సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 422వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - 55వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను శిరిడీలో ఉన్న ఇరవైయ్యొక్క రోజులూ, అలాగే మోతాలో ఉండే సమయంలోనూ, నా మనసులో వచ్చిన ఆలోచనే వ్యక్తులందరి నోటినుంచి ప్రకటమవుతోందన్న అనుభవం నాకు కలిగింది. మాటలన్నీ ఒకే రకమైన శబ్దాల్లో ఒకే రకంగా ఉండేవి. ప్రతి ఒక్క మాటకీ అర్థం వారి పనులని, వారి భావాన్ని అనుసరించి ఉన్నట్లనిపించేది. నా ఆలోచనతో వారికి ఏ సంబంధమూ ఉండేది కాదు. అయితే ఏ శబ్దాల్లో నేను ఆలోచిస్తున్నానో ఆ శబ్దాల్లాగానే ప్రతివారూ తమ తమ అర్థాలలో తమ తమ ఉద్దేశ్యాన్ని అనుసరించి అది పూర్తికావాలన్న ఉద్దేశ్యంతో ఉచ్ఛరించినట్లు నా కనిపించేది. దీంతో నాకప్పుడు, ఆకాశంతోనూ అలాగే జనులతోనూ ఏకాత్మత ఉన్నట్లు అనిపించేది. అప్పుడు అందువల్లనే బాబా నా సమక్షంలో ‘ఆకాశం గుణం శబ్దమే’ అని ప్రదర్శించారు. అలాగే అది ఒకే సమయంలో సర్వత్రా వినిపించేట్లు చేశారు. సాధకుడికి ఒకసారి సృష్టిలో అంతటా ఒకే శబ్దం ఉచ్ఛరింపబడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. అది స్వాభావికమైనదే. “ఓం, ఓ మిత్యే తదక్షరమిద, ఓం సర్వ తస్యోప వ్యాఖ్యానం”కి ఇది ప్రత్యక్ష అనుభవం. 

1917వ సంవత్సరంలో అహ్మదాబాదులో కొత్తగా మారిన ఇంట్లో మొదటిరోజున ఏ వైపు ఏ దిశో తెలియకపోవటం వల్ల కూర్చోకూడని దిశలో కూర్చుని వైశ్వదేవం చేశాను. తరువాత వెంటనే కళ్ళు మండటం మొదలుపెట్టాయి. దీంతో ‘తప్పు దిశలో కూర్చుని వైశ్వదేవం చేసినదానికిది శిక్ష’ అని నా మనసుకి అనిపించింది. నా చెల్లెల్ని నా పుస్తకాలన్నింటినీ తీసుకొని అహ్మదాబాదు రమ్మని పిలిపించాను. ఆమె రాక చాలా అనిశ్చితంగా ఉంది. దానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు నేను మరచిపోయాను. ఆమెను తీసుకురావటానికి నేను స్టేషనుకి వెళ్ళలేకపోయాను. చెల్లెలు అహ్మదాబాదుకి, అలాగే నా నివాసస్థానానికి కూడా అపరిచితురాలు. అందువల్ల ఆమె పుస్తకాల బరువుతో ఒంటరిగా ఇల్లు ఎలా చేరుతుందోనని చింతించాను. అప్పుడొక రోజు రాత్రి ఒక మార్వాడీ కూలివాడిని వెంటబెట్టుకొని చిరునామా ఆధారంతో ఆమె క్షేమంగా ఇల్లు చేరుకొంది. మార్వాడీ అతను మంచి మనిషి. ఎంత కూలీ ఇవ్వాలని అతన్నడిగితే, “నాకు కూలీ వద్దు. ఇవ్వాలనుకొంటే కొంచెం నెయ్యి ఇవ్వండి” అన్నాడు. అపరిచిత పట్టణంలో, అపరిచిత స్థానంలో ఒక సుందరమైన విధవ స్త్రీని రాత్రి సమయంలో సురక్షితంగా తీసుకొని వచ్చి కూలిని గురించి అడగకుండా కొంచెం నెయ్యిని అడగటం, అలాగే అది లభించాక ఆనందించి, “చూడండయ్యగారూ, ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పండి. మరి నేను వెళ్ళొస్తాను” అని చెప్పి వెళ్ళిపోవటం - ఇదంతా చూసి నాకు ‘ఇతను మామూలు కూలీ కాడు, కేవలం బాబానే!’ అని అనిపించింది. శ్రీతుకారామ్ మహారాజుగారి ‘భోజనంలోకి ఒక పావుశేరు నెయ్యి అడగటమ’నే దాని స్మరణను బాబా పైన చెప్పిన విధంగా నెయ్యి అడిగి చేయించారు. అంతేకాదు, "చూడు, నేను వెళ్తున్నాను. మళ్ళీ ఏదైనా పని ఉంటే పిలిపించమని” అన్నారు.

1917లో దీపావళికి ఒక నెలరోజులు సెలవులొచ్చాయి. అప్పుడు నేను ముంబాయి వెళ్ళి అక్కడ్నించి శిరిడీ వెళ్ళాను. అప్పుడు బాబా, “ఏం చేస్తున్నావు?” అని అడిగారు. నేను, “అహ్మదాబాదులో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను” అన్నాను. "ఇప్పుడు బావుందా?” అంటూ బాబా నా ఉద్యోగం గురించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ‘పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగం చేయనా? లేక అధ్యాపకుడి ఉద్యోగం చేయనా?’ అని అడిగినప్పుడు బాబా నన్ను అధ్యాపకుడి ఉద్యోగానికి ఎంపిక చేశారు. అందువల్ల నాకు ఇప్పుడు కూడా అధ్యాపకవృత్తినే చేయాలని అనిపిస్తోంది. ఇది బాబాకు ఇష్టం. అంతేకాదు, అది శాస్త్ర సమ్మతం కూడా. ఎందుకంటే ముఖ్యంగా అధ్యయనం లేదా అధ్యాపనమే బ్రాహ్మణ ధర్మం.

ఒకసారి రాధాకృష్ణమాయి, “వామన్! నాకు నూట ఇరవై అయిదు లేదా రెండు వందల రూపాయిలివ్వు. దాంతో బాబా ఎదురుగా ఉన్న దర్వాజా వద్ద మట్టిదీపాలు పెట్టటానికి దీపమాల కట్టిద్దాం” అన్నారు. అప్పుడు ఇవ్వటానికి నా దగ్గర డబ్బు లేదు. అందువల్ల నా అసమర్థతను వ్యక్తం చేశాను. అయితే ఆమె చనిపోయిన తరువాత శిరిడీ వెళ్ళినప్పుడు నేను బాబాని, “బాబా! ఎదురుగా దీపమాల కడదామా?” అని అడిగితే, అప్పుడు బాబా, “ఇప్పుడేమీ అవసరంలేద”ని అన్నారు. ఈ మాటతో రాధాకృష్ణమాయి బ్రతికి ఉన్నప్పుడు ఆమె అడిగిన వెంటనే ఈ పని అయివుంటే బాగుండేదని నాకు పశ్చాత్తాపం కలిగింది. రాధాకృష్ణమాయి దీపమాల కట్టాలని బాబా ఆదేశంతోనే నాకు చెప్పివుంటారని నాకనిపించింది. అప్పుడు ఆ ఆదేశాన్ని అమలుచేయటంలో నా అసమర్థతను వ్యక్తం చేశాను. తరువాత బాబా దీపమాల కట్టడానికి అనుమతించలేదు. దీంతో రాధాకృష్ణమాయి మాటలు బాబా మాటలే అనిపించింది. దానికి సరిగ్గా ఒక ఏడాది తరువాత బాబా దేహత్యాగం చేయబోతున్నారు. అందువల్లే ఆయన దానికి ఇప్పుడేమీ అవసరం లేదని అన్నారని నాకు అనిపించింది.

ఒకసారి విల్లేపార్లేలో గదిలో నేను పడక్కుర్చీలో కూర్చుని ఉన్నాను. మధ్యాహ్నం పన్నెండు, ఒంటిగంట మధ్య సమయం. ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను. బాబా నాకు బాగా గుర్తొస్తున్నారు. వారు లేని ప్రపంచం శూన్యంగా అనిపించసాగింది. వాతావరణం చాలా వేడిగా అనిపించింది. ఇంతలో ధోవతి కట్టుకొని, తలపై టోపీ పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చి అక్కడ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చుని , “దాహం వేస్తోంది, మంచినీళ్ళివ్వు” అన్నాడు. నేను లేచి అతనికి మంచినీళ్ళిచ్చాను. అతను మంచినీళ్ళు త్రాగాడు. తరువాత ఆ టేబుల్ మీద 1917లో ప్రచురించబడిన రెండున్నర రూపాయల విలువైన నిర్ణయసాగర్ ప్రెస్ వాళ్ళ ‘ఈశాద్యష్టోత్తరశతోపనిషత్‌’ను చేతిలోకి తీసుకొని దాని పేజీలు తిరగేసి అలాగే తిరిగి దాన్ని యథాస్థానంలో పెట్టి, “వాహ్! నీవు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి పెట్టే పుస్తకాన్ని పెట్టుకున్నావు” అని అంటూ లేచి వెళ్ళిపోయాడు. బాబాని తీవ్రమైన ఇచ్ఛతో స్మరించటంతో వారే స్వయంగా వచ్చారనీ, అలాగే ఉపనిషత్తుల జ్ఞానం చాలా ఎక్కువగా గ్రంథస్తం చేయబడివున్న ఆ గ్రంథాన్ని ఇంకా చదవమని సూచిస్తున్నారనీ ఆ తరువాత నాకనిపించింది. బయటకొచ్చి చూస్తే ఆ వ్యక్తి నాకు కనిపించలేదు. అంతేకాదు, మేము ఆ గదిలో ఎన్నోరోజులు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఆ వేషంలో మళ్ళీ నాకు కనిపించలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo