సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1294వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కృప చూపిన బాబా
2. తలచుకున్నంతనే కనపడకుండా పోయిన కాసు కనపడేలా చేసిన బాబా
3. సాయి ఎల్లప్పుడూ తమ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు

కృప చూపిన బాబా


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి. నేనిప్పుడు బాబాకి మాటిచ్చిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. నా భర్త కళ్ళకి రెటీనా సమస్య వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు నాలుగుసార్లు సర్జరీ చేశారు. ఇంకా చేస్తూనే ఉండాలట. 2022, జూలై చివరివారంలో ఒక సర్జరీ అయింది. అప్పుడు నేను, "సర్జరీ మంచిగా అయితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా సర్జరీ బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. నా భర్తను ఆ బాధ నుంచి కాపాడు తండ్రీ. పాపం, ఆయన నరకం అనుభవిస్తున్నారు".


ఇక, ఆ సందర్భంలోనే జరిగిన మరో అనుభవం గురించి చెప్తాను. మేము పదేళ్ల నుంచి స్టార్ హెల్త్ పాలసీ కడుతున్నాము. నా భర్త తన సర్జరీకి ముందు ఆ పాలసీ నెంబర్ తప్పు ఇచ్చారు. తీరా నేను సర్జరీ రోజు బిల్లు కట్టడానికి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు, "పాలసీ అప్లై కాలేదు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగమ"న్నారు. నేను వెళ్లి వాళ్ళను అడిగితే, "పాలసీ నెంబర్ తప్పు ఇచ్చారు" అన్నారు. నేను నా దగ్గర పాలసీ నెంబర్ చూపించాను. అయితే వాళ్ళు, "ఇప్పుడు అప్లై చేస్తే, డబ్బులు రావడానికి రాత్రి అవుతుందో, రేపు ఉదయం అవుతుందో చెప్పలేము" అన్నారు. ఆ విషయం డాక్టరుగారి పి.ఎ తో చెప్తే, అతను హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వాళ్లతో మాట్లాడి మాకు చాలా సహాయం చేశారు. మేము, "బిల్ పే చేసి వెళ్తాము. పాలసీ మనీ వస్తే, మాకు తిరిగి ట్రాన్స్ఫర్ చేయండి" అని రిక్వెస్ట్ చేశాము. ఆ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఎంతో మంచివాళ్లు. మేము అడగగానే సరే అన్నారు. నేను బిల్ పే చేసి ఇంటికి వచ్చాను. అయితే మరుసటిరోజు బిల్ కట్టించుకునే చోట ఉండే స్టాఫ్ ఫోన్ చేసి, "మీ పాలసీ క్యాన్సిల్ అయింది" అని చెప్పారు. నేను, "బాబా! మీ దయతో మాకు పాలసీ అప్లై అయి డబ్బులు వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నా భర్త ఆ డాక్టరుగారి పి.ఎకి ఫోన్ చేశారు. ఆయన మాకోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి పాలసీ అప్లై చేయించి, డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ అయ్యేలా సహాయం చేశారు. మేము అస్సలు నమ్మలేకపోయాము. నేనుగానీ, నా భర్తగానీ ఆ డబ్బులు వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే, బిల్ పే చేశాక మన గురించి ఆలోచించాల్సిన అవసరం హాస్పిటల్ వాళ్లకు లేదు కదా! కానీ బాబా ఆ పి.ఎ రూపంలో మాకు సహాయం చేశారు. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా".


ప్రస్తుతం మా బాబు ఆరవ తరగతి చదువుతున్నాడు. 2022, జూలై మూడవ వారంలో బాబుకి ఒక పరీక్ష పెట్టారు. అందులో వచ్చే మార్కులను బట్టి పిల్లలకి సెక్షన్స్ డివైడ్ చేసారు. తక్కువ మార్కులు రావడంతో మా బాబుని నాన్ ఐఐటి సెక్షన్లో వేశారు. అయితే మా బాబు, "నేను ఆ సెక్షన్‌కి వెళ్ళను" అని బాగా ఏడ్చాడు. నేను ఆ విషయమై బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా కృప చూపారు. మరుసటిరోజు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కలిసి మా బాబుని, "10 రోజుల తరువాత ఐఐటి క్లాసులో కూర్చోమ"ని అన్నారు. ఇప్పుడు మా బాబు ఐఐటి క్లాసులో కూర్చుంటున్నాడు. "థాంక్యూ సో మచ్ బాబా. ప్లీజ్ బాబా, సమస్యల నుంచి నన్ను కాపాడు. ఇంట్లో అందరికీ ఆరోగ్య సమస్యలు, దానికి తోడు గొడవలు. ఏ జన్మలో చేసిన పాపాలో నేను ఇప్పుడు నరక బాధలు పడుతున్నాను. ఈ సమస్యలతో పోరాడే ఓపిక నాకు లేదు. చాలా బాధగా ఉంది తండ్రి. నేను తెలిసి, తెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించి, కరుణతో కాపాడు బాబా ప్లీజ్".


తలచుకున్నంతనే కనపడకుండా పోయిన కాసు కనపడేలా చేసిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా సాయి పాదములకు నా అనంతకోటి నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాధారణ సాయి భక్తురాలిని. సాయే నా సర్వస్వం. ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇప్పుడు నేను ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, ఆగస్టు 5వ తారీఖున నేను శ్రీవరలక్ష్మీ వ్రతం చేసుకున్నాను. నేను నా అలవాటు ప్రకారం ఒక లక్ష్మీ కాసు పూజలో పెట్టాను. సాధరణంగా పూజ పూర్తయిన తర్వాత నేను ఆ లక్ష్మీ కాసు ధరిస్తాను. కానీ ఆ రోజు కొంచెం పనిలో ఉండి లక్ష్మి కాసును తర్వాత కట్టుకుందామని, దాన్ని తీసి బాబా విగ్రహం ఉన్న ప్లేటులో పెట్టాను. ఇంకా సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఐదు రోజుల తర్వాత ఆ కాసు విషయం గుర్తుకు వచ్చి, వెంటనే దేవుడి గదిలోకి వెళ్లి బాబా విగ్రహం ఉన్న ప్లేటులో చూస్తే, కాసు కనిపించలేదు. ఇంకా ఒకటికి రెండుసార్లు గది మొత్తం వెతికాను. కానీ కాసు ఎక్కడా దొరకలేదు. దాంతో బాబా పాదాల దగ్గర పెట్టిన పువ్వులతో పాటు ఆ కాసు తీసుంటానని అనిపించింది. వెంటనే వెళ్లి దేవుడి దగ్గర నుండి తీసిన వాడిపోయిన పూలున్న కవరులో ఒకటికి రెండుసార్లు వెతికాను గాని కాసు కనపడలేదు. ఇంకా నేను చాలా సెంటిమెంట్‍గా ఫీలై, 'ఎందుకిలా జరిగింది?' అని చాలా బాధపడ్డాను. మరుసటిరోజు ఉదయం సాయినాథుని తలుచుకుంటూ వాడిపోయిన పూలున్న కవరులో మళ్ళీ వెతికాను. సాయి మహిమ చూపించారు. ఒక పువ్వుకి అంటుకుని ఆ కాసు కనిపించింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ముందురోజు ఆ కవరులో ఎంత వెతికినా కనపడనిది మరుసటిరోజు బాబా నామం తలుచుకుంటూ వెతికితే, ఆ తండ్రి దయతో కనిపించింది. ఇక నా సంతోషానికి అవధులు లేవు. నమ్ముకున్న వారిని ఆపదల నుండి కాపాడుతారు సాయి. "థాంక్యూ సో మచ్ సాయి. ఏమైనా తప్పులుంటే క్షమించండి".


సాయి ఎల్లప్పుడూ తమ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను హైదరాబాదు నివాసిని. నేను ఇంతకుముందు చాలా అనుభవాలు సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. 2022, ఆగస్టు రెండోవారంలో నేను మెట్లు దిగుతూ అనుకోకుండా పడిపోయాను. ఆ ఘటనలో నా కాలికి దెబ్బ తగలడంతో నేను నడలేకపోయాను. కాలు బాగా వాచిపోవడంతో కాలు విరిగిందేమోనని నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను మన సాయిని మనసారా ధ్యానించి, "కాలుకి ఫ్రాక్చర్ ఏమీ లేనట్లయితే, నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం నేను నిద్రలేచేసరికి నా కాలు వాపు, నొప్పి చాలావరకు తగ్గిపోయాయి. ఇది సాయి కృప వల్లే జరిగిందని నా ధృఢ విశ్వాసం. ఆయన ఎల్లప్పుడూ తమ భక్తుల్ని కాపాడుతూ ఉంటారనడానికి ఇదో నిదర్శనం.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo