సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1291వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలిస్తే పలికే, తలచిన వెంటనే వచ్చే సాయి ఉండగా దేనికీ భయం లేదు
2. ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
3. స్మృతిమాత్ర ప్రసన్నుడు మన సాయినాథుడు

పిలిస్తే పలికే, తలచిన వెంటనే వచ్చే సాయి ఉండగా దేనికీ భయం లేదు


సాయిభక్తులందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. సాయినాథుడు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. సాయితండ్రి దయవలన మా పెద్దబ్బాయి జర్మనీలో MS చదువుతున్నాడు. ఆ బాబా అనుగ్రహాన్ని నేను నా గత అనుభవంలో తెలియపరిచాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే... మా అబ్బాయి 2022, ఏప్రిల్ 4న బయలుదేరి ఇండియా రావడానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే సరిగా తను బయలుదేరాల్సిన ముందురోజు తనకి కొద్దిగా జ్వరం వచ్చింది. దాంతో తను, 'ప్రస్తుత కరోనా సమయంలో నేను జ్వరంతో ఇండియా ఎలా వెళ్ళాలి? అమ్మానాన్నలకు ఇబ్బంది అవుతుందేమో!' అని భయపడ్డాడు. ఏదేమైనా చివరకు సాయిపై  భారం వేసి ఇండియాకి ప్రయాణమయ్యాడు. సాయినాథుని దయవల్ల తను క్షేమంగా ఇండియా చేరుకుని, 3  రోజులు గృహనిర్బంధంలో ఉన్నాడు. మాకుగాని, తనకుగాని ఎటువంటి ఇబ్బందీ లేకుండా కాపాడారు మా సాయి. బాబా దయవల్ల మే 24 వరకు మా అబ్బాయి ఆనందంగా గడిపి తిరిగి జర్మనీ వెళ్లి, ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తూ క్షేమంగా ఉన్నాడు.


చాలారోజుల నుంచి పిప్పిపన్ను ఒకటి నన్ను చాలా ఇబ్బందిపెడుతోంది. డెంటల్ హాస్పిటల్‌కి వెళ్తే, "రూట్ కెనాల్ చేయాల"ని చెప్పి, చేశారు. కానీ అది సరిగా జరగనందువల్ల ఇంకోరోజు రమ్మన్నారు. అయితే అప్పుడు కూడా మునుపటిలాగే సరిగా జరగలేదు. మూడవసారి వెళ్ళేటప్పుడు నేను బాబాను, "ఈరోజు ఎటువంటి ఇబ్బందీ లేకుండా రూట్‌ కెనాల్ జరిగేలా చూడండి బాబా" అని ప్రార్థిచాను. బాబా దయవలన నాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆరోజు రూట్ కెనాల్ చక్కగా జరిగింది. ఆ తండ్రిని నమ్ముకుంటే జరగనిది ఏముంటుంది?


ఈమధ్య 4 నెలలు నా భార్యకు నెలసరి సరిగా రాలేదు, ఒకవేళ వచ్చినా 10 రోజుల వరకు ఓవర్ బ్లీడింగ్ అవుతుండేది. దానివల్ల నా భార్య చాలా ఇబ్బందిపడుతూ తన ఉద్యోగ విధులు సరిగా నిర్వర్తించుకోలేకపోయేది. డాక్టరుకు చూపిస్తే, 'DMC ఆపరేషన్ చేయాల'ని చెప్పారు. నా భార్య చాలా భయపడింది. మేము సాయినాథునిపై భారమేసి, "ఆపరేషన్ లేకుండా తగ్గించమ"ని ప్రార్ధించసాగాము. నా భార్య రోజూ బాబా ఊదీని తన పొట్టపై రాసుకుంటూ ఉండేది. తరువాత వేరొక డాక్టరుని కలిసి వారి సలహాను తీసుకుందామని బాబాపై భారం వేసి వెళ్ళాం. ఆమె పరీక్ష చేసి, "ఆపరేషన్ అవసరం లేదు. మందులతో తగ్గుతుంది" అని చెప్పారు. బాబా దయవలన ఊదీ ప్రభావంతో ఆపరేషన్ లేకుండానే నా భార్య ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది.


గతంలో నా భార్య 'మా చిన్నకుమారుడికి MBBS సీటు వస్తే, తిరుపతి వెంకన్నకు కళ్యాణం చేయిస్తానని, మెట్లపూజ చేస్తాన'ని మ్రొక్కుకుంది. బాబా దయవలన మా అబ్బాయికి MBBS సీటు వచ్చి ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ మా నాన్నగారు, అమ్మగారు పరమపదించడం వల్ల, ఇంకా కరోనా వలన మొక్కులు తీర్చలేకపోయాము. ఈ సంవత్సరం మ్రొక్కు తీర్చుకుందామని అనుకుంటే, వెంకన్న కళ్యాణం కేవలం ఆన్లైన్‍లోనే బుక్ చేసుకోవాలన్నారు. సరేనని మేము రెండు, మూడుసార్లు ఆన్లైన్లో బుక్ చేయడానికి ప్రయత్నించాం, కానీ బుక్ అవలేదు. ఇక మేము, "బాబా! ఎలాగైనా ఈ సంవత్సరం తిరుపతి వెంకన్న మ్రొక్కు తీర్చే మార్గం చూపండి" అని బాబాను ప్రార్థించాము. బాబా దయవలన నా భార్య ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఆన్లైన్లో మా పేరు మీద జూలై 8న వెంకన్నస్వామి కళ్యాణానికి, అలాగే రూమ్ బుక్ చేసి పెట్టాడు. వెంటనే మా బాబువాళ్ళు రానుపోను రైలు టికెట్లు బుక్ చేశారు. జూలై 6న మేము, మాతోపాటు నా భార్య స్నేహితురాలు, ఆవిడ ఇద్దరమ్మాయిలు బయలుదేరాము. మేము 7వ తేదీ ఉదయం తిరుపతిలో దిగాము. కానీ మెట్లపూజ చేయగలమో, లేదోనని చాలా భయపడ్డాము. ఎందుకంటే, నాకు 50, నా భార్యకి 47 సంవత్సరాల వయస్సు. అదీకాక మా ఇద్దరినీ వెన్నునొప్పి కొంచెం ఇబ్బందిపెడుతోంది. కానీ మేము మెట్టు మెట్టుకూ బాబా నామస్మరణ చేసుకుంటూ పూజ చేయసాగాము. నేనైతే నా కుమారునితో పాటు ఎంతో ఉత్సాహంగా పూజ చేశాను. మీరు నమ్మరు, మెట్లపూజ చేసేటప్పుడుగానీ, తరువాతగానీ నాకు ఎటువంటి ఇబ్బందులూ లేవు. నా తండ్రి సాయి దయతో గత 5 సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న మ్రొక్కును ఏ ఆటంకాలు లేకుండా తీర్చుకుని 10వ తేదీన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. పిలిస్తే పలికే, తలచిన వెంటనే వచ్చే నా తండ్రి సాయి ఉండగా దేనికీ భయం లేదు. ఆ తండ్రి గూర్చి ఎంత చెప్పినా తక్కువే. నా తండ్రి సాయి పాదపద్మములకు శతకోటి వందనాలు.


శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా


అందరికీ నమస్కారం. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అదృష్టాన్ని ప్రసాదించిన ఈ బ్లాగువారికి ధన్యవాదాలు. మీపై బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో చిన్న అనుభవాన్ని పంచుకునేలా దయ చూపిన బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఒకరోజు మావారి ఆఫీసువాళ్లు కుటుంబాలతో చిన్నగా ఒక ట్రిప్‍కి వెళ్దామని ప్లాన్ చేశారు. మా కుటుంబంలో అందరం కూడా ఆ ట్రిప్‍కి వెళ్ళాము. ట్రిప్ అంతా బాగానే జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మాయి కడుపునొప్పి అని బాధపడింది. విరోచనమైతే సెట్ అవుతుందనుకున్నాము. కానీ తర్వాత కూడా తనకి కడుపునొప్పి అలానే ఉంది. దానికి తోడు వాంతి అయ్యేటట్లు కూడా ఉందని అమ్మాయి చెప్పింది. మేము తనతో, "సరే, ఏం కాదులే" అని సర్ది చెప్పాము. ఆ తరువాత నేను, "బాబా! నేను మీపై భారం వేస్తున్నాను తండ్రి. పాపకి ఏ ఇబ్బంది లేకుండా చూసి, మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయతో మా అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా నిద్ర పట్టేసింది. ఇంకా బాబా మా అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా. మీరు ప్రసాదించిన ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి. ఈమధ్య అందరూ వైరల్ ఫీవర్ వంటి రకరకాల జ్వరాలతో బాధపడుతున్నారు. దయచేసి అందరినీ ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. మా అందరి భారం పూర్తిగా మీదే తండ్రి. ప్రతి ఒక్కరికీ మీరే రక్షగా ఉండండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి".


సర్వేజనా సుఖినోభవంతు!!!


స్మృతిమాత్ర ప్రసన్నుడు మన సాయినాథుడు


నా పేరు మల్లేశ్వరి. నేను హైదరాబాదు నివాసిని. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా కృతజ్ఞతలు. నేను ఈ బ్లాగ్ ద్వారా ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను పంచుకున్నాను. ఇది మూడోసారి. ఈమధ్య నా బంగారు లక్ష్మీదేవి లాకెట్ కనబడలేదు. బీరువాలోను, ఇంకా ఇల్లంతా ఆ లాకెట్ కోసం వెతికి వెతికి నాకు నీరసమొచ్చింది కానీ, లాకెట్ కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా!  మీ కృపతో ఆ లాకెట్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రీ. దయాసింధూ! ఇంతకుముందు ఇలా వేడుకుంటే, నన్ను కాపాడావు" అని బాబాని వేడుకుంటూ రెండు రోజులు గడిపాను. ఆ తర్వాత రాఖీపౌర్ణమి ముందురోజు కొన్ని వస్తువులు కొనుక్కుందామని డబ్బుల కోసం బీరువా తెరిచాను. పక్కనే ఉన్న మా పాపతో ఆ లాకెట్ గురించి చెప్పి వెతకమన్నాను. తను వెంటనే ఎదురుగా ఉన్న గులాబీ రంగు పెట్టెలో నుండి ఆ లాకెట్ తీసి నాకు ఇచ్చింది. దాన్ని చూసి నా సంతోషానికి అవధులు లేవు. నేను అంతకుముందు ఎన్నోసార్లు ఆ పెట్టెలో వెతికాను. అప్పుడెప్పుడూ ఆ లాకెట్ కనిపించలేదు. స్మృతిమాత్ర ప్రసన్నుడైన సాయినాథుని వేడుకున్నంతనే నా లాకెట్ కనిపించేలా చేశారు. ఆ దయార్ద్రస్వరూపుడు మనల్ని ప్రతిక్షణం కనిపెట్టుకుంటూ మన మనోవిచారాలన్నిటినీ వేడుకున్నంతనే పోగొడుతున్నారు. "దయాసింధూ! నీ పాదపద్మములకు అనంతకోటి వందనాలు".


ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ బాబా మీ దయ వుంటే భయం దేనికి. సాయి నువ్వు చూపించే ప్రేమ దయ ఆశీస్సులు అన్ని నా కు కావాలి. బాబా నీకు శత కోటి నమస్కారాలు

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo