ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా చల్లని కృప
2. బాబా తోడుంటే ఎలాంటి సమస్య అయినా తీరుతుంది
3. ప్రార్థించిన 20 నిమిషాల్లో ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
బాబా చల్లని కృప
నా తల్లి, తండ్రి, దైవం అయిన సాయికి శతకోటి వందనాలు. నా పేరు శ్రీరంజని. ఒకసారి మా అమ్మానాన్న హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే షుగర్ లేదు కానీ, ఈసీజీలో తేడా ఉందని వచ్చింది. దాంతో కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే , ఆయన టెస్టులు చేసి 'ప్రధాన నరం 70% బ్లాక్ అయిందని, కొలెస్ట్రాల్ లేదు కాబట్టి స్మోకింగ్ వల్ల' అని అన్నారు. ఇంకా, "ఎకో టెస్టు నార్మల్ వచ్చింది కాబట్టి, స్ట్రెస్ టెస్టు చేసి గుండె తట్టుకుంటుందంటే స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. స్మోకింగ్ మానేసి రోజూ ఎకో స్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంద"ని చెప్పారు. స్టెంట్ వేస్తే టాబ్లెట్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అందుకని మేలుకోరి అలా డాక్టరు చెప్పారు. తర్వాత స్ట్రెస్ టెస్టు చేసారు. అధి నార్మల్‌గా ఉండటంతో మందులిచ్చి పంపేసారు. మందులు తీసుకొని హాస్పిటల్ నుండి బయటకి వస్తుంటే ఫోటో రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. తద్వారా అంతా తమ దయ అని బాబా చెప్పకనే చెప్పారు. నేను అమ్మతో, "రోజూ నాన్న తాగే పాలలో బాబా ఊదీ వేసి ఇవ్వమ్మా, బాబా ఆ బ్లాక్ కరిగిస్తారు" అని చెప్పాను. అమ్మ అలాగే చేస్తుంది. "బాబా! మీ దయవల్లే నాన్నకి స్టెంట్ పడలేదు. దయచేసి ఊదీ మహిమతో బ్లాక్ పూర్తిగా తొలగిపోయేలా చేయండి".
నేను ఒక అర్హత పరీక్ష వ్రాయడం కోసం క్లాసులు విన్నాను, స్లాట్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ అంతలో నాన్నకి టెస్టులు చేసి హార్ట్‌లో బ్లాక్ ఉందని చెప్పడం వల్ల నేను వెంటనే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళొచ్చాను. ప్రయాణం వల్ల అలిసిపోయి పరీక్షకోసం అంత బాగా చదవలేకపోయాను. అయినప్పటికి బాబా మీద నమ్మకంతో పరీక్షకు వెళ్ళాను. ఆటోలో వెళ్తుంటే ఒక ట్రావెల్స్ బస్సు గ్లాసు మీద, లారీ ట్యాంకర్ వెనుక బాబా దర్శనం ఇచ్చారు. పరీక్ష వ్రాస్తున్నప్పుడు ఆ పరీక్ష పాసవ్వడానికి సరిపడా సమాధానాలు నాకు తెలియలేదు. అప్పుడు బాబా దర్శనమిచ్చారనే దైర్యంతో మరోసారి ప్రయత్నిస్తే మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలిగాను. బాబా దయవల్ల పాస్ మార్కులు 50 అయితే నాకు 62 మార్కులు వచ్చాయి. ఈ అనుభవంతో ఆటంకాలొచ్చినా నమ్మకం కోల్పోకుండా చివరివరకు ప్రయత్నించాలని బాబా నాకు బోధ చేసారు. అంతేకాదు, బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారన్న నమ్మకం నాకు బలపడింది. "బాబా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి? మీరు చేసే బోధలను పాటిస్తూ మీ మార్గంలో నడవటం తప్ప. మీ చల్లని కృపను భక్తులందరిపై కురిపించండి బాబా". సాయి బంధువులారా! బాబా ఏది చేసిన మన మంచికోసమేనని శ్రద్ధ-సబూరీలతో ఉండండి.
బాబా తోడుంటే ఎలాంటి సమస్య అయినా తీరుతుంది
నా పేరు కె నాగ శ్రీనివాసరావు. మాది కోనసీమ. 2024, సెప్టెంబర్ 3న మా మా అబ్బాయికి జ్వరం వచ్చింది. మేము మామూలు జ్వరమని తలచి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించాం. కానీ జ్వరం, ఒళ్ళునొప్పులు తగ్గకపోగా తీవ్రం అయ్యాయి. ఇంకా తలపోటు కూడా విపరీతంగా ఉండింది. అందుచేత బాబుని నాల్గవ రోజు సమీపంలో ఉన్న ఒక హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాం. డాక్టరు బ్లడ్ టెస్ట్ చేయిస్తే, 'ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నాయని, డెంగ్యూ పాజిటివ్' అని రిపోర్టు వచ్చింది. దాంతో ఆ డాక్టరు మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ మరుసటి రోజున మరోసారి టెస్టులు చేయిస్తే, రిపోర్టులో మళ్లీ ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నాయని వచ్చింది. దాంతో నాకు చాలా కంగారుగా అనిపించి, "ఏమిటి బాబా ఇలా జరిగింది? బాబుకి ప్లేట్లెట్లు పెరిగి త్వరగా మామూలు అయ్యేలా అనుగ్రహించు తండ్రీ" అని అనుకున్నాను. డాక్టర్ మందులిచ్చి, సెలైన్లు కూడా ఎక్కించి ఐదో రోజు మళ్ళీ టెస్టులు చేయించమన్నారు. ఈసారి బాబా దయవల్ల ప్లేట్లెట్ల సంఖ్య పెరిగింది, బాబుకి జ్వరం తగ్గి మామూలుగా అయ్యాడు. బాబా తోడుంటే ఎలాంటి సమస్య అయినా తీరుతుంది. "ధన్యవాదాలు బాబా".
ప్రార్థించిన 20 నిమిషాల్లో ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు అన్నీ. ఉద్యోగం చేస్తున్న నేను పరీక్షల బిజీలో ఒకరోజు నా మొబైల్ ఫోన్ పక్కన పెట్టి పని చేసుకున్నాను. తర్వాత లంచ్ టైమ్‌లో భోజనం చేసేటప్పుడు మొబైల్ కోసం చూస్తే, కనిపించలేదు. వేరే మొబైల్స్‌తో నా మొబైల్‌కి రింగ్ చేసాము కానీ, ఎక్కడా మొబైల్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించలేదు. అలా ఒక గంట సమయం గడిచింది. మావారు నా మొబైల్ ట్రాక్ చేస్తే, మా కాలేజీలోనే ఉన్నట్లు చూపించింది. అయితే నా సహోద్యోగులు కూడా నా మొబైల్ కోసం వెతికినప్పటికీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. ఇంకా నేను నిరాశ చెంది, "బాబా! ఇంకా ఫోన్ దొరకడం అసాధ్యం. కానీ మీరు దాన్ని సాధ్యం చేయగలరు. దయచేసి ఫోన్ దొరికేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. తర్వాత కాసేపటికి నా సహోద్యోగి ఒకరు "నా రూమ్‌లో ఏదో మొబైల్ రింగ్ వినిపిస్తోంది" అన్నారు. నేను వెళ్లి చూస్తే, ఒక ఫైల్ పేపర్స్ మధ్యలో నా ఫోన్ కనిపించింది. బాబా తమను ప్రార్థించిన 20 నిమిషాల్లో నా మొబైల్ నాకు ఇచ్చారు. ఆయన చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా వెంటనే అద్భుతాలు చూపిస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om sai ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete