చేశారు’ అనే అనుభూతి కలిగింది. కానీ ఫ్లాట్ ఓనర్ అద్దె కొంచెం ఎక్కువ చెప్పారు. అందువలన ఆ ఫ్లాట్ వదిలి వేరేవి చూడడానికి వెళ్లాను. ఇంకో మూడు ఫ్లాట్లు చూశాను. కానీ మనసంతా ముందు చూసిన బాబా పటం ఉన్న ఫ్లాట్ మీదనే ఉండిపోయింది. అందువలన వెనక్కి వచ్చి అదే ఫ్లాట్ ఓనరుతో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి ఫైనల్ చేశాను. తరువాత మేము ఆ ఇంటిలో నివసించటం ప్రారంభించాము. ఇల్లు చాలా బాగుంది. చాలా మంచి సెంటర్. బీచ్‌కి  బాగా దగ్గర. గాలి, వెలుతురు పుష్కలంగా వస్తున్నాయి. ఇంటికి దగ్గరలోనే పెద్ద బాబా గుడి ఉంది.

ఆ ఇంట్లో దాదాపు పది నెలలు ఉన్న తర్వాత ఇల్లు బాగా నచ్చి, ఆ ఇల్లు అమ్మితే కొనేసుకుందామని ఆశ(దురాశ) పుట్టింది. కానీ ఇంటి యజమానిని మాకు ఇల్లు అమ్మమని అడిగితే, 'కుసంస్కారం అనుకుంటార'ని అడగలేదు. తరువాత సొంత ఇల్లు కొనుక్కుందామని అదే ఏరియాలో అపార్టుమెంట్లు చూడడం మొదలుపెట్టాము. ప్రతి ఆదివారం పేపర్లో ప్రకటనలు చూచి వెళ్లి ఫ్లాట్ చూసి వచ్చేవాళ్ళం. కానీ ఏవీ నచ్చేవి కాదు. ఈ విధంగా రెండు నెలలు గడిచాయి. ఇంతలో అనుకోకుండా మా ఇంటి యజమాని నా భార్యకు ఫోన్ చేసి, “మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని అమ్మేద్దామని అనుకుంటున్నాము, మీరు కొనుక్కుంటారా?” అని అడిగారు. నాకు, నా భార్యకు నోట మాట రాలేదు. ఎందుకంటే మేమెప్పుడూ ఆయనను ఇల్లు అమ్ముతారా అని అడగలేదు. అలాంటిది ఆయనంతట ఆయనే అడిగారు. ఆ ఇల్లు మాకు చాలా నచ్చింది కాబట్టి వెంటనే కొనేసుకున్నాము. ఆ విధంగా ఆ ఇంటికి అద్దెకు వచ్చిన మేము అదే ఇంటికి యజమానులమయ్యాము. ఇదంతా కేవలం సాయిబాబా కృప మాత్రమే. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మనం భక్తితో నమ్మకంతో ఉండాలి. అంతటి మంచి ఇల్లు మా సొంతమవుతుందని కలలో కూడా అనుకోలేదు. అంతా సాయి ఆశీర్వాదమే. సాయినాథుని పాదపద్మాలకు శతకోటి నమస్సుమాంజలులు. 

ప్రస్తుతం నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కొని ఉన్నాను. సాయిబాబా సహాయం చేస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను. ఆయన మాత్రమే నన్ను ఈ సమస్య నుండి కాపాడగలరు. ఇది నా ఉద్యోగానికి సంబంధించినది. చాలా ఆందోళనతో రోజులు గడుపుతున్నాను. ఈ సమస్య తీరిపోతే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను. సాయిబాబా మనందరినీ రక్షించుగాక!

సర్వేజనాః సుఖినోభవంతు.
జయ జయ సాయి - సద్గురు సాయి.


8 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
    ఓం సాయిరాం!
    మీ అనుభవాలు చాలా అమూల్యమైనవి. సాయినాథుని కృప ఎల్లవేళలా ఉండాలని ప్రార్థన.
    సరేజనా సుఖినోభవంతు.సర్వే సుజనా సుఖినోభవంతు.
    🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  5. సాయి! నిరంతరం ఎల్లవేళలా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న నందుకు ఏ విధంగా మీ రుణం తీర్చుకోగలను తండ్రి. నువ్వు లేని ఈ లోకం మాకు శూన్యం సమానం.

    ReplyDelete
  6. Baba please take care of my pinky and bruno

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo