1. తీర్థయాత్రలకు బాబా అభయం
2. తుఫాను రేపి, చల్లార్చి తిరుమలేశుని దర్శనం చేయించిన బాబా
3. కోరినంతనే తీర్చేసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
'సాయి మహరాజ్ సన్నిధి' అనే సాయికుసుమాల బృందావనంలోకి ఒక తుమ్మెదనై తిరిగి వస్తూ బ్లాగ్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుకుంటున్నాను. నా పేరు సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవాల సాయిఅమృతాన్ని తనివితీరా గ్రోలవలసిందిగా భక్తులకు ప్రార్థన.
తీర్థయాత్రలకు బాబా అభయం:-
2022, జూన్ 24 నుండి 2022, జూలై 3 వరకు పది రోజులు కర్ణాటక యాత్రకు వెళ్లేందుకు అనుమతిని అర్థిస్తూ సద్గురు సాయినాథుని పాదాల చెంత చీటీలు వేస్తే, 'సంతోషంగా తీర్థయాత్ర చేయండి. నేను మీ వెన్నంటే ఉంటాన'ని సాయి నుంచి అనుమతి వచ్చింది. తదనుగుణంగా నేను 2022, జూన్ 24న హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి, అక్కడ యాత్రాబృందాన్ని కలుసుకున్నాను. మరుసటిరోజు నుండి పదిరోజుల పాటు మేము మా యాత్రలో భాగంగా మహానంది, అలంపురం, మంత్రాలయం, హంపి విజయనగరం, గోవా, గోకర్ణం, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, హళేబీడు, బేలూరు, మైసూరు, శ్రీరంగపట్నం, బెంగళూరు, కోటిలింగాల, శ్రీపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాలన్నీ దర్శించుకున్నాము. మా యాత్ర సమయంలో భారీవర్షాలు కురుస్తున్నప్పటికీ మాకు ఎక్కడా విఘ్నాలు కలుగకుండా బాబా కాపాడారు. ఆయన అనేకచోట్ల ఫోటో రూపంలో దర్శనమిస్తూ 'నేను మీ వెనకాలే ఉన్నాను' అంటూ మా యాత్రను దిగ్విజయంగా పూర్తిచేయించారు. అందుకు నేను శ్రీసాయినాథునికి ప్రణామాలు తెలుపుకుంటూ, 'యాత్ర దిగ్విజయంగా జరిగినట్లయితే, ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటాన'ని ఆయనకిచ్చిన మాటను ఆలస్యంగానైనా ఇలా నెరవేర్చుకున్నాను. ఆలస్యానికి క్షమించమని బాబాను ప్రార్థిస్తున్నాను.
తుఫాను రేపి, చల్లార్చి తిరుమలేశుని దర్శనం చేయించిన బాబా:-
శ్రీసాయినాథుని ఆశీస్సులతో నా భార్య 2022, జూలై 12 నుండి 2022, జూలై 19 వరకు తిరుమలలోని శ్రీవారి సేవకు ఎంపిక అయింది. అందువలన ఆమె 2022, జూలై 11న తిరుమల చేరుకుంది. 19వ తేదీన ఆమె సేవ ముగుస్తుందనగా ముందురోజు ఉదయం నేను, మా పెద్దమ్మాయి తిరుపతి చేరుకున్నాము. మా అమ్మాయి మ్రొక్కు కారణంగా శ్రీవారిమెట్లు మార్గం గుండా మేము కాలినడకన కొండపైకి బయలుదేరాం. మొత్తం 600 మెట్లు ఉండగా 300 మెట్లు ఎక్కాక, ‘మిగిలిన మెట్లు నేను ఎక్కగలనా?’ అని భయపడ్డాను. వెంటనే మన ఈ బ్లాగ్ గుర్తుకు వచ్చి, 'సునాయాసంగా కొండమీదకు చేరుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూడు గంటల్లో కొండపైకి చేరుకున్నాను. పైకి చేరేసరికి మాకోసం వసతి సౌకర్యంతో ఒక మిత్రుడు ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆ మిత్రుడు మరునాడు, అంటే 2022, జూలై 19 ఉదయం గం.8:45 నిమిషాలకి బ్రేక్ దర్శనం కూడా ఏర్పాటు చేశాడు. మాకు ఆ టికెట్లు ఇచ్చి తను కొండ దిగి తిరుపతి వెళ్ళిపోయాడు. తరువాత మాకు ఫోన్ చేసి, "రేపు ఉదయం 9 గంటలకి మీరు జె.ఈ.ఓ ఆఫీసు దగ్గర ఉండండి. నేను మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను" అని చెప్పాడు. కారణం, బ్రేక్ దర్శనానికి ఆరుగురం వెళ్లొచ్చు. 19వ తేదీ ఉదయం 8 గంటలకు మేము జె.ఈ.ఓ ఆఫీసు దగ్గరకి వెళ్లి, వాళ్ళ రాకకోసం నిరీక్షించాము. అయితే తొమ్మిది గంటలైనా వాళ్ళు రాలేదు. ఫోన్ చేస్తే, కలవలేదు. గం.9:45ని.లకి గేటు మూసేస్తారు. అందువలన నేను బాబాను తలుచుకుని, "ఈ తుఫాను రేపిన మీరే దీనిని నుండి బయటపడేయండి. ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని అక్కడే నిల్చున్నాను. అంతలో దూరంగా ఆ మిత్రుడు కారు కనబడింది. బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని, అందరం కలిసి 10 గంటలకు లోపలికి వెళ్లి, ఎంతో వైభవంగా, అతి దగ్గరగా శ్రీసాయి వెంకటరమణుని దర్శించుకున్నాం. సాయి భక్తులారా! బాబా ఉండగా భయమేలా? బాబా పాదపద్మములకు శతకోటి ప్రణామాలతో ...
- నిట్టల సూర్యనారాయణమూర్తి,
78/3 ఆర్.టి.విజయనగర్ కాలనీ, హైదరాబాద్ - 57.
కోరినంతనే తీర్చేసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. నా పేరు శిరీష. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా 2022, జూలై నెల చివరివారంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంటాను. కొన్నిరోజుల క్రితం మేము కార్పెంటర్‌ని పిలిచి మా పాపకోసం ఒక ఉయ్యాల చేయించాం. అది తయారయ్యాక కార్పెంటర్ మాతో, "దీన్ని వ్రేలాడదీయడానికి కావాల్సిన చైనులు తీసుకొస్తే, వచ్చి బిగిస్తాన"ని చెప్పి వెళ్ళిపోయాడు. మేము చైనులు తెప్పించి అతనికి మూడుసార్లు ఫోన్ చేస్తే, వస్తానన్నాడు కానీ రాలేదు. ఆపై ఫోన్ ఎత్తడం కూడా మానేశాడు. మాపాప రోజూ, "ఉయ్యాల వ్రేలాడదీయడానికి అతనిని ఎప్పుడు పిలుస్తార"ని అడుగుతుంటే, మేము తనకి ఏదో ఒకటి సర్దిచెప్తూ ఉండేవాళ్ళం. చివరికి జూలై 27 ఉదయం కూడా మేము అతనికి ఫోన్ చేశాాము. అతను లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను నా ఫోన్‍లో భక్తుల అనుభవాలు చదువుతుంటే, ఆరోజు అనుభవాలలో ఒక భక్తురాలు తమ పాప బొమ్మల సెట్ లోని బొమ్మలు కనపడకుండా పోతే, బాబాను ప్రార్థించడం వల్ల దొరికాయని చాలా వివరంగా వ్రాశారు. అది చదివాక నేను బాబాను, "స్వామీ! పాప చాలా ముచ్చటపడి అడుగుతోంది. మీ మనవరాలి కోరికను ఈరోజు తీర్చరా బాబా?" అని అడిగి స్నానానికి వెళ్లాను. వచ్చేసరికి కార్పెంటర్ వచ్చి ఉయ్యాల బిగిస్తూ కనిపించాడు. అరగంట క్రితం ఫోన్ చేస్తే, లిఫ్ట్ కూడా చేయనతను బాబాను కోరగానే తనంతటతానే వచ్చి ఉయ్యాల బిగిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగానూ, చాలా సంతోషంగానూ అనిపించి మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
2022, మే నెలలో నా కొత్త పట్టుచీర ఒకటి కనిపించలేదు. అది మా ఆడపడుచు నాకు కానుకగా ఇచ్చింది. అంతకు రెండురోజుల క్రితం దానిని చూశాను. తర్వాత మరి కనిపించలేదు. బీరువా అంతా వెతికాను, కానీ కనిపించలేదు. మొత్తం ఐదుసార్లు వెతికి ఇక అది పోయినట్లేనని నిర్ధారించుకున్నాను. కానీ ఎలా పోయిందని ఎంత ఆలోచించినా నాకు ఏమీ గుర్తురాలేదు. అయినా నేను 'మా ఇంట్లో దొంగతనం ఎలా జరిగింది? ఎవరు చేసుంటారు?' అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నెలరోజుల తరువాత జూన్ నెలలో మరొకసారి వెతికి చూద్దామనిపించి, "బాబా! పట్టుచీర పోయినందుకు కాదుగానీ, ఎవరు దొంగతనం చేశారో అర్థంకాక నాకు చాలా అశాంతిగా ఉంటోంది. మీ దయతో ఆ చీర దొరికితే మీకు ఒక పట్టుపంచె సమర్పించుకుంటాను. అలాగే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని అనుకుంటూ రెండు చీరలు తీశాను. అంతే, వాటికింద పోయిందనుకుంటున్న ఆ పట్టుచీర కనిపించింది. నాకు బాబా అద్భుతం చేశారనిపించింది. అంతకుముందు అదేచోట ఐదుసార్లు అన్నీ తీసి వెతికినప్పుడు కనిపించని చీర ఇప్పుడు కనిపించేసరికి నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటినుండి ప్రతిరోజూ ఈ అనుభవం వ్రాసి పంపుదామనుకుంటూనే వాయిదా వేస్తూ చివరికి పై ఉయ్యాల అనుభవం జరిగిన వెంటనే రెండు అనుభవాలను వ్రాసి మీతో పంచుకోవడానికి బ్లాగువారికి పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete