1. శ్రీసాయి అనురాగ తరంగాలు
2. కరుణాసముద్రుడు సాయి
శ్రీసాయి అనురాగ తరంగాలు
అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2024, వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల మా అమ్మకి తల తిరగడం, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఒకరోజు అవి ఎక్కువై వాంతి కూడా అయింది. అప్పుడు నాకు చాలా భయమేసింది. మనం కష్టంలో/బాధలో ఉన్నప్పుడు ముందుగా మనకోసం వచ్చేది సాయి మాత్రమే! అందుచేత నేను ఆయన్ని ప్రార్థించి ఆర్ఎమ్పి డాక్టరుకి ఫోన్ చేస్తే, అతను వచ్చి అమ్మని చూసి ఇంజెక్షన్ చేసి, టాబ్లెట్లు ఇచ్చాడు. బాబా దయవల్ల త్వరగా అమ్మ కోలుకుంది. అయితే అమ్మకి బాగాలేని ఆ సమయంలో నేను పడ్డ టెన్షన్ అంతాఇంతా కాదు. అది బాబాకి మాత్రమే తెలుసు. ఆ సమయమంతా నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూనే ఉన్నాను. అప్పుడు బాబా, 'నేను ఉన్నాను' అని వీడియో మెసేజ్ రూపంలో అభయం ఇచ్చారు. అదెలా అంటే, నేను భక్తికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నాను. ఆ గ్రూపులో ప్రతిరోజూ ఆధ్యాత్మిక విషయాలు పెడుతుంటారు. బాబా ఫొటోలు కానీ, వీడియోలు కానీ చాలా చాలా అరుదుగా పెడుతుంటారు. అలాంటిది నేను అమ్మకి బాగాలేదని టెన్షన్ పడుతున్న సమయంలో ఆ గ్రూప్ అడ్మిన్ నుంచి గ్రూపులో కాకుండా వ్యక్తిగతంగా నాకు ఒక మెసేజ్ వచ్చింది(అంతకుముందు ఎప్పుడూ అలా రాలేదు). ఏంటా అని చూస్తే, అది ఒక బాబా గుడి తాలూకు వీడియో. గుడి చాలా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా బాబా మూర్తి అయితే చాలా ప్రశాంతంగా నవ్వుతున్నట్టు ఉంది. బాబాను చూడగానే నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. ఆయన 'నేను నీతోనే ఉన్నాను' అని చెప్తున్నట్టుగా అనిపించి చాలా చాలా సంతోషవేసింది. మామూలుగా బాబా భక్తుల గ్రూపుల నుంచి వీడియో వచ్చి ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ, బాబా గురించి చాలా తక్కువగా షేర్ చేసే గ్రూపు అడ్మిన్ నుంచి, అది కూడా వ్యక్తిగతంగా వచ్చిందంటే అది ఖచ్చితంగా బాబా పంపిందేనని నా బలమైన నమ్మకం.
ఇకపోతే, మా అమ్మకి నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంటే నేను "నొప్పి తగ్గిపోవాలి" అని
బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే మందులతో పాటు కొన్ని చిట్కాలు చెప్పారు. వాటితో అమ్మకిప్పుడు మెరుగ్గా ఉంది. "థాంక్యూ బాబా. అమ్మకి ఉన్న సమస్యలన్నీ తొలగించి తనకి ఆరోగ్యం, మనశ్శాంతి ప్రసాదించు సాయి".
2024, జూలై నెలలో ఒకరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఫోన్లో బాబా హరతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. ఆ సమయంలో బాబాకి వేసిన వైలెట్ కలర్ డ్రెస్ చూసి, 'ఈ కలర్ డ్రెస్ నాకు ఉంది' అని అనుకున్నాను. తర్వాత ఉదయం 6:45కి ఫోన్ తీసి శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూసి ఒక్కసారిగా షాకయ్యాను. ఎందుకంటే, నేను కలలో ఏ కలర్ డ్రెస్ అయితే చూశానో సరిగ్గా అదే డ్రెస్ బాబా ధరించి ఉన్నారు. నాకు కల వచ్చిన సమయానికి బాబాకి స్నానం కూడా అయి ఉండదు. అంటే ఆ రోజు వేసుకోబోయే డ్రెస్‌తో బాబా నాకు ముందే దర్శనం ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇదివరకెప్పుడూ ఇలాంటి దర్శనం బాబా నాకు ఇవ్వలేదు. "థాంక్యూ సో మచ్ సాయినాథా".
చివరిగా ఒక చిన్న అనుభవం. మా తమ్ముడికి ఉద్యోగ విషయంలో కొన్ని టెన్షన్లు ఉన్నాయి. అందుకని తను ఉద్యోగం మానేస్తానన్నాడు. నేను బాబాని, "తను మంచిగా ఉద్యోగం చేసుకోవాలి" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల ఇప్పుడు అంతా బానే ఉంది. "ధన్యవాదాలు బాబా. తమ్ముడు జీవితంలో మంచిగా స్థిరపడేలా ఆశీర్వదించండి బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
కరుణాసముద్రుడు సాయి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ స్వరూప శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికి నమస్కారం. నా పేరు సుధ. నాకు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది నా సాయితండ్రే. మేము పూణేలో ఉంటాము. మేము మా పిల్లల స్కూలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాం. ఒకరోజు మా సొసైటీ సెక్రటరీతో బ్యాంకు వ్యక్తులు వచ్చి మేము అప్పుడుంటున్న ఇంటి కొలతలు చూస్తుంటే, మాకు ఏమీ అర్థంకాక, "ఎందుకు?" అని అడిగితే, ఆ సెక్రెటరీ, "మీకు తెలియదా! ఈ ఇంటిని ఎవరికో అమ్మేశారు" అని చెప్పారు ఆ సెక్రటరీ. మాకు టెన్షన్ మొదలై ఇంటి ఓనర్‌కి ఫోన్ చేసి అడిగితే, "అవును ఇల్లు అమ్మేశాము. మీరు ఒక నెలలో ఖాళీ చేయండి" అని చెప్పారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇల్లు దొరకడం చాలా కష్టం. చుట్టుపక్కల ఎంత వెతికినా, ఎంతమంది బ్రోకర్స్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. అంతలో మా సొసైటీలోనే వేరే ప్లాట్ కాళీ అవుతుందని మాకు తెలిసింది. అయితే అది రెండు నెలలకు ఖాళీ అవుతుంది. అందువల్ల మా ఓనర్ని ఇంకో నెల సమయమివ్వమని అడిగాము. అందుకాయన ఇంటిని కొనుక్కున్నవాళ్ళని అడగండి అన్నారు. దాంతో ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసాము. కానీ వాళ్ళు, "కావాలంటే ఇంకో పది రోజులు తీసుకోండి గాని, రెండు నెలలు అంటే కష్టం" అన్నారు. ఇంకా నేను సాయితండ్రి మీద భారమేసి, "మాకు ఇల్లు దొరికితే 1,116 సమర్పిస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు, మూడు రోజుల్లో మాకు ఒక మంచి ఫ్లాటు మా సొసైటీలోని దొరికింది. ఆ ఇంటిలో ఉంటున్నవాళ్ళు మరుసటి నెల ఖాళీ చేద్దామనుకొని కూడా ఎందుకో హఠాత్తుగా ఖాళీ చేయడం, ఆ విషయం మాకు తెలిసిన వ్యక్తికి తెలియపరచడంతో అప్పటికి మేము ఉంటున్న ఇంటి కంటే మంచి సౌకర్యాలతో, 500 రూపాయల తక్కువ అద్దెతో మాకు ఇల్లు దొరికింది. ఆ ఇంటి ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు. ఇదంతా సాయిదయ కాక మరొకటి కాదు. కరుణాసముద్రడు నా సాయి. "ధన్యవాదాలు బాబా. మా అమ్మ మరియు నా పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడు తండ్రీ. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించు తండ్రీ".
