సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1301వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి దిగులునైనా తీసేసే బాబా
2. నమ్ముకున్నవారికి బాబా అండగా ఉంటారు
3. కోవిడ్ నుండి బయటపడేసిన బాబా

ఎటువంటి దిగులునైనా తీసేసే బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు కల్పన. మాది హైదరాబాదు. నా అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించిన బాబాకు, ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. 2021, డిసెంబరులో మా అమ్మాయిని ఎంబిబిఎస్ చదువుకోసం ఉక్రెయిన్ పంపించాము. తరువాత రెండు నెలలకి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై తను అక్కడ చిక్కుకుపోయింది. టీవీలో న్యూస్ చూస్తుంటే, మాకు చాలా భయమేస్తుండేది. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, "బాబా! నీదే భారం. మమ్మల్ని నువ్వే చూసుకోవాలి" అని వేడుకుంటాను. మా అమ్మాయి విషయంలో కూడా నేను బాబా మీద భారమేసి, "బాబా! మీరే మా పాపని ఎలాగైనా సురక్షితంగా ఇంటికి తీసుకుని రావాలి" అని వేడుకున్నాను. పాప అక్కడినుండి రావడానికి పది రోజులు పట్టినప్పటికీ బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇండియాకు వచ్చింది. మనకు ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా బాబా మీద భారం వేస్తే, ఆయన మనకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటారు.


నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది. ఆ విషయమై నేను డాక్టరుని సంప్రదిస్తే, స్కానింగ్ చేసి, "గర్భసంచి వాచింది. దానివల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంద"ని చెప్పి గర్భసంచి క్లీన్ చేసి టెస్టుకు పంపారు. అప్పుడు నేను దిగులుతో, "బాబా! టెస్టు రిపోర్టు నార్మల్ వస్తే, నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ అని వచ్చింది. అలా బాబా దిగులు తీసేసారు.


2022, ఫిబ్రవరిలో మావారు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కలిసి ముంబయి, శిరిడీ వెళ్లారు. శిరిడీలో బాబాను దర్శించుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి, "మేము గోవా వెళ్తున్నామ"ని చెప్పారు. నేను, "వద్దు, ఇంటికి వచ్చేయండి" అని చెప్పాను. కానీ వాళ్ళు నా మాట వినకుండా గోవా వెళ్లారు. అక్కడ మావారికి జ్వరం, జలుబు వస్తే, మామూలు జలుబు, జ్వరమే అనుకుని టాబ్లెట్ వేసుకున్నారు. అయితే మా ఆడపడుచు వాళ్ళ బాబుకి కూడా జ్వరం వచ్చింది. తను అక్కడినుండి ఇంటికి వచ్చిన తర్వాత అనుమానంతో కరోనా టెస్ట్ చేయించుకుంటే, పాజిటివ్ వచ్చింది. దాంతో మావారు కూడా టెస్టు చేయించుకున్నారు. ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో నాకు, మా పిల్లలకి కూడా కోవిడ్ వస్తుందేమో అని భయమేసి, "బాబా! నాకు, పిల్లలకి కోవిడ్ రాకుండా నువ్వే చూసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మాకు కోవిడ్ రాలేదు. మేమంతా క్షేమంగా ఉన్నాము. మా జీవితంలోకి సాయిబాబా రావడం గొప్ప అదృష్టం.  "బాబా! మేము నిన్ను మరిచినా నువ్వు ఎల్లప్పుడూ మా వెంట ఉన్నావు తండ్రి. మీ ఆశీస్సులతో అందరూ సదా సంతోషంగా ఉండాలి".


నమ్ముకున్నవారికి బాబా అండగా ఉంటారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య నా భార్య చెల్లెలి పెళ్లి హైదరాబాదులో వైభవంగా జరిగింది. తీవ్రమైన వర్షాల ప్రభావం వల్ల పెళ్ళైన మరుసటిరోజు నాకు బాగా నీరసంగా అనిపించింది. ఆ మరుసటిరోజుకి విపరీతమైన జ్వరం కూడా వచ్చి పూర్తిగా మంచానికి అతుక్కుపోయాను. అయితే ఆ రాత్రికే నేను తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉండగా ఆ స్థితిలో ప్రయాణం ఎలా చేయాలో నాకు అర్ధం కాలేదు. పోనీ సెలవు పొడిగించుకుందామంటే వారం తరువాత సెలవు అవసరం నాకు చాలా ఉంది. కాబట్టి సెలవు పొడిగించుకోలేను. అందువల్ల బాబాను ప్రార్థించి ఊదీ నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీ నీళ్ళల్లో కలిపి తాగి, పారాసెటమాల్ టాబ్లెట్ కూడా వేసుకుని బాబా నామస్మరణ చేస్తూ విశ్రాంతి తీసుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి జ్వరం నుండి ఉపశమనం లభించింది. ఇంకా, "రాత్రి ప్రయాణంలో జ్వరం రాకుండా చూడమ"ని బాబాని ప్రార్థించి ప్రయాణమయ్యాను. బాబా దయవల్ల ఆ రాత్రి ప్రయాణంలో జ్వరం రాలేదు. మరుసటిరోజు కూడా జ్వరం లేకపోయేసరికి ఆఫీసుకి వెళ్ళొచ్చాను. నమ్ముకున్నవారికి బాబా అండగా ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం కొద్దిగా గొంతు పట్టినట్లు ఉంది. బాబా దయవల్ల అది కూడా త్వరగా నయమవుతుందని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా".


మొదట నేను రైల్వేలో జూనియర్ ఇంజనీరుగా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం సీనియర్ సెక్షన్ ఇంజనీరు ప్రమోషన్ కోసం ప్రాసెస్ అవుతుండగా ఒక చిన్న సమస్య వచ్చి పడింది. మొదటిసారి మెడికల్ టెస్టు చేసేటప్పుడు క్లర్క్ తప్పిదం వల్ల A3 మెడికల్ స్టాండర్డ్ టెస్టు చేయించుకోవాల్సిన మా బ్యాచ్ వాళ్ళందరం B1 మెడికల్ స్టాండర్డ్ చేయించుకున్నాం. ఆ కారణంగా మా ప్రమోషన్‍కి ఇబ్బంది అయి, A3 మెడికల్ ఫిటినెస్ రిపోర్ట్ తీసుకుని రమ్మన్నారు. అయితే ఈ ఐదు సంవత్సరాలలో నా కంటి సైట్ బాగా పెరిగింది. అందువల్ల సమస్య అవుతుందేమేనని భయపడి శ్రీ సాయినాథుని తలుచుకుని మెడికల్ టెస్టుకి వెళ్ళాను. కళ్లద్దాలు లేకుండా నేను అస్సలు చదవలేకపోయాను(6/9 విత్ or వితౌట్ స్పెక్ట్స్ ఉండాలి). దాంతో డాక్టరు, "బయట ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుని, రిపోర్టులు తీసుకునిరండి" అని చెప్పారు. నేను ఆ సాయినాథుని మీదే నమ్మకముంచి దారంతా ఆయననే తలుచుకుంటూ ఐ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్లి చూపించుకుని రిపోర్టు తీసుకున్నాను. తరువాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసి అనుభవాలు చదివి బాబాకి దణ్ణం పెట్టుకుని మళ్ళీ రైల్వే హాస్పిటల్‍కి వెళ్ళాను. 'రిపోర్టులో ఫిట్ అని వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అనుకోని డాక్టర్ కేబిన్‍కి వెళ్ళాను. ఆ డాక్టర్ అంతా చెక్ చేసి, ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతా ఆ బాబా దయ. మనం ఏం తప్పు చేయనప్పుడు ఆ బాబా మీద భారం వేస్తే, అంతా ఆయన చూసుకుంటారు అనే దానికి ఇదే నిదర్శనం. "బాబా!  మీ మీద పూర్తి నమ్మకముంచితే మీరు చూసుకుంటారని చెప్పినా నేను భయపడ్డాను. నన్ను క్షమించు తండ్రి. మీ దయతో ఏ ఇబ్బంది లేకుండా ప్రమోషన్ వస్తే, ఐదుగురికి అన్నదానం చేస్తాను, అలాగే నా అనుభవం మీ బ్లాగులో పంచుకుంటాను తండ్రి. ఇంకా నా భార్యకి సుఖప్రసవమై తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


కోవిడ్ నుండి బయటపడేసిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేను రోజూ ఈ బ్లాగును చదువుతాను. అలా చదువుతుంటే నా మనసుకు ప్రశాంతంగా, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు జ్యోతి. మేము యుఎస్‍లో ఉంటాం.  2022 జూన్, జూలై నెలలల్లో మా కుటుంబమంతా ఇండియాకి వచ్చాం. నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టరుకి చూపించుకుందామని నేను, నా భర్త మధురై వెళ్ళాము. అక్కడ చికిత్స జరుగుతుండగా నాకు, నా భర్తకి కోవిడ్ వచ్చింది. అదే మొదటిసారి మాకు కోవిడ్ రావడం.  కాబట్టి నేను చాలా భయపడిపోయాను. నా భర్త మాత్రం 'అంతా బాబా చూసుకుంటార'ని ధైర్యంగా ఉన్నారు. హాస్పిటల్ వాళ్ళు కోవిడ్ వల్ల చికిత్స ఆపేశారు. దాంతో మేము చేసేదేమీ లేక ఇంటికి వచ్చి గృహనిర్బంధంలో ఉండసాగాము. ఆ సమయంలో నేను బాబాకి దణ్ణం పెట్టుకోని క్షణం లేదు. మొదటి మూడు రోజులు నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు నా మనసులో, "బాబా! త్వరగా ఈ కోవిడ్ లక్షణాలు తగ్గితే, బ్లాగులో నా అనుభవం పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయవల్ల మరునిమిషం నుండి నా మనసు చాలా తేలికపడింది. తర్వాత ఐదు రోజులకి కోవిడ్ టెస్టు చేయించుకుంటే, 'నెగిటివ్' వచ్చింది. అలా అనుగ్రహించి బాబా నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. జన్మజన్మలకు నేను మీపట్ల కృతజ్ఞతగా ఉంటాను. మీరు నా జీవితంలో ఎన్నో సమస్యలను తీర్చారు. ప్రస్తుతం నేను నా ఆరోగ్యం గురించి చాలా మధన పడుతున్నానని మీకు తెలుసు బాబా. నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఏం చేయాలో దారి చూపండి బాబా. దయచేసి నన్ను ఈ సమస్యల నుండి త్వరగా బయటపడేసి నా మనసు ప్రశాంతంగా ఉండేటట్లు చూడండి బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


8 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sai ram 🙏🙏🙏

    ReplyDelete
  3. Jaisairam bless supraja and help her to resolve back and neck pain problems 🙏

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ రేపు దీపావళి పండుగ. పండుగ తర్వాత కారీ్తీక మాసం వస్తుంది. శివారాధన మొదలు అవుతుంది.

    ReplyDelete
  5. Samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo