సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 423వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 56వ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

1918వ సంవత్సరంలో దీపావళి సెలవులకు నేను విల్లేపార్లే వెళ్ళాను. అయితే అక్కడకు చేరుకున్న రెండవరోజునే నాకు ఇన్‌ఫ్లుయెంజా సోకింది. ఇంతలో బాబా తీవ్రంగా అస్వస్థులయ్యారని తెలిసింది. తరువాత ఒకటి రెండురోజుల్లోనే బాబా దేహత్యాగం చేశారన్న సమాచారం కూడా వచ్చింది.

బాబా ఇచ్చిన పరీక్షలో నేను ఉత్తీర్ణుడిని కాలేదు కనుకనే నేను మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా ఆయన 1916 తరువాత సన్యాస స్వీకారానికి ఒప్పుకోకుండా, సొలిసిటర్ పరీక్ష వ్రాయమని చెప్పారన్న భావనను నా మనసులో పెట్టుకున్నాను. ఆయన ఆజ్ఞను పాలించటం నా కర్తవ్యం. నాలో వైరాగ్యం తక్కువ ఉండటం వల్లనే బాబా నాకు అలాంటి ఆజ్ఞను ఇచ్చి ఉండవచ్చు అనిపించింది.

ఒకసారి పాఠశాల మూసేసి ఉన్నందువల్ల అప్పుడు నేను నాడియాద్‌లో బాబాయి దగ్గర ఉన్నాను. పాఠశాల తెరిచేరోజున నేను అహ్మదాబాదు వెళ్ళాను. కానీ ప్లేగు బాగా వ్యాపించటం వల్ల పాఠశాల తెరచిన వెంటనే తిరిగి 15 రోజులో, నెలరోజులో మూసివేయాల్సి వచ్చింది. అందువల్ల నేను ముంబాయి వెళ్ళి, స్కూలు తెరవటానికి ఒకరోజు ముందు విల్లేపార్లేలో బయలుదేరి అహ్మదాబాదు చేరుకోవాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా నా చెవిలో, “ఇప్పుడు కూడా ప్లేగు వుంది, పాఠశాల తిరిగి మూసివేయవలసి ఉంది” అని చెప్పారు. కానీ పాఠశాల తెరిచేరోజున నేను అహ్మదాబాదు చేరుకున్నాను. బండి సరైన సమయంలో నడవకపోవటం వల్ల అహ్మదాబాదుకి 8 గంటలు ఆలస్యంగా చేరుకుంది. తరువాత పాఠశాలకు చేరుకోగానే అక్కడ రామశంకర్ మొదలైనవారు కలిసి, “గ్రామంలో ప్లేగు బాగా తీవ్రంగా ఉంది. ప్రజలు పట్టణం వదిలి వెళ్ళిపోయారు. అందువల్ల సెలవులు పొడిగించారు” అని చెప్పారు. అది వినటంతోనే బాబా మాటలు సత్యమేనన్న అనుభూతి కలిగింది. నేను ముంబాయి తిరిగి వచ్చి దీపావళి సెలవురోజుల్లో అక్కడే ఉండిపోయాను.

సాయిమహారాజు మహాసమాధి అయిన తరువాత శ్రీరామనవమి, గురుపూర్ణిమ, శ్రీకృష్ణజయంతి పండుగరోజుల్లో మరియు మరో ఎనిమిది రోజులూ నేను ఫలాహారమే చేస్తుండేవాడిని. గురుచరిత్ర ఒకటి, రెండుసార్లు, శ్రీసాయిసచ్చరిత్ర ఒకసారి పఠించాను. అంతేకాక, పద్యరూపంలో ఉన్న భాగవతంలోని దశమస్కంధాన్ని కూడా పఠనం చేస్తుండేవాడిని. గోపికలు భగవానుడి ప్రాప్తికోసం కాత్యాయనవ్రతం చేసినట్లు భాగవతంలో చదివి కార్తీక బహుళ పాడ్యమి నుంచి మార్గశిర శుద్ధ పూర్ణిమ వరకు ఉప్పు లేకుండా సైంధవ లవణం వేసి తయారుచేసిన చప్పిడి అన్నం తిని, అఖండదీపం ప్రజ్వలింప చేసి ఒక నెలరోజుల పాటు ఆ వ్రతాన్ని నేనాచరించాను. కాకాసాహెబ్ దీక్షిత్ ఇచ్ఛానుసారం అప్పట్లో నేనాయనకు ఒక లేఖ వ్రాసిచ్చాను. 'తత్వమస్యాది లక్ష్యం' - దీని అర్థం తత్వమసి మొదలైన వాక్యాలతో తెలుసుకోబడుతుంది. తెలుసుకోవలసింది తెలుసుకోగలుగుతాం. తత్వమసి మొదలైన వాక్యాల లక్ష్యమవుతారు ఆ గురువు. అంటే తత్వమసి అనే వాక్యంతో ఆయన్ని గుర్తించలేము. ‘తత్వమసి వాక్యాల జ్ఞానంతో ప్రాప్తించేదే గురువు’ అని ఆ గురుస్తుతిలో వర్ణించాను.

1919వ సంవత్సరం అక్టోబరు సెలవుల్లో శిరిడీ వెళ్ళాను. కాకాసాహెబ్ దీక్షిత్, బూటీసాహెబ్ అక్కడే ఉన్నారు. అప్పుడు బహుశా దసరా అనుకుంటాను. బాబా పుణ్యతిథి అవటం వల్ల కాకాసాహెబ్ మొదలైనవారు బ్రాహ్మణులను పిలిపించి వారికి యథావిధిగా పూజ, అర్చనలు చేశారు. తరువాత బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించారు. భోజనం ప్రారంభించక పూర్వం బ్రాహ్మణులు, “భగవద్గీత 15వ అధ్యాయం పఠించండి” అని చెప్పారు. “నాకు అది కంఠతా రాదు” అన్నాడు కాకాసాహెబ్. అప్పుడు, “నాకు అది కంఠతా వచ్చు” అని చెప్పి నేను దాన్ని పఠించాను. పఠనం సమాప్తమవటంతోనే బ్రాహ్మణులు, “మీ పఠనంలో ఇరవై అయిదు తప్పులున్నాయి” అన్నారు. అది విని నేను బ్రాహ్మణుల ఆక్షేపణను వ్యతిరేకిస్తానేమోనని కాకాసాహెబ్ భయపడి నావైపు చూశారు. నేను ఆయన ఉద్దేశ్యాన్ని గౌరవించి బ్రాహ్మణులు చేసిన విమర్శకు సమాధానమివ్వకుండా మౌనంగా దాన్ని సహించాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo