ఈ భాగంలో అనుభవాలు:
1. మొర ఆలకించి అనుగ్రహించిన బాబా
2. సొంతింటి కల నెరవేర్చి గృహప్రవేశానికి వచ్చిన బాబా
మొర ఆలకించి అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. మేము విజయవాడలో ఉంటాము. నా చిన్నప్పటినుంచి నేను, మా కుటుంబం చాలావరకు సాయిమాతను నమ్ముకుని ఉన్నాము. నేను రోజూ ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతాను. తద్వారా నాకు బాబా మీద నమ్మకం, ధైర్యం వృద్ధి చెందుతున్నాయి. 2024, ఆగస్టు నెలాఖరులో వరదల వల్ల విజయవాడలో అందరూ చాలావరకు ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో మేముండే ప్రాంతంలోకి కూడా వరద వస్తుందన్న వార్త తెలియడంతోనే ఇంటికి కావలసిన పాలు, కూరగాయలు, మందులు తెచ్చి పెట్టుకున్నాము. అయితే బాబా దయవలన కట్ట తెగినప్పటికీ మాకు వరద రాలేదు. కానీ నాకు భయంగా ఉండింది. సమీపంలో వినాయకచవితి ఉన్నందున మావారు మా అత్తవారింటికి వెళదామని అన్నారు. వరద వలన వెళ్లక తప్పని పరిస్థితి. అయినా మరల తుఫాను ఉందని నా మనసు శంకించింది. అందువల్ల నేను వెళ్లేముందు సాయికి ఒకటే చెప్పుకున్నాను, "స్వామీ! ఇక్కడ (మా ఇంటి వద్ద) ఎటువంటి వరదలు రాకుండా ఉండేలా చూడండి. అందరినీ క్షేమంగా ఉండేలా చూడండి" అని. బాబా నా మొర ఆలకించి మా ప్రాంతంలో వరద రాకుండా చేశారు.
.
ఇకపోతే, నేను, నా భర్త, మా బాబు బండి మీద మా అత్తగారి ఊరు బయలుదేరాము. దారిలో వర్షం వలన ఇబ్బందై మావారు నన్ను, బాబుని బస్సు ఎక్కించారు. మొత్తానికి అందరం క్షేమంగా మా అత్తగారింటికి చేరుకున్నాము. వినాయకచవితి ఎటువంటి విజ్ఞాలు లేకుండా జరుపుకున్నాము. కానీ ఆరోజు మధ్యాహ్నం నుండి తుఫాను వల్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో తిరుగు ప్రయాణం గురించి నాకు చింత ఏర్పడి, "సాయినాథా! ఏ ఇబ్బందిపడకుండా మమ్మల్ని విజయవా డ చేర్చండి" అని మనసులో సాయిని వేడుకున్నాను. మర్నాడు వర్షం తగ్గడంతో మావారు ఆఫీసుకి వెళ్లాలని, "నేను బండి మీద వెళ్తాను. మీరు 10 గంటల బస్సుకి రండి" అని చెప్పి బయలుదేరారు. మాకు 10:30కి బస్సు దొరికింది. విజయవాడ చేరడానికి 2:30 గంటల సమయం పడుతుంది. కానీ ఉదయం 7 గంటలకి బయలుదేరిన మావారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. నేను 'సాయిరాం, సాయిరాం' అని తలచుకుంటూనే, "స్వామీ! నా భర్త ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరేలా చూడండి" అని అనుకున్నాను. మేము కొంత దూరం ప్రయాణం చేసాక మావారు ఫోన్ చేసి, "ఇంటికి చేరాను. దారిలో వర్షం వల్ల ఆలస్యం అయింద"ని చెప్పారు. "జాగ్రత్తగా ఇంటికి చేర్చారు, కోటి కోటి ప్రణామములు బాబా".
2024, సెప్టెంబర్‌లో ఒకరోజు మా బాబు చల్లటి మజ్జిగ తాగాడు. మర్నాడు ఉదయానికి తనకి జ్వరం వచ్చింది. టాబ్లెట్ వేస్తే తగ్గింది గాని, మరల జ్వరం ఎక్కువగా వచ్చింది. నేను బాబా నామం చేస్తూనే బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టర్‌కి చూపిస్తే, మందులిచ్చి తగ్గకపోతే టెస్టులు చేద్దామన్నారు. ఆ మందులతో జ్వరం తగ్గలేదు. ఆ సమయంలో డెంగ్యూ, చికెన్‌గున్యా జ్వరాలు బాగా వ్యాప్తి చెందుతుండటం నాకు చాలా చాలా భయమేసింది. సాయి నామం చేస్తూ బాబుని ల్యాబ్‌కి తీసుకెళ్లి, "బాబుకి ఎటువంటి పెద్ద సమస్య లేకుండా చూడమ"ని సాయిని వేడుకున్నాను. టెస్టు కోసం బ్లడ్ ఇచ్చే సమయంలో 'నేనున్నాను' అంటూ ఆ సాయి భగవానుడు ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు. అయితే రిపోర్టులో కొంచెం టైఫాయిడ్ ఉందని వచ్చింది. డాక్టరు 3 రోజులకి మందులు ఇచ్చారు. వాటితో బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయిమాత".
సొంతింటి కల నెరవేర్చి గృహప్రవేశానికి వచ్చిన బాబా
నా పేరు హేమలత. మేము గుంటూరులో ఉంటాము. మేము 3ఏళ్ళ నుంచి సొంతిల్లు కావాలని అనుకుంటున్నప్పటికీ అది నెరవేరలేదు. నేను సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటాను కానీ, సాయిని ఇల్లు గురించి అడగాలని నాకెప్పుడూ అనిపించలేదు. అలాంటిది ఒకరోజు అనుభవాలు చదువుతుంటే, "బాబా! మేము ఒక కొత్త ఇల్లు కొనుక్కునేలా దయ చూపండి" అని అనుకున్నాను. అలా అనుకున్న కొన్ని రోజుల్లోనే మేము ఇల్లు కొనుక్కున్నాము. గృహప్రవేశానికి నేను ముందుగా సాయిని ఆహ్వానించాను. మాకన్న ముందే ఫోటో రూపంలో మా ఇంటిలోకి వచ్చి ఉన్నారు సాయి. నేను నమ్మలేకపోయాను. ఎవరో మాకు బహుమతిగా ఇవ్వటానికి ఆ ఫోటో తెచ్చారని తెలిసి 'ఒక తండ్రిలా ఆ సాయినాథుడు వచ్చార'ని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ధన్యవాదాలు బాబా".
