సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 421వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 54వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకరోజు ఉదయం పది, పదకొండు గంటలకు నిత్యకర్మను చేసుకొని ఉయ్యాలపై కూర్చుని ఒక్కసారి ‘సాయినాథా’ అని బాబా పేరు ఉచ్ఛరిస్తూ, అదే సమయంలో మా బాబాయి ఇంటి దగ్గర ఒక ఫకీరు భిక్షను అడగటం చూశాను. దానితో బాబా పేరు ఉచ్ఛరించినంత మాత్రానే ఆ నామంలో ఉన్న శక్తితో బాబా ప్రకటమై స్థూలరూపాన్ని ధరిస్తారని నాకనిపించింది. శిరిడీలో నేను బాబా నామాన్ని (తీవ్రంగా) ఉచ్ఛరించినవుడు, "అరే, ఇంకా ఎందుకలా చేస్తున్నావు?” అంటూ తమ అయిష్టాన్ని ప్రకటించారు బాబా. దానిక్కారణం ఇదే అయి ఉండవచ్చునని నాకనిపిస్తోంది. ఆ తరువాత బాబా నామోచ్ఛారణను నేను సావధానంగా చేస్తుండేవాణ్ణి. అలాగే చాలా అరుదుగా నామోచ్ఛారణ చేసేవాడిని.

మోతాలో నేను సుదీర్ఘకాలం ఉన్న సమయంలో ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చింది. నువ్వులతో చేసిన లడ్డూలనూ, బియ్యం, పెసరపప్పుతో చేసిన కిచిడీనీ డబ్బుతోపాటు దానంగా ఇవ్వటం మా వంశంలో పూర్వంనుంచీ ఉన్న అలవాటు. ఆ ప్రకారంగా దానవిధి అయిన తరువాత లడ్డూ ప్రసాదం తినమని మా ఇంట్లోవాళ్లు నాకు ఇచ్చారు. అయితే దాన్ని నేను తినలేదు. ఎందుకంటే, ఏదో ఒక రూపంలో వచ్చి బాబా ఆ లడ్డూను స్వీకరిస్తేనేగానీ ఆ లడ్డూని నేను తినకూడదని మనసులో అనుకున్నాను. సాయంకాలం వరకూ ఎవరూ రాలేదు. ఇది జరగడానికి ముందు, అంటే నేను మోతా వెళ్ళిన రెండు మూడు రోజుల్లోనే అబ్దుల్లా లాంటి సాధువు ఒకరు రామేశ్వర ధర్మశాలలో వచ్చి ఉన్నాడు. ముస్లింలాగా కనిపించేవాళ్ళని అక్కడ ఎలా ఉండనిచ్చారన్న ఆలోచన అప్పట్లో నా మనసుకనిపించింది. సంక్రాంతిరోజు సాయంకాలం నేను దైవదర్శనం కోసం బయటకొచ్చాను. నేను ఇంట్లో లేని ఆ సమయంలో అతను మా ఇంటి ఎదురుగా వచ్చి నిలుచున్నాడట. ఆ సమయంలో మోఘీ అక్కయ్య బయటనే ఉందట. ఆయన ఆమెను నువ్వుండలు అడిగాడట. ఆమె భిక్ష కోసం ఉంచిన అయిదు లడ్డూలను అతనికిచ్చిందిట. వాటిని స్వీకరించి అతను, “మగవారు ఎక్కడున్నారు? మాకు మగవారితోనే పని" అని అన్నాడట. నేను ఇంటికి రాగానే మోఘీ అక్కయ్య ఈ విషయం నాతో చెప్పింది. దాంతో, “శ్రీసాయిబాబా నా ప్రతిజ్ఞను తెలుసుకొని స్వయంగా వచ్చి నా లడ్డూను స్వీకరించార”ని నాకు విశ్వాసం కలిగింది. దీనిద్వారా, “పారమార్థిక మార్గంలో పోవటం చిన్నపిల్లలు సరదాగా ఆడే ఆట కాదు. ఇది మగవారి యుద్ధం” అని సందేశమిచ్చారు.

శిరిడీలో ఉండి నేను సాయిబాబా లాంటి పూర్ణత్వాన్ని పొందిన మహాత్ముడిని చాలా కష్టపెట్టాను. అయితే వైరాగ్యం తక్కువగా ఉండటం వల్ల నాకు ప్రాప్తించవలసినది ప్రాప్తించలేదు. ఈ విచారంతో నా మనను ఖిన్నమైపోయింది. ఇది బాబా తప్పు కాదు. తప్పంతా నాదే. అప్పుడు దృఢ వైరాగ్యం ఉండి ఉంటే నాకప్పుడే అవన్నీ లభించి ఉండేవి. బాబా మతానుసారం సన్యాసం స్వీకరించటానికి కావలసిన వైరాగ్యం నాలో లేదు. నేను ఆయన పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి కాలేదని నాకు బాగా అనిపిస్తోంది. నిగూఢ విషయాలను నా మనసులోనే ఉంచుకొనే స్వభావం లేకపోవటం వల్ల సన్యాసం స్వీకరించాలన్న నా ఆలోచనకు అప్పుడు బాబా ఇచ్చిన అనుమతి గురించి మోఘీ అక్కయ్యకు చెప్పాను. అప్పుడు వైకుంఠరావు బాబాకి వివేకపూర్వకంగా ఓ లేఖను రాశాడు. 1913వ సంవత్సరంలో శిరిడీలో నేను పదకొండు నెలలున్న తరువాత సెలవిచ్చి బాబా నన్ను తిరిగి పంపించేశారు. అప్పుడు బాబా మానవరూపంలో వచ్చి, "మాకు కఠిన వైరాగ్యం ఉన్నవాళ్ళే అవసరం. నీలాంటి పచ్చికుండ వద్దు" అని నాకు సందేశమిచ్చారు.

దాని తరువాత ఆ సాధువు రామేశ్వరం ధర్మశాలలోగానీ లేదా మోతాలోగానీ ఎక్కడా కనిపించలేదు. మోఘీ అక్కయ్య, "మన ఇంటికొచ్చిన ఫకీరు మన ఊరివారు కాదు. వారెవరో కొత్త వ్యక్తి” అని కూడా చెప్పింది. దాంతో నాకు, “ఆ ఫకీరు మరెవరో కాదు, బాబానే!” అన్న విశ్వాసం కలిగింది. తరువాత నేను లడ్డూ తిన్నాను.

బాబాతో పాటు నేను శిరిడీలో ఉన్నప్పుడు నా వైరాగ్యం దృఢంగా లేదని అనిపించటం వల్ల బాబా నన్ను శిరిడీలో ఉంచలేదు. వారి కొలంబాలోని జొన్నరొట్టె విషయం నేను వారితో చెప్పినప్పుడు బాబా, "తరువాత చూద్దాం” అన్నారు. ఆయన క్రొత్త కఫ్నీ ధరించినప్పుడు అంతకుముందున్న కఫ్నీని ఇతరులకిచ్చేవారు. అప్పుడు నేను కూడా ఒకటి అడిగాను. కానీ వారు నాకు ఇవ్వలేదు. ఒకసారి ముక్తరాం ఉపయోగిస్తున్న కఫ్నీని నేను ధరిస్తే అతడు దానిని విప్పించి, "ఇప్పటివరకూ బాబా ఎవరినీ కూడా వారి ఇచ్ఛకు విరుద్ధంగా సన్యాసిని చేయలేదు” అన్నారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo