సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 481వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • ఏమి ఈ బాబా లీల!

ఓం శ్రీ సాయినాథాయ నమః.

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు అంజనా గుప్తా. మాది వరంగల్ జిల్లా నర్సంపేట. నేను మీ అందరికీ పరిచయస్తురాలినే. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా మొదటి అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇది నా రెండవ అనుభవం. మొదటి అనుభవం తర్వాత ఆరు నెలల లోపే నాకు రెండవ అనుభవాన్ని ప్రసాదించారు సద్గురు సాయినాథుడు. ఒక బుధవారం రాత్రి ఎప్పటిలానే బాబాను తలచుకుంటూ పడుకున్నాను. గురువారం తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో అరవై నుండి డెబ్భై సంవత్సరాల మధ్య వయస్సులో ఉండే ఒక వృద్ధుడు కనిపించారు. ఆయన అచ్చం బాబాలానే ఉన్నారు. ఆ కలలో నేను ఒక ఫంక్షన్ కోసం పరకాల వెళ్లాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత బస్టాండ్ వద్దకు వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.  నాతోపాటు మా పిల్లలిద్దరు కూడా ఉన్నారు. చేతిలో లగేజీ ఉంది. ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రావట్లేదని నేను చాలా అసహనానికి గురి అవుతున్నాను. ఆ సమయంలో ఆ వృద్ధుడు (బాబా) నా దగ్గరకు వచ్చి, బిడ్డా! ఇక్కడ బాబా మందిరం ఉంది. బాబాను దర్శించుకోకుండానే వెళ్ళిపోతున్నావెందుకు? ఎక్కడ బాబా మందిరం ఉన్నా తప్పకుండా దర్శించుకుని వెళ్తావు కదా, మరి ఎందుకు తల్లీ బాబాను దర్శించుకోకుండానే వెళ్లిపోతున్నావు? నీకు బాబాను దర్శించుకోవాలని అనిపించటంలేదా?” అని అన్నారు. నేను, “బాబా మందిరం ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు కదా!” అన్నాను. దానికి ఆ వృద్ధుడు, “అయ్యో తల్లీ, నీకు తెలియదా? ఈమధ్య ఈ బస్టాండుకు దగ్గరలోనే బాబా మందిరం నిర్మించారు. నువ్వు నాతో రా! నీకు చూపిస్తాను, బాబా దర్శనం చేయించి పంపిస్తాను” అని నన్ను తనతో పాటుగా బస్టాండ్ దగ్గర ఒక మూలమలుపు నుండి లోపలికి తీసుకువెళ్తున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక, “నేను నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, మందిరం ఇంకా ఎంత దూరం ఉంద”ని అడిగాను. అందుకాయన, “ఇక్కడే, ఇక్కడే, దగ్గరకు వచ్చేశాము” అని చెబుతూ అలా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇద్దరు పిల్లలతో, చేతిలో లగేజీతో నడవడం చాలా కష్టంగా ఉంది నాకు. దాంతో నేను, “ఇక్కడే, ఇక్కడే అని చాలా దూరం నడిపిస్తున్నావు, ఇంక నేను నడవలేను” అంటూ ఆ వృద్ధునిపై కోప్పడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను. (ఆ వృద్ధుడు బాబానే అని కలలో నాకు తెలియదు కదా!) ఆయనేమో, “అయ్యో తల్లీ! ఇంత దూరం వచ్చి బాబా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతావా?” అని అంటున్నారు. నాకేమో విసుగు, చిరాకు, కోపం అన్నీ వస్తున్నాయి. అయినా ఒక్కసారి ఆలోచించాను, బాబా మందిరానికి వెళ్ళి వెళ్తేనే బావుంటుందేమో అని. “సరే, ఇంత దూరం వచ్చాను కదా, ఇంకాస్త దూరం నడిస్తే బాబా మందిరం వచ్చేస్తుందేమో” అనుకొని వెనక్కి తిరిగి చూస్తే ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడున్నవాళ్లని ఆ వృద్ధుడి గురించి, బాబా మందిరం గురించి అడిగితే, నేను చెప్పిన ఆనవాళ్లతో ఎవరూ లేరని చెప్పి, “ఇక్కడ బాబా మందిరం లేదు, ఆ వృద్ధుడెవరో కనిపించట్లేదంటున్నావు, అసలిక్కడ బాబా మందిరమే లేనప్పుడు బాబా మందిరం చూపిస్తానని ఎలా తీసుకెళ్తాడు నిన్ను?” అని అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఆ వృద్ధుడు మరెవరో కాదు, బాబానే అని. “అయ్యో, సాయినాథా! నా దగ్గరికి వచ్చింది, నాతో తిరిగింది, నన్ను నడిపించింది, నాతో మాట్లాడింది నువ్వేనా?” అని బాబాను గుర్తించలేకపోయినందుకు చాలా బాధపడ్డాను, వేదనచెందాను. కానీ, మందిరం కనిపించకపోయినా బాబా దర్శనమిచ్చారని కలలోనే చాలా సంతోషించాను కూడా.

తెల్లవారాక మావారికి నా కల గురించి వివరించాను. అటు తర్వాత మావారితో, “మీకు ఎవరైనా పరకాలకు చెందినవాళ్లు తెలిస్తే బస్టాండుకు దగ్గరలో ఏదైనా సాయిబాబా మందిరం ఉందేమో తెలుసుకోండి” అని చెప్పాను. “సరే, నేను తెలుసుకుంటాను” అన్నారు మావారు. కానీ నాలుగయిదు రోజులైనా మాకు పరకాలలో సాయిబాబా మందిరం ఉందో, లేదో తెలియలేదు. ఆ విషయం ఎలా తెలుసుకోవాలో అర్థంకాక చాలా బాధపడ్డాను. అలాగే వారం రోజులు గడిచిపోయింది. తొమ్మిదవరోజున “పరకాల బస్టాండ్ దగ్గర సాయిబాబా మందిరం కట్టడానికి శంకుస్థాపన జరిగింది” అని న్యూస్ పేపర్లో మెయిన్ పేజీలో కలర్ ఫోటోతో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చూస్తూనే ఒళ్ళు ఝల్లుమంది. “ఏమి ఈ బాబా లీల! అసలు అక్కడ బాబా మందిరం లేదు కదా! అంటే, నాకు ముందుగానే అక్కడ బాబా దర్శనం ఇచ్చార”ని చాలా పులకించిపోయాను. పరకాలలో బాబా మందిరం కట్టడానికి ముందే ఆ విషయం నాకు తెలిసినందుకు సంతోషించాను. 

కలలో ఏ విధంగా అయితే నేను ఫంక్షనుకి వెళ్లి, తరువాత బాబా మందిరానికి వెళ్ళినట్టుగా వచ్చిందో, అదేవిధంగా ఆ కల వచ్చిన 8 సంవత్సరాలకు నేను ఒక ఫంక్షనుకి హాజరైన తరువాత పరకాలలోని సాయిబాబా మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. ఆ కార్యక్రమానికి దాదాపు పాతికమందిమి ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్ళాము. అందులో ఇరవైమంది గత కొన్ని సంవత్సరాలుగా తరచూ బిజినెస్ పనిమీద పరకాలకు వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఏనాడూ బాబా మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోలేదు. నా వల్ల వాళ్ళందరూ బాబా దర్శనం చేసుకోవడం జరిగింది. బాబా దర్శనంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు. నేను కూడా బాబా మందిరాన్ని చూసి ఎంతగా పులకించిపోయానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ప్రతి తల్లి తన కడుపులో బిడ్డను మోస్తూ ఆ బిడ్డ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నేను కూడా పరకాలలోని బాబా మందిరాన్ని చూసినప్పుడు అలాంటి అనుభూతిని పొందాను. నిజంగా నాకిది రెండవ అనుభవం అయినప్పటికీ నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. బాబా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజూ నాతో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు అనే దానికి ఇది చక్కటి నిదర్శనం. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. సదా మా ఇంట, మా వెంట ఉండి మమ్ము నడిపిస్తూ వారి ఆశీస్సులు మాపై కురిపిస్తూ మా జీవితాలను ధన్యం చేస్తున్న బాబాకు కోటానుకోట్ల కృతజ్ఞతలు.

ఈ బ్లాగులో బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్నవారికి నా కృతజ్ఞతలు. సాయిబంధువులందరికీ ఒక చిన్న విన్నపం, పరకాలలోని బాబా మందిరాన్ని దర్శించుకోవాలని ఎవరైనా అనుకుంటే ఒక పూర్తి రోజును కేటాయించుకోండి. అలా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ బాబా మందిరం అంత అద్భుతంగా ఉంటుంది, అక్కడికి వెళితే తిరిగి రావాలనిపించదు. మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సాయిబంధువులందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు.


3 comments:

  1. 🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏

    ఓ సనాతనా!మీరు ముందుద్భవించి
    నట్టి ఓంకారమవు నందునణగిన శబ్ద
    సంపదవు తత్ర్పవాహముసాగు ప్రాణ
    శక్తివీ సువిశాల విశ్వమునకంత
    జీవనాధారుడీవ కృపావతంస.

    భావము:ఓ సనాతనా ! మీరు ముందుద్భవించి
    నట్టి ఓంకారమవు నందునణగిన శబ్ద
    సంపదవు తత్ర్పవాహముసాగు ప్రాణ
    శక్తివీ సువిశాల విశ్వమునకంత
    జీవనాధారుడీవ కృపావతంస.
    జయము దిగ్విజయము జయ సాయినాథ🙏🌹🙏
    🙏🌹🙏ఓం సాయిరామ్🙏🌹🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  3. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo