సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1286వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పాపని ప్రతి నిమిషం కాపాడుతున్న బాబా
2. బాబా అనుగ్రహంతో దైవదర్శనం
3. బాబా అనుగ్రహం

పాపని ప్రతి నిమిషం కాపాడుతున్న బాబా


ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 9 నెలల వయస్సున్న మా పాపకి పుట్టుకతో హర్ట్ ప్రాబ్లమ్ ఉంది. బాబా దయవల్ల సర్జరీ చేస్తే తనకి నయం అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ సర్జరీ విషయంగా ఇన్సూరెన్స్ కోసం తన బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాల్సి ఉంది. అయితే ఈమధ్య ఆ బర్త్ సర్టిఫికెట్ కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, "బర్త్ సర్టిఫికెట్ కనపడితే బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకోగానే సర్టిఫికెట్ దొరికింది. "థాంక్యూ బాబా".


ఒకసారి మా పాప ఉయ్యాలలో నుండి కింద పడిపోయింది. ఉయ్యాల కాస్త ఎత్తుగా ఉన్నందున పాప తలకి దెబ్బ తగిలిందేమోనన్న భయంతో ఇంట్లో అందరం ఒకటే టెన్షన్ పడ్డాము. నేను బాబాకి నమస్కరించి, ఊదీ మంత్రం చదివి పాప తలకి ఊదీ రాశాను. అలాగే, 'పాప తలకి దెబ్బ తగలకుండా ఉండి, తను ఆరోగ్యంగా ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా నా మొర ఆలకించి పాపకి ఏ దెబ్బ తగలకుండా కాపాడారు.


హర్ట్ ప్రాబ్లెమ్ ఉన్నందువల్ల ప్రతినెలా పాప సాచ్యురేషన్ చెక్ చేయాలని డాక్టర్లు చెప్పారని నేను ఇదివరకు నా అనుభవాలలో చెప్పాను. 2022, జూలై 23న మేము పాపకి సాచ్యురేషన్ చెకింగ్‌తోపాటు వ్యాక్సినేషన్ చేయిద్దామని హాస్పిటల్‌కి వెళ్ళాము. పాప పుట్టిన తరువాత ఈ తొమ్మిది నెలల్లో ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్లినా పాప బాగా ఏడవడం, పని ఆలస్యమవడం, నాకు తలనొప్పి వంటి వాటితో హాస్పిటల్ వాతావరణమంటేనే భయం వేస్తుంది. అందుకే నేను, "బాబా! హాస్పిటల్లో పని గంటలో పూర్తవ్వాలి. పాప ఎక్కువగా ఏడవకూడదు, ముఖ్యంగా సాచ్యురేషన్ చెక్ చేసేటప్పుడు (తను ఏడిస్తే, సాచ్యురేషన్ రాదు, జీరో చూపిస్తుంది), అలాగే వ్యాక్సిన్ వేసిన తర్వాత పాప ఎక్కువ ఏడవకుండా నిద్రపోవాలి. ఇవన్నీ జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అద్భుతం! బాబా నేను కోరుకున్న మూడు కోరికలూ నెరవేర్చారు. నేను అస్సలు ఊహించలేదు. మామూలుగా సాచ్యురేషన్ దగ్గర పాప ఏడుపు ఆపడానికి కనీసం ఒకటి, రెండు గంటలు పట్టేది. అలాంటిది పాపని నిద్రపోయేటట్టు చేసి త్వరగా సాచ్యురేషన్ చెకింగ్ పూర్తయ్యేలా ఆశీర్వదించారు నా బాబా. "థాంక్యూ బాబా".


హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే పాపకి 101.4 డిగ్రీల జ్వరం వచ్చింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీ పాపకి పెట్టి, "జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, గంటలో పాపకి జ్వరం తగ్గింది. ఇలా మా పాపని ప్రతి నిమిషం బాబా కాపాడుతున్నారు. ఇలాగే నిండు నూరేళ్లు తనని, నా భర్తని, నన్ను కాపాడమని బాబాను వేడుకుంటున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. పాపకి ఎలాంటి సర్జరీ జరగకుండా కాపాడండి బాబా. దయచేసి నా కుటుంబాన్ని చక్కటి ఆరోగ్యంతో చిరకాలం వర్ధిల్లేలా ఆశీర్వదించు తండ్రీ. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".


బాబా అనుగ్రహంతో దైవదర్శనం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను సాయిబిడ్డను. చిన్నతనంనుంచి నేను బాబా భక్తురాలిని. బాబా ఆపద సమయాలలో అడుగడుగునా తమ సహాయాన్ని అందించి మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఏదైనా సమస్యలో ఉండి బ్లాగు తెరిస్తే, ఏదో ఒక అనుభవ రూపంలో భక్తులకు ఊరటనిస్తున్నారు బాబా. ఈ బ్లాగులో అనుభవాలు పంచుకుంటామంటే, కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఈమధ్య మాకు తెలిసినవాళ్ళు, "తిరుమలలో బ్రేక్ దర్శనం ఇప్పిస్తాము, మాతో రండి" అంటే మేము తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము. అప్పుడు నేను, "బాబా! తిరుపతి ప్రయాణం ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగి, స్వామి దర్శనం బాగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఇక బాబా అనుగ్రహం చూడండి. మాకు ట్రైన్ టిక్కెట్లు దొరకలేదు. 'అది బాబా అనుగ్రహం అంటున్నారేమిటి?' అని అనుకుంటున్నారా!  ట్రైన్ టిక్కెట్లు దొరకనందువలన మేము కారులో తిరుపతికి ప్రయాణమయ్యాము. అదే మాకు అదృష్టమైంది. దారిలో మేము చిన్నతిరుపతి మరియు విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. అనుకోకుండా తెలిసినవాళ్ళు కలిసి 10 నిమిషాల్లోనే మాకు దుర్గమ్మ దర్శనం చేయించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ బాబా దయవలనే దర్శనం అంత మంచిగా జరిగిందని మేము అనుకున్నాము. ఇంకా, విజయవాడ నుంచి వెళ్తుంటే దారిలో రెండు, మూడు కార్లపై బాబా దర్శనమిచ్చి, 'నేను మీతోనే ఉన్నాను. పిలిచినంతనే మీకంటే ముందు నేనుంటాను' అని తెలియజేశారు. ఇంకా తిరుపతిలో మాకు రెండుసార్లు స్వామి దర్శనభాగ్యాన్ని అనుగ్రహించారు ఆ తండ్రి. అంత రద్దీలోనూ అక్కడున్న సిబ్బంది మమ్మల్ని కంగారుపెట్టలేదు. పైగా ఎవరో నా చేయి పట్టుకుని, "అమ్మా! స్వామివారిని చూడు" అని ముందుకు నెట్టారు. నేను ఒక నిమిషం పాటు అలానే స్వామిని చూస్తూ ఉండిపోయాను. ఆయన నా బాబానే అనిపించారు. ఇంతటి అనుభూతిని ప్రసాదించిన బాబాకు సాష్టాంగ నమస్కారం సమర్పిస్తున్నాను. బాబా అనుగ్రహంతో తిరుగు ప్రయాణంలో మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. "ధన్యవాదాలు బాబా".


బాబా అనుగ్రహం


శ్రీ సాయినాథాయ నమః!!!

జై బోలో సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


ముందుగా, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నడుపుతున్న అన్నయ్యలు, అక్కలు అందరికీ పేరుపేరునా నమస్కారాలు. నా పేరు బి.నిర్మల. మాది సూర్యాపేట. నన్ను సాయి అడుగడుగునా కాపాడుతున్నారు. ఆయన ఒక తండ్రిలా, గురువులా నాకు ప్రతి విషయంలో సలహాలిస్తూ, సహకరిస్తుంటారు. నేను సాయీశ్వరుని లీలలను చదువుతూ ఉంటాను. సాయి నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే సాయికి పాదాభివందనాలు చేస్తూ, కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇది చిన్న విషయమే అయినా బాబా అనుగ్రహం. ఈమధ్య మా ఇంటి కేబుల్ కనెక్షన్ ఊరికే ప్రతి 15, 20 రోజులకొకసారి రిపేరుకి వస్తుండేది. రిపేరు చేసేవాళ్ళు పదేపదే వచ్చి రిపేర్ చేయడానికి చాలా ఇబ్బందిపడుతుండేవాళ్లు. మాకూ ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు 2, 3 సార్లు వచ్చి వెళ్ళాక మళ్ళీ రిపేరు వచ్చినప్పుడు నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, "రిపేరు చేసేవాళ్ళు రాకుండానే కేబుల్ బాగయ్యేలా చూడండి బాబా. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని వెంటనే వ్రాసి బ్లాగుకి పంపుతాన"ని మ్రొక్కుకుని టీవీ ఆన్ చేసాను. చిత్రంగా 4 రోజుల నుండి రాని టీవీ వెంటనే వచ్చింది. "ధన్యవాదాలు బాబా. కానీ వెంటనే అనుభవాన్ని వ్రాస్తానని చాలాసార్లు అనుకుని కూడా ఆలస్యంగా వ్రాసినందుకు నన్ను క్షమించు బాబా. ఇక ముందు కూడా నా అనుభవాలు అందరితో పంచుకుంటాను. నన్ను క్షమించు బాబా".


జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయి బాబా నా భర్త కీ బిడ్డలకు నిండు నూరేళ్ల ఆయుశు్ ప్రసాదించు. ఇంక నీ దర్శనం కలిగించు.

    ReplyDelete
  4. బాబా నాకు రావాల్సిన ప్రమోషన్ ఎలా అయిన ఈ సంవత్సరం వచ్చేలా చూడు తండ్రి.

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo