|
సాయి వచనం:-
|
|
|
Home »
శ్రీసాయిలీల పత్రిక 1925
,
శ్రీసాయిలీల పత్రిక 1928
,
సమకాలీన భక్తులు
» ఆనందరావు పరశురామ్ డోలస్
ఆనందరావు పరశురామ్ డోలస్
సోర్స్: సాయిలీల పత్రిక 1925 సంచిక 2,3 & 1928 సంచిక 4,5.
|
సాయి వచనం:-
|
|
|
శ్రీసాయిబాబాను సశరీరులుగా దర్శించి, వారి అనుగ్రహానికి పాత్రుడైన భక్తుడు ఆనందరావు పరశురామ్ డోలస్. అతను ముంబాయి నగరంలోని కండివాలి నివాసి. అతని కుటుంబానికి బాబాతో అనుబంధం ఎలా మొదలైంది తెలియదుగాని, వాళ్ళు బాబాను పూజిస్తూ ఉండేవాళ్ళు. అతను తన కుటుంబసభ్యులతో ఎప్పుడూ, “శ్రీబాబా అనుగ్రహంతో నాకు ఉద్యోగం వస్తే, నేను నా మొదటి జీతం డబ్బులు ఖర్చుపెట్టి శిరిడీ వెళ్లి బాబాని దర్శించి, వారికి దక్షిణ సమర్పించుకుంటాను” అని అంటుండేవాడు. 1917 సంవత్సరంలో బాబా అతనిని అనుగ్రహించారు. అతనికి 35 రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. అతను మొదటి జీతం నుండి 20 రూపాయలు శ్రీబాబాకి దక్షిణగా ఇవ్వాలని, మిగిలిన 15 రూపాయలు శిరిడీ వెళ్లే ఖర్చులకోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఎవరితో కలిసి శిరిడీ వెళ్ళాలనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో ఆ ఊరి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న అంధేరికి చెందిన వేంద్రేమాస్టర్ అతనితో, “శిరిడీ వెళ్ళాలని ఉంది. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే, నాకు మంచి తోడు దొరుకుతుంది” అని అన్నారు. దాంతో అతను వారితో కలిసి దాదర్ నుండి 4 గంటల ప్యాసింజర్ రైలులో శిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అదే విషయాన్ని అతను తన ఇంట్లో చెప్పి, శిరిడీకి వెళ్ళడానికి మధ్యాహ్నం బయలుదేరాలని చెప్పాడు. అది తెలిసి అతని పెద్ద అక్క చాలా బాధపడి, ”మనం సదా శ్రీబాబాను ఒకేలా భక్తితో పూజిస్తున్నప్పటికీ, వారు నీకు మాత్రమే శిరిడీ వెళ్ళే అవకాశాన్ని కల్పించారు కానీ, నాకు ఆ భాగ్యాన్ని కల్పించలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం!“ అని శ్రీబాబా ఫోటో దగ్గర కన్నీళ్లు పెట్టుకోసాగింది. ఆమె ఏడవటం చూసిన డోలస్కి జాలేసి ఆమెతో, “నేను ఒకసారి వెళ్లి శ్రీబాబా దర్శనం చేసుకుని వచ్చాక మరోసారి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ శిరిడీకి తీసుకెళ్లి ఆయన దర్శనం చేయిస్తాను” అని అన్నాడు. అయినప్పటికీ ఆమె మనసు శాంతించలేదు. అప్పుడు ఆమె తల్లి ఎవరి వద్ద అయినా డబ్బులు అప్పుగా తీసుకుని, ఆమెను కూడా అతనితోపాటు శిరిడీ వెళ్ళమని చెప్పింది. దాంతో వాళ్లిద్దరు, వేంద్రేమాస్టర్, అతని కుటుంబం, ఇంకా పక్క ఊరికి చెందిన ఒక వృద్ధ కమ్మరి మహిళ కలిసి శిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళు మరుసటిరోజు ఉదయం 10 గంటలకు శిరీడీ చేరుకునేసరికి శ్రీబాబా లెండీ తోటకి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అది తెలిసి వాళ్ళు ఆలస్యం చేయకండా తమ సామానంతా దీక్షిత్ వాడాలో ఉంచి, బాబా దర్శనం చేసుకున్నారు. తర్వాత స్నానాలు చేసి శ్రీబాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడు బాబా తమ ఆసనంపై కూర్చుని ఉన్నారు. మసీదులో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా వుంది. అందువల్ల వేంద్రేకు, డోలస్కు కూర్చోడానికి చోటు దొరకలేదు. కాబట్టి వాళ్ళు శ్రీబాబా ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు బూటీ శ్రీబాబా దగ్గరకు వచ్చి, పొగాకు చిలము గొట్టంలో నింపి వారి చేతికి ఇచ్చాడు. బాబా దానిని ఒకసారి పీల్చి, డోలస్ వైపు చూసి, ఆ చిలుము అతనికి ఇవ్వసాగారు. కానీ, మొదటిసారి శిరిడీ వచ్చినందువల్ల, బాబా చేతుల్లో నుండి నేరుగా చిలుము తీసుకోవడం అతనికి సమంజసంగా అనిపించలేదు. అందువల్ల అతను వారితో, “బాబా! నేను వయసులో చిన్నవాడినైనందున పొగాకు తాగను” అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని వెనక్కి తీసుకుని, అక్కడ ఉన్న మిగతా భక్తులకు ఒకరి తర్వాత ఒకరికి చిలుము ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత శ్రీబాబా డోలస్ వైపు చూసి, “10 రూపాయల దక్షిణ ఇవ్వు” అని అడిగారు. అతను వెంటనే వాడాకి వెళ్లి, ఆ డబ్బు తీసుకొచ్చి వారికి సమర్పించాడు. తర్వాత బాబా వేంద్రే వద్ద నుండి దక్షిణ తీసుకున్నారు. ఆపై మహిళల మధ్య కూర్చుని ఉన్న డోలస్ అక్కను దక్షిణ అడిగారు. ఆ తర్వాత డోలస్ని మళ్ళీ అడిగారు. దాంతో అతను తన వద్ద ఉన్న మిగిలిన మొత్తాన్ని కూడా తీసుకొచ్చి వారికి సమర్పించాడు.
ఆ తర్వాత డోలస్, అతని అక్క వాడాకు వెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి వెళ్లడానికి కావాల్సిన ఖర్చుల లెక్కలు చూసుకుంటే, కొంత డబ్బు తక్కువైంది. వాళ్ళు శిరీడీకి కొత్త కావడం వల్ల అక్కడున్న భక్తులతో వాళ్ళకి అంతగా పరిచయం లేదు. అందువల్ల వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచించిన మీదట వేంద్రేమాస్టర్ను, “కొంచం డబ్బులు అప్పుగా ఇవ్వగలరా?” అని అడిగారు. దానికి అతను, “నేను ఎక్కువ డబ్బు తీసుకురాలేదు. పైగా నేను శ్రీబాబా దక్షిణ కోసం దాచిన డబ్బులతోనే ప్రయాణ ఖర్చులు పెట్టుకుని వచ్చాను” అని అన్నాడు. తర్వాత వాళ్ళతో పాటు వచ్చిన వృద్ధ కమ్మరి మహిళ డోలస్, అతని అక్క ఆందోళన పడటం చూసి, “ఓహో! మనం శ్రీబాబా చరణాల చెంతకు వచ్చాము. ఇక్కడ ఉండగా మీరు ఎందుకు ఇలా దిగులుపడుతున్నారు?” అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఆమెకు విషయం చెప్పారు. దానికి ఆమె, “శ్రీబాబా అనుగ్రహం మీపై పూర్తిగా ఉంది. కాబట్టే ఆయన మిమ్మల్ని దక్షిణ అడిగారు. నాపై ఆయన కృప లేదు కాబోలు! అందుకే నా దగ్గర నుండి ఒక్క పైసా కూడా దక్షిణ తీసుకోలేదు. మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆయనే మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. దాని గురించి మీరు అస్సలు దిగులు పడకండి. మీకు డబ్బు ఇబ్బంది ఉంటే, మీరు నా దగ్గర నుండి తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వీలును బట్టి నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి” అని అంది. ఆమె మాటలు విన్నంతనే వాళ్ళకి ఎంతో సంతోషమేసింది, అలాగే శ్రీబాబా లీలకు ఆశ్చర్యం కలిగాయి.
ఆ రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత, శ్రీబాబా మసీదు నుండి చావడికి వెళ్ళడానికి ఏర్పాట్లు జరగసాగాయి. ఆ క్రమంలో భక్తులు తమ తమ మిత్రబృందానికి బాబా సేవ నిమిత్తం చామరాలు, విసనకర్రలు మొదలైనవి ఇచ్చుకోసాగారు. ఆ సమయంలో డోలస్ మనసుకి ‘మొర్చేల్(నెమలి ఈకల చామరం), చావరి(సాధారణ చామరం), విసనకర్ర వీటిలో ఏదో ఒకదానితో శ్రీబాబాకి విసిరి సేవ చేసుకోవాలని’ బలంగా అనిపించింది. కానీ ఎవరినైనా అడిగి దానిని తీసుకోవడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. దాంతో అతని మనసుని, ‘నేను మొదటిసారి శిరిడీ రావడం వల్ల, నాకు ఎవరితోనూ అంతగా పరిచయం లేదు. అందుకే నేను బాబాకు సేవ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోతున్నాన’ని ఎన్నో ఆలోచనలు కలవరపెట్టాయి. ఇంతలో శ్రీబాబా అతని మనసులోని కోరికను గ్రహించారు. ఒక భక్తుడు తనంతటతానే అతని దగ్గరకు వచ్చి చేతిలో ఒక చామర పెట్టి, “మీరు శ్రీబాబాకు చామర సేవ చేస్తారా?” అని అడిగి వెళ్ళిపోయాడు. అతను ఎంతో సంతోషించాడు. శ్రీబాబా సర్వజ్ఞులని, అలాగే వారు తమ బిడ్డల ముద్దుముచ్చట్లు ఎప్పటికప్పుడు ఎలా తీరుస్తారో అతనికి పూర్తిగా అనుభవపూర్వకంగా అర్థమైంది.
1918, అక్టోబర్ 15న శ్రీబాబా సమాధి చెందారు. ఆ ముందురోజు డోలస్ పెద్ద అక్కకి ఒక కల వచ్చింది. ఆ కలలో, డోలస్ శిరిడీ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు శ్రీబాబా ప్రసాదం మాత్రమే తెచ్చి, తీర్థం తీసుకురాలేదని ఆమెకి అతనిపై కోపం వచ్చినట్లు కనిపించింది. మరుసటిరోజు శ్రీబాబా సమాధి చెందారనే వార్త వాళ్ళకి తెలిసింది.
డోలస్ తండ్రి ప్రతి నెలా తన సంపాదన నుండి రూపాయికి పావులా(ముప్పావు అణా) చొప్పున దానధర్మాలకోసం కొంత సొమ్ము పక్కన తీసేవాడు. అదేవిధంగా డోలస్ కూడా తనకి ఉద్యోగం వచ్చినప్పటి నుండి తన సంపాదన నుండి కొంత మొత్తాన్ని శ్రీబాబా పేరిట విడిగా తీసి పక్కన పెడుతుండేవాడు. ఆ సొమ్ము శిరిడీలోని బాబాకు ఎలా చేరుతుందో అని రాత్రింబగళ్లు అతను దిగులుపడుతూ శ్రీబాబాను, “మీ పేరిట తీసి పెట్టిన సొమ్ము ఏదో ఒక రూపంలో మీకు అందే మార్గాన్ని మీరే చూపించండి” అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతనికి గోవింద్ రఘునాథ్ దభోల్కర్, హరిసీతారామ్ దీక్షిత్‌లు తరచుగా శిరిడీకి వెళ్లి వస్తుంటారన్న విషయం తెలుసు కానీ, అంతగా పరిచయం లేనందున వాళ్ళను సంప్రదించే ప్రయత్నం చేయకుండా వేరే మార్గాల కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఆలోచనలతోనే చాలా రోజులు గడిచిపోయిన తర్వాత, ఒక రోజు రాత్రి అతను తపాలా పనులు ముగించుకుని, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి చర్చిగేట్ స్టేషన్లో గం.8:20ని.లకు రైలు ఎక్కాడు. దభోల్కర్ కూడా ఏదో పని మీద విల్లేపార్లేలోని దీక్షిత్ ఇంటికి వెళ్తూ, అదే రైలు ఎక్కి డోలస్ ఉన్న డబ్బా లోనికి వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు. డోలస్ ఎలాంటి పరిచయం లేకపోయినప్పటికీ, ఆయనకి నమస్కారించి, పరిచయం చేసుకొని శ్రీబాబా పేరిట విడిగా తీసిపెట్టిన సొమ్మును శిరిడీలోని బాబా వద్దకు ఎలా పంపించాలని, ఇంకా చాలా ఇతర సమాచారాన్ని విలేపార్లే స్టేషన్ వచ్చేవరకు వారి నుండి అడిగి తెలుసుకున్నాడు. దభోల్కర్ అతనికి సరైన సలహా ఇచ్చి, శ్రీశిరిడీ సంస్థానం పూర్తి వివరాలు అందించాడు. అలాగే 'శ్రీసాయిలీల' పత్రిక సభ్యత్వం, చందాదారులు మొదలైన వివరాల గురించి కూడా చెప్పాడు. ఈవిధంగా బాబా అనుగ్రహంతో అతను తను దాచిపెట్టిన సొమ్ము సంస్థాన్‌కు పంపించడమే కాకుండా, ఒక సామాన్య చందాదారుడు అయ్యాడు.
అప్పటినుండి డోలస్ శిరిడీలో జరిగే ప్రతి ఉత్సవానికి గోవింద్ రఘునాథ్ దభోల్కర్, రఘువీర్ భాస్కర్ పురందరేలతో కలిసి శిరిడీ వెళ్లి వస్తుండేవాడు. ఆయా సందర్భాలలో అతను క్షేమంగా శిరిడీ చేరుకున్నట్లు, అలాగే అక్కడ నుండి బయలుదేరుతున్నట్లు ఇంట్లో వాళ్ళకి పోస్ట్‌కార్డ్ పంపుతుండేవాడు. 1923వ సంవత్సరంలో వర్షాకాలం రోజుల్లో అతని భార్య ప్రసవించి బాలింతగా ఉన్న సమయంలో అతను శిరిడీ వెళ్లాడు. అతను అక్కడ నుండి 'ఫలానా రోజు ఫలానా సమయానికి వస్తాను' అని ఇంటికి ఉత్తరం పంపాడు. కానీ కొన్ని కారణాల వల్ల అన్నాసాహెబ్ దభోల్కర్, పురందరేలు బయలుదేరేడానికి ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమవడం వల్ల, డోలస్ ఉత్తరంలో రాసిన సమయానికి ఇంటికి చేరుకోలేకపోయాడు. దాంతో అతని కుటుంబసభ్యులకు కంగారు మొదలై, 'వర్షాల వల్ల గోదావరి నదికి వరదలు వచ్చి ఉండవచ్చు' వంటి రకరకాల అనుమానాలు, భయాలుతో దిగులు పడసాగారు. అటువంటి స్థితిలో ఒకరోజు మధ్యాహ్నం డోలస్ భార్య భోజనం చేసి, అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఆమెకు నిద్రపట్టింది. అప్పుడు ఆమెకి ఒక కల వచ్చింది. ఆ కలలో వాళ్ళ ఊరికి చెందిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, తనతోపాటు ఒక 14-15 ఏళ్ల అందమైన బాలుడిని వెంటబెట్టుకుని వచ్చి, వాళ్ళ ఇంటి ముందు నిలబడి, డోలస్ తల్లిని పిలిచి, "మీరు మీ అబ్బాయి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను మా దగ్గరే ఉన్నాడు, ఏ అపరిచిత ప్రదేశంలోనో లేడు. అతను చక్కగా, క్షేమంగా ఉన్నాడు” అని చెప్తూ, పక్కనున్న అబ్బాయిని ముందుకు తోసి, ”ఇదిగోండి, మీ అబ్బాయిని తీసుకోండి” అని చెప్పి ఆయన అదృశ్యమైపోయారు. ఇంతలో డోలస్ భార్యకి మెలుకువ వచ్చి చుట్టూ చూసింది. అక్కడ కలలో కనిపించిన బ్రాహ్మణుడు గానీ, ఆ అబ్బాయి గానీ లేరు. అదే రోజు సాయంత్రం డోలస్ శిరిడీ నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.
తర్వాత కఠినమైన ఆఫీస్ నిబంధనలు వల్ల డోలస్ శ్రీరామనవమి ఉత్సవానికి మాత్రమే శిరిడీ వెళ్ళసాగాడు. ఆ క్రమంలో 1925వ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవానికి శిరిడీ వెళ్లాలని డోలస్ నిశ్చయించుకొని అందుకోసంగానూ ఎప్పటిలాగే తన హెడ్ క్లర్క్‌ని అడిగి, ఒక నెల సెలవుకోసం దరఖాస్తు చేయాలనుకున్నాడు. అయితే అప్పటికి 8 రోజుల ముందు నుండి అతని అసిస్టెంట్ అనారోగ్యం బారినపడి ఉన్నాడు. అందువల్ల తన సెలవుకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని భావించిన అతని మనసు ‘నేను శిరిడీకి ఎలా వెళ్ళగలను?' అని రాత్రింబగళ్లు తల్లడిల్లిపోయింది. ఆఖరికి ఒకరోజు అతను శ్రీబాబాను ప్రార్థించి సెలవు దరఖాస్తును హెడ్ క్లర్క్ చేతిలో పెట్టాడు. ఆ క్లర్క్ వెంటనే ఆ దరఖాస్తును యాజమాని ముందుకు తీసుకెళ్ళి, ఒక నెల రోజుల సెలవు కోరుతున్నట్లు తెలియజేశాడు. దానికి ఆ అధికారి, 'అతని అసిస్టెంట్ అనారోగ్యంతో ఉన్నాడు కదా, మరి ఇతను సెలవుపై వెళ్తే ఇతని పని ఎవరు చూస్తారు? కాబట్టి ఇతనికి ప్రస్తుతానికి సెలవు ఇవ్వడం కుదరదు” అని అన్నాడు. ఆ మాటలు వినగానే డోలస్ మనస్సుకు చాలా బాధ కలిగింది, ఒక రకమైన నిరాశ, ఆవేదన చుట్టుముట్టాయి. అతను తన మనసులోనే, 'నేను మీ దర్శనం కొరకు శిరిడీ రావాలని ఎంతో ఆతురతగా ఉన్నాను. కానీ నా ముందు ఇలాంటి కష్టం వచ్చి పడింది. ఒకవేళ మీరు నాకు సెలవు ఇప్పించకపోయినట్లైతే, నేను నా ఉద్యోగానికి రాజీనామా అయినా ఇచ్చేస్తాను కానీ, మీ దర్శనానికి రాకుండా మాత్రం అస్సలు ఉండలేను’ అని బాబాతో చెప్పుకున్నాడు. ఆ తర్వాత మర్నాడు కూడా సెలవు దొరకకపోతే, ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనే తన నిర్ణయాన్ని తన హెడ్ క్లర్క్‌కు తెలియజేయాలని అనుకున్నాడు. మరుసటిరోజు ఉదయం అతను ఆఫీసుకు బయలుదేరుతున్న సమయంలో శ్రీబాబా పటం ముందు నిలబడి పైన చెప్పుకున్న మాటలనే మళ్ళీ చెప్పుకున్నాడు. తర్వాత అతను ఆఫీసుకి వెళ్ళి హెడ్ క్లర్క్‌ను తన సెలవు గురించి అడిగాడు. వెంటనే ఆ హెడ్ క్లర్క్ యజమాని వద్దకు వెళ్లి, రెండు వారాల సెలవు లభించేలా చేశాడు. శ్రీబాబాపై పరిపూర్ణమైన శ్రద్ధ ఉంటే, ఏ పనిలోనైనా సరే అపజయం ఎదురు కాదు. ఆ విధంగా బాబా అనుగ్రహంతో అతనికి సెలవు దొరికింది. ఈ విధంగా శ్రీబాబా అతని కష్టాలన్నింటినీ తొలగించారు. భవిష్యత్తులో కూడా అలాగే అనుగ్రహించమని అతను రాత్రింబగళ్లు బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడు.