1. బాబా కృపతో సమస్యల నుండి విముక్తి
2. స్తవనమంజరి పారాయణతో శ్రీహనుమాన్ మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా
3. బాబా అనుగ్రహం
బాబా కృపతో సమస్యల నుండి విముక్తి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు రఘు. మాది హైదరాబాద్. నేను గతంలో కొన్ని అనుభవాలను మన ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా, అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఎం.బి.ఏ చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రతి శనివారం ఆన్లైన్లో క్లాసులు జరుగుతాయి. బాబా దయవలన నేను 4 మాడ్యూల్స్ పాసయ్యాను. ఇంకా 6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక శనివారం పరీక్ష ఉందని నేను ముందురోజు శుక్రవారంనాడు పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుండగా హఠాత్తుగా నా లాప్టాప్ రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అవటానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ లాప్టాప్ పనిచేస్తుందిలే అనుకున్నాను. కానీ పది నిమిషాల తరువాత మళ్ళీ రీస్టార్ట్ అయి అప్పుడు కూడా చాలా సమయం తీసుకుంది. దాంతో, 'ఇలా అయితే రేపటి పరీక్షకి ఎలా ప్రిపేరవ్వాలి? అంతేకాదు, రేపు కూడా ఇలాగే రీస్టార్ట్ అయితే నేను పరీక్షలో ఫెయిల్ అవుతాను" అన్న భయంతో చాలా టెన్షన్‌గా అనిపించింది. వెంటనే, "సహాయం చేయండి బాబా. లాప్టాప్‌కి ఎటువంటి సమస్యా రాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. అప్పటినుండి లాప్టాప్ రీస్టార్ట్ సమస్య మళ్ళీ రాలేదు. బాబా దయవలన నేను శనివారం పరీక్ష బాగా వ్రాసి పాసయ్యాను. "ధన్యవాదాలు బాబా. మీరే నాకు సహాయం చేసి మిగిలిన మాడ్యూల్స్ కూడా పాస్ చేయించి మంచి గ్రేడ్ వచ్చేటట్లు దీవించండి స్వామీ".
బాబా దయవలన మేము ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని దాన్ని అద్దెకు ఇచ్చాము. ఆ అద్దె డబ్బులే EMI కట్టడానికి నాకు ఉపయోగపడుతుండేవి. బాబా దయవల్ల కరోనా సమయంలో కూడా ఆ ఇల్లు ఖాళీగా లేదు. అలాంటిది 2022, ఏప్రిల్ నెలలో ఆ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేశారు. సరేనని టులెట్ బోర్డు పెట్టి, "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. కానీ రెండు నెలలు గడిచినా ఎవరూ ఆ ఇంటిలోకి అద్దెకు రాలేదు. ఇల్లు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ మరీ తక్కువ డబ్బులకు అద్దెకు అడుగుతుండేవాళ్లు. నేను రోజూ బాబాను, "అద్దె విషయంలో సహాయం చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఒక కుటుంబం నాకు ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడిగారు. వాళ్ళకి నా ఇల్లు గురించి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదుగానీ బాబా దయవల్ల వాళ్ళు ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు ఎక్కువ రోజులు ఆ ఇంటిలో ఉండేటట్టు అనుగ్రహించండి స్వామీ".
2022, జూలై నెల చివరివారంలో ఒకరోజు ఉదయం నాకు కొద్దిగా జలుబు ఉన్నప్పటికీ బాగానే ఉన్నందువల్ల నేను మూమూలుగానే ఆఫీసుకి వెళ్ళాను. అయితే సాయంత్రానికి జ్వరం వచ్చింది. ఆ రాత్రి టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి జ్వరం లేదుగానీ ఒళ్ళునొప్పులు, దగ్గు, జలుబు ఉండేసరికి నా స్నేహితుడికి ఫోన్ చేస్తే తనకి కూడా ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు ఉన్నాయని చెప్పాడు. ఇంకా నాకు భయమేసింది. ఎందుకంటే, కోవిడ్ మొదటి వేవ్‌లో మా కుటుంబమంతా కరోనా ప్రభావానికి గురై బాగా ఇబ్బందిపడ్డాము. బాబా దయవల్లే కోలుకున్నాము. నేను టాబ్లెట్లు వేసుకుని ఆవిరి పట్టాను. కానీ, రాత్రికి జ్వరం వచ్చింది. రెండు రోజులైనా కూడా జ్వరం, ఒళ్ళునొప్పులు, దగ్గు మరియు జలుబు తగ్గలేదు. అప్పుడు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ, "బాబా! దయచేసి నా ఆరోగ్యాన్ని బాగుచేసి నాకు సహాయం చేయండి. మీ దయతో నాకు నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, బాబా దయవలన జ్వరం తగ్గిపోయింది. "బాబా! మీకు వందనాలు. మీరే నాకు తల్లి, తండ్రి మరియు గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రీ. ఇంకా నాకున్న ఆరోగ్య సమస్యను తగ్గేలా చేయండి బాబా. అలాగే నాకున్న సొంతింటి కోరికను కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీసాయినాథార్పణమస్తు!!!
స్తవనమంజరి పారాయణతో శ్రీహనుమాన్ మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా
సాటి సాయిబంధువులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. ఒకరోజు నేను మా తొమ్మిది నెలల పాపని బంతితో ఆడిస్తున్నప్పుడు పొరపాటున ఆ బంతి మా ఇంటి హాల్లో ఉన్న శ్రీహనుమంతుని ఫోటోకి తగిలింది. ఆ సంఘటనతో నాకు చాలా బాధ, భయం కలిగాయి. వెంటనే హనుమంతునికి క్షమాపణలు చెప్పుకుని, "108 సార్లు గుంజీలు తీస్తాన"ని మొక్కుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో బెడ్‌రెస్ట్ తీసుకోవడం వల్ల నేను బరువు పెరగడం, పైగా వ్యాయామం చేసి చాలా రోజులు అవడం వల్ల 11 గుంజీలు తీసేసరికి బాగా అలసిపోయాను. కొన్నిరోజుల తర్వాత ఒక సాయిభక్తుని ద్వారా 'సాయి స్తవనమంజరి' గురించి తెలుసుకుని 2022, ఆగస్టు 22న శ్రద్ధగా చదివాను. తరువాత అనుకోకుండా నేను హనుమంతుని ఫోటో ముందు నిలబడి టీవీలో హనుమాన్ చాలీసా పెట్టుకుని 108 గుంజీలు తీసేశాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, గుంజీలు తీసిన తరువాత రోజువారీ అలవాటు ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి సాయి ఫోటోలు పెడదామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, మొట్టమొదట హనుమంతుని ఫోటో నాకు దర్శనమిచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మ్రొక్కు తీర్చగానే ఫోటో రూపంలో ఆయన తమ దర్శనంతో నన్ను ఆశీర్వదించారని అనిపించింది. "బాబా! మీ స్తవనమంజరి చదివిన తరువాతే నేను మ్రొక్కు తీర్చుకోగలిగాను. మీకు, హనుమంతునికి ధన్యవాదాలు. ఇంకా మా మ్రొక్కులు కొన్ని తీర్చుకోనందుకు నన్ను, నా కుటుంబాన్ని క్షమించి, ఆ మ్రొక్కులు తీర్చుకునే శక్తిని ప్రసాదించండి బాబా. తప్పులేవైనా వ్రాసివుంటే క్షమించండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా అనుగ్రహం
సోదరభావంతో తోటి సాయిభక్తులకు బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిస్తున్న బ్లాగ్ నిర్వాహకులైన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మాతో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఇటీవల జీతం పెంచాల్సి ఉండగా నేను ప్రతిపాదించే ఇంక్రిమెంట్‌కు భాగస్వాములు అంగీకరిస్తారా, లేదా అనే సందేహం నా మనసులో మెదిలింది. అప్పుడు నేను సాయి భగవానుని, ఆ విషయంలో అనుగ్రహించమని ప్రార్థించి, "అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. సాయి ఆశీస్సులతో నా భాగస్వాములు అతనికి నేను ప్రతిపాదించిన ఇంక్రిమెంట్ ఇవ్వడానికే కాకుండా అతన్ని కూడా ఒక భాగస్వామిగా తీసుకోవడానికి అంగీకరించారు. "బాబా! నేను మీకు వాగ్దానం చేసినట్లుగా ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటూ మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను".
శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain. Help her health gain Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sairam
ReplyDelete