ఈ భాగంలో అనుభవాలు:
1. ఇతరుల శ్రేయస్సు కోరుకున్న సద్భావన ఫలితంగా వెంటనే అనుగ్రహాన్ని వర్షించిన సాయి
2. సాయి కృప
ఇతరుల శ్రేయస్సు కోరుకున్న సద్భావన ఫలితంగా వెంటనే అనుగ్రహాన్ని వర్షించిన సాయి
నా పేరు శ్రీవాణి. మా గురుదేవులు పూజ్యశ్రీ అమ్ముల సాంబశివరావు గారు 'మనం మన జీవితాలలో ఉద్యోగం, వ్యాపారం వంటివి చేసు కుంటూనే మిగిలిన సమయాన్ని సాయికి సంబంధించిన పలు కార్యక్రమాలు చేస్తూ సాయి సేవలో వినియోగించుకోవాలని, తద్వారా సాయి ప్రచారం చేస్తూ, సాయి తత్వాన్ని, బోధనలను అందరికీ చేరేలా చేసి ప్రజల్లో సాయి భక్తి పెంపొందింపజేసి తద్వారా సమాజంలో సత్య, ధర్మ, న్యాయ స్థాపన చేయాలనే' లక్ష్యంతో 'సాయి సేవక వ్యవస్థ'ని ఏర్పాటు చేశారు. అందుకోసం పూజ్య గురుదేవుల దగ్గర 'సాయి సేవక్' దీక్ష తీసుకోవాలి. అలా దీక్ష తీసుకున్నవారు గురువుగారి దగ్గర సాధనాలయంలో సాధనలో పాల్గొంటూ అన్నివిధాలా సంస్కరించబడతారు. ఆధ్యాత్మికంగా తాము ఎదుగుతూ తమతో పాటు సమాజాన్ని కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. ఇది ఒక మహత్కార్యం. నేను గొప్ప ఆధ్యాత్మిక ఫలాన్నిచ్చే ఈ 'సాయి సేవక్' దీక్ష తీసుకొని గురువుగారి సాయిమార్గంలో గడుపుతూ నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఆశించాను. కానీ దీక్ష నియమం ప్రకారం, దీక్ష తీసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ దీక్ష తీసుకుని నేను ఎక్కడ సన్యాసినిగా మారిపోతానో అన్న భయంతో నా తల్లిదండ్రులు నాకు అనుమతి ఇవ్వలేదు. పలుమార్లు మా గురువుగారిని దీక్ష తీసుకోవడానికి అనుమతించమని అడిగాను కానీ, 'నాకు యోగ్యత లేనందువల్లో, నా తల్లిదండ్రుల అనుమతి లేనందువల్లో, మరేదైనా కారణం వల్లో "చూద్దాం లే" అని మాత్రమే ఆయన నుండి సమాధానం వచ్చింది. నేను 'సాయి సేవక్' దీక్ష తీసుకోవాలని తపిస్తూ ఉన్నప్పటికీ దీక్ష తీసుకోకుండానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను బాధపడి పడి దీక్ష విషయం దాదాపు మర్చిపోయాను కూడా. ఇలాంటి స్థితిలో 2026, జూన్ 12న పుట్టినరోజు సందర్భంగా ఒకరికి,
"సాయినాథుని కృపతో మీకు భౌతిక విషయాల్లో మేలు జరగాలని, మీరు ఆధ్యాత్మికంగా మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని సాయి ప్రేరణగా తనకి శ్రేయస్సు కలగాలనే మంచి భావనతో శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపించాను. ఇతరుల శ్రేయస్సు కోరుకున్న సద్భావన ఫలితంగా సాయి వెంటనే నాపై అనుగ్రహాన్ని వర్షించారు, సుమారు 10 నిమిషాల్లో నా జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మలుపుకి శ్రీకారం చుట్టారు. మా గురుదేవులు పూజ్యశ్రీ అమ్ముల సాంబశివరావు గారి సంస్థ వారు నాకు ఫోన్ చేసి, "ఈ సంవత్సరం 'సాయి సేవక్' జీవితకాలపు దీక్షకి అప్లై చేసుకోండి" అని చెప్పారు. నిజానికి అప్పటికి అప్లై చేసుకోవాల్సిన గడువు దాటిపోయింది. అయినా సాయి అనుగ్రహం వల్ల నాకు ఒక అవకాశం ఇస్తున్నట్లు చెప్పి మరీ, నన్ను అప్లై చేసుకోమని సూచించారు. అంతకాలంగా లేనిది ఆ రోజు అవకాశం తలుపు తట్టడం నాకు ఆశ్చర్యానందాలను కలిగించింది. కానీ మరో వైపు నా తల్లిదండ్రులు ఈసారైనా అనుమతిస్తారో, లేదో అనే భయం మొదలైంది. "వాళ్ళు అనుమతించాల"ని సాయిని తీవ్రంగా ప్రార్థించాను. ఆ సాయినాథుడు వాళ్ళ మనసుల్ని ఎలా మార్చారో, ఏమో కానీ, ఆశ్చర్యంగా వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో నేను సంతోషంగా సేవక్ దీక్షకి అప్లై చేసుకోవడం, పూజ్య గురుదేవులు ఇంటర్వ్యూకి హాజరవడం, చివరికి నేను సాయి సేవక్ దీక్షకి ఎంపిక కావడం జరిగిపోయింది. సాయి ఆశీస్సులతో నేను అక్టోబర్ 10న నా పుట్టినరోజునాడు సాయి సేవక్ దీక్ష తరగతులకోసం గురుదేవుల సాయి సేవాశ్రమంకి ప్రయాణమవబోతున్నాను. ఈ అనుభవం ద్వారా మనస్ఫూర్తిగా ఒకరి లౌకిక, ఆధ్యాత్మిక ఉన్నతి కాంక్షించిన సద్భావన ఫలితంగా, 'మరి నీ ఆధ్యాత్మిక ఉన్నతి మాటేంటి?' అని నా ఆధ్యాత్మిక ఉన్నతికి బీజం వేసి సాయి నన్ను అనుగ్రహించారని నాకనిపిస్తుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయి కృప
నా పేరు అనూష. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2026, వినాయకచవితికి ముందు చాలా రోజుల తర్వాత నేను మా వూరు వెళ్ళాను. తిరిగి వద్దామనే సమయానికి వినాయకచవితి దగ్గరలోనే ఉంది కదా, పండగ అయ్యాక హైదరాబాద్ వెళదామని ఉండిపోయాను. అయితే దగ్గర్లోనే నా నెలసరి సమయం ఉంది. ఇంకా 1 వారం ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా కాళ్ళనొప్పులు, వెన్నునొప్పి వచ్చాయి. దాంతో నేను, 'నెలసరి వస్తుందేమో! ఒకవేళ అదే జరిగితే, 'ఇంతా ఇంటిలో ఉండి కూడా పండగ చేసుకోవడానికి కుదరదు' అని చాలా భయపడ్డాను. వెంటనే నా బాబాని తలుచుకుని, "నేను తిరిగి హైదరాబాద్ వెళ్లేవరకు నాకు నెలసరి రాకుండా, అలాగే సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా పండగ చేసుకునేలా చూడండి బాబా" అని ప్రార్థించాను. నేను ఊరిలో ఉన్నన్ని రోజులు నాకు నెలసరి రాలేదు, అలాగే నాకు వచ్చిన కాళ్ళనొప్పి, వెన్నునొప్పి కూడా తగ్గిపోయాయి. నేను సంతోషంగా పండగ చేసుకున్నాను. ఇదంతా కేవలం నా బాబా దయవల్ల జరిగిందని నేను నమ్ముతున్నాను. "ధన్యవాదాలు బాబా. సమస్య పెద్దదైనా, చిన్నదైనా అనుక్షణం తోడుండి కాపాడుతున్నందుకు నేను మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను బాబా".
ఓం శ్రీసాయినాథాయ నమః.
