ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయతో దొరికిన స్మార్ట్‌వాచ్&ఇయర్‌బడ్స్
2. అంతా బాబా దయ
బాబా దయతో దొరికిన స్మార్ట్‌వాచ్&ఇయర్‌బడ్స్
నా మాధవి. మేము యూఎస్ఏలో ఉంటున్నాము. ఒకరోజు మేము వాటర్ కంట్రీకి వెళ్ళాము. అక్కడ ఆ రోజు చివరలో మేము వాటర్ స్లైడ్‌కి వెళ్ళాము. అందులో భాగంగా నేను, నా స్నేహితులు ఒక పడవలో ఎక్కి కిందకు జారుతున్నప్పుడు నా స్నేహితురాలొకరు కింద పడిపోబోతుంటే, నేను ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాను. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా మరొక పడవ వచ్చి మా పడవను ఢీకొట్టింది. నేను ప్రమాదాన్ని ఊహించి పడవలో కింద కూర్చుండిపోయాను. ఆ సమయంలో నా చేతికి ధరించి ఉన్న స్మార్ట్‌వాచ్ ఎలాగో తెలీదు నీటిలో పడిపోయింది. ఆ విషయం నేను గమనించలేదు. రైడ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దాదాపు 5-10 నిమిషాలకి నా వాచ్ లేదని గ్రహించాను. ఒక పక్క చీకటి పడుతుంది, మరోపక్క వాచ్ సరిగ్గా ఎక్కడ పడింది తెలియదు, అదికాక ఆ రోజుకు చివరి రైడ్ కూడా అయిపోవస్తుంది. ఈ కారణాల చేత నేను భయపడ్డాను. ఏదేమైనా మేము వెనక్కి వెళ్తూ దారి పొడవునా వాచ్ కోసం వెతకనారభించాం. ఆ సమయంలో నేను 'ఓం సాయిరామ్' అని జపిస్తూ, "బాబా! నా వాచ్ దొరికేలా అనుగ్రహించండి" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల చీకటి పడుతున్నప్పటికీ నా స్నేహితురాలొకరు అకస్మాత్తుగా నీటిలో ఏదో ఉన్నట్లు గమనించింది. తను ఆ విషయం చెప్పడంతో నేను, నా భర్త నీటిలో ఉన్న నా వాచ్‌ను అందుకోగలిగాము. నేను ఒకవేళ మరో 5, 10 నిమిషాల తర్వాత వాచ్ నా చేతికి లేదని చూసుకొని ఉంటే, వాచ్ దొరికేది కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటే, చీకటి పడుతుంది, రైడ్ మూసివేయబోతున్నారు. ఆ వాచ్ నా భర్త నాకిచ్చిన పుట్టినరోజు కానుక. అందుకే అది నాకు ఎంతో సెంటిమెంట్. అందువల్ల అది దొరికినప్పుడు నేను అమితమైన కృతజ్ఞతతో భావోద్వేగానికి లోనయ్యాను. "కోటికోటి ప్రణామాలు బాబా. 'నీ భారం నాపై వేయండి, నేను మోసేదను' అన్న మీ మాటల అంతరార్థం, శక్తి నాకు ఈ అనుభవం ద్వారా అర్థమయ్యాయి. మా భారాలను మీకు అప్పగిస్తే, మీరు సమస్తం చూసుకుంటారనే నమ్మకంతో ఉండటం అంటే ఏమిటో మీరు నిజంగా నాకు చూపించారు".
నేను సాధారణంగా వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు నడుస్తూ ఇయర్‌బడ్స్ పెట్టుకొని ధ్యానానికి సంబంధించిన విషయాలు వింటూ ఉంటాను. ఒకరోజు నేను వాకింగ్‌లో ఉన్నప్పుడు నా భర్త ఫోన్ చేసి, "మనం ఒక చిన్న డ్రైవ్‌కు వెళదామా?" అని అడిగారు. నేను సరేనని చెప్పి, నేనున్న ప్రదేశానికి రమ్మని చెప్పాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి ఒక చిన్న డ్రైవ్‌కు వెళ్లాము. ఆ సమయంలో నేను నా ఇయర్‌బడ్స్ తీసి కారులో ఉంచాను. మేము తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, నేను ఆ ఇయర్‌బడ్స్ తీసుకొచ్చి నా ఆఫీస్ రూమ్‌లో పెట్టి, ఆ తర్వాత వాటి గురించి పూర్తిగా మర్చిపోయాను. మరుసటిరోజు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లాలనుకున్నప్పుడు ఇయర్‌బడ్స్ కోసం ప్రతిచోట వెతికినా దొరకలేదు. నేను వాటిని ఎక్కడ పెట్టానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అస్సలు గుర్తు రాలేదు. ఇంకా నేను 'ఓం సాయిరామ్' అని జపించడం ప్రారంభించాను. కేవలం 2-3 నిమిషాలు జపించిన తర్వాత అకస్మాత్తుగా నేను ఆ ఇయర్‌బడ్స్ ఎక్కడ పెట్టానో గుర్తుకు వచ్చింది. నాకు నిజంగా అద్భుతం అనిపించింది. "బాబా! నామస్మరణ శక్తిని, మీ నామం అత్యంత చిన్న విషయాలలో కూడా మాకు ఎలా మార్గదర్శనం చేస్తుందో మీరు నాకు మరోసారి చూపించారు. చాలా చాలా కృతజ్ఞతలు బాబా. దయచేసి నన్ను ఎల్లప్పుడూ మీ మార్గదర్శకత్వంలో నడిపించండి. ఎల్లప్పుడూ మాతోనే ఉండండి. మీరే నా తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, ఇంకా నా సమస్తం. నేను ఎల్లప్పుడూ మీ పాదాల చెంతనే ఉండాలని కోరుకుంటున్నాను బాబా. పవిత్రమైన హృదయంతో మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నా తల్లిదండ్రులకు, అలాగే ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం, సంతోషం ప్రసాదించండి. కోటి కోటి ప్రణామములు తండ్రీ".
సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవభయ హరణం
అంతా బాబా దయ

