సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 420వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - 53వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను భోజనం చేసి, పనమ్మాయితో పరుపులూ, దిండ్లు తీసుకొని అక్కడకి వెళ్ళి, తరువాత పనమ్మాయిని పంపించి కొంచెంసేపు అక్కడే కూర్చున్నాను. అప్పుడు వారిలో ఒకరు వైరాగ్యంతో నిండివున్న ఒక భజనను వినిపించారు. అందులో ఒక పంక్తి గుర్తుంది. అది ఇలా ఉంది:

“ధర్మధ్వజం విరిగిపోతోంది - ధర్మధ్వజం విరిగిపోతోంది - మేలుకోండి”

“సంసారంలో ఎందుకు చిక్కుకుని ఉన్నావు? ధర్మం యొక్క ధ్వజం పతనమవుతోంది. ధర్మరక్షణ కోసం నడుం బిగించి సన్యాసాన్ని గ్రహించి ధర్మాన్ని నిలబెట్టు” అని బాబా దత్తాత్రేయ రూపంలో ప్రకటమై నాకు చెప్తున్నారని  నిశ్చయమైంది. సన్యాసం స్వీకరించాలని నాకు తీవ్రమైన కోరిక ఉండేది. అయితే నాకు నా వైరాగ్యం మీద పూర్ణ విశ్వాసం లేదు. అంతేకాక, సాయిమహారాజు సన్యాసం వద్దనీ, సొలిసిటర్ చదువుకోమనీ ఆజ్ఞాపించారు. అందువల్ల సన్యాసుల మాటను కేవలం విని ఊరుకున్నాను. మర్నాడు పరుపులు తెప్పించానో లేక వారే తిరిగి పంపించారోగానీ ఇంచుమించు తొమ్మిది గంటలకు ముగ్గురు సన్యాసులూ నన్ను కలవటానికి వచ్చారు. అప్పుడు, “భక్తా! నీవు మాకు చాలా ఉత్తమమైన సేవ చేశావు. దాంతో మేము ప్రసన్నులమైనాము. ప్రస్తుతం నీ బుద్ధి క్షీణించింది. దాన్ని బాగుచేయటానికి ఒక కాగితం ముక్క, కొంచెం కుంకుమ తీసుకురా. మేము నీకు ఒక మంత్రం రాసిస్తాం. దాన్ని ఒక లోహపు తాయెత్తులో పెట్టుకొని ఉపయోగించు” అన్నారు. తదనుసారం నేను కాగితము, కుంకుమ తెచ్చిచ్చాను. వారు దానిపై మంత్రం రాసి ఆ కాగితాన్ని గుండ్రంగా ఒక పొట్లంలాగా కట్టి నాకు ఇచ్చి, "ఇప్పుడు మేము నాసిక్ వెళ్తున్నాం. మాకు కేవలం రెండు రూపాయలిస్తే నీ బుద్ధి సరైన స్థానంలోకి రావటం కోసం ప్రార్థనగానీ లేదా సాధనగానీ చేస్తాము” అన్నారు. నా వద్ద వారికివ్వటానికి డబ్బుల్లేవు. అమ్మకి గానీ లేదా మోఘీ అక్కయ్యకి గానీ డబ్బిచ్చే ఆలోచన కనిపించకపోవటంతో వారికి వట్టి నమస్కారం చేసి పంపించాను. అయితే దానితో నా చిత్తంలో క్షోభ కలిగింది. సన్యాసులు నా సమస్యను తెలుసుకొన్నారు.

కానీ తరువాత అమ్మకు, మోఘీ అక్కయ్యకు ఆ సన్యానుల యోగ్యతను చెప్పిన మీదట మోఘీ అక్కయ్యకు అమ్మ రెండు రూపాయిలిచ్చి, "సన్యాసులిప్పుడు దారిలోనే ఉండొచ్చు. వారికివి ఇవ్వమ"ని చెప్పింది. ఆమెకు సన్యాసులు వీధిలోనే కనిపించారట. అప్పుడామె వారికి ఆ రెండు రూపాయలు ఇచ్చింది. నేను కూడా కాసేపు పచార్లు చేయాలని ఇంటి బయటకు వచ్చాను. కానీ మా అమ్మకి నేను తమని వదిలేసి సన్యాసులతో పాటు పారిపోతానేమోనని చింత కలిగింది. నేను ఇంట్లో లేకపోవటం చూసి, ఆమె బయటకొచ్చి ఇంచుమించు గ్రామాన్నంతా నాకోసం వెతికి వచ్చింది. నేను ఇంటికి తిరిగి రాగానే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. నన్ను చూసి ఆమె, "అమ్మయ్య, వచ్చావా? ఆ సన్యాసులతో పాటు నీవు వెళ్ళిపోయావేమోనని నాకు భయమేసింది. మీ నాన్నగారు పోయినప్పటినుంచీ నీవు ఇల్లు వదిలి వెళతావేమోనని నా మనసు నీ గురించే చింతపడుతోంది” అని అన్నది. నా శ్రద్ధ కేవలం సాయిబాబా మీదే ఉంది. అందువల్ల సన్యాసులు అభిమంత్రించిన కాగితాన్ని చాలారోజుల వరకూ అలాగే పెట్టి ఉంచాను. దాంతో నేను తాయెత్తు చేయించుకోలేదు.

సంసారం మీద నాకు విరక్తి కలగటం 1916వ సంవత్సరంలో బాగా ఎక్కువైంది. అందువల్ల అమ్మ, నాన్న, అన్న, అక్కయ్యలకు నా గురించిన చింతే ఉంటుండేది. నా ఈ విరక్తిని చూసి అందరూ దుఃఖించేవారు. ఇది నిజం. ఇప్పుడు నేను కాషాయరంగు వస్త్రాలను ధరించినంత మాత్రాన దాన్ని మరిచిపోలేను. అందువల్ల ఈ సందర్భాన్ని గురించి రాశాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo