ఈ భాగంలో అనుభవం:
- బాబా లీలలు బహు చిత్రమైనవి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి బంధువులందరికీ నమస్కారం. మా వూరిలో చాలామంది ప్రతి ఏటా సెప్టెంబర్ నెల ప్రాంతంలో శిరిడీ వెళ్లి, అక్కడ ఒక వారముండి చుట్టుపక్కల ప్రదేశాలు చూసి వస్తుంటారు. అలా వాళ్ళు 2024, సెప్టెంబర్ 15న శిరిడీ వెళ్తుంటే, నేను కూడా వాళ్లతో కలిసి శిరిడీ వెళ్ళాను. బాబా నాకు చక్కటి దర్శనాలు, శేజారతి అనుగ్రహించారు. నేను అనుకున్నట్లు సచ్చరిత్ర పారాయణ కూడా ఒక్క రోజులో పూర్తి చేసేలా అనుగ్రహించారు. నేను అదివరకే చుట్టుపక్కల ప్రదేశాలు చాలాసార్లు చూసి ఉండడం వల్ల అందరితోపాటు 22వ తేదీ వరకు ఉండకుండా సెప్టెంబర్ 19, గురువారంనాడు ఉదయం బాబా దర్శనం చేసుకొని, మధ్యాహ్నం ద్వారకామాయి వద్ద హారతి వీక్షించి సాయంత్రం తృప్తిగా ఇంటికి బయలుదేరాను. ఈ పర్యటనలో బాబా నాకు రెండుసార్లు జామకాయ, ఒకసారి ఆరతి అనంతరం ఇచ్చే ప్రసాదం, తీర్థం, ఒకసారి వేపాకు అనుగ్రహించారు. నేను వేపాకు, జామకాయలు ఇంటికి వెళ్లి మా వారితో కలిసి తిందామని జాగ్రత్తగా వేరుగా ప్యాక్ చేసి పెట్టుకొని శిరిడీ-కాకినాడ ట్రైన్లో తాడేపల్లిగూడెం వచ్చాను. నన్ను తీసుకెళ్లడానికి రావాల్సిన మావారు రావడంలో కాస్త ఆలస్యం అయింది. అందుచేత నేను ఒక పావు గంట ఫోన్ మాట్లాడుతూ మావారికోసం ఎదురుచూసాను. మావారు వచ్చి నేను తీసుకొచ్చిన లగేజీ కారులు పెడుతూ, "3 లగేజీలు అన్నావు కదా! రెండే ఉన్నాయేంటి?" అన్నారు. ఒక్కసారిగా నాకు తెలివి వచ్చినట్టయింది. ఎందుకంటే, నాకు అప్పటివరకు ఆ బ్యాగ్ గురించిన స్పృహ కూడా లేదు. వెంటనే ఆ బ్యాగుకోసం నేను అదివరకు కూర్చున్న చోట, స్టేషన్లో ఉన్న లిఫ్ట్‌లో వెతికాము కానీ, ఎక్కడా కనపడలేదు. పోయింది ఫుడ్ బ్యాగ్, అందులో ప్రత్యేకంగా అంత విలువైన వస్తువులు ఏమీ లేవు కానీ, ప్రసాదాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇంత యాత్ర చేసి బాబా ప్రసాదం ఒకటైన లేకుండా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడం నాకెందుకో శుభశకునంగా అనిపించక మనసుకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే, బాబా ప్రసాదం కంటే విలువైనది ఏముంటుంది? ఇకపోతే, నా విషయంలో ఎప్పుడూ వస్తువు పోవడమనేది జరగదు. పోయినవన్ని మళ్ళా దొరికేస్తూ ఉంటాయి. "ఈసారి కూడా అలాగే బ్యాగ్ దొరకాల"ని బాబాను ప్రార్ధించి, "దొరికితే రవ్వకేసరి నైవేద్యం పెట్టి, 108 ప్రదక్షిణలు చేస్తాన"ని అనుకొని కాకినాడలో ఉండే మా తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పి, నా కోచ్, సీట్ నెంబర్ కూడా చెప్పి వెళ్లి చూడమన్నాను. నాకు లగేజీ డోర్ వరకు తెచ్చి, దిగేటప్పుడు కంగారులో ఆ డోర్ దగ్గర వదిలేశానేమోనని అనుమానం. అదే మాట మా తమ్ముడితో అంటే, తను, "డోర్ దగ్గర ఐతే దొరకడం కష్టం. అయినా కూడా వెళ్లి చూస్తానులే" అని కాస్త నిరాశగా అన్నాడు. నాకు మాత్రం 99 శాతం దొరికేస్తుందని నమ్మకమున్నా ఎక్కడో కొంచెం టెన్షన్ కూడా ఉండింది. ఇంటికి వెళ్లి అన్యమనస్కంగా స్నానం అదీ కానిచ్చి ట్రైన్ కాకినాడ చేరే సమయం ఎప్పుడు అవుతుందా?, తమ్ముడు ఎప్పుడు కాల్ చేస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఈలోపు వేపాకు మాత్రం హాండ్ బ్యాగులోనే పెట్టుకున్నాను కాబట్టి, అదైనా మావారికి ఇవ్వడానికి మిగిలిందని సంతోషపడ్డాను. అంతలో మా తమ్ముడు వీడియో కాల్ చేసి నేను కూర్చున్న బెర్తులోనే సురక్షితంగా ఉన్న నా బ్యాగ్ చూపించాడు. ఇక నా సంతోషానికి అవధులు లేవు. బాబా మరో అద్భుతాన్ని చూపించారనుకున్నాను. అంతటితో తృప్తి చెంది ప్రసాదాలన్నీ వాళ్ళని తినమని, అక్కడున్న బంధువులకి, స్నేహితులకి పంచమని, ఇంకా బాబా ప్రసాదంగా లభించిన జామకాయలను ఎలా వేరుగా ప్యాక్ చేసి పెట్టానో వివరంగా చెప్పి బాబా వాళ్ళకి ప్రసాదం అందించడానికి ఇంతా నడిపించారని సంతోషించాను. అంతటితో కథ సుఖాంతం అనుకుంటూ ఉండగా ఒక పావుగంటకి మా తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసి, "నువ్వు చెప్పిన జామకాయ ప్రసాదం తింటున్నాం కానీ, వేరే ఏ ప్రసాదాలు ఇందులో లేవు" అని చెప్పాడు. అది విని ఒక్క క్షణం నా మనసు శూన్యమైపోయాక నేను బయలుదేరేిముందు మొత్తం ప్రసాదం పాకెట్లు, ఊదీ పాకెట్లు అన్నీ ఒక స్టీల్ డబ్బాలో పెట్టి, దాన్ని ఫుడ్ బ్యాగులో(ఎంగిలి ఉంటుందని) ఎందుకనిపించి నా స్యూట్ కేసులో పెట్టుకున్న విషయం గుర్తొచ్చింది. ఇక చూడండి నా మనస్థితి. నేను ఏదైతే పోయిందని అప్పటివరకు బాధపడ్డానో అది నా దగ్గరే సురక్షితంగా ఉంది. ఆ జామకాయలను మాత్రం బాబా మా తమ్ముడి కుటుంబానికి ప్రసాదించారని అనుకున్నాను. బాబా ఎవరి ప్రసాదాన్ని వాళ్ళకి చేర్చారు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే అది ఎంత అద్భుతంగా అందేలా చేస్తారో బాబా. లేకుంటే అంత దూరంలో ఉండే మా తమ్ముడువాళ్ళకి నేను పనిగట్టుకుని ప్రసాదం పంపి ఉండేదాన్ని కాదు. ఈ సంఘటన ద్వారా బాబా తమ అనుగ్రహం మా మీదనే కాకుండా మా తమ్ముడువాళ్ళ మీద కూడా ఉందని చెప్పకనే చెప్పారు. ఏమిటో బాబా లీలలు, బహు చిత్రమైనవి. ఇంత లీలామృతాన్ని చవిచూసిన నేను ఈ మాధుర్యాన్ని సాయిబంధువులతో పంచుకోకుండా ఉండలేక ఇలా మీ అందరితో పంచుకున్నాను.
ఇప్పుడు నేను పంచుకోబోయే విషయం నన్ను నా జీవితంలో అత్యంత టెన్షన్ పెట్టిన విషయం. నేను ఎప్పుడూ నెలసరి విషయంలో నాకు ఎలాంటి సమస్యా ఎదురు కాదని, బాబా దయవల్ల ఏ కార్యక్రమానికైనా అడ్డంకిగా మారదని నేను ఇదివరకు ఈ బ్లాగులో పంచుకున్న నా అనుభవాలలో ప్రస్తావించాను. కానీ 2024, అక్టోబర్ నెలలో అనుకున్న సమయానికి నెలసరి రాలేదు. రోజులు గడుస్తున్నా అటువంటి ఛాయలు కూడా కనిపించకపోయేసరికి గైనిక్ సమస్య అనుకుని బాగా కంగారుపడి, విపరీతమైన టెన్షన్‌తో ఒక గురువారం డాక్టర్ దగ్గరకు పరుగెత్తాం. ఆ డాక్టర్ స్కానింగ్ చేసి, ఇంకో పరీక్ష చేసి మేమనుకున్న సమస్య కాదని తేల్చింది కానీ, 'Pap Smear' టెస్టు చేయాలని చెప్పి మరలా టెన్షన్ పెట్టింది. సరే, ఆ టెస్ట్ చేసి రిజల్ట్ కోసం పక్క ల్యాబ్‌లో ఇమ్మని చెప్పారు. మేము మరుసటిరోజు టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు బాబాను ప్రార్డించుకుంటూనే గడిపాము. "మేము భయపడినట్టు ఏమీ లేకపోతే మీ గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తామని, శిరిడీ దర్శిస్తామ"ని బాబాకి మొక్కుకున్నాము. బాబా దయవల్ల మేము ఊహించినట్టుగానే ఇబ్బంది ఏమీ లేదని, కొద్దిగా ఇన్ఫెక్షన్ మాత్రం ఉందని, ఒక 10 రోజులు మందులు వాడితే సరిపోతుందని డాక్టర్ చెప్పారు. వాటితోపాటు నెలసరి రావడానికి కూడా మందులు ఇచ్చారు. బాబా దయవల్ల రెండు రోజుల తేడాతో ఇద్దరమూ ప్రదక్షిణ మొక్కు తీర్చుకున్నాము. నెలసరి వచ్చిన తరువాత శిరిడీ వెళ్ళాలని వేచి చూడగా ఆ ఎదురుచూపు ఫలించి 2024, అక్టోబర్ 28న నెలసరి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ మీద అచంచల విశ్వాసంతో, శ్రద్ధ-సబూరిలతో నేను ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రీ. మా కుటుంబంలో అందరం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండేట్లు చూడు సాయి".
సర్వం సాయినాథార్పణమస్తు.
Om sai ram, 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
CHAALAA SANTHOSHAM AMMA..
ReplyDeleteEDI SARVAM SREE SHIRIDI SAINAADHUNI ANUGRAHAME KADAA TALLI..
BAABAA NEVER DISAPPOINT HIS CHILDREN.
BAABAA NEVER LEAVE HIS CHILDREN ALONE.
BAABAA SAYS...
"" ETA NENUNDAA NEEKU BHAYAMELAA.
NEE BHAARAMUNU NAAPAI NIDUMU..
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻