1. నమ్ముకున్న భక్తులను అన్నివిధాలా కాపాడే బాబా
2. అనారోగ్యం లేకుండా కాపాడిన బాబా
3. బాబాను ప్రార్థించిన క్షణంలోనే తగ్గిన జ్వరం
నమ్ముకున్న భక్తులను అన్నివిధాలా కాపాడే బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
అద్భుతానంత చర్యాయ నమః!!!
సాయిబంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నడుపుతున్న సాయికి నమస్కారం. నా పేరు శ్రీనివాసబాబు. మాది హైదరాబాద్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి సాయిభక్తుడిని. ఈమధ్య ఏ సమస్య ఉన్నా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుకు నా అనుభవాన్ని పంపిస్తానని బాబాకు చెప్పుకుంటే, ప్రతి సమస్యా తీరిపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఆ దృష్ట్యా ఈ బ్లాగ్ పూర్తిగా బాబా అనుగ్రహంతో, వారి సంకల్పంతో నడుస్తున్న అభినవ డిజిటల్ 'సాయి సచ్చరిత్ర' అనటంలో సందేహమే లేదు. ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటుండటం వల్ల 'బాబా ఎలాంటి సమస్య నుండైనా కాపాడే తండ్రి' అని ఆ తండ్రి మీద భక్తి, గౌరవాలు ప్రతి భక్తునికి కలుగుతున్నాయి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా, చాలా సంవత్సరాల ముందు జరిగిన రెండు అనుభవాలు చెప్తాను. ఒకరోజు నేను మంచి నిద్రలో ఉండగా బాబా ఒక గుదుము గుదిమి "ప్రక్కకు జరుగు" అన్నారు. నేను నిద్రలోనే ప్రక్కకు జరిగి మంచం మీద నుంచి క్రిందకు పడ్డాను. మెలకువ వచ్చి చూస్తే, నేను అప్పటివరకు పడుకున్న మంచం మీద సీలింగ్‌కి ఉండాల్సిన ఫ్యాన్ పడివుంది. ఈ వింత అనుభవాన్ని చాలామంది నమ్మరు కానీ, నమ్మిన భక్తులను బాబా ఎల్లవేళలా కాపాడుతారు. ఆనాడు ఆ తండ్రి నన్ను అలా కాపాడకపోయుంటే నేను ఇవాళ మీకు ఈ విషయం చెప్పగలిగేవాడిని కాను.
చిన్నవయసులో ఒకసారి నాకు అమ్మోరు పోసి ఒళ్లంతా మంటలతో బాధను భరించలేక బాగా ఏడుస్తుంటే మా అమ్మ, "బాబాని తలచుకుని పడుకో" అని చెప్పింది. కొన్ని గంటల తర్వాత బాబా నా దగ్గరకి వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. నేను, "ఒళ్లంతా మంటలుగా ఉంద"ని చెప్పాను. అందుకాయన, "నేనున్నానుగా, ఏమీ ఉండదులే" అని అన్నారు. ఆ క్షణమే నాకు మంటలు తగ్గి మంచి నిద్ర పట్టింది. తెల్లవారుఝామున అమ్మ వచ్చి నేను నిద్రపోతుండటం చూసి వెళ్ళిపోయి మరుసటిరోజు ఉదయం, "రాత్రి ఏమి జరిగింది?" అని అడిగింది. అప్పుడు నేను అమ్మతో, "రాత్రి బాబా నా దగ్గరే ఉన్నారు" అని చెప్పి గుక్కపెట్టి ఏడ్చాను. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించు సాయీ".
ఇప్పుడు ఈమధ్యకాలంలో బాబా ప్రసాదించిన అనుభవాలను చెప్తాను. ప్రస్తుతం మా అక్క అమెరికాలో ఉంది. తను అక్కడికి వెళ్లి మూడు నెలలు అవుతోంది. 2022, జూలై నెల చివరిలో అక్క నాకు ఫోన్ చేసి, "నా ఐపాడ్ ఫోన్ కనబడట్లేదు. ఇల్లంతా జల్లెడ పట్టాము, కానీ ఫోన్ ఎక్కడా దొరకలేదు” అని చెప్పి బాధపడింది. నేను వెంటనే బాబాను తలచుకుని, “బాబా! అక్క ఐపాడ్ ఫోన్ ఇంట్లోనే ఉండాలి. మీ ఆశీర్వాదంతో ఆ ఫోన్ దొరికితే, వెంటనే నేను మీ అనుగ్రహాన్ని ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాన”ని చెప్పుకున్నాను. ఒక అరగంట తర్వాత అక్క ఫోన్ చేసి, “ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి, బీరువాలో ఒక మూల ఉంది” అని చెప్పింది. “ధన్యవాదాలు బాబా”.
నేను ప్రతి పని బాబాని తలచుకుని చేస్తుంటాను. నేను ఒక కెమికల్ ప్లాంట్‌లో ప్యాకింగ్ సెక్షన్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నేను పనిచేసే చోట ఆడిటింగ్ వర్క్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ వర్క్ చాలా కఠినంగా ఉంటుంది. ఈమధ్య డ్రగ్ ఆడిట్ జరిగినప్పుడు నేను, “బాబా! ఏ ఆటంకాలు లేకుండా ఆడిట్ పూర్తయితే, నా అనుభవాన్ని ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాన”ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆడిట్ విజయవంతమయింది. నమ్మిన భక్తులకు బాబా ఎన్నడూ అన్యాయం చేయరు. కాకపోతే ఒక్కోసారి కొంచెం ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు 'నాకు ఏమీ జరగలేద'ని బాధపడకండి. ఏది, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు. ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? “ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే నన్ను కాపాడు తండ్రీ. నేను దేనిగురించి ఆరాటపడుతున్నానో మీకు తెలుసు సాయీ. వాటిని త్వరలో తీర్చు సాయీ. అవి నెరవేరిన వెంటనే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను”.
అనారోగ్యం లేకుండా కాపాడిన బాబా
శ్రీసాయినాథుని దివ్య పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు సౌదామిని. మాది భీమవరం. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఇలా పంచుకుంటూ ఉంటే బాబాతో నేరుగా మాట్లాడుతున్న భావన కలుగుతుంది. 2021వ సంవత్సరంలో పోస్ట్ కోవిడ్ వలన ఎన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని బయటపడ్డానో అది నా తండ్రి బాబాకి మాత్రమే తెలుసు. ఎందుకంటే, నా ప్రతి కష్టం ఆయనకు చేరవేయడం, అది అంతే సుళువుగా తీరిపోవడం జరుగుతూ వచ్చింది. ఇకపోతే, ఈమధ్య ఒక వారం పాటు యూరినరీ ప్రాబ్లం, సాయంత్రమయ్యేసరికి ఒళ్లునొప్పులు, ఇంకా విపరీతమైన ఆకలి, నీరసం, వాటితోపాటు నాకు ఏదో అయిందనే భయం పట్టుకుని విపరీతమైన ఆందోళనకు గురవుతుండేదానిని. అట్టి స్థితిలో నా తండ్రి బాబా నా పక్కనే ఉంటే నాకు ఏమీ కాదనే విశ్వాసంతో ఆయన మీద భారం వేసి గురుపౌర్ణమికి పూర్తయ్యేలా సచ్చరిత్ర సప్తాహపారాయణ మొదలుపెట్టాను. బాబా దయవల్ల ఎంత భయమున్నా ఆయన గుర్తుకు రాగానే అంతే తొందరగా నా ఆందోళన తొలగిపోతుండేది. నేను ఆయనపై నమ్మకముంచి గైనకాలజిస్టు దగ్గరకి వెళ్తే, అన్ని టెస్టులు చేయించారు. అప్పుడు నేను, "బాబా! అంతా నార్మల్ అని వచ్చేలా చూడండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. డాక్టరు, "మూత్ర సంబంధిత సమస్య ఏమీ రాలేదు. కేవలం బాగా నీరసంగా ఉన్నారు. ఆహారం పుష్టిగా తీసుకోండి" అని చెప్పి విటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు. "శతకోటి వందనాలు సాయితండ్రీ".
బాబాను ప్రార్థించిన క్షణంలోనే తగ్గిన జ్వరం
బాబాకి హృదయపూర్వక ప్రణామాలు. ప్రియమైన సాయిబంధువులకు నమస్కారాలు. బ్లాగ్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. బాబా వారికి మంచి ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించుగాక! నేను సాయిభక్తుడిని. ఇటీవల 75 ఏళ్ల వయసున్న మా అమ్మకు తీవ్రంగా జ్వరం వచ్చింది. మేము ఆమెకు అన్నిరకాల యాంటీబయాటిక్స్ ఇచ్చి, అన్ని టెస్టులు చేయించాము. టెస్టు రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. కానీ వారం రోజులైనా అమ్మ జ్వరతీవ్రత అలాగే ఉంది. అప్పుడు నేను చివరగా, "బాబా! అమ్మకి జ్వరం తగ్గి నార్మల్ అయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా బాబాను ప్రార్థించిన క్షణంలోనే అమ్మకు జ్వరం తగ్గి, టెంపరేచర్ నార్మల్‌కి వచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతం. అందుకే నేను ఎప్పుడూ ఈ బ్లాగ్ 'ఆధునిక సచ్చరిత్ర' అని భక్తులందరికీ చెప్తుంటాను. కాబట్టి బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ శ్రద్ధ, సబూరిని పాటించండి.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba thamaku prasadhinchina Anubhavalu Chaala manchiga panchukunnaru
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete