సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 479వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. 'తినే పదార్థం' అని బదులిచ్చిన బాబా
  2. బాబా ఆశీస్సులు అందిన సంకేతం

'తినే పదార్థం' అని బదులిచ్చిన బాబా

సాయిభక్తురాలు సాయి సిరి తన ఏడేళ్ల బాబుకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

మా బాబుకి బాబా అంటే చాలా చాలా ఇష్టం. వాడికి ఏ ఇబ్బంది కలిగినా బాబాను తలచుకొని ఆయనకు చెప్పుకుంటాడు. తనకు దెబ్బ తగిలినా, జబ్బు చేసినా తన నుదుటన ఊదీ పెట్టమని, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇవ్వమని అంటాడు. వాడు ఎక్కువగా టీవీ చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు ఏవైనా పదాలు అర్థం కాకపోతే, వాటి అర్థమేమిటని మమ్మల్ని అడుగుతుంటాడు. మేము చెప్తే సరే, లేకుంటే వాడు బాబా దగ్గరకి వెళ్లి, బాబా పటంపై మెల్లగా టిక్కు టిక్కుమని రెండుసార్లు కొట్టి, "బాబా! ఈ పదం అర్థం కాలేదు, దీని అర్థం ఏమిటి?" అని అడుగుతాడు. తరువాత వచ్చి ‘బాబా దాని అర్థం చెప్పారు’ అంటుంటాడు. ‘చిన్నవాడు కదా, ఏదో అలా అంటున్నాడులే’ అని అనుకునేవాళ్ళం. 2020, మే 26న కూడా టీవీలో కార్టూన్ సీరియల్ చూస్తూ నా దగ్గరకు వచ్చి, ఒక పదం చెప్పి, అదేమిటని అడిగాడు. వాడికి ముందు ఉండే పళ్లు అన్నీ ఊడిపోయి ఉండడంతో వాడి మాటలు నాకు స్పష్టంగా అర్థంకాక ‘నాకు తెలియదు’ అన్నాను. వాడు బాబా ఫోటో దగ్గరకి వెళ్లి ఎప్పటిలానే బాబాను అడిగాడు. వెంటనే వచ్చి, “అది తినే పదార్థమంట, బాబా చెప్పారు" అని చెప్పాడు. "అసలు నువ్వేమి అడిగావు? బాబా ఏం చెప్పారు?" అని రెండు మూడుసార్లు అడిగాను. కానీ, వాడు చెప్పేది అర్థంకాక వదిలేశాను. రెండు మూడు రోజుల తర్వాత ఏదో విషయంగా మా అన్నయ్య నాకు ఫోన్ చేశారు. మాటల్లో, రెండు రోజుల క్రితం బాబు ఇలా చేశాడని చెప్పాను. అప్పుడు అన్నయ్య "అవునా!" అని అన్నారు. ‘అవున’ని బదులిస్తూనే, "బాబు ప్రక్కనే ఉన్నాడు, మళ్లీ అడగనా?" అని అన్నాను. "సరే, అడగండి అయితే" అని అన్నయ్య అన్నారు. బాబుని దగ్గరకు పిలిచి, "మొన్న బాబా ఏమి చెప్పారు?" అని అడిగాను. వాడికి వెంటనే అర్థంకాక అయోమయంగా చూశాడు. అప్పుడు నేను కాస్త వివరంగా అడిగితే, "బాబా నాకు ‘తినే పదార్థం’ అని చెప్పారు" అన్నాడు. అది విన్న అన్నయ్య, "సరే! అసలు ఏమి అడిగాడో కూడా అడగండి. అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది" అని అన్నారు. నేను అడిగితే, వాడు మళ్ళీ అదే పదం చెప్పాడు. అప్పుడు కూడా నాకు వాడి చెప్పేది సరిగా అర్థం కాలేదు. కానీ ఫోనులో వాడి మాటలు వింటున్న అన్నయ్య, "వాడు 'సూజీ' అంటున్నాడు" అన్నారు. అప్పుడు నాకు అర్థమై, "నిజమే అన్నయ్యా! వాడికి 'జ' అక్షరం పలకడం సరిగా రావట్లేదు. అందుకే వాడు చెప్తుంది నాకు అర్థం కావడం లేదు" అని అన్నాను. అప్పుడు అన్నయ్య, " 'సూజీ' అంటే 'రవ్వ', అంటే తినే పదార్థమే కదా. దీనినిబట్టి బాబా వాడికి నిజంగానే సమాధానం ఇస్తున్నట్లున్నారు" అని అన్నారు. "అవును అన్నయ్యా, నాకూ ఇప్పుడే అర్థం అవుతోంది. వాడు చిన్నవాడు, వాడికి దాని అర్థం తెలియకే మమ్మల్ని అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. బాబా దగ్గరకి వెళ్లి వచ్చి 'తినే పదార్థమ'ని చెప్తున్నాడంటే, బాబా వాడికి సమాధానం ఇవ్వడం నిజమేననిపిస్తోంది” అన్నాను. తరువాత అన్నయ్య, "ఇంక అనుమానం అవసరం లేదు. బాబా వాడిపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా వుంది. సదా వాడిపై బాబా ఆశీస్సులు ఇలాగే ఉండాలి. ఆయన ప్రేమలో వాడు సంతోషంగా ఉండాలి" అని చెప్పి ఫోన్ పెట్టేశారు. చిన్నవయస్సులోనే నా బిడ్డ బాబా అనుగ్రహానికి ఇంతలా పాత్రుడైనందుకు ఒక తల్లిగా నాకెంతో ఆనందంగా అనిపించింది. "బాబా! మీకు నా ప్రణామాలు. ఎల్లప్పుడూ ఇలాగే నా బిడ్డపై మీ అనుగ్రహాన్ని కురిపిస్తూ వాడిని సంరక్షించండి".

బాబా ఆశీస్సులు అందిన సంకేతం

సాయిభక్తురాలు సాయి తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ సభ్యులకు, సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఇంతకుముందు కూడా ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు బాబా దయవల్ల మరొక అనుభవాన్ని పంచుకునే అవకాశం లభించింది.

నేను గత కొన్ని వారాలుగా ‘సాయిలీలామృతం’ పారాయణ చేస్తున్నాను. పారాయణ వల్ల నాకు చాలా మనశ్శాంతి లభించింది. ఆ పుస్తకంలో పారాయణ తరువాత అన్నదానం చేయమని ఉంది. కానీ ఇల్లు వదిలి ఎటూ కదలలేని పరిస్థితి వలన కనీసం ఒక్కరికి కూడా అన్నదానం చేయలేకపోయాను. నా ఈ స్థితికి నేను బాబాకు క్షమాపణ చెప్పుకుని, కనీసం ఏదో ఒక రూపంలో వచ్చి నేను వండిన పదార్థాన్ని స్వీకరించమని వేడుకున్నాను. బాబా ఏదో ఒక రూపంలో వస్తారని ఎంతో ఎదురుచూశాను. కానీ అలా జరగలేదు. మా కాలనీలో కుక్కలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఒక కుక్క తరచూ మేముంటున్న ఇంటికి వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే చిన్నపాప దానికి రోజూ ఆహారం ఇస్తుంటుంది. కనీసం ఆ కుక్కకైనా ఆహారం పెడదామని ఎంత ఎదురుచూసినా అది కూడా రాలేదు. కాస్త బాధగా అనిపించినప్పటికీ మనసుకి సర్దిచెప్పుకున్నాను. అప్పుడు బాబా చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది, “ఏ ఋణానుబంధం లేనిదే ఎవరూ ఎవరి దగ్గరకూ రారు” అని. దాంతో ఆ కుక్కకు నాకు ఋణానుబంధం లేదని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను. 

అలా రోజులు గడుస్తున్నాయి, మనసులో మాత్రం ఆ బాధ అలానే ఉంది. ఇంతలో మా అమ్మానాన్నల పెళ్లిరోజు వచ్చింది. “బాబా! అమ్మానాన్నలను ఆశీర్వదించండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని, దీర్ఘాయిష్షుని ప్రసాదించండి” అని బాబాను వేడుకున్నాను. పెళ్ళిరోజు సందర్భంగా అమ్మానాన్నలను బాబా గుడికి వెళ్ళమని చెప్పాను. కానీ, బాబా గుడిలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, కరోనా వల్ల రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగకూడదనే కారణంతో వాళ్ళు ఊరి బయట ఉన్న సరస్వతీదేవి గుడికి వెళ్లి వచ్చారు. దాంతో నేను, “బాబా! నేను ఏది అడిగినా మీరు చేయట్లేదు, పిలిచినా రావట్లేదు, ఎందుకు?” అని అడిగాను. కానీ అంతలోనే, ‘ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో అంతా బాబాకు తెలుసు, మేము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా బాబా ఆశీర్వాదం మాపై ఉంటుంది’ అని అనుకున్నాను, 

తరువాత మా నాన్న ఒక పనిమీద బయటికి వెళ్ళారు. కొంతసేపటికి నేను భోజనానికి ఎప్పుడు వస్తారో తెలుసుకుందామని మా నాన్నకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి, “నేనిప్పుడు జంగంపల్లిలో ఉన్న బాబా గుడి ముందు ఉన్నాను, ఇప్పుడే బైక్ దిగాను” అని చెప్పారు. ఆ మాట వినగానే నా మనసుకి ఎంతో సంతోషం కలిగింది. ఆ గుడి మా ఊరి నుండి 10 km దూరంలో హైవేలో ఉంటుంది. ఆరోజు శుక్రవారం అవటం వల్ల గుడి ఖాళీగా కూడా ఉంటుంది. వెంటనే బాబా దగ్గరకు వెళ్లి సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తరువాత కాసేపటికి మా నాన్న గుడిలో బాబా ఫోటో ప్రక్కన నిలుచుని సెల్ఫీ తీసుకుని నాకు పంపించారు. నేను ఉదయం నుండి బాబాను అడుగుతున్నాను, “అమ్మానాన్నలను మీరు ఆశీర్వదించినట్టు నాకు తెలియాలి బాబా” అని. అందుకు సాక్ష్యంగా బాబానే స్వయంగా నాన్నను ఫోటో తీసుకునేలా ప్రేరేపించి ఉంటారని ఎంతో ఆనందంతో బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.

మనం ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండి బాబాను విశ్వసించాలి. బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. “చాలా చాలా థాంక్స్ బాబా! ఎప్పుడూ మాతోనే ఉండండి. నీ భక్తులందరినీ కాపాడు, కరుణించు తండ్రీ!” శరణు సాయీ శరణు! 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


6 comments:

  1. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    లీలా విశ్వంభర.. వినీలా వికాసా
    సదా దివ్య తేజ..నిత్య జ్యోతి రూప!!
    ఘోర పపహరా... జ్ఞాన సంపన్న గంగాధర
    శోక తప్త నివారి..కర్మ క్షయ కింకరి ముని మౌళి!!
    సత్ చిత్ ఆనంద నిలయ..శిరిడి నివాసాయా
    గురునందన సద్గురు సాయినాథ పాహిమాం రక్ష రక్ష!!!

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై🙏🌹🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ...........

    ReplyDelete
  3. ఓం సాయిరాం
    బాబా తో మాట్లాడే ఆ బాబు నిజంగా అదృష్టవంతుడు

    ReplyDelete
  4. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo