సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి ఊసే సాయి ధ్యాసే - లేదు లేదిక వేరె బాట



శ్రీసాయిబాబా డెబ్భైఅయిదవ మహాసమాధి పూజోత్సవాలు 1993 విజయదశమి పర్వదినాన శిరిడీలోని సాయిపథం ప్రాంగణంలో వైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ సత్సంగమిది. వేదికపై వారు చేసిన ఈ చివరి ఉపన్యాసాన్ని అక్షరరూపంగా సాయిపథం పాఠకులకు అందిస్తున్నాము. ఆ వాక్సుధాధారలతో మన మనసులు పునీతమవగా సాయి ధ్యాననిమగ్నులమవుదాం.

ఈరోజున బాబా 75వ మహాసమాధి ఉత్సవాల సందర్భంగా మనమందరము ఇక్కడ కలుసుకుని బాబా స్ఫురణలో ఉండటం శ్రీసాయి అనుగ్రహవిశేషంగా భావిస్తున్నాను. మనందరం సాయిపథంలో నడుస్తున్నాము, లేదా నడవాలని ఆశపడుతున్నాము. ‘బాబాపై భక్తిని ఇంకా ఎలా పెంపొందించుకోవాలి?’ అనే తపన మనందరిలోనూ ఉన్నది. ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనుకుంటాము. కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. “మనకు నిజంగా ఏమి కావాలి? ఎందుకోసం ఇంతదూరం వచ్చాము? వీటివల్ల మనం అనుకున్నవి ఏమైనా నెరవేరుతున్నాయా? అసలు బాబా ఎవరు? మనము ఆయనకు పూజచేస్తే, ఆయన స్మరణచేస్తే, మనం అనుకుంటున్న లక్ష్యం - అది లౌకికమైన కోరిక కావచ్చు, ఆధ్యాత్మికమైన లక్ష్యం కావచ్చు, ఏదైనాసరే అది నేరవేరుతున్నదా? అవి తీరుతుంటే ఎలా తీరుతున్నాయి? బాబా మన కోరికలు ఎందుకు తీర్చాలి?” - ఈ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇదిగో ఫలానా కోరిక ఉన్నది, మనం బాబాకు మ్రొక్కుకున్నట్లయితే, సాయిబాబా స్మరణ చేసినట్లయితే లేదా సాయిబాబాకు పూజ చేసినట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది అనుకుంటున్నాము, అంతే.

కానీ ఆ కోరికలు తీర్చటానికి వెనుకనున్న అసలైన సాయితత్త్వం గురించి సరైన అవగాహన లేకపోయినట్లయితే మనం ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి, ఇంతదూరం వచ్చి ఇలా కూర్చొని ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అసలు మనకు ఏం కావాలి? ఈ కోరిక యొక్క తత్త్వం ఏమిటి? ఈ ప్రశ్నలు ముందు మనకు రావాలి. వీటికి వేటికీ మన దగ్గర సమాధానం లేదు. మన జీవితం అనేటువంటిది ఒక డిగ్రీ కోర్సులా ఉన్నదనుకుంటే, ఎందుకు చదువుతున్నామో, ఏం చదువుతున్నామో అర్థంకాకుండా కాలేజీ అనే ఈ ప్రపంచంలో హాజరవుతున్నాము. పరీక్షకు కూర్చుంటున్నాము. పరీక్ష పేపరు వచ్చింది. మనం ఎందుకు పుట్టాం? మన జీవితలక్ష్యం ఏమిటి? దాని తత్త్వమేమిటి? మొదలయిన ప్రశ్నలకు మనవద్ద సమాధానాలు లేవు. దేనికీ సమాధానం తెలియని ప్రశ్నాపత్రం చూచిన విద్యార్ధి పరీక్ష హాలులో ఎటువంటి మనఃస్థితికి లోనవుతాడో అటువంటి మనఃస్థితికే మనం లోనవుతున్నాము. ఏకాంతంలో కూర్చుని ఒక్కసారి ఆలోచించి చూడండి. “అసలు నేనేంటి? ఈ అనంతకోటి జీవరాశులలో నేనెంతటివాడ్ని? నా పుట్టుకకు ఏమైనా ప్రయోజనం లేదా అర్థం స్ఫురిస్తున్నదా? ఉంటే అది ఏమిటి? దేనికోసం నేను పాటుబడుతున్నాను?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఒకరకమైన నిరాశ, నిస్పృహ వస్తుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఇంకా మరణించలేదు గనుక, మరణించేదాకా జీవించాలి గనుక. ఇంతకుమించి ఎవరైనా సమాధానం చెప్పగలరా? కాబట్టి, తెలియకుండా మన జీవితగమ్యం మరణమవుతోంది. దానినే బాబా “పిడకలు ఏరుకోవడం” అన్నారు. “ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరుకోడానికా? సద్గురువును తెలుసుకో!” అన్నారు. సద్గురువును తెలుసుకోకపోతే ఈ జీవితమంతా పిడకల వేట అన్నారు. పిడకలు ఏరుకోవడం అంటే మన చితిని మనమే సిద్ధంచేసుకోవడం. 

మనకు తెలియకుండా మనందరిలో ఉండే నిస్పృహకు, మన జీవితం యొక్క లక్ష్యం, అర్థం తెలియకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, జీవితం యొక్క తత్త్వం ఏమిటో అవగాహన లేకపోవడమే. కోరిక యొక్క తత్త్వం, ఈ కోరికలు మనం ఎట్లా తీర్చుకోవాలి అనేటువంటి విధానం తెలియకపోవడం. ఒకవేళ కోరిక నెరవేరినా ఇది నిజంగా తీరడంకాదేమో అని అన్పించడం. ఆధ్యాత్మికవేత్తలు దీనికి సమాధానంగానే రకరకాల మార్గాలు చెప్పారు. ఉదాహరణకు డిగ్రీ సంపాదించాలనే కోరిక ఉంది. మొదట్లో అదే జీవితలక్ష్యంగా మనకు అనిపిస్తుంది. డిగ్రీ రాగానే ఉద్యోగం కావాలనిపిస్తుంది. మరల ఉద్యోగం వస్తే, ప్రమోషను రావాలనుంటుంది. సమస్యలు సృష్టించుకోవడం, సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడం. వీటితోనే గడిపేస్తుంటాము. కాబట్టి ఈ ఇంద్రియసుఖాలలో తాత్కాలికమైన సుఖం తప్ప మరి ఎటువంటి ప్రయోజనం లేదు. దీనికి అతీతమైన, శాశ్వతమైన సుఖం ఉన్నది, ఆనందం ఉన్నది. దానికోసం ప్రాకులాడాలంటే, ఈ ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి, ప్రాపంచికమైనటువంటి విషయాల్ని వదలిపెట్టు అని చెప్పారు. కానీ మనకు అది ఎంతవరకు సాధ్యం?

ఇది వినడానికి బాగుండి, చూసేదానికి ఇంతకంటే వేరే మార్గం లేదని కూడా అనిపిస్తుంది. సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎదుటివారికి అది అర్థరహితం అనిపించవచ్చు. కానీ ఎవరి సమస్య వారికి చాలా కఠినమైనది, జటిలమైనది. ఎదుటివాడు చెప్పేటప్పుడు “అదేం సమస్య? దానిగురించి ఎందుకు తాపత్రయపడతావు? అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే, వీటిగురించి తాపత్రయపడకు, శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చెయ్యి, ముక్తికోసం ప్రయత్నం చెయ్యి” అని చెప్పడం తేలిక. కానీ చిన్న చిన్న విషయాలే మనల్ని తొలిచివేస్తాయి. వీటిని వదులుకోలేము. ప్రపంచంపట్ల మనకుండే ఇష్టాన్ని వదులుకోలేము, కనుక ఆధ్యాత్మికత వైపు మొగ్గడం అనేది మనకు అంత తేలికయిన పని కాదు. కాబట్టి ఒక సిద్ధాంతరీత్యా మాత్రం దాన్ని అంగీకరిస్తాము. 

“ఎందుకయ్యా శిరిడీ వస్తున్నారు? ఎందుకు సత్సంగానికి వస్తున్నారు?” అని అడిగితే, “బాబా కృప కోసమండీ! ముక్తి కోసమండీ! ఆత్మసాక్షాత్కారం కోసమండీ!” అంటారు. ఇలా వారు చదువుకున్న వేదాంత గ్రంథాలలో వాళ్ళకు వచ్చినటువంటి పదాలు చెబుతారు. కానీ నిజంగా ముక్తి, మోక్షం అంటే ఏమిటో మనకు తెలుసా? అవి నిజంగా అవసరమా? ఆత్మ అంటూ ఒకటుంది, అది మనకు సాక్షాత్కారించాలా! ఎప్పుడూ చూడని, కనీవినీ ఎరుగనిదాన్ని, తత్త్వం ఏమాత్రం అంతుపట్టని ఒక స్థితిని గురించి మనం ప్రాకులాడటం, తాపత్రయపడటం ఎంతవరకు సాధ్యమవుతుంది? గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి, ఎంతమందికి ఇవి నిజంగా అవసరమో! ఊరకే నోటిమాటగా చెపుతున్నాం. చెప్పేటప్పుడు ఏదో ఉన్నతమైన గమ్యము చెప్పాలి కనుక ముక్తీ, మోక్షము అని చెబుతాము. బాబా కృప అని చెబుతాము. రోజంతా మనం ప్రాపంచికమైన, లౌకికమైన విషయాల గురించి, సమస్యల గురించి ఆలోచిస్తాము. కానీ అవి చెప్పుకోవటానికి మనకు సంకోచం. ఈ సంకోచం ఎందువల్ల వచ్చింది? తరతరాలుగా మనకు ఇవన్నీ తుచ్ఛమైనటువంటివి అని ఒక రకమైన brainwash జరిగి వున్నది. ఈ ప్రాపంచిక కోరికల గురించి అడగటం గానీ, మాట్లాడటం గానీ, అసలు అవి ఉన్నాయని చెప్పుకోవటం గానీ తప్పు అని. ఇలా ఈ శుష్కవేదాంతం మన స్థితి ఇది అని చెప్పుకునేటువంటి ధైర్యం కూడా మనకు లేకుండా చేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నాం, ముక్తి - మోక్షం అని చెబుతున్నాము. ఎప్పుడో ఏదో వస్తుందని అంటున్నాము. దాన్ని ఒక ప్రక్కన పెట్టుకొని మన వ్యవహారం మనం చేసుకుంటూ పోతున్నాము. కనుక మన జీవితంలో ఈ ఆధ్యాత్మికత అనేది ఒక భాగం కాకుండా పోతోంది. తెలియకుండా ప్రతి మనిషికి ఆధ్యాత్మికత అంటే భయం ఏర్పడుతోంది.

వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడు, కాలేజీ చదువులు చదువుకుంటున్న పిల్లవాడు ఒక రెండు సత్సంగాలకు వెళ్లినట్లయితే, వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు? “ఇప్పుడే ఎందుకురా ఇవన్నీ? ఇంకా time ఉందిలే నీకు, ఇప్పుడే పోకు” అంటారు.  సినిమాలకు పోయినా, పేకాటాడినా, చిల్లర తిరుగుళ్ళు తిరిగినా పెద్దగా పట్టించుకోరు, పెద్దగా భయపడరు. కానీ వాడు సత్సంగానికి గానీ భజనకు గానీ పోతే, కొంపమునిగినట్లుగా బాధపడతారు. ఎందుకని? వాడు జీవితానికి పనికిరాకుండా పోతాడేమోనని భయం. 

ఆధ్యాత్మికత అంటే అది మనల్ని జీవితానికి పనికిరాకుండా చేసేటువంటిది అన్న అభిప్రాయం మనకు ఉన్నట్లే కదా! ఎప్పుడయ్యా మరి ఈ ఆధ్యాత్మికత అంటే! మనము ప్రాపంచికమైన సుఖాలన్నీ అనుభవించి, మన బాధ్యతలన్నీ తీర్చుకొని, బాగా ముసలివాళ్ళము అయి, ఇంద్రియాలు సరిగా పని చెయ్యనప్పుడు - అప్పుడు ఆధ్యాత్మికత అంటాము. వీడు చూద్దామన్నా వీడి ముఖం చూడ్డానికి ఎవరూ ఉండరు. అప్పుడిక వీడు జయించేదేమిటి? జయించేందుకు ఏముంటుందని? చిట్టచివరలో బాబా ముఖం, ఆధ్యాత్మికత ముఖం చూడాలని మనం చెబుతున్నాము. అంటే అన్నీ అయిపోయిన తరువాత చివరకు ఆయన. కాబట్టి మన మనస్సులో మనకు తెలియకుండా ఆధ్యాత్మికత అంటే ఎలాంటి అభిప్రాయం ఉన్నదో ఆలోచించుకోండి. ఒకరకమైన భయం ఉంది. ఆ భయాన్ని ఆధారంగా చేసుకొని, దానితో మంచిగా ఉంటూ, నీవు నా జోలికి రావద్దు అని చెబుతూ maintain చేసుకుంటూ పోతాము. ఎంతవరకు ఉండాలో, అంతవరకే ఉండాలి అని కొంచెం లౌక్యం జోడిస్తాము. ఇదే మనకు, ధర్మానికి, ఆధ్యాత్మికతకు పట్టిన గ్లాని, జబ్బు. ఇట్లా ధర్మానికి గ్లాని, జబ్బు పట్టినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పారు మహనీయులు. ఇప్పుడు పట్టినటువంటి గ్లాని ఏమిటి? అని అంటే ఇదే. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచికానికి అతీతమైనటువంటిది, భిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. ప్రపంచంలో ఉన్నంతవరకూ మనకు ఆధ్యాత్మికత వంటపట్టదు. ఆధ్యాత్మికత వంటబట్టిందా, ఇక వాడు ప్రపంచానికి పనికిరాడు. ఇదో, అదో తేల్చుకోవాలి, అనే ఒక ఆలోచన మన నరనరాలలో, రక్తంలో జీర్ణించుకుపోయింది. చెప్పేవాడికి, వినేవాడికి, అర్థం కాని రీతిలో వల్లించబడుతున్న మెట్టవేదాంతం వల్ల ఏర్పడిన జబ్బు ఇది. మాట్లాడితే ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మం, ముక్తి, మోక్షం, మనస్సును అంతర్ముఖం చెయ్యడం, అమనస్కం చెయ్యడం.. ఇట్లాంటి పదాలు ఎంత మాట్లాడితే అంత మనం ఆధ్యాత్మికతలో ‘మునిగిపోయినట్లు’ లెక్క. ఇది ఆధ్యాత్మికతకు పట్టిన గ్లాని. ఈ గ్లానిని తొలగించడానికే బాబా వచ్చారు.

మన దు:ఖానికి కారణం ఏమిటి? మనలో రకరకాల కోరికలున్నాయి. ఈ కోరికలు తీరాలి. ఈ కోరికలు నెరవేరితే మనకు ఆనందం. ఆ ఆనందం శాశ్వతమో, అశాశ్వతమో మనకు అనవసరం. అది అశాశ్వతమైనా మనకు అదే కావాలి. ఎప్పుడో శాశ్వతమైన సుఖం వస్తుందని, ఈరోజు అందివచ్చిన సుఖాన్ని, అది అశాశ్వతమైనదైనా సరే దులుకోము ఎవరైనా! అయినా అదేదో తెలియదు, వస్తుందని గ్యారంటీ లేదు. ఎవరినైనా అడిగితే ఇవ్వలేమంటున్నారు. లేదా, అన్నీ వదలిపెట్టుకొని వస్తే ఇస్తామంటున్నారు. దీనిగురించి భగవాన్ రమణమహర్షి చాలా చక్కగా చెప్పారు. 

ఒకసారి ఆయన దగ్గరకు వేదాంతాన్ని బాగా తలకెక్కించుకొన్న ఒకామె వచ్చింది. భగవాన్ దగ్గర కూర్చొని, ధ్యానం చేసుకొని, మనస్సును అంతర్ముఖం చేసుకొని, ఇంకా అలాంటివి ఏవేవో చేసుకొని వెళ్ళేటప్పుడు అడిగింది, "భగవాన్! నాకేమీ కోరికలు లేవు. ఆ ముక్తి అంటారే అది ఇస్తే నేను వెళ్ళిపోతాను” అంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆమె మళ్ళీ అడిగింది. “ఊఁ! సరి” అన్నారు. ఆయన పద్ధతి అది. ఆయన ఇచ్చాడో లేదో కూడా చూసుకోకుండా, ఇక తన పనయిపోయినట్లు ఆమె వెళ్ళిపోయింది. బహుశా గడప దాటిన తరువాత ఆ విషయం ఆమెకు గుర్తుండకపోవచ్చు కూడా. ఆమె అట్లా వెళ్ళగానే భగవాన్ కడుపు పట్టుకుని పకపకా నవ్వసాగారు. అక్కడున్నవాళ్ళందరూ అడిగారు, భగవాన్ ఎందుకు నవ్వుతున్నారని. “ఆఁ, ఆమె మాటలకులే” అన్నారు. “ఆ మాటల్లో తప్పేముంది, మేమందరమూ కూడా అందుకేగా వచ్చాము? మేము అడగాల్సిన మాటలే ఆమె అడిగింది” అన్నారు. “ఆఁ! ఏమీ లేదు. నాకింకేం అక్కర్లేదు, ముక్తి మాత్రం కావాలి అన్నందుకు నవ్వు వచ్చింది. ఏ కోరికా లేకపోతే మిగిలేది ముక్తేగా! ఇక నేనిచ్చేదేమిటి?” అన్నారాయన. కాబట్టి మనం అడిగేటటువంటిది ఎంతటి అసంబద్ధమైనదో ఒక్కసారి ఆలోచించండి. మనకేమీ అక్కర్లేదు, ముక్తి కావాలనటం నోటి మాటలాంటిది. ఆ మాట రమణమహర్షి లాంటి సద్గురుమూర్తికి నవ్వు తెప్పించింది. అంత హాస్యాస్పదమైన విషయాన్ని మనం చాలా సీరియస్‌గా, చాలా గొప్పగా చెబుతాం. ఈ గ్లానిని తొలగించుకోవటానికి, మనం ఎక్కడ ఉన్నామో అక్కడనుంచి మనలను నడిపిస్తూ ఏమీ అవసరం లేని స్థితికి రావాలంటే ఏమి చేయాలో అది చేసేవాడే సమర్థ సద్గురువు. నిజమైనటువంటి సద్గురువు ఆధ్యాత్మికత ప్రపంచానికి వ్యతిరేకమైనటువంటిది, భిన్నమైనటువంటిది అని బోధించడు. సద్గురువు యొక్క పని ఏమిటంటే - మనం క్రింద ఉన్నాము, క్రిందినుంచి చేయి పట్టుకొని మనలను పైకి తీసుకువెళ్ళాలి! ఆయన పైన కూర్చొని ‘పైకిరా’ అనటం కాదు. పైకి రాగలిగితే ఇంకేముంది? మనల్ని ఆయన తీసుకుపోయేదేముంది? దీన్ని యోగి వేమన చక్కగా చెప్పాడు ఒక పద్యంలో .... “ఇహము లేదు పరము గలదు అన్నవాడి మాట కల్ల మాట. ఇహములోనే పరము చూపువాడే సద్గురువు!!” మనం ఇహంలోనే ఉన్నాము. ఇక్కడికి, ఆ సద్గతో, ముక్తో, మోక్షమో మనకు అందించేవాడే సద్గురువు.

ఒకవేళ ఆయన(సద్గురువు) ఇహంలో ఉన్న మనకు ముక్తినో, మోక్షాన్నో ఇవ్వదలచినా తీసుకునే స్థితిలో మనము లేము. వివేకానందస్వామి ఆజన్మసిద్ధుడని చెప్పారు రామకృష్ణ పరమహంస. అంతటి కారణజన్ముడికి రామకృష్ణ పరమహంస సమాధిస్థితినిస్తే, “నాకు ఇల్లుంది, సంసారముంది, నాకు తల్లిదండ్రులున్నారు, నాకు బాధ్యతలున్నాయి. నన్నేమి చేస్తున్నావు?” అని కేకలు పెట్టాడు. అప్పుడు రామకృష్ణులు “నీకిప్పుడు కాదులే” అన్నారు.

కాబట్టి దానిని తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఆయనే కలగచేయాలి. ఇవ్వడం ఒకటి, తీసుకునే సామర్థ్యాన్ని కలగచేయడం ఒకటి. ఈ రెండుపనులు చేసే కార్యక్రమాన్ని అవతారకార్యంగా ధరించి ఉద్భవించినటువంటి సమర్థ సద్గురువు శ్రీసాయిబాబా.

శ్రీసాయిబాబా ముక్తి, మోక్షం వంటి మాటలెప్పుడూ మాట్లాడలేదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వివిధ ప్రాపంచిక కోరికలతోనే వచ్చారు. ఆయన ఆ కోరికలన్నింటినీ తీరుస్తూనే ఉన్నారు. ఎందుకు తీరుస్తున్నారు? అంటే- దానికి ఆయనే చెప్పారు. “నా భక్తుడు అడిగేవన్నీ నేను ఇస్తూనే వుంటాను, నేను ఇవ్వదలుచుకుంది వారడిగేంతవరకు” అని. అయితే ఆయనేమి ఇవ్వదలుచుకున్నారో మాత్రం చెప్పలేదు. సరే! అదేమిటన్న జిజ్ఞాస మనకు కలగాలి కదా! మనం అడిగేవన్నీ ఆయన ఇస్తుంటే చాలు అనుకుంటాము. కానీ, ఆయన ఇచ్చే పద్ధతి ఎలా వుంటుందంటే, ఇలా మన కోరికలు తీరుస్తూ తీరుస్తూ, ఒకనాటికి ఆయన ఇవ్వదలుచుకుంది మనం తీసుకునే స్థితికి తీసుకుపోతారు.

ఉదాహరణకు, అప్పుడే స్కూల్లో చేర్పించిన పాపను స్కూలుకు పంపించాలి. పాప రోజూ స్కూలుకి వెళ్ళేందుకు మొరాయిస్తుంది. ఏం చేస్తాము? స్కూలుకి వెళితే చాక్లెట్లు ఇస్తామని లాలిస్తాము. ఇంకా వరుసగా నెలరోజులు వెళితే సైకిలు కొనిస్తామని చెపుతాము. పాప స్కూలుకెళుతుంది. పాప వెళ్ళేది చాక్లెట్లకోసమే. కానీ, మన లక్ష్యం మాత్రం పాపను స్కూలుకు పంపించడం. ఇట్లా ఎప్పటిదాకా ఇస్తాము? తనకు తానుగా స్కూలుకు వెళ్ళేంతవరకు ఇస్తాము. అదేవిధంగా మనం మన కోరికలను బాబాను అడుగుతూ వుంటాము. ఆయన తీరుస్తూవుంటారు. అలా ఎప్పటిదాకా అంటే ఆయన ఇవ్వదలుచుకుంది మనం అడిగేంతవరకన్నమాట.

ఇంకా బాబా, “నా భక్తుడ్ని నేనే ఎన్నుకుంటాను. నా సంకల్పం లేకుండా ఎవ్వరూ శిరిడీకి రారు” అని చెప్పారు. మరి బాబా ఎలా ఎన్నుకుంటారు? ఏ అర్హత, ప్రాతిపదికపై ఎన్నుకుంటారు? ఈ కోటానుకోట్ల జీవులలో వీళ్ళే నా భక్తులు అనుకోవడానికి ఆయనకు ప్రాతిపదిక ఏమిటి? మనను ఆయన చెంతకు లాగేదేమిటి? మన సాధనాపటిమా? మన పూర్వజన్మసుకృతమా? మనకంటే ఇంకా బాగా సాధనచేసేవారు దొరకరనా? మనలనే ఎందుకు ఎన్నుకున్నారాయన? దానికి సమాధానం బాబానే చెప్పారు
“నాకు వాళ్ళకు ఉన్నటువంటి ఋణానుబంధం” అని. “పూర్వజన్మ సంబంధం వల్ల మనందరము కలుస్తాము. అల్లాహ్ నాకు కొంతమంది జీవులను కేటాయించారు. వాళ్ళ బాగోగులను నేను చూసుకోవాలి” అన్నారు సాయిబాబా. అంటే ఈ కేటాయింపు ఆయనకూ మనకు వున్న ఋణానుబంధంవల్లనే జరుగుతుంది.

ఇక్కడ ‘ఋణానుబంధం వల్ల మనము సాయిభక్తులమయ్యాం’ అన్నది గుర్తుపెట్టుకుంటే ఏం జరుగుతుంది? ‘అన్నీ బాబానే చూసుకుంటారు’ అన్న అవగాహన పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక బిడ్డ వున్నాడు. తల్లిదండ్రుల మీద ఎంతగా ఆధారపడతాడు? భోజనం, విద్య వంటి అన్ని విషయాలూ తల్లిదండ్రులే చూసుకుంటారు అనుకుంటాడు. ఆ నమ్మకం ఎందుకు కలుగుతుంది? వారు తల్లిదండ్రులు గనుక, ఋణానుబంధం వుంది గనుక. అట్లా ఇతరులను నమ్మగలడా? పక్కవాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకూ మనకూ ఏమిటి సంబంధం? అనుకుంటాడు. కాబట్టి ఏదో ఒక సంబంధం వుండాలి. ఈ సంబంధం వలన మనకు ఒక ‘సెక్యూరిటీ’భద్రత ఏర్పడుతుంది. మనం బాబా దగ్గరకు వచ్చినది ఆయనకూ మనకూ ఉన్న ఋణానుబంధం వలన కాబట్టి మన కోరికలు తీర్చడం ఆయన బాధ్యత. అది ఆయనకు బాధ్యత అయిందంటే ఆయన మనవాడు. మనం ఆయనవారం. 

మన కోర్కెలు తీరేదానికి ఆయన మార్గం కనుక ఆయనకు శరణాగతి చెందుతున్నాం. ఈ కోరికలన్నీ బాబా వలనే తీరుతాయి, ఆయన తీర్చగలడు, ఆయన ద్వారా అవుతుంది అని మనకు తేలుతుంది. ఆయనగానీ అనుకుంటే పని అయిపోతుంది అంటాము. అది నమ్మే ఆయనను ఆశ్రయిస్తాము. దీనితో ఇక్కడ బాబాపై ఇంకా ఇంకా ఆధారపడటం మొదలవుతుంది. తేలికగా ఆయనను ప్రేమించగలము, తేలికగా ఆయనపై ఆధారపడగలము. మరింతగా ఆయనతో ఋణానుబంధం పెంచుకొంటాము. కోరిక తీరితే ఆయన ద్వారానే తీరాలి, వేరే అవకాశం లేదు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం, స్ఫురణ మనకు కలుగుతుంది. లేదూ, ఎవరికైనా రాలేదు, ఫలానా కోరిక తీరలేదు అంటే ఒక్కసారి మరలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు బాబామీద మాత్రమే ఆధారపడివున్నారా? ఇంకా వేరే ఎక్కడా ఆధారపడిలేరా? అని అడిగితే, “లేదండీ, మేము బాబానే నమ్ముకుని ఉన్నాము” అంటాడు. 

ఒక అరగంట మాట్లాడిన తర్వాత, “మొన్న ఒక వాస్తుసిద్ధాంతిగారు వచ్చారండీ, మా ఇంట్లో ఈశాన్యం తగ్గిందట, బహుశా అందువల్ల వచ్చివుంటాయండీ ఈ కష్టాలు” అంటాడు. ఆ తర్వాత ఇంకొక గంటాగి మెల్లగా, “నా జాతకచక్రం చూసి చెప్పారండీ, నాకు నలభయ్యవయేడు దాకా శని ఉందట. ఆ తర్వాత బాగుంటుందట” అంటాడు. ఇంక అక్కడ బాబా చేసేదేమిటి? ఈ వచ్చిన కష్టాలకు కారణం ఇంట్లో ఈశాన్యం తగ్గడం, అది గానీ పెరిగితే కష్టాలు తీరుతాయి! కాబట్టి ఇక్కడ కష్టం తీర్చేది ఈశాన్యమూల. ఇంక బాబామీద ఏం విశ్వాసం ఉన్నట్లు? జాతకమూ, గ్రహస్థితి మీదే కష్టసుఖాలు మారుతూంటే బాబా అనుగ్రహం వలన మారేదేమిటి? మధ్యలో ఎవరో వచ్చి శాంతులు, పూజలు, పరిహారాలు చేయించమని చెప్పగానే “ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, బాబా సకలదేవతాస్వరూపం కదా! ఈ పూజలూ ఆయనకేగా చెందుతాయి” అనుకోవడం, ఎవరెలా చెప్పితే అదల్లా చేయడం. ఈవిధంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. కేవలం బాబా మీద మాత్రమే ఆధారపడటం చేతకావటం లేదు. ఎప్పుడైతే ఆ శరణాగతి భావన రాదో బాబాకూ మనకూ ఉన్న ఋణానుబంధాన్ని మర్చిపోతాము. ఆ శరణాగతి పూర్తిగా రాకుండానే పని అయితే ఏమవుతుంది? అప్పటికే చాలా రాళ్ళు వేసివుండటం వలన, చాలామందికి మ్రొక్కుకునివుండటం వలన ఎవరివలన, దేనివలన మనపని జరిగిందో గ్రహించలేము. దానివలన బాబా తన చెంతకు చేర్చుకునే పద్ధతిలో కలిగే మార్పులు వచ్చే అవకాశం లేదు. అలా అని బాబా వాళ్ళను వదిలేయరు. వాళ్ళు దారికి రావడానికి కాస్త ఆలస్యం అవుతుందంతే!

అయితే చాలామంది విషయంలో ఏం జరుగుతుందంటే, ఈ కోరిక తీరబోయే సమయానికి వారిలో ఆ కోరిక పట్ల కోరిక, ఆసక్తి తగ్గిపోతుంది. ఎక్కువగా జరిగేదదే! ముందు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక కోరిక కోరేస్తాము. తీరా ఆ కోరిక తీరే సమయానికి ఈ కోరిక తీరడం అంత అవసరమా అనుకుంటాము. కాబట్టి యిక్కడ కోరిక తీరే ‘ప్రాసెస్’ లోనే సంస్కరింపబడతామన్నమాట. అందుకే ఎవరికైనా బాబానుండి అనుభవం రావడంలేదు, కోరిక తీరడం లేదు అంటే ఈ రకమైన పూర్తి విశ్లేషణ చేసుకుంటూ పోవాలి. “మనం బాబా మీదనే ఆధారపడి ఉన్నామా? నిజంగా మనం బాబా భక్తులమేనా? ఆయన్నొక్కడ్నే ఆశ్రయించి ఉన్నామా? ఆయనపట్ల అనన్య ప్రేమ, భక్తి ఉన్నాయా?” అని యోచించుకోవాలి. నారద భక్తి సూత్రాలలో చెప్పినట్లుగా అనన్యభక్తి అంటే ఇంకే విషయంతోనూ పంచుకోలేనటువంటి ప్రేమ! అటువంటి ప్రేమ, భక్తి మామూలుగా కలగదు. ఒక్కసారి బాబా గురించి ఒక మాట చెబితేనో, ఎప్పుడో ఒక కోరిక తీరితేనో జరగదు. ఆయన్నే పూర్తిగా స్మరణలో పెట్టుకోవడం కూడా జరగదు.

మామూలుగా అందరికీ ఉండే ఇంకో సమస్య ఉంది. “బాబా స్మరణ చేస్తున్నాను కానీ బాబా మీద నాకు మనస్సు నిలబడటంలేదు, బాబా గుర్తుకు రావడంలేదు” అంటాము. “స్మరణ బాబా మీదనే ఉన్నదా?” ఆ ప్రశ్న వేసుకోవాలి మళ్ళీ. మనస్సుకు సహజంగా ఉండే గుణం ఏమిటి? బాగా ఇష్టమైన విషయంపట్లగానీ, బాగా ద్వేషించే విషయం మీదగానీ అప్రయత్నంగా మనస్సు దానంతటదే లగ్నం అవుతుంటుంది. ధ్యానానికి కూర్చుంటాము. కళ్ళు మూసుకోగానే ఇంకేవో విషయాలు వచ్చేస్తాయి. ఉదాహరణకు, ఆరోజు మనకేదో అవమానం జరిగివుందనుకోండి! “వాడు నన్నంత మాటంటాడా? వాడి అంతు చూడాల్సిందే, ఏ విధంగా వాడికి బుద్ధి చెప్పాలి?” అని ఆలోచిస్తుంటాము. లేదా ఎవరిమీదైనా బాగా ఇష్టం ఉంటే అటుపోతుంది మనసు. ఇదంతా అప్రయత్నంగా జరిగేదే. ఇక్కడ బాబాపట్ల ఉండాల్సినంత ఇష్టం లేకపోవడం వలన మాత్రమే ధ్యానం కుదరటం లేదు అని తెలిసిపోతుంది. 

సాధన అంటే ఏమిటి? బాబాపట్ల ప్రేమ పెంచుకోవడమే. ఇష్టం పెంచుకుంటే స్మరణ పెరుగుతుంది, ధ్యానం దానంతటదే జరుగుతుంది. సరే! బాబా పట్ల ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, అసలు మనకు ఇష్టాయిష్టాలు ఎలా కలుగుతాయో, ఎలా పెరుగుతాయో గమనించాలి. సాధారణంగా మనకు ఒక వస్తువు లేదా, వ్యక్తితో ఉండేటటువంటి సంబంధం (కాంటాక్ట్) వల్ల ఇష్టాయిష్టాలు కలుగుతాయి. అదెలాగో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు రెండు నెలలపాటు ఒక రూములో కలిసి ఉన్నారంటే క్రమంగా సన్నిహితులౌతారు. వీడి సమస్యలు వాడు, వాడి సమస్యలు వీడు ఆలోచించడం, ఇద్దరూ కలిసి వాటిని తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం చేస్తారు. ఒకరోజు ఒకడెవడైనా ఊరికి పోతే వాడికి ఉత్తరం వ్రాయడం, ఫోను చేయడం, వాడ్ని చూడలేకుండా ఉండలేకపోవడం.. ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదో కారణంగా కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ దూరంగా ఉండటం జరిగితే, ఒక్కనెల చూడాలని బాగా అనుకుంటారు. రెండోనెలకి మెల్లగా మర్చిపోతారు. వాడికి అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీడికిక్కడ సరిక్రొత్త స్నేహితులేర్పడుతారు. ఎవరికి వారైపోతారు. ఇక్కడ కాన్స్‌టెంట్‌గా ఉన్న టచ్ లేకపోతే ఇష్టం పోతున్నది. ఒక విషయాన్ని గురించి పదిసార్లు చూడడం, పదేపదే వినడం జరిగితే దానిమీద ఇష్టం పెరుగుతుంది. ఒకటి, రెండు సినిమాలు చూడగానే వాటిమీద ఇంట్రస్టు పెరిగి ఇక వరుసగా సినిమాలు చూడాలనిపిస్తుంది. సినిమాలపై యిష్టం పెరుగుతుంది. ఏదో కారణంగా పరీక్షలుండో లేదా ఇట్లా శిరిడీ వచ్చినపుడో చూడరు గనుక ఒక గ్యాప్ ఏర్పడుతుంది. మరలా ఊరికిపోయి చూసుకుంటే ఏమవుతుంది? సినిమాలపట్ల ఆసక్తి తగ్గిపోయివుంటుంది.

అలాగే బాబాతో ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి? ఆయనతో కాన్స్‌టెంట్‌ టచ్ పెట్టుకోవాలి. అది ఎట్లా పెంచుకోవాలి? ఆయన భౌతిక శరీరంతో ఉంటే ఆయన సన్నిధిలో కూర్చుని, ఆయన సేవ చేసుకుంటూ ఉండటం ద్వారా ఆయనతో సంబంధం పెరుగుతుంది అనుకుంటే, మరి ఆయన భౌతికంగా లేరే? ఎట్లా? ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే ఒకరి పనులు మరొకరికి నచ్చాలి. అప్పుడే సన్నిహితులౌతారు. నచ్చకపోతే దూరం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనను దగ్గర చేర్చేది నచ్చిన పనులే. బాబాతోనూ అనుబంధం పెంచుకోవాలంటే ఆయన చేసిన పనులు తెలుసుకోవాలి. అవి ఆయన చరిత్ర చదివితే తెలుస్తాయి. ఆయన తత్త్వం అర్థం చేసుకోవడానికి, ఆయన ఎలాంటి వారు? మనను ఉద్దరిస్తారా, లేదా అన్న పద్ధతిలో చరిత్రను విశ్లేషణాత్మకంగా చదవాలి. అంతేకానీ, పారాయణ అంటే, స్నానంచేసి, వ్యాసపీఠం దగ్గర కూర్చుని, అగరుబత్తి వెలిగించి, మొత్తం పుస్తకాన్ని ఏడు భాగాలుగా విభజించి, ఫలానా పేజీదాకా మొదటిరోజుకి అనుకొని, ఆ పేజీలో ఒక వేలుంచి పేజీలు తిప్పడం కాదు. అప్పుడు ఆ ఫలానా పేజీ మీదే ఉంటుంది దృష్టి, ఇక చరిత్రలోని సారాంశం మనసుకేం పడుతుంది? కాబట్టి ఒక్కసారైనా సరే చరిత్రలోనుంచి బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? ఏం చెప్పారాయన? ఒకలీల జరిగినపుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను? ఇలా ప్రతివిషయం గురించి తరిచి చూసుకుంటూ ఒక్క లీల చదివినా చాలు! నిజానికి ఆ ఇంట్రస్ట్ ఉంటే ఒక్క లీలతో ఆపము. నవల చదివినట్లుగా బాబా చరిత్ర చదువగల్గుతాము. చరిత్ర అవగాహనతో చదవడం వలన ఆనందం, తృప్తి కలుగుతాయి. లేకపోతే మామూలు జీవితం ఎంత అర్థరహితంగా ఉంటుందో, మనం శిరిడీ రావడం, సత్సంగాలు చేసుకోవడం ఇదంతా కూడా అంతే అర్థరహితమై పోతుంది. అర్థరహితమైన జీవితంలో ‘పారాయణ’ కూడా ఒక అర్థరహితమైన సాధన అవుతుంది. ఈ జీవితానికొక అర్థాన్ని చెప్పేటట్లుగా ఉండాలి మనం చేసేపని. ఈ అవగాహన పెంచుకొని ఆ నేపధ్యంలో జరిగేటటువంటి సాధన నిజమైన సాధన. అటువంటి సాధన చేసినప్పుడే మనం నిజమైన ‘సాయిపథం’లో పయనించినవాళ్ళమవుతాము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సమాప్తం...

source:  సాయిపథం ప్రధమ సంపుటం.

5 comments:

  1. 🙏ఓం సాయి రామ్🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Ivvi chebuthaabiki baagunthaayi. Evari badhaalu vaalavi. Naaku Sai konni (4-5) issues lo help chesaaru. Chaala ekkuvaa saarlu help chesthaanu anni cheppi anyayam chesaaru. Asalu alanthappudu jeevi endhukku puttaali.
    Only God is true. Not others.

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  5. ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo