సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 465వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా ప్రసాదించిన దివ్య అనుభవాలు

సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు భారతి. ఈ బ్లాగులో వున్న సాయిభక్తుల అనుభవాల ద్వారా ఎంతో ధైర్యాన్ని మరియు ప్రతిచోటా బాబా ఉన్నారన్న విశ్వాసాన్ని బాబా నా మనసులో నింపుతూ ఉన్నారు. ప్రతి ఒక్క అనుభవం నుంచి బాబా నాకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉన్నారు. సాయినాథుని గురించి ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడనుండి మొదలుపెట్టాలో నాకు తెలియడం లేదు. “ప్లీజ్ బాబా! మీరు నాతో ఉండి నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా అందరికీ చేరేలా చూడండి”.

నా జీవితంలో జరిగిన అనుభవాలను ‘సాయి మహరాజ్ సన్నిధి’ తెలుగు బ్లాగులో రాయడం కోసం బ్లాగ్ నిర్వాహకులు ఇచ్చిన లింకును 2020, జూన్ 17న ఓపెన్ చేసి, తెలుగులో టైప్ చేసే యాప్‍‌ని నా ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ సాఫ్ట్‌వేర్ నా ఐ-ఫోన్‌లో సపోర్ట్ చెయ్యలేదు. అప్పుడు మనసులో బాబాని తలచుకుని, “అసలు ఒక యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే టైపింగ్ ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేది! నేను ఇప్పుడే నా అనుభవాలను రాసేదాన్ని కదా!” అని అనుకున్నాను. వెంటనే నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేయగానే, మొట్టమొదటిగా నాకు ఒక వీడియో కనిపించింది. అందులో “నోటితో చెబితే కంప్యూటర్లో తెలుగులో టైప్ అవుతుంది, నో యాప్, నో సాఫ్ట్‌వేర్. ఏమీ డౌన్‌లోడ్ చేయకుండానే గూగుల్ క్రోమ్ సహాయంతో తెలుగులో టైప్ చేయవచ్చు” అని కనిపించింది. నా సమస్యకి పరిష్కారం చూపినందుకు బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎవరికైనా ఉపయోగపడవచ్చనే ఉద్దేశ్యంతో ఆ లింకుని ఇక్కడ జతపరుస్తున్నాను.

****************

నా అనుభవాలను బ్లాగులో పంచుకోవటానికి ఈ విధంగా బాబా తమ ఆమోదం తెలిపారు. “బాబా! నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపద్మముల చెంత ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ కరుణ మా అందరిపై ఎల్లప్పుడూ చూపించండి బాబా”.

నా చిన్నతనంలో నేను గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అక్కడే నాకు బాబా పరిచయమయ్యారు. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఖాళీగా ఉన్న పీరియడ్‌లో మా స్నేహితురాలు క్లాస్‌రూంలో నిలబడి అందరికీ వినిపించేలా ‘సాయిలీలామృతం’ చదివేది. అలా బాబా నా జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి క్రొత్త పెన్ ఓపెన్ చేసినా, క్రొత్త పుస్తకం ఓపెన్ చేసినా ‘ఓం సాయిరాం’ అని రాయటం, ఏ క్రొత్త వస్తువు కొన్నా దానిని గురువారంరోజు వాడటం మొదలుపెట్టడం నాకు అలవాటుగా మారింది. ఇప్పుడున్న నా ఈ జీవితం బాబా ఇచ్చిన ప్రసాదం. నేను ఎక్కడ ఉన్నా ప్రతి చోటా ఆయన నాతో ఉండేవారు. నా చిన్నతనంనుంచి బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో నుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ఇంటర్మీడియట్ చదువు కోసం మా ఊరికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరాను. అప్పట్లో మా ఊరు నుంచి పెద్దగా బస్సులు ఉండేవి కావు. ఉదయం ఆరుగంటల బస్సుకి కాలేజీకి వెళ్లి, సాయంకాలం ఆరుగంటల బస్సుకి ఇంటికి వచ్చేదాన్ని. ఆ ప్రయాణం నాకు చాలా కష్టంగా అనిపించేది. అంతేకాదు, బస్‌స్టాప్ కూడా ఊరికి చివరలో వుండటం వల్ల ఇంటినుంచి అక్కడికి వెళ్ళటానికి రోజూ అరగంట నడవాల్సి వచ్చేది. అప్పుడు నేను, “బాబా! ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించండి” అని బాబాని ప్రార్థించాను. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే బాబా అనుగ్రహంతో నాకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజీలో (APRJC) సీటు వచ్చింది. ఆ రెండు సంవత్సరాలూ ఏ కష్టమూ లేకుండా గడిచిపోయింది.

నా జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతమైన లీలను మీతో పంచుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితం నా ఉద్యోగరీత్యా మేము జర్మనీలో ఉండేవాళ్ళం. అప్పటికి మా వివాహమై నాలుగు సంవత్సరాలైంది. ఉద్యోగరీత్యా మొదట్లో మేము సంతానం గురించి ఆలోచించలేదు. తర్వాత కొన్నాళ్లకి సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకసారి నేను సెలవులకి ఇండియాకి వెళ్ళినప్పుడు అందరూ పిల్లల గురించి అడిగారు. ఆరునెలల పాటు దీని గురించి మేము దిగులుగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. మామూలుగా మనకి భగవంతుడు కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తుకొస్తారు. ఆ సమయంలో నేను బాబాను నమ్మి ‘నవ గురువార వ్రతం’ చేయడం మొదలుపెట్టాను. సాయి చమత్కారం ఇప్పుడు చూడండి. బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్‌సైట్‌లో, “నాకు రెండు వందల రూపాయలు దానం చేయండి, మీరు వారం రోజులలో శుభవార్త వింటారు” అని వచ్చింది. అదే విషయం నేను నా భర్తతో చెప్పాను. అప్పుడతను, “దానం చేస్తే జరుగుతుందా?” అని అన్నారు. “బాబాపై విశ్వాసం ఉంచి దానం చేస్తే అన్నీ జరుగుతాయి” అని చెప్పాను. నా భర్త బాబాపై నమ్మకంతో శిరిడీ సాయిబాబా ట్రస్ట్‌కు ఆన్‌లైన్‌లో రెండు వందల రూపాయలు పంపారు. ఇది జరిగిన మూడవరోజున టెస్ట్ చేయించుకుంటే, నేను గర్భవతినని నిర్ధారణ అయ్యింది. బాబా దయవల్ల నాకు నార్మల్ డెలివరీతో చక్కని ఆడపిల్ల పుట్టింది. మా పాపకి 'సాయి' అని పేరు పెట్టుకున్నాము. 

అదే సమయంలో జరిగిన ఇంకొక అద్భుతం గురించి మీతో చెప్పాలి. నేను గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకరోజు ఆఫీసు నుండి నా భర్తతో పాటు ఇంటికి వెళ్తుంటే ఒక పెద్దాయన తనలో తాను పెద్ద పెద్దగా ఏదో మాట్లాడుకుంటూ మా ముందు నుండి వెళ్లడం గమనించాను. కొద్దిగా ముందుకు వెళ్లి అక్కడున్న చిన్న గార్డెన్లో కూర్చొని ఏదో పెద్దగా మాట్లాడుకుంటూ పేపర్‌పైన చకచకా ఏదో వ్రాసుకుంటున్నారు. జర్మనీలో అలాంటి వ్యక్తిని అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. ఆయనను చూడగానే నాకెందుకో ఆయన బాబానే అనిపించింది. వెంటనే మేము అతనికి దగ్గరలో ఉన్న బల్ల మీద కూర్చున్నాము. నేను మనసులో, “మీరు బాబానే అయితే మా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అంతేకాదు, మా నుండి దక్షిణ కూడా తీసుకోవాలి” అని అనుకున్నాను. అంతే! మరునిమిషంలో ఆయన మా దగ్గరికి వచ్చి జర్మన్‍లో ఏదో మాట్లాడారు. ఆయన  ఏదో అడుగుతున్నారని అనిపించింది, కానీ అదేంటో మాకు సరిగా అర్థం కాలేదు. అయినా మా సంశయం తీరక “ఈయన బాబానే అయితే మా దగ్గర ఒక యూరో తీసుకోవాలి” అనుకున్నాం. వెంటనే ఆయన నేనిచ్చిన ఒక యూరో తీసుకున్నారు. ఇంకోసారి కూడా ఆయన అదే మార్గంలో కనిపించారు. అప్పుడు మేము ఒక యూరో ఇస్తే, ఆయన తీసుకోలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు మేము జర్మనీలోనే ఉన్నప్పటికీ మళ్లీ ఎప్పుడూ ఆయన మాకు కనపడలేదు, అంతకుముందు ఐదు సంవత్సరాలు కూడా మాకు కనపడలేదు. కేవలం నేను గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమేనేను నీతో ఉన్నానుఅన్నట్టు నాకు బాబా మూడు, నాలుగు సార్లు కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పటికీ ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా చాలా ఆనందం కలుగుతుంది. అదే సమయంలో మావారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం కూడా చాలా పెరిగింది.

బాబా చేసిన ఇంకొక దివ్యమైన అద్భుతాన్ని మీతో పంచుకుంటాను. మా పాపకి 9 నెలలు ఉన్నప్పుడు, పాపని చూసుకోవడానికి మా అమ్మని నాతోపాటు జర్మనీకి తీసుకుని వచ్చాను. మూడు నెలల తరువాత అమ్మకి వీసా గడువు పూర్తికావస్తుండటంతో అమ్మని ఇండియాకి పంపించడం కోసం జర్మనీ నుంచి విశాఖపట్టణానికి అక్టోబరు 12న ఫ్లైట్‌కి సెప్టెంబరులోనే టికెట్ బుక్ చేశాను. ముందు నేను కూడా మా అమ్మతో ఇండియాకి వెళ్దామనుకున్నాను. కానీ నాకు సెలవులు లేకపోవటం వలన మరియు చిన్న పాపతో ప్రయాణం చేయడం కష్టమని నా సోదరుడు, “అమ్మని ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్‍లో పంపించు, నేను వెళ్లి అమ్మని తీసుకుని వస్తాను” అని చెప్పాడు. అమ్మ అంతగా చదువుకోలేదు, తనకి పెద్దగా ఏమీ తెలియదు. దాంతో అసలు తను ఒంటరిగా ఇండియాకి ఎలా వెళ్తుందని నాలో ఆందోళన మొదలైంది. ‘ఎవరైనా తెలుగువాళ్లు ఎయిర్‌పోర్టులో కనిపిస్తే అమ్మని వాళ్లకి అప్పచెప్పాలి’ అని అనుకున్నాను. అమ్మ చాలాసార్లు నాతో, “ఎవరైనా తెలుగువాళ్ళు కనిపిస్తారో, లేదో! ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది” అని చెప్పేది. “మనకు బాబా తోడుగా ఉంటారు, భయపడకు.మీ భారం నాపై పడవేయుము, నేను మోసెదనుఅని బాబానే చెప్పారు కదా! అంతా బాబానే చూసుకుంటారు” అని అమ్మకి ధైర్యం చెప్పి బాబాపైనే భారం వేశాం. తరువాత అమ్మకి ధైర్యం కలగటానికి చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన భాగవత, మహాభారత ప్రవచనాలను వినిపించాను. బాబా మా ప్రార్థనలు విని ఎలా అనుగ్రహించారో చూడండి. అక్టోబరు మొదటివారంలో నేను ఇండియాలో ఉన్న మా కజిన్‌కి ఫోన్ చేశాను. అప్పుడు తను నాతో, “మా ఇంటి ముందు ఉంటున్న స్కూల్ హెడ్మాస్టర్‌గారి అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. తను డెలివరీకోసం జర్మనీ నుంచి ఇండియాకి వస్తోంది” అని చెప్పింది. ఆ హెడ్మాస్టారు మరియు వాళ్ళ అమ్మాయి కూడా మా అమ్మకి బాగా తెలుసు. మాకు చాలా సంతోషమేసింది. వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి. “మా అమ్మకి అక్టోబరు 12న టికెట్ బుక్ చేశాను. మరి మీరెప్పుడు వెళ్తున్నారు ఇండియాకి?” అని అడిగాను. ఆమె నాతో, “అక్టోబరు 16న వెళ్తున్నాన”ని చెప్పింది. మా అమ్మకి సరిగ్గా అక్టోబరు 16 వరకు మాత్రమే వీసా అనుమతి ఉంది. వెంటనే మా అమ్మ ఫ్లైట్ టికెట్‌ని అక్టోబరు 16కు మార్చాను. ఆహా, ఏమి బాబా లీల! ఆ అమ్మాయి కూడా, “ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీతో మరియు నాలుగు సంవత్సరాల అబ్బాయితో ఎలా ఇండియాకి వెళ్ళాలా” అని ఆందోళనతో ఉంది. తను కూడా బాబాను ప్రార్థిస్తూ, “బాబా! ఎవరైనా పెద్దవాళ్ళు తోడుగా ఉంటే బాగుండు” అని అనుకుందట. ఆ అమ్మాయి భర్త కూడా చాలా ఆనందించారు, మా అమ్మ తన భార్యకు తోడుగా ఉన్నందుకు. బాబా దయవల్ల మా అమ్మ ఏ భయమూ లేకుండా చక్కగా మా ఇంటికి చేరుకుంది. ఆ అమ్మాయిది కూడా మా ఊరే కావటంవల్ల విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత కారులో అమ్మని మా ఇంటి దగ్గర దింపారు. నా సోదరుడు ఢిల్లీకి వెళ్లి అమ్మను తీసుకురావలసిన అవసరం కూడా రాలేదు. “బాబా! ఇలానే ఎల్లప్పుడూ మీ కృప మాపై చూపించండి, మీ పట్ల మా భక్తిభావాన్ని పెంపొందించండి”.

2019, ఏప్రిల్ నెలలో ఖరగ్‌పూర్‌లో జరిగే ఒక ఇంటర్వ్యూకి నేను వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే హఠాత్తుగా వచ్చిన తిత్లీ తుఫాను కారణంగా నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రైళ్ళు, బస్సుల బుకింగ్ కోసం ప్రయత్నించాను. కానీ అవి కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఖరగ్‌పూర్‌ వెళ్లేందుకు ఏ దారీ కనపడలేదు. సంస్థ అడ్మిన్‌ను కాంటాక్ట్ చేస్తే, "ఇంటర్వ్యూ పోస్ట్‌పోన్ చేయడం లేదు. మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల"ని చెప్పారు. ఇప్పుడెలా వెళ్ళాలా అని ఆందోళన చెందాను. అప్పుడు బాబా అనుగ్రహంతో హైదరాబాదు నుండి భువనేశ్వర్‌కి ఉదయం ఒకే ఒక బస్సు ఉందని తెలిసింది. వెంటనే ఆ బస్సుకి టికెట్ బుక్ చేసుకొని, భువనేశ్వర్ నుండి ఖరగ్‌పూర్‌కి రాత్రి 8 గంటలకు ఉన్న మరో బస్సుకి టికెట్ బుక్ చేశాను. అయితే వెళ్ళే మార్గంలో భయంకరమైన ఈదురుగాలుల ప్రభావానికి చెట్లు, విద్యుత్తు స్తంభాలు, పెద్ద పెద్ద లారీలు రోడ్డుమీద పడిపోయి ఉన్నాయి. నా జీవితంలో అంత భయానక పరిస్థితిని మొదటిసారి చూశాను. అటువంటి పరిస్థితుల నడుమ బస్సు చాలా ఆలస్యంగా భువనేశ్వర్ చేరుకుంది. అయితే తుఫాను ప్రభావం భువనేశ్వర్‌లో మరీ ఎక్కువగా ఉండటం వలన బస్సులన్నీ రద్దు చేయడంతో నా పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. కనీసం ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేవు. చేసేది లేక బస్టాండు సమీపంలో ఒక రూము తీసుకున్నాను. తుఫాను వలన భువనేశ్వర్ మొత్తం నీళ్ళతో నిండిపోయి ఉంది. చెట్లు, విద్యుత్తు స్తంభాలు ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నాయి. రూములో కరెంట్ లేదు. పొద్దుటి నుండి ఏమీ తినకపోవటం వల్ల బాగా ఆకలి వేస్తోంది. భోజనం చేద్దామంటే ఎక్కడా భోజనం దొరకలేదు. చివరికి హోటల్‌వాళ్ళే తినడానికి అటుకులు, బిస్కెట్లు ఇచ్చారు. నేను ఇంకా ఖరగ్‌పూర్‌ వెళ్లాల్సి ఉంది. కానీ బస్సులు లేవు. ఏమి చేయాలో తెలియలేదు. బాబా దయవలన సాయంత్రం ఆరు గంటలకి ఈదురుగాలుల తీవ్రత తగ్గింది. బస్టాండుకి వెళ్లి విచారిస్తే, ఒకే ఒక్క ప్రైవేట్ బస్సు కోల్‌కత్తా వెళ్తుందని, అందులో వెళ్తే రాత్రి 2:30 గంటలకి ఖరగ్‌పూర్‌ హైవేలో దింపుతామని చెప్పారు. హైవే నుండి ఊరి లోపలికి చాలా దూరం ఉంటుంది. కానీ నాకు వేరే దారిలేక ధైర్యం చేసి బాబా మీద భారం వేసి ఆ బస్సు ఎక్కాను. రాత్రి 12:00 దాటిన తర్వాత, బస్సులో నుంచి బయటకు చూస్తే చాలా భయమేసింది. తుఫాన్ కారణంగా కరెంటు లేనందున ఒక్క లైటు కూడా లేదు, అంతా అంధకారంగా ఉంది. చాలా ఆందోళనపడి, "బాబా! 2:30 గంటలకి బస్సు దిగితే హైవేలో నా పరిస్థితి ఏమిటి? ఆటోగానీ, ట్యాక్సీగానీ దొరుకుతుందా?" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా నా ఊహకు అస్సలు అందని విధంగా సహాయం చేశారు. బాబాపై భారం వేసి హైవే మీద బస్సు దిగాను. నా వెనుక ఒక అమ్మాయి దిగింది. అంతే, 'నాకు తోడుగా బాబానే దిగారు' అన్నంత ఆనందం కలిగింది. ఆ అమ్మాయితో మాట్లాడితే, వాళ్ళ నాన్నగారు ఖరగ్‌పూర్‌లో ట్యాక్సీ డ్రైవరని, తనకోసం ఆయన వచ్చారని చెప్పింది. "ఆహా బాబా, నాకోసం నువ్వు ఇలా వచ్చావా!" అని అనుకున్నాను. వాళ్లు నన్ను కూడా తమ ట్యాక్సీలో ఎక్కించుకొని ఖరగ్‌పూర్‌లో నాకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్ వద్ద మూడు గంటలకి దింపారు. ఏ మాత్రమూ వెయిట్ చేయకుండా అర్థరాత్రి వేళ నా ప్రయాణం అంత సాఫీగా సాగుతుందని నేనస్సలు అనుకోలేదు. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక భయంకరమైన ప్రయాణం. కానీ బాబా అనుగ్రహంతో ఏ కష్టం లేకుండా సుఖంగా నా ప్రయాణం జరిగింది. బాబా సర్వకాల సర్వావస్థలయందు మనకు తోడుగా ఉంటారు. మనం దేనికీ దిగులు చెందనవసరం లేదు.


11 comments:

  1. Super ga undi. Really you are lucky to be helped by sai in such a bad situation

    ReplyDelete
  2. భగవంతుడు సర్వ వ్యాపకత్వం.విరాట్ స్వరూపం.
    సాయి సర్వస్వం..సాయి లీలామృతం మధురం మధురం.
    🙏🙏🙏 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్🙏🙏🙏🌹🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ ....

    ReplyDelete
  4. Jai sai ram :) chala bagunnai mee anubhavalu

    ReplyDelete
  5. ఏం చెప్పను సాయి నీ లీలలు .అదే నిమిషంలో ఆందోళనకు గురి చేస్తావు వెనువెంటనే నేను ఉన్నాను అంటావ్ ..ఎంతెంత దయ నీది ఓ సాయి.

    నువ్వు మా మా వెంటే ఉండి ప్రతి నిమిషం మమ్మల్ని కాపాడుతున్నావు అనడానికికి ఈ అనుభవం ఒక నిదర్శనం

    ReplyDelete
  6. Enduku SaiNadha nannu intha badhapedhutunnav andarki Anni icchey nuvuu nenu adigindhi enduku ivvatla andaru nannu baba pichhidhi antunnaru. Oka Job istav kani Edo oka badha pedatav na cheta vodulukunela chestav. Inka eppudhu na jeevitanii ki oka margam istav.niku nenu anteyy jaleyy ledhuu asala. Ila chesey badhulu chavuuu ni ivvu.

    ReplyDelete
  7. Om sri sairam🙏🙏

    ReplyDelete
  8. Very nice Sai Leelas.You are lucky devotee..Sai blessed you.last Sai miracle is very nice.Baba helped you dear.Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo