సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1303వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు

బాబా దయ


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి పాదాభివందనాలు. బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఆమధ్య మా ఊరిలో బంధువులందరూ పదిరోజులు కాశీయాత్రకి వెళ్లారు. వాళ్లలో చాలా పెద్దవాళ్ళు, చాలా చిన్నపిల్లలు ఉన్నందున నేను, 'వాళ్ళందరూ క్షేమంగా వెళ్లి, దర్శనాలన్నీ బాగా చేసుకుని ఎవరింటికి వాళ్ళు తిరిగి వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. ముఖ్యంగా నేనే వాళ్ళందరినీ వెళ్లిరమ్మని చెప్పి పంపినందువల్ల వాళ్ళు వెళ్ళింది మొదలు తిరిగి వచ్చేవరకు వాళ్ళ క్షేమం గురించి బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. యాత్రలో ఒకరోజు పూరి, కూర తిన్నాక వాళ్ళందరూ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బందిపడ్డారు. ఆ విషయం తెలిసి నేను ముందు భయపడినప్పటికీ 'బాబా ఉన్నార'ని, "వాళ్ళకి ఏమీ కాకూడదు" అని బాబాను ప్రార్థించి, ఊదీ తీసుకున్నాను. అక్కడ వాళ్ళందరినీ ఒక డాక్టరు చూసి మందులివ్వడంతో వాళ్లంతా కష్టం నుండి గట్టెక్కారు. అలా బాబా అందరినీ కాపాడారు. ఆయన కృపవల్ల అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు.


మా కోడలికి కాన్పు సమయం దగ్గరైనప్పుడు నేను బాబాను, "బాబా! కోడలికి నార్మల్ డెలివరీ అయి తల్లి, బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా మా కోడలికి నార్మల్ డెలివరీ అయి ఆడపిల్ల పుట్టింది. మా కొడుకు, కోడలికి అదివరకే ఒక బాబు ఉన్నాడు. పిల్లలిద్దరూ బాబా అనుగ్రహ ప్రసాదమే. 21వ రోజున పాప బారసాల, నామకరణము బాబా తమ గుడిలోనే చేసుకునేలా ఏర్పాటు చేశారు. బాబా, దుర్గమ్మతల్లి దయతో అంతా బాగా జరిగింది. మేము చాలా సంతోషించాము. 


బాబా దయతో మా పిల్లలు అమెరికాలో పాత ఇల్లు అమ్మేసి వేరే రాష్ట్రంలో కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంటి గృహప్రవేశ సమయానికి బ్రాహ్మణులు దొరకక చాలా ఇబ్బంది అయింది. ఆ ముహూర్తం తప్పితే తరువాత మంచి ముహూర్తాలు లేవని పిల్లలు భయపడ్డారు. అయితే బాబా దయవల్ల చివరి నిమిషంలో బ్రాహ్మణుడు దొరకడంతో కార్యక్రమం చక్కగా జరిగింది. తరువాత పిల్లలు ఇంతకుముందు ఉంటున్న రాష్ట్రం నుండి కొత్తగా ఇల్లు తీసుకున్న రాష్ట్రానికి మారారు. అప్పుడు చిన్న మనవరాలికి రెండు నెలల వయస్సు అయినందున ప్రయాణానికి భయపడ్డాము. నేను, "బాబా! వాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తున్నారు. మీరు కూడా వెళ్లి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. మీ అనుగ్రహాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబాకు పగ్గాలు అప్పగించిన తరువాత మనకి భయం అక్కరలేదు.


పిల్లలతో ఎయిర్‌పోర్టుకి వెళ్లేసరికి బాగా ఆలస్యమవడంతో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. అదీకాక, ఆఫీసర్లు వాళ్ళ లగేజీని కేబిన్ రూమ్‌లో కాకుండా చెక్‌ఇన్‌లో వేయమన్నారు. అయితే వాటిలో చాలా బంగారం ఉన్నందున కొంచెం భయపడినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లగేజీ అంతా చెక్‌ఇన్‌లో వేశారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతూనే డోర్స్ క్లోజ్ చేశారు. నేను కంగారుపడతానని ఆ విషయాలేవీ వాళ్ళు నాకు చెప్పకుండా 'ఆల్ ఒకే' అని మాత్రం మెసేజ్ పెట్టారు. కానీ నాకెందుకో వాళ్ళ ఫోన్లకు బాబా, శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీదేవి, అమ్మవార్ల ఫోటోలు పంపాలనిపించి, వాటిని పంపి, "వీళ్ళందరూ మీతో వస్తున్నారు" అని మెసేజ్ పెట్టాను. అంతా బాబా సంకల్పం. బాబా దయవల్ల అందరూ క్షేమంగా వేరే రాష్ట్రానికి చేరుకున్నారు. ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చిన సామాన్లు కూడా ఎటువంటి సమస్య లేకుండా చేరాయి. అవే కాకుండా కార్లు కూడా బాగా వచ్చాయని పిల్లలు చెప్పారు. పిల్లల్ని స్కూలులో జాయిన్ చేసి ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇలా పాత ఇల్లు అమ్మడం దగ్గరనుంచి కొత్తింటి గృహప్రవేశం, ప్రయాణాలు, పిల్లల స్కూల్ జాయినింగ్ అన్నీ బాబా మా కుటుంబ పెద్దగా చూసుకున్నారు. “ధన్యవాదాలు బాబా”.


ఒకరోజు మా ఇంట్లో ఐఫోన్ కనిపించకుండా పోయింది. వేరే ఫోనుతో ఆ ఫోనుకి కాల్ చేస్తే, ఫోనులో ఛార్జింగ్ లేకపోవడం వల్ల రింగ్ రాలేదు. అప్పుడు నేను, "బాబా! ఫోన్ కనిపిస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో మీ దయను పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని జపించాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే ఎప్పుడూ పెట్టని గిన్నెలు పెట్టే చోట ఆ ఫోన్ కనిపించింది. ఇది చిన్న విషయమే అయినా బాబా ప్రేమకు ఆనందంతో నాకు ఏడుపొచ్చింది. "బాబా! మీకు నేను చాలా ఋణపడి ఉన్నాను తండ్రీ. ఎంత చెప్పినా, వ్రాసినా అన్నీ తక్కువే. ఏదో నా ఆరాటం కొలదీ వ్రాస్తున్నాను. నా కుటుంబ బాధ్యత అంతా మీదే తండ్రీ. మేమందరమూ తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి నాన్నా. మా పెద్దమ్మ గురించి మిమ్మల్ని వేడుకున్నాను. దానికి సంబంధించిన వివరాలు వ్రాయలేకపోయాను మన్నించండి ప్రభూ. ఈమధ్య మా అమ్మ ఆరోగ్యం కొంచెం బాగాలేదు తండ్రీ, మీ దయతో తనకి నయమైతే బ్లాగులో పంచుకుంటాను బాబా".


సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా సాయి పాదములకు నా అనంతకోటి నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నా పేరు రమాదేవి. సాతులూరు గ్రామం. నేను అంగన్‌వాడీ టీచర్ని. నేను సాయిబాబా భక్తురాలిని. నాకు ఏ సమస్య వచ్చినా 'బాబా' అని పిలిచినంతనే ఆ తండ్రి నాకు తోడూనీడై సహాయం అందిస్తున్నారు. ఆయన ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆలస్యంగా పంచుకుంటున్నందుకు ముందుగా బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను క్రాఫ్ట్(పంట) లోన్ తీసుకుని 2022, జూలై 11కి ఒక సంవత్సరం అవుతున్నందున రెన్యూవల్ చేయిద్దామని బ్యాంకుకి వెళ్తే, "అడంగల్, 1బి, ఈసీ కావాల"ని బ్యాంకువాళ్ళు చెప్పారు. రెన్యూవల్‍కి అవన్నీ ఉండాలని తెలియక నేను వాటిని తీసుకుని వెళ్ళలేదు. ఆ విషయమే నేను చెప్తే, "11వ తేదీలోగా రెన్యూవల్ చేసుకోకపోతే వడ్డీ రేటు పెరుగుతుంది" అని చెప్పారు. సరేనని నేను అడంగల్, 1బి కోసం సచివాలయానికి వెళ్తే, "సర్వర్ పనిచేయటం లేదు, నాదెండ్ల  M.R.O ఆఫీసుకి వెళ్లి క్లియర్ చేయించుకుని తీసుకురండి" అని అన్నారు. కానీ ఆ సమయంలో MROగారు సెలవులో ఉన్నారు. నాలుగురోజుల తరువాత వస్తారని చెప్పారు. నాకు ఏం చేయాలో తోచక, "బాబా! 11వ తేదీకల్లా పని అవ్వాలి. నాకు మీరు తప్ప ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయ చూపారు. మరునాడు గురువారం సచివాలయం నుండి డేటా ఆపరేటర్ ఫోన్ చేసి, "మేడం, సర్వర్ పని చేస్తోంది. మీ సర్వే నెంబరుకి క్లియరెన్స్ వచ్చింది. అడంగల్, 1బి వచ్చాయి. వచ్చి తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. అవి తీసుకుని వెళ్తే బ్యాంకువాళ్ళు వెంటనే రెన్యూవల్ చేశారు. "వేలవేల కృతజ్ఞతలు బాబా".


ఈమధ్య నా స్నేహితురాలిపై తన భర్త పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. డాక్టరు, "తన శరీరం 50 శాతం కాలిపోయింది. తను బ్రతుకుతుందో, లేదో చెప్పలేం. ఎటువంటి నమ్మకం ఇవ్వలేము. గొంతు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అలా అయితే ఇంకేమీ చేయలేము" అని చేప్పారు. ఆ విషయం నాకు తెలిసి, "బాబా! ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. పెళ్ళైన దగ్గర నుండి తను కష్టాలు పడుతోంది. తనకి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లలకు అమ్మ లేకపోతే ఎంతో బాధ తండ్రీ. దయచేసి వాళ్ళమ్మకు ఏమీ కాకుండా కాపాడు బాబా" అని బాబాను వేడుకుని బాగా ఏడ్చాను. బాబా దయవలన నా స్నేహితురాలి పైచర్మం మాత్రమే కాలింది. ఇంకా లోపల ఇన్ఫెక్షన్ రాకుండా చేసి తనని, అనాధలు కాకుండా ఆ పిల్లలని సాయి కాపాడారు. నాకు తోడునీడ అయిన నా సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు. 'సాయీ' అని పిలిచిన వెంటనే 'ఓయీ' అని పలికే నా తండ్రికి నా కృతజ్ఞతలు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain Jaisairam

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ పాపం ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో.మంటతో మహిళలు యెంతో నరకం అనుభవిస్తున్నారు. బుద్ధి లేని భర్త లు వుండగా భార్య ల పరిస్థితి అంతే

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo